కొంతమంది కుష్టురోగులు వాళ్ళకి కొంత దూరంలోకి వచ్చి, సంకోచంగా చూస్తూ నిలబడ్డారు.
"స్వప్నా! ఈ జబ్బు భయంకరమైనదే కావచ్చు. కానీ మరింత భయంకరమైన అసత్యాలు దీనిని గురించి ప్రచారంలో ఉన్నాయి. నిజానికి ఇది అంత త్వరగా అంటుకునే వ్యాధి కానేకాదు స్వప్నా!"
సంశయంగా తలెత్తి చూసింది స్వప్న.
"నిజం స్వప్నా! లెప్రసీలో రెండు రకాలు ఉన్నాయి. ఒక రకం అసలు అంటువ్యాధి కానేకాబు. రెండోరకం కొంచెం మందకొడిగా వ్యాపించే అంటువ్యాధి. అది రోజుల తరబడి సన్నిహితంగా కలిసి ఉండి ఒకరి సబ్బులూ, టవర్సూ లాంటివి మరొకళ్ళు ఉపయోగించినా, శారీరక సంపర్కం పెట్టుకున్నా మాత్రమే వస్తుంది. కలరాలాగా, ప్లేగులాగా తక్షణం సోకదు" అన్నాడు అనునయంగా.
అయితే అతని మాటలని ఎవరూ నమ్మినట్లు కనబడలేదు. శాపగ్రస్తులంలాగా, దీనమైన మొహాలతో నిలబడి ఉన్న ఆ రోగుల దగ్గరికి నడిచాడు సందీప్.
"వద్దు! వద్దు౧ మేము పెద్ద రోగం వాతపడ్డ దౌర్భాగ్యులం! మా దగ్గరికి రావద్దు!" అంటూ వెనుదిరిగి, కాళ్ళూ, చేతులూ విరిగి, ముక్కు చెవులూ ఊడిపోయిన పాత బొమ్మలలాగా ఉన్న ఆ మనుషులు కుంటుకుంటూ దూరంగా పారిపోబోయారు.
అందరికన్నా వెనుకబడి పోయింది ఒక స్త్రీ. ఆమె దగ్గరనుంచీ ఏదో పడిపోయింది.
"చూడమ్మా! ఏదో పారేసుకుని వెళ్ళిపోతున్నావు." అని ఎలుగెత్తి పిలిచాడు సందీప్.
ఆమె ఒక్కసారి వెనక్కు తిరిగి, ఆ క్రిందపడిన దాన్ని చూసి, వెక్కిళ్ళు ఆపుకుంటూ వెళ్ళిపోయింది.
అది ఆమె కాలి బొటనవేలు !
కుష్టు రోగుల అవయవాలకు స్పర్శజ్ఞానం లోపించడం కూడా వాళ్ళకి అంగవైకల్యం కలగడానికి కారణం అవుతుంది. స్పర్శజ్ఞానం కోల్పోయిన అవయవాలకీ దెబ్బ తగిలినా బాధ తెలియదు. దెబ్బ తగిలి, బాధ కలగగానే వెనక్కి తగ్గేటట్లు చేసే 'అసంకల్పిత ప్రతీకార చర్య' (REFLEX ACTION) - కొన్ని - అవయవాలలో నశించి పోతుంది. అందుకని గాయాలమీద గాయాలయి, అవయవాలే నాశనమైపోవడం జరుగుతుంది. ఇది సాధారణంగా పాదాలకి ఎక్కువగా జరుగుతుంది. అందుకే ఆ రోగులు విధిగా మెత్తటి బూటు వేసుకోవాలి.
లేకపోతే ఇప్పుడా స్త్రీకి జరిగినట్లే జరుగుతుంది.
బలహీనంగా ఉన్న బొటనవేలుకి ఎదురు దెబ్బ తగిలి అది ఊడి పడిపోయినా ఆమెకు బాధ కలుగలేదు. అసలు అది ఊడి పడిపోయినా ఆమెకు బాధ కలుగలేదు. అసలు అది ఊడి పడిపోయిన సంగతి కూడా ఆమెకు తెలియదు, సందీప్ చెప్పేదాకా.
"ఆగండి ! ప్లీజ్ ! ఆగండి !" అంటున్నాడు సందీప్.
అప్పటికే చాలాదూరం వెళ్ళిపోయారు మిగతా వాళ్ళందరూ. బొటనవేలు ఊడిపోయిన స్త్రీ మాత్రం తటపటాయిస్తూ నిలబడిపోయింది.
సందీప్ చేతుల్లో స్వప్న పెనుగులాడుతూ, విడిపించుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తోంది.
ఆమెని ఉక్కు కౌగిట్లో బంధించేశాడు సందీప్.
"స్వప్నా! నన్ను నమ్ము! నిజంగానే నీకు ఏమీ కాలేదు. కంగారు పడిపోకు!" అంటూ బొటనవేలు తెగిపోయిన స్త్రీవైపు తిరిగాడు సందీప్. "మీకు కూడా భయమేమీ లేదమ్మా! ఈ జబ్బుని నయం చెయ్యడం అంత అసాధ్యమైన పనేమీ కాదు." అన్నాడు.
ఆమె విషాదంగా చెప్పింది. "ఇది తగ్గే జబ్బు కాదు బాబూ! నాకు తెలుసు! దీనితో కుళ్ళిపోయి చావవలసిందే!"
గొంతు పెద్దది చేసి కొంచెం తీవ్రంగా అన్నాడు సందీప్. "ఒకప్పుడు క్షయ రోగాన్ని గురించి కూడా ఇలాగే భయపడేవారు. స్ట్రెప్టోమైసిన్ లాంటి మందులు రావడం మొదలెట్టాక అది కంట్రోలులోకి వచ్చింది. ఇదీ అంతే! సల్ఫాడ్రగ్స్ వచ్చాక ఈ మొండి రోగం వైద్యానికి లొంగింది. ఇప్పుడు డాప్సోన్, రిఫామ్ పిసిన్, క్లోఫాజైమైన్ మందులు మూడు కలిపి వాడితే అతి త్వరలోనే తగ్గుముఖం పడుతోంది. ఆ తర్వాత ప్లాస్టిక్ సర్జరీతో అంగవైకల్యానికి కొంతవరకూ సరిచెయ్యడానికి ఆస్కారం..."
మాట సగంలో ఆపేసి ఆమె మొహంలోకి చూశాడు సందీప్. తను ఆవేశంలో ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తుంటే ఆమెకెలా అర్థమవుతుందీ?
తికమక పడుతున్నట్లు చూస్తోంది ఆమె. కానీ ఆమె మొహంలో సన్నటి ఆశారేఖ. ఈ వ్యాధి తగ్గుతుందని అతను చెప్పడం మాత్రం మెల్లిగా మనసుకెక్కుతోంది.