Previous Page Next Page 
జయ - విజయ పేజి 44


    "ఏమో! మీ మాటల్లో నిజం వుండేవుండవచ్చు! కానీ నా విషయంలో మాత్రం నిజం కాదు!"
    "నన్ను నమ్మమని నేను మిమ్మల్ని బ్రతిమాలబోవటం లేదు!" అన్నాడతను.
    విజయ మాట్లాడలేదు.
    "అయామ్ సారీ విజయా! మీలాంటి ఆప్తురాలు నన్ను ఇంత మోసం చేస్తారనుకోలేదు." బాధగా అన్నాడతను.
    విజయ ఇంక తట్టుకోలేకపోయింది.
    "తప్పు ఒప్పుకుంటున్నానండీ! ఇంకేమీ అనవద్దు నన్ను..." చేతులు జోడిస్తూ అందామె.
    చంద్రకాంత్ నవ్వాడు.
    "ఈ తప్పు అంత తేలిగ్గా క్షమించగలిగేది కాదు విజయా! దీనికి మీరు మూల్యం చెల్లించాలి! శిక్ష అనుభవించాలి."
    విజయ ఆశ్చర్యంగా అతనివేపు చూసింది.
    "చెప్పండి! మీరే శిక్ష విధించినా సరే! తప్పక అనుభవిస్తాను.
    "మళ్ళీ మాట తప్పరు కదూ!"
    "ఊహు! ఇంకా మిమ్మల్ని కాదనే శక్తి నాకెక్కడిది? ఇప్పటికే దొంగలా మీముందు నిలబడాల్సి వస్తోంది."
    "ఇలా దగ్గరకు రండి! ఆ శిక్షేమిటో చెప్తాను." సీరియస్ గా అన్నాడతను.
    విజయ తటపటాయించింది. అతని మనసేమిటో అర్థంకావడంలేదామెకి. భయంతో అక్కడే నిలబడిపోయింది.
    "సరే అలాగయితే నేనే మీదగ్గరకొస్తాను." అంటూ ఆమె దగ్గరకు నడిచి అమాంతం ఆమెను రెండు చేతులతో పైకెత్తి తన గుండెలకు హత్తుకున్నాడు.
    విజయ నివ్వెరపోయింది. ఆమె శరీరమంతా భయముతో కంపించిపోయింది.
    "అయ్యో! ఏమిటిది? చంద్రకాంత్ గారూ! వదిలేయండి! ఇది పాపం!" అంది గింజుకుంటూ. ఆమె కళ్ళ వెంబడి బొటబొటా కారిపోసాగినయ్.
    చంద్రకాంత్ గట్టిగా నవ్వాడు.
    "విజయా! నాకంతా తెలుసు! నీ మనస్సు నేనెప్పుడో గ్రహించాను! నాకూ జయకూ వివాహం జరిగిన మొదటిరోజు ఉదయం నేను కళ్ళు మూసుకుని పడుకుని వుంటే నువ్వు మా గదిలోకి వచ్చి నా కాళ్ళకు నమస్కరించి వెళ్ళడం నేను చూడలేదనుకున్నావ్ కదూ?"
    విజయకు నోట మాట రావడం లేదు.
    "ఆరోజే నాకు అనుమానం కలిగింది విజయా! ఆ తరువాత జయ సాహచర్యంలో ఆమె గురించి తెలుసుకున్న మరెన్నో విషయాలు నా అనుమానాన్ని బలపర్చినాయ్. ఉత్తరాల్లో చూపిన సాహిత్యాభిలాష నిజజీవితంలో కొచ్చేసరికి ఏమయిపోయింది? అంతవరకూ ఉత్తరాల్లో చూపిన సాహిత్య జ్ఞానమంతా ఎదుటికొచ్చేసరికి మాయమయిపోతుందా? ఇవన్నీ ఒక పక్క, మరోపక్క ఆమె నా యెడల చూపే నిర్లిప్తత! శారీరక సుఖం అనుభవించేప్పుడు ఆమె ఎలాంటి ఉత్సాహం లేకుండా బొమ్మలా జీవం లేనట్లు ఉంటే ఆ అనుమానాలు మరింత ఎక్కువవక ఏమవుతాయ్? అయినా నా అనుమానాలు అనుమానాలుగానే నిలిచిపోయాయి. మీ అమ్మకు సీరియస్ గా వున్నరోజున జయ కోసం ఆఫీస్ కెళ్తే అక్కడ కిషోర్ తోపాటు కనిపించింది. అప్పుడు నా అనుమానాలు మరోవేపు మళ్ళినాయ్.
    "రెండోసారి ఇద్దరూ కలుసుకోవడం_ఆ విషయం నాకు చెప్పకపోవడం నా అనుమానాల్ని బలపరిచినాయ్. చివరకు మోసాన్ని మోసంతోనే జయించాలని యిద్దరికీ అబద్ధాలు చెప్పి నా అనుమానాల్ని ధృవపరచుకున్నాను.
    "భగవంతుడా!" గొణిగింది విజయ.
    "జరిగిందంతా నేనే చెప్పేస్తాను! ఇంకా మీ దగ్గర నిజం దాచడం నా అవివేకమే అవుతుంది. కిషోర్ వల్ల జయ గర్భవతి అయింది. ఆమె జీవితం నాశనమవుతుందన్న భయంతో ఆమెను వివాహం చేసుకోటానికి సిద్ధపడ్డ మీతో వివాహం జరిపించాలని అమ్మ ఆలోచించింది. నిజం చెపుతున్నాను! మనస్ఫూర్తిగా నేనేనాడూ అంగీకరించలేదు ఇందుకు" దీనంగా అంది విజయ.
    "ఇందులో నీ తప్పేమీ లేదు విజయా! పరిస్థితులు ఎదుర్కోలేక జయను నాకిచ్చి వివాహం చేసింది మీ అమ్మ. కానీ పర్యవసానాలు ఆమె వూహించలేకపోయింది."
    కొద్దిసేపు ఇద్దరూ మాటల్లేకుండా నిలబడిపోయారు.
    విజయ అతని కౌగిలి నుండి విడివడటానికి ప్రయత్నించింది.
    "నన్ను వదిలేయండి ప్లీజ్" దుఃఖంతో ఆమె గొంతు పూడిపోయింది.
    "ఊహు! నిన్ను వదిలేయటానికి కాదు విజయా దగ్గరకు తీసుకుంది. ఈ క్షణం నుంచీ మనది శాశ్వతమయిన బంధం."
    "అలా అనకండి! మా చెల్లెలికి ద్రోహం చేయడం కంటే ఇంత విషం మింగి ఛస్తాను."
    "జయా, నేనూ కలిసి వుండటం అసంభవం విజయా! నేనేకాదు. జయ కూడా నాతో సంసారం చేయడానికి అంగీకరించదిక."
    "అంటే..." పిచ్చిదానిలా అతనివేపు చూసిందామె.
    "ఆమె విషయం ఎలా పరిష్కరించాలో నాకు తెలుసు! ఆమె కిషోర్ తో వెళ్ళిపోతుంది."
    విజయ నిర్ఘాంతపోయింది.
    "ఏమిటి మీరంటోంది?" అంది హీన స్వరంతో.
    "అవును విజయా! రెండు రోజుల్లో జయ యింటికి వస్తుంది. అప్పుడే కిషోర్ ని కూడా పిలుచుకొస్తాను. అప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకుని నిర్ణయించుకుంటారు. కిషోర్ ఆమెని అంగీకరించటానికి సుముఖంగా వున్నాడు."

 Previous Page Next Page