ఎక్కడెక్కడో తిరిగి వచ్చేసరికి అప్పుడే స్నానం చేసి జుట్టు ఆరబెట్టుకుంటున్న విజయ కనిపించింది.
"హాస్పిటల్లో విజయ మీకోసం చూస్తోంది" అందామె చిరునవ్వుతో.
"సరే!" అంటూ అక్కడే కూర్చుండిపోయాడతను.
ఆమె తన గదిలోకెళ్ళి బట్టలు మార్చుకుని బయటికొస్తోంటే అతను ఆమెకెదురుగా వచ్చాడు.
"విజయా! నీతో ఓ విషయం మాటాడాలనుకుంటున్నాను" అన్నాడతను.
విజయ కలవర పడింది.
"నా పేరు జయ! అంది ఆందోళన బయటకు తెలీకుండా.
"మీరు నాకు అబద్ధాలు చెప్పనని ప్రామిస్ చేయండి ముందు!"
విజయ ముఖం పాలిపోయింది.
"అదేమిటి అలా అంటున్నారు?"
"మరేం చేయను! నా చుట్టూ ఉన్న పరిస్థితులలా ఉన్నాయ్."
విజయ మౌనంగా ఉండిపోయింది. అతనికి తామాడిన నాటకం తెలిసిపోయిందేమోనని గుండెలు వేగంగా కొట్టుకోసాగినాయి.
"నాతో స్నేహం చేసుకుని నాకు ఉత్తరాలు రాసింది మొదట్నుంచీ మీరే కదూ?"
విజయ నిశ్చేష్టురాలయింది.
అతనికేం సమాధానం చెప్పగలదు తను?
ఇంకా అబద్ధాలు చెప్పాలా? ఇంత దూరం వచ్చాక ఇంకా అబద్ధాలు చెప్పటం వల్ల ప్రయోజనం ఏమిటి? అతనికి ఆ విషయాలన్నీ తెలిసిపోబట్టే ఇంత ధైర్యంగా అడగ గలుగుతున్నాడు. అయితే అది ఎలా తెలిసిందో తనకు అర్థం కావటం లేదు.
"అవును!" ధైర్యం తెచ్చుకుని అందామె.
"మరి జయనే విజయ అని ఎందుకు అబద్ధం చెప్పారు?"
"తప్పంతా నాదే!"
"నేనడిగేది తప్పెవరిదని కాదు విజయా! మీరలా అబద్ధం చెప్పి నన్ను మోసగించాల్సిన అవసరం ఎందుకొచ్చిందని."
విజయకు జరిగిందంతా చెప్పక తప్పలేదు.
"అదంతా నా తెలివితక్కువతనం మూలానే జరిగింది చంద్రకాంత్ గారూ! ఆరోజు మీరు హఠాత్తుగా యింటికొచ్చి నన్నే పలుకరించారు గుర్తుందా? "విజయగారున్నారా?" అని అడిగారు. నేనే విజయనని మీరెందుకు సందేహించలేదు? అంటే మీ మనసులో విజయకో అందమయిన ఊహా రూపం ఉంది. అంచేత మీ ఊహకు భిన్నంగా ఎలాంటి అందం, ఆకర్షణ లేకుండా నేను కనిపించేసరికి నేనే విజయ అయి ఉండవచ్చునని మీరు అనుమానించలేకపోయారు. అదీగాక మనం రాసుకున్న ఉత్తరాల్లో మీరు ఓసారి రాశారు. "తను అందంగా లేకపోయినా తను కోరుకునే వ్యక్తి అందంగా ఉండాలని కోరుకోవడం సహజం" అని! అంటే మీరూ అందమయిన అమ్మాయినే కోరుకుంటారు కదా! అంచేత మీరూ నా గురించి ఏర్పరుచుకున్న ఊహలను పాడుజేయటం ఇష్టంలేక అందమయిన నా చెల్లెలు జయను విజయగా మీకు పరిచయం చేశాను. అయితే మీరామె అందానికి అంతగా ఆకర్షింపబడతారని నేననుకోలేదు. నిజానికి నేనలా చేయడం జయకూ, మా అమ్మగారికీ సుతరామూ ఇష్టంలేదు. కేవలం నా మొండిపట్టుదల వల్లే వాళ్ళు మాట్లాడకుండా ఊరుకుండిపోయారు. అయితే మీరు ఆమెనే వివాహం చేసుకుంటానని రాసినప్పుడు మాత్రం నేను ఎంతటి తప్పుచేశానో తెలిసి వచ్చింది. కానీ ఆ పరిస్థితుల్లో పశ్చాత్తాపపడి ఏం ప్రయోజనం? అందుకే మీకు జవాబు రాయకుండా ఊరుకున్నాను. ఆ తరువాత మీరూ జయా కలుసుకోవటం, జయను వివాహం చేసుకోవడం జరిగిపోయింది."
జయ అతనిని వివాహం చేసుకోడానికి దారితీసిన పరిస్థితులు మాత్రం దాచి మిగతావన్నీ వివరించింది విజయ.
జయ కిషోర్ వ్యవహారం అతనికి చెప్తే జరిగేదేమిటో తనకు తెలుసు. అతను తక్షణం జయతో సంబంధాలు తెగతెంపులు చేసుకుంటాడు. తన చేతులారా తను చెల్లాయి జీవితం మంట కలిపినట్లవుతుంది.
చంద్రకాంత్ కీ విషయం అర్థమయిపోయింది. ఆమె మరో రహస్యం తన దగ్గర దాస్తోంది.
"విజయా! మిమ్మల్ని మరో విషయం అడుగుతున్నాను. దీనిక్కూడా మీరు కపటం లేకుండా సమాధానం చెప్పాలి."
"ఏమిటది?"
"మీరు నన్ను ప్రేమించారు కదూ?"
"ఊహు! అదేమీ లేదు..." గాభరాగా అందామె.
"విజయా! ఇలా నా కళ్ళల్లోకి చూసి చెప్పండి! మనం రాసుకున్న ఉత్తరాలన్నీ ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి! మనకి ఒకరంటే ఒకరికి అనురాగం ఏర్పడింది ఆ ఉత్తరాలవల్లేగా! మీరు పిచ్చిపిచ్చి ఆలోచనలతో అబద్ధాలు చెప్పకుండా వుండివుంటే మనం ఒకటయ్యేవాళ్ళం కదూ? ఇలా అందరం బాధపడుతూ, ఎవరికీ సుఖం లేకుండా గడిపే దురదృష్టం ఎందుకుండేది? నేను మిమ్మల్ని కోరుకోలేనని అసలెలా అనుకున్నారో నాకు అర్థం కావటం లేదు. మీరు మీ అందాన్నీ ఆకర్షణనీ ఎందుకు అంత తక్కువగా అంచనా వేసుకున్నారు? అయినా మనిషిని ప్రధమంగా ఆకర్షించేది అందం అయితే అయివుండవచ్చుకానీ, అందంలేని వారికి అంతకంటే గొప్ప ఆకర్షణేదో భగవంతుడు ముందే ఏర్పాటు చేస్తాడు. మీరు గొప్ప అందగత్తే కాకపోవచ్చు! కానీ అంతకంటే అందమయిన హృదయం మీకుంది. మీరు మాట్లాడితే వెన్నెలలు కురిసినట్లుంటుంది. మీరు నవ్వినప్పుడు అదో వింత అందం కురిపిస్తుందని మీకు తెలుసా? మరెన్నో ఆకర్షణలు మీలో ఉన్నాయని మీకు తెలీదు."
అతని మాటలు వింటూంటే విజయకు కళ్ళ వెంబడి నీళ్ళు తిరిగినయ్!