"అయ్యో! ఇదేమిటి? లోకమంతా ఏమనుకుంటారు?" అయోమయంగా అంది విజయ.
"ఎవరేమనుకున్నా ఫర్వాలేదు విజయా! లోకం కోసం కృత్రిమ జీవితాలు గడపటం కంటే లోకాన్ని ఎదిరించి జీవితాలను సుఖమయం చేసుకోవడం మంచిది."
విజయ వెర్రిదానిలా అతనివేపు చూస్తుండిపోయింది.
జయ బాబుతో సహా టాక్సీ దిగి ఇంట్లో కొచ్చింది. ఆమెను చూస్తుంటే విజయకు దుఃఖం ముంచుకొచ్చింది. జయ మొఖంలో వైరాగ్యం స్పష్టంగా కనపడుతోంది.
ఆమెతో జరిగిన విషయాలన్నీ చెప్పాలనుకున్న విజయ ఆమె మొఖంలో నిర్లిప్తత, గభీరత చూసి నోరు మెదపలేకపోయింది. రాత్రి వరకూ ఆమెతో ఒక్కమాట కూడా మాట్లాడేందుకు ధైర్యం చాలలేదు. ఆమె మంచం పక్కనే కుర్చీలో కూర్చుండిపోయింది దిగులుగా!
చాలాసేపటి తర్వాత "అక్కా!" అంటూ పిలిచింది జయ.
"ఊ!"
"ఆయనకు అన్నీ తెలిసిపోయాయక్కా!"
"అవును జయా!"
"ఈ పరిస్థితుల్లో మేము ఇంకెలా కలిసి ఉండగలం?" విజయ ఉలిక్కిపడింది.
"అదేమిటి? అలా ఎందుకనుకుంటున్నావ్!"
"అదంతే అక్కా! ఒకవేళ నాలాంటిదాన్ని ఆయన క్షమించినా నేనాయనతో సంసారం చేసేందుకు సిద్ధంగా లేను! ఇప్పటివరకూ అనుభవించిన నరకం చాలు! ఇంకొక్క క్షణం కూడా నేనీ పాపం చేయలేనక్కా! నా బాబుతో నా బ్రతుకు నేను చూసుకుంటాను!"
విజయ చకితురాలయి వింటోందామె మాటలు.
"నా జీవితం ఇలా అయినందుకు నాకేమీ బాధలేదక్కా! కానీ నా మూలాన నీ జీవితం కూడా నాశనమయిపోతుందేమో అని తల్లడిల్లిపోతున్నాను."
"నేను సుఖంగానే ఉన్నానుగానీ ఆ మాటలిక ఆపి విశ్రాంతి తీసుకో!" ఆమెని వారిస్తూ అంది విజయ.
"నిన్నో కోరిక కోరేదా అక్కా!"
"ఏమిటది?"
"చంద్రకాంత్ గారిని మనందరం కలసి మోసగించామక్కా! అందుకు ప్రాయశ్చిత్తంగా నువ్వో మంచిపని చేయాలి."
"ఏమిటి?"
"ఆయనను నువ్వు వివాహం చేసుకుని సుఖపెట్టాలి. నావల్ల ఎలాంటి సుఖమూ నేదాయనకి."
"జయా!" ఆవేదనతో అంది విజయ.
"అవునక్కా! నువ్వా పని చేయకపోతే మనిద్దరికీ పాపం అంటుతుంది. జీవితాంతం ఇద్దరం అశాంతితో అలమటించిపోవలసిందే!" కళ్ళ వెంబడి జారుతోన్న కన్నీటిని తుడుచుకుంటూ అందామె.
"ఇప్పుడీ మాటలన్నీ ఎందుకు? ముందు నువ్వు విశ్రాంతి తీసుకో." ఆమెను వారిస్తూ అంది విజయ.
ఆ రాత్రంతా ఎవరికీ నిద్రపట్టనేలేదు.
ఆమెను కిషోర్ తో పాటు పంపించి వేయాలని చంద్రకాంత్ తీసుకున్న నిర్ణయం జయకు తెలియజేయాలా, వద్దా అన్న సందేహంలో పడిపోయింది. అసలు కిషోర్ మళ్ళీ మనసెందుకు మార్చుకున్నాడో. వివాహితురాలని తెలిసినా ఇంకా ఆమెనే ఎందుకు కోరుకుంటున్నాడో. ఎంత ఆలోచించినా ఏమాత్రం అవగాహన కావడం లేదు.
ఆరోజు ఉదయం కాఫీ ఫలహారాలయ్యాక చంద్రకాంత్ జయ దగ్గరకొచ్చి కూర్చున్నాడు.
అతనిని చూడగానే లేచికూర్చుంది జయ.
"నీతో మాట్లాడాలి జయా!" గంభీరంగా అన్నాడతను.
జయ జీవం లేనట్లు చూసిందతని వైపు.
"సాయంత్రం కిషోర్ వస్తున్నాడిక్కడకు. అతనితో అన్నీ మాట్లాడాను. అతను నువ్వు లేని జీవితం అలా వంటరిగా గడచిపోవలసిందేనని నిర్ణయించుకున్నాడట. ఇటు మనమిద్దరమూ కలసి సంసారం కొనసాగించటం కూడా అవివేకమే అవుతుంది. యంత్రాల్లా బ్రతికేకంటే మనసున్న మనుషుల్లా జీవించడం ఇద్దరికీ అవసరమే. కనుక నువ్వూ, కిషోరూ జరిగిందంతా పీడకలగా మర్చిపోయి కొత్త జీవితం ప్రారంభించడం అందరికీ శ్రేయస్కరం."
జయ అతనివంక చూడటం లేదు. శరీరమంతా మొద్దుబారినట్లు అనిపిస్తోంది.
"మాట్లాడవేం జయా! నా అభిప్రాయం అతనికీ నచ్చింది. ఎంతో ఆనందించాడు. అతనితో వెళ్ళడానికి నీకేమయినా అభ్యంతరమా?"
జయ తలవంచుకుంది.
"చెప్పు జయా! అతనితో వెళ్ళటం నీకిష్టం లేదా?"
"నేను కొంచెం ఆలోచించుకోవాలి." నెమ్మదిగా అందామె.
"ఆలోచించు! ఇందులో బలవంతం ఏమీలేదు. నీ మనసుకి నచ్చినట్లు చేసే అధికారం నీకుంది!"
అతను బయటికొచ్చేశాడు.
సాయంత్రం అయిదు దాటింది.
విజయ గదిలోనే దిగాలుపడి కూర్చుండి పోయింది. ఆమె కళ్ళవెంబడి నీళ్ళు కారిపోతూనే ఉన్నాయ్. జయతో మాట్లాడే సాహసం కలగటం లేదామెకి. ఇలాంటి విచిత్ర సంఘటనలు అంతవరకూ ఎక్కడా కనలేదు. వినలేదు.
జయ మనసంతా అల్లకల్లోలంగా తయారయింది.