మిన్నలటే! ధరిత్రికిని మింటికి వంతెన గట్టు బుద్ధిసం
పన్నులటే! ప్రపంచమును భస్మమొనర్చెడు మారణాయుధా
లెన్నొ సృజించినారటె! సరే! మొగ మించుక పైకి త్రిప్పు, డీ
చిన్నిగులాబి మొగ్గను సృజించెదరే? దయచేసి చెప్పుడీ!
ఆయు వశాశ్వతంబు; క్షణమావల నే వలవంత మూడునో!
ఈ యిల మీద నీవు జనియింపక మున్నె జనించి మాయమై
పోయిరి అందమౌ చెలులు పూరుషు లెందరొ! సృష్టి సర్వమున్
మాయ సుమా! విచారములు మానుమ! తీయని మద్య మానుమా!
సరకము కేల నుండగ, హసన్ముఖియౌ సఖి మ్రౌల నుండగా,
నరకము కూడ స్వర్గమగు నాకు; వికస్వరమైన కోకిల
స్వరమది హెచ్చరించెను "వసంతము సాంతము కాక ముందె సుం
దర దరహాసభాసుర సుధా మధురాధర శీధు వానగన్."
త్రాగుట తప్పు గాదు; మతితప్పి ఎగాదిగ నూగి గాలిలో
రేగుట సుంత తప్పు; చెలరేగి బజారున సాగి తూగి యూ
రేగుట కొంత తప్పు; ఎదురేగి జనమ్ముల నాగి పిచ్చిగా
వాగుట గొప్ప తప్పు; పరవళ్ళు క్షమింపగరాని తప్పగున్.
త్రాగుత తప్పు గాదనుట తథ్యము; స్వార్థపిశాచి కౌగిటన్
దూగుచు వేయినాలుకలతో నిరుపేదల వేడిరక్తముం
ద్రాగుట కంటె ఈ మధువు త్రాగుట మేలు గదయ్య! మారణో
ద్యోగుల కంటె త్రాగి పడియుండెడివాడు ప్రశంసనీయుడే.
స్వాంతము శాంతమై పరవశమ్మగు; ఈశ్వర చింతనామృతా
భ్యంతర తన్మయత్వ పరిపాటికి బాటలు వేయు; వంతలున్
జిన్తలు మాయజేయు; శ్రమజీవులకున్ సుఖమిచ్చు; సుంత వి
శ్రాంతి లభించు బుద్ధి; కవురా! మధుపాన మహత్త్వ మెట్టిదో!!
తీయని గోస్తనీరసము తీయని ప్రేయసిచేయి వచ్చి అం
దీయని నాడు మ్రోడగు గదే బ్రతుకంతయు; హేయమైన ఈ
మాయ జగత్తులో "బ్రతుకుమా!" యని దేవుడొసంగె మూడు ఆ
ప్యాయములౌ వరాలు "జవరాలు"ను "శీధువు""సాధుమైత్రియున్."
కంటికి కానరాని తెరగంటుల స్వర్గము నమ్మి వేతువా
మింటికి నిచ్చెనల్? విడువు మీ భ్రమ మిత్రమ! చెల్లవంటి నీ
వంటి మహామనీషి కిటువంటి పనుల్! కవుగింటిలోని వా
ల్గంటి యొసంగు నాసవము కంటెను స్వర్గము వేర యున్నదే!
క్షణికమె యైన యీ పరవశత్వము "ముక్తి వధుకటాక్ష లా
క్షణికము" కాకపోదు; సరసత్వములో విరసత్వ ముండునే?
గుణవతి చేతి పానకము, కోమలి గానము, మత్తకాశినీ
మణితము, సత్కవిత్వమును మై మరపించు రసాయనంబులే!
ఆసవ మానువాని హృదయంబున గల్గెడి పారవశ్య మా
భాసమె యౌనుగాక; ప్రభుపాద నిరంతర చింతన క్రియా
భ్యాస రసానుభూతి కొక పాఠము నేర్పినయట్టులుండు; నీ
ర్ష్యాసముపేతమౌ జగతి కవ్వల దవ్వుల నున్నయట్లగన్.
నేనొక నాస్తికుండ నని నింద యొనర్తురు బుద్ధిహీను ల
జ్ఞానులు స్వాభిమాను; లది సత్యము గాదు సుమా! సమస్త వి
శ్వాని కొకండె కర్తయును భర్తయు హర్తయు నైన కేవల
జ్ఞానమయున్ పరాత్పరుని నమ్మితి! నా హృదయమ్ము నమ్మితిన్!
నన్నొక "మద్యపాయి"గ జనంబులు పల్కిరి కొంతమంది; ఏ
మన్న కొరంత లేదు; పరమాత్ము ననుగ్రహ మున్నజాలు; నీ
కన్నులతోడు! నీ మధుర గానముతోడు! ప్రసన్నమైన యీ
వెన్నెల తోడు! గుండెలు ద్రవించును దివ్యరసానుభూతిలో.
"శీధువు ద్రావరా" దనుచు జెప్పె "ఖురాను" పఠించి ప్రొద్దునన్
సాధు వొకండు; వింటిని-నిశాసమయంబున పోయి కంటి; నా
యోధుడు తప్పత్రావి పడియుండెను మంచము మీద దుర్భరా
గాధ సమాధిలో మొరటు గాడిద కైవడి నోండ్రపెట్టుచున్.
మెత్తని మూగజంతువుల మేకల నావుల బట్టి కత్తితో
కుత్తుక లుత్తరించి తిను క్రూరుల, నిర్దయులైన దుర్మదో
న్మత్తుల ప్రేమమూర్తి పరమాత్ముడు మెచ్చునె? ప్రాణదాత యీ
నెత్తురు చేతి పూజలు గణించునె? మోక్ష మనుగ్రహించునే?
డొక్కల నెండగట్టి సకుటుంబముగా నుపవాన ముండినన్,
చక్కదనాల శిల్పములు సమ్మెటలం బడమొత్తి ముక్కులం
జెక్కిన, శీర్షముల్ చెవులు చేతులు ఛిన్నమొనర్చి నిప్పులం
ద్రొక్కి, నగ్నికుండముల దూకిన, దేవుడు మోక్షమిచ్చునే?
పొట్టపెంచిన పెనుతిండిపోతు కన్న
బొజ్జ వంగని సోమరిపోతు కన్న
పొడిచి రంకెలు వేయు ఆబోతు కన్న
కైతవము లేని యీ త్రాగుబోతు మిన్న.
ఫలము లిచ్చెడు పాదపప్రతతి గనియు
పాలు గురిసెడు గోసమూహాల గనియు
కరిగి వర్షించు నీలమేఘాల గనియు
కనికరము నేర్చుకొనని ముష్కరుడు నరుడు.
పరుగులిడు ఆశతో కాళ్ళు విరుగ బడును;
తిరుగ బడును; జగమ్ముపై తిరుగబడును;
పరువుతీయును; నరజాతి పరువు తీయు;
మనసు నరికట్టలేని పామరుడు నరుడు.
కోర్కె చెలరేగి పందెపు గుఱ్ఱ మట్లు
పరువు లెత్తంగ పగ్గాలు పట్టలేని
రౌతు పడిపోవు లోతైన గోతిలోన;
తెరువు తెలియని వట్టి వానరుడు నరుడు.
తలపయి మండుటెండలను దాలిచి చల్లని నీడ లిచ్చు పాం
ధులకు; కఠోరమౌ శిలలతో పడమోదిన పూలు కాయలున్
ఫలము లొసంగు; ప్రాణముల బాసియు కాయము గోసియిచ్చు; నీ
యిల నరజాతికిన్ తరువులే గురువుల్ పరమార్థబోధనన్.
పచ్చని పంటచేలు; పయిపై జను మబ్బులచాలు; తోటలో
విచ్చిన జాజిపూలు, నులివెచ్చని తేనెలు; వానలున్; గడున్
ముచ్చట గొల్పు లేళ్లు; మరి బుల్బులులున్; సెలయేళ్లు; సాకి అం
దిచ్చెడు ద్రాక్షపానకము; లివ్వి ఖయాముకు ప్రాణతుల్యముల్.
బ్రతుకొక కొండలోయ; పొరపాటుగ ప్రక్కకు కాలు వైచినన్
పతనము దప్ప; దీ యిరుకుబాట పయిం బయనించి యెందరో
సతమతమైరి; యాత్ర కొనసాగినవా రొకరైన లేరు; పం
డితులును పాదుషాలు "బురిడీ పడి" రీ గరిడీ పరీక్షలో!