Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యం - 2 పేజి 45

                                 


                                       పరమేశ్వరుడు

          

    తెలతెల వారువేళ, తెర తీయగ తీయగ పక్షిసంతతుల్
    కలకల కూయువేళ, పయిగ్రమ్మిన మబ్బులు వాన చిన్కులన్
    జలజల రాల్చువేళ, సహజమ్ముగ స్వప్నములో స్తనంధయుల్
    కిలకిల నవ్వువేళ, తిలకింతును నీ సొగసుల్ జగత్ర్పభూ!

    అంబర చుంబితంబులు మహా గిరులున్, సువిశాలముల్ సము
    ద్రంబులు, పొంగి పారెడు తరంగిణులున్, ఫలపుష్పపత్ర పూ
    ర్ణంబులు చె;ట్లనంత గగనంబును దేవుని యున్కి దెల్ప ని
    త్యంబు నిదర్శనంబులు; ప్రదర్శనముల్ పరమాత్మశక్తికిన్.

    పాత్రధారులమై కళాక్షేత్రమందు
    అడుగు తడబడకుండ మే మభినయింప
    సూత్రధారుడవై పైన జూచుచున్న
    ఓ జగన్నాట్య సందర్శకా! జయోస్తు!

    ఈ విశాల వినీలాంబరావధికము
    పట కుటీరమ్ము నా కీ ప్రపంచ మెల్ల;
    ఈ గుడారమ్ములో విహరించు యుష్మ
    దీయ రాజ్య వినోదయాత్రికుడ నేను!

    ఆణిముత్యాల జాలరీ లందగించు
    నీల మణిమయ సువిశాల శాలలోన
    నొంటరిగ గూరుచుండి క్రీగంట స్వీయ
    సృష్టి సౌందర్యమును సమీక్షింతు వీవు!

    నిలువగా ధాత్రి, త్రావగా నీళ్లొసంగి
    బ్రతుకుటకు గాలి, తియ్యని పండ్లొసంగి
    పవలు రాత్రులు శ్రమపడి ప్రజల పాల
    నం బొనర్చెడు "విశ్వకుటుంబి" వీవు!

    హాసము లేని మోము, పరిహాసము లేని వినోదగోష్ఠి, అ
    భ్యాసము లేని విద్య, రసభావ వికాసము లేని కావ్యమున్,
    శ్వాసము లేని దేహము, ప్రశాంతత లేని తపస్సు, దైవ వి
    శ్వాసము లేనివాని నరజన్మము వ్యర్థమయా! దయామయా!

    చుక్కల నీలిదుప్పటి ముసుంగున ప్రాణుల రాత్రివేళలన్
    చక్కగ నిద్రపుచ్చి తొలిసంజల మేలిపసిండి మండువా
    రెక్కలు మెల్లగా తెరచి రేపటి వృత్తికి మేలుకొల్పు నీ
    మిక్కుటమైన ప్రేమ పొలిమేరలు లేనిదయా! దయామయా!

    నల్లని మేఘమాల గగనమ్మున గ్రమ్మినవేళ గుండియల్
    ఝల్లని నెమ్మెయిన్ పరవశత్వము మేకొను; భూతధాత్రిపై
    చల్లని సత్కృపారసము చల్లగ నెల్లరు సంతసిల్లగా
    "మెల్లగ సాగివచ్చె పరమేశ్వరుడం" చనిపించు నెందుకో!

    వెన్నెలలో, ప్రభాతమున విచ్చిన పువ్వుల చిత్రచిత్రమౌ
    వన్నెలలో, ఒయారముగ వంగిన చక్కదనాల చుక్కలౌ
    కన్నెలలో, ప్రతీచి అలికస్థలి కన్నులవిం దొనర్చు ఆ
    క్రొన్నెలలోన నీదు తళుకుల్ బెళుకుల్ తిలకింతునో ప్రభూ!

    తత్వ మెరుంగజాలము గదా! జగదీశ్వర! నింగి నీ యనం
    తత్వము దెల్పు; నీ సకరుణత్వము దెల్పు పయోనిధుల్; త్వద
    స్తిత్వము దెల్పు గాలి; భవదీయ శుచిత్వము దెల్పు నగ్ని; నీ
    సత్వము దెల్పు మేదిని; దిశల్ ప్రకటించు భవన్మహత్త్వమున్.

    కుంటి కురూపి భిక్షుకుల గ్రుడ్డి కబోదుల మమ్ము గాంచి క్రీ
    గంట కవోష్ణబాష్పములు గార్చుచు మబ్బులమేడ మీద గూ
    ర్చుంటివి; సిగ్గుసిగ్గు! పురుషోత్తముడా! మము సంస్కరించి మా
    గుంటలు పడ్డ బీద బ్రతుకుల్ సరిదిద్దగ లేచిరా ప్రభూ!

    ద్రాక్షరసంబు కాంక్ష మెయి ద్రావెడుచో భవదీయనామ ది
    వ్యాక్షర చింతనామృతము నానెద నంచు దలంతు నా మన
    స్సాక్షిగ - నా రుబాయతుల సాక్షిగ-నా సఖి సాక్షిగా-సహ
    స్రాక్షుడ వీవు సాక్షిగ - యథార్థము పల్కితి నో జగత్పతీ!

    ఆడుట మోజె, కాళ్లు కదలాడవు నల్గురిలోన; తీయగా
    పాడుట వేడుకే, గళము పల్కదయా! పదిమంది ముందు; నే
    నేడనొ కొమ్మచాటున వసించెడు పక్షిని; నీడ నున్న న
    న్నీడకు తెచ్చి పైకి దుమికింపకు మీ పలుగాకులన్ ప్రభూ!

    ఎప్పుడు "భానుబింబ" మను నీ దివిటీ వెలిగించినావొ! తా
    నెప్పటి కారిపోదు; పొగ ఏర్పడదున్; కొడిగట్ట దింత; నీ    
    త్రిప్పిన మంటి బొంగర మిదే క్షణమాగదు; గిఱ్ఱుగిఱ్ఱు మం
    చిప్పటి కట్టులే తిరుగు; నీ కరలాఘవ మేమిటో ప్రభూ!

    ఇవ్వల మే మెరుంగుదుము' ఇవ్వల కవ్వల నేమి యున్నదో
    ఎవ్వనికైన శక్యమగునే వచియింపగ; మా యశక్తతన్
    దవ్వుల నీలిమబ్బు పరదా తెరచాటున దాగి చూచు నీ
    నవ్వుల చప్పుడిప్పుడు వినంబడుచున్నదయా! మహోదయా!

    గాలిపటంబు జీవితము; కట్టిన దారము బుద్ధి; పుణ్య పా
    పా లవి గాలిపాటులు; నభంబు ప్రపంచము; దీని సూత్ర సం
    చాలకు డెవ్వడో తెలియజాలము; పైపయి కేగి యాడు వా
    ల్గాలికి! తల్లడిల్లి సుడిగాలికి తూలిపడున్ ధరాస్థలిన్.

    పోయెను దూరదృష్టి - పడిపోయెను భోజనపుష్టి - శుష్కమై
    పోయెను దేహయష్టి - చెడిపోయెను హార్దికతుష్టి - నష్టమై
    పోయెను చిత్తశుద్ధి - విడిపోయెను భాగ్యసమృద్ధి - స్రస్తమై
    పోయె సమస్తమున్; వదలిపోనిది వాని దురాశ యొక్కటే!

    నవరసభావ పూర్ణమగు నాటకవేదిక మీద నెల్ల మా
    నవులును గజ్జె గట్టి నటనం బొనరించెడి వేషధారులే!
    యవనిక ముందె కాని తెర కావల వేసము విప్పినంత రా
    జెవడొ! భటుం డెవండొ! స్ఫురియింపదు సర్వము నొక్క రూపమై!

    వేసము వేసి పంపితివి వేదికమీదకు; పాడు వేళ నా
    మీసము జారిపోయి విషమించె పరిస్థితి; ప్రేక్షకుల్ పరీ
    హాసము చేయనుండిరి; రహస్యముగా తెరవేయు మంచు నీ
    కోసము చూచితిన్; కసరుకొంటి; విదెక్కడి దర్శకత్వమో!

    ఆంగిక వాచికా ద్యభినయంబు లొనర్చుచు, హావభావముల్
    భంగిమముల్ వెలార్చుచును, పాత్రలు వచ్చెడు నిష్ర్కమించెడున్;
    రంగము వెంటనే మరొక రంగము సాగుచునుండె; దృశ్యముల్
    రంగులు మారుచున్నవి; తెరల్ పడుచున్నవి; లేచుచున్నవిన్!

    ఆడుచు పాడుచున్ తగవులాడుచు నవ్వుచు నేడ్చుచున్ జతల్
    వీడుచు పోయినారు తెర వెన్కకు; పోయినవాడు వెండియున్
    రా డొకడేని; చిత్రమగు నాటక మియ్యది; దీని "నాంది" నె
    వ్వాడు పఠించెనో "భరతవాక్యము" విన్పడ దెన్నినాళ్లకున్!

    నను మెడబట్టి గెంటితివి నాటకరంగము పైకి; చేత కా
    దని బతిమాలుకొన్న వినవైతివి; కన్నులు విప్పి సభ్యులన్
    గనుగొనినంత కాళ్లు వడకం దొడగెన్; సరికొత్త నర్తనం
    బనుకొని చప్పటుల్ చరచి రందరు; చాల్ తెరదింపు మో ప్రభూ!

 Previous Page Next Page