అక్కట! మేను డస్సె; మొగమా జిగి తప్పెను; ప్రొద్దు వాలె; నీ
వెక్కడి కేగెదో తెరువరీ! క్షణ మాగుము; మా కుటీరమం
దిక్కడ సేద దీర్చుకొను మించుకసేపు; భవన్నివాస మే
దిక్కున నున్నదో! బయలుదేరిన దెప్పుడొ! గమ్య మెద్దియో!
పరుగులు పెట్టుచున్నది ప్రపంచము నిప్పులు త్రొక్కినట్టు, లం
బరము పెఠిల్లునన్ బగిలి పైబడినట్టులు, భూత మేదియో
తరుముచునున్న యట్టులు, వృథా శ్రమ తప్ప యథార్థ మేదియో
ఎరుగ దొకింత; ఈ యురుకు లెచ్చటికో? మరి యెందుకోసమో?
అందము డెందమున్ నులిమి హత్య యొనర్చెడి మొండిదున్న కా
నందము బండిసున్న; కరుణారస ముండునె రాతిగుండెలో?
మంద మరుత్కుమార సుకుమార సుగంధ రసార్ద్ర హార్దిక
స్పందనమున్ గణించునె భుజంగ విభుండు క్షుథావ్యథాక్రుధన్?
వచ్చిన పాత మిత్రునకు వాకిటి జంటగులాబి గుత్తు లం
దిచ్చి నవాసవంబు గొనితెచ్చు నిమిత్తము లోనికేగి నే
వచ్చెడు నంతలో-నమిలివైచెను వాడు గులాబి పువ్వులన్;
మచ్చిక దక్కి వట్టి తొడిమల్ పడియున్నవి ముందు బల్లపై.
పెట్టెల భాగ్యలక్ష్మి జెరబెట్టకు; మిత్రుల నెత్తిమీద చై
పెట్టకు; సత్యమున్ విడిచిపెట్టకు; పండితులైనవారి డీ
కొట్టకు; వట్టి గప్పములు కొట్టకు; నమ్మినవారి గోతిలో
నెట్టకు, గద్దెలెక్కి తెగ నీల్గకు; మూల్గ కజీర్ణరోగివై.
ఎంతటి కష్టమేని సహియింపుము; నెమ్మెయి ప్రాణమున్న ప
ర్యంతము చేయి చాపకు మదాంధుల ముందు; నితాంత నిర్దయ
స్వాంతులముందు; నీచమగు యాచన కంటెను చావు మేలు; నీ
యంతట నీవు నిల్వబడరా! విడరా పరతంత్రభావముల్!
అచ్చటి భక్తులన్ గనిన యంతనె నాకును భక్తి పుట్టి నా
ముచ్చెలజోడు గోపురము ముందర చప్పున విప్పి లోనికిన్
జొచ్చితి; నిల్పలేక మనసున్, గుడిబైటకు వచ్చి చూచితిన్;
మ్రుచ్చిలిపోయినార లెవరో మునిమ్రుచ్చులు కొత్తముచ్చెలన్.
లోకుల కొంపలార్పి యెటులో గడియించిన పాడుడబ్బుతో
ఆకసమెత్తు గట్టితివి హర్మ్య; మదింకను లేచుచుండె పై
పైకి; మరేమి లేదు; అటుపై అట పై గదిలోన మృత్యువే
నీకు ఘటిల్లు నేని నిను నేలకు దింపు టదెంత కష్టమో!
అచ్చపు పూలతోట జగమంత; యముండను మాలి నిత్యమున్
విచ్చినపూలు గిల్లుకొని వెళ్ళును; "మాదగు వంతు నే, డికన్
వచ్చును రేపు మీ దయిన వం" తని అశ్రుకణాలు రాల్చుచున్
విచ్చనిపూల వైపుగని విచ్చినపూల్ విలపించె పెద్దగా!!
అక్కడ రెక్కలూడి అణగారెడి పుష్పము వెచ్చనూర్చి నా
కొక్క రహస్యముం దెలిపె "నో నరుడా! జగమందు క్రూరులౌ
రక్కసు లున్నవారు; మనరక్తము పీల్తురు; చెప్పుకాళ్లతో
ద్రొక్కుదు; రెంత ముట్టెపొగరో! మరి మెత్తనివారి జూచినన్."
పచ్చిగ పావులం గదిపి పందెములం దలక్రిందు చేసి యీ
నిచ్చెన లెక్కినా ననుచు నిక్కకు; ప్రక్కకు జూడు మల్లదే!
విచ్చిన నోటితో బుసలువెట్టెడి ఆ పెనుబాము నోటిలో
జొచ్చిన - చచ్చినట్లు తొలిచోటుకు జఱ్ఱున జారకుందువే!
బాణములో కృపాణములొ బాకులొ ఘోరవిషాగ్నికీలలో
ప్రాణవినాశకమ్ములగు నాయుధముల్ సమకూర్చి రెన్నియో
ప్రాణము తీయనేర్చిన ధురంధరు లందరు; లేడు బొందిలో
ప్రాణము పోయనేర్చిన కృపాపరు డొక్కడు నింతమందిలో!!
ఒక్కదినాన నే నడచుచుంటిని; మంటిని రెండుకాళ్లతో
ద్రొక్కు కులాలు గంటిని; ఎదో నుడి వింటిని; "అంత మోటుగా
త్రొక్కకు! క్రుమ్మబోకు! మొకరోజున నీవలె నేను సైతమున్
జక్కనివాడనే! బలము సత్వము గల్గిన మానవుండనే."
నే నొక కుమ్మరింటి కడ నిల్చి తటాలున తల్పు తీయగా
బానలు కుండ లేకమయి పల్కిన వొట్లొకమూల నుండి; "ఎం
దే నగుపించినారె మముతీరిచి దిద్దిన కుంభకారు!" "లే
మైనది చూచినావె మము అమ్మినవారలు కొన్నవారలున్!!"
అధరము చేర్చి శీధురసమాను రసజ్ఞుని తోడ నిట్లనెన్
మధుకలశంబు; "పూర్వ మొకమానిసినే సుమి నేను గూడ నీ
విధమున వైభవం బనుభవించితి; తీయని తేనె లానితిన్;
పృథివిని నా స్వరూపము ధరింతువు నీవును కొన్నినాళ్లకున్."
ప్రార్థన వేళలన్ ప్రతిమ పల్కెను భక్తునితో - "ఇవన్నియున్
వ్యర్థము! తొల్త నేను నొక బండనె; సమ్మెటపోటు లోర్చితిన్;
సార్థకమయ్యె నా బ్రతుకు; స్వామిగ మారితి; నీవు కూడ అ
న్యార్థము కష్టనష్టముల నందిన పూజ్యత గల్గు నావలెన్.
అమ్మెయి కత్తికోతల సహస్రముఖమ్ముల "రాచిరాచి రం
పమ్మున బెట్టి" లోకులిడు బాధల నోర్చిన దువ్వెనల్ సుగం
ధమ్ముల జిమ్ము ముగ్ధవనితా జనతా సువినీల కేశబం
ధముల నెక్కి కుల్కును గదా! శ్రమ నందక సౌఖ్య మబ్బునా?
ఇతనిది అందమైన మొగమే; మరి పున్నమచందమామకున్
బ్రతియగు నట్టిదే; ప్రతి దినంబును లోకుల వెక్కిరించి ఈ
గతి వికృతిం గనెన్; పరుల కల్మికి ఏడ్చి తపించి వేదనా
హతి తెగమాడి "అట్లపెన" మట్లయిపోయె క్రమక్రమమ్ముగన్.
పొలుపగు పారిజాతములు బుట్టల కెత్తెడివాని గాంచి "యెం
దుల" కని యంటి కౌతుకముతో; నత డిట్లని పల్కె "వీని మం
గలమున వాడ్చిమాడ్చి తిలకమ్ములు వండుదు; మా రసంబుతో
చెలువలు దిద్దు బొట్టు విరజిమ్మును కమ్మని సౌరభమ్ములన్."