దట్టమైన చీకటి... ఏదో అడుగుల చప్పుడు వినబడితే అకస్మాత్తుగా మెలుకువొచ్చింది ఆదిత్యకు.
ఏవో గుసగుసలు విన్పించాయి.
దిగ్గున లేచి కూర్చున్నాడు. లైబ్రరీ ఎదురుగా వున్న స్కూల్ బిల్డింగ్ లోంచి గుసగుసలు విన్పిస్తున్నాయి.
నలుగురైదుగురు వ్యక్తులు నవ్వుతూ మాట్లాడుకుంటున్నారు.
లేచి కిటికీలోంచి చూసి, తలుపు నెమ్మదిగా తెరచి, బయటికొచ్చాడు ఆదిత్య.
స్కూల్ వేపు నడిచాడు.
తలుపు సందులోంచి లోనికి చూశాడు.
లోన బుడ్డి దీపం చుట్టూ ఓ అయిదుగురు వ్యక్తులు కూర్చున్నారు. అందరికీ ముప్పై యేళ్ళలోపే వుంటాయి.
"ఒరే వెంకటూ! ఫారిన్ సరుకును భలే పట్టావురా" సీసాలోని డ్రింక్ ను గ్లాసులో పోసుకుంటూ అన్నాడొకడు.
"పట్టడవేట్రా బాబూ... వైన్ షాపు ఓనర్ దగ్గర్నించి కొట్టుకొచ్చింది. వాటిలో నాలుగు బాటిల్స్ ఆ సర్కిల్ గాడు లాక్కెళ్ళిపోయాడు. ఒకటి నా ముఖాన పడేశాడు. రేపెలాగైనా యింకొకటి సంపాదిస్తాన్లే... కంగారుపడకు" వెంకట్ చెప్తున్నాడు.
వెంకట్ ఊళ్ళోకొచ్చాడన్నమాట!
వెంకట్ పొడవుగా, సన్నంగా వున్నాడు. భుజాల వరకూ జుత్తు. వాడ్ని చూడగానే తెల్సిపోతుంది రౌడీ అయ్యుంటాడని.
"ఒరే వెంకటూ! మీ వూళ్ళో మంచి పోరి వుందన్నావుగదా... ఇంతవరకూ రాలేదేంట్రా?" ఇంకొకడు అడిగాడు.
"పోరంటే బజారు పోరనుకున్నావేట్రా రాంరెడ్డీ! సొగసైన పోరి. దివ్యభారతి దాని ముందు దిగదుడుపు... నెక్ట్స్ మన జర్నీ అక్కడికే" హుషారుగా అన్నాడు వెంకట్.
"దానికి పెళ్ళి కాలేదా?" ఇంకొకడు అడిగాడు.
"పెళ్ళా...అదేదో లవ్ కహానీలే... భర్త బిజినెస్ మీద బొంబాయిలో వున్నాడు. ఇదొక్కత్తే యిక్కడుంటుంది. రెండు మూడుసార్లు ట్రై చేశాను. పడలేదు. పిట్ట... అందుకే... ఈసారి... మిమ్మల్ని తీసుకొచ్చింది" అని అటూ ఇటూ చూశాడు వెంకట్ గాడు.
వాళ్లు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారో అర్ధమైంది ఆదిత్యకు. అతని నరాల్లో రక్తం సలసలా మరిగిపోతోంది. వాళ్ళని అక్కడ పాతిపెట్టేయాలని నిర్ణయించుకున్నాడు ఆదిత్య.
అంతలోనే ఆ ఆలోచనను విరమించుకున్నాడు.
సుమబాల ఇంటిలోనే వాళ్ళకు ఎటాక్ ఇస్తే... సుమబాలకు తన మీద మంచి అభిప్రాయం ఏర్పడడానికి అవకాశముంటుంది.
అందుకే...
మాట్లాడకుండా వెనక్కి వచ్చేసి సుమబాల ఇంటివేపు నడవటం ప్రారంభించాడు.
వెన్నెల వెలుగు మసక మసగ్గా వుంది. ఆ మసక వెలుగులో రాతి బిల్డింగ్ పెద్ద కొండలా వుంది.
బిల్డింగ్ లోకి వెళ్ళాలంటే మెయిన్ గేటు తప్ప మరో మార్గంలేదు. చుట్టూ ప్రహరీగోడ... బిల్డింగ్ వెనకవేపు నడుస్తున్నాడు ఆదిత్య.
బిల్డింగు వెనక గోడకానుకుని ఎత్తైన మర్రిచెట్టెక్కాడు ఆదిత్య.
ఫస్టు ఫ్లోర్లో... ఆ చివర గదిలో లైటు వెలుగుతోంది.
అంటే సుమబాల మేల్కొని వుందన్నమాట... శతృవుల కోసం నిరీక్షిస్తున్నాడు ఆదిత్య.
* * * * *
చదువుతున్న నావెల్ ని పక్కనబెట్టి, తలదిండు కిందున్న పిస్టల్ ని ఒకసారి చూసుకుని...
హాయిగా నిద్రపోతున్న ప్రెటీ బుగ్గమీద ముద్దుపెట్టి గదిలో లైటు ఆర్పడానికి ముందుకడుగేసింది సుమబాల.
అప్పుడు వినిపించాయి ఆమెకు.
కుక్కలా అరుపులు... భయంకరంగా అరుస్తున్నాయి. అవి... అవి మామూలు అరిచే అరుపుకాదని యిట్టే గ్రహించింది సుమబాల.
ఆమె మనసేదో కీడును శంకించింది. ఎన్నడూ ఇంతగా అరవని కుక్కలు అరుస్తున్నాయంటే?
ముందు జాగ్రత్త చర్యగా బెడ్ రూమ్ లో లైటార్పేసి పిల్లో కిందున్న పిస్టల్ ని తీసుకుని వరండాలోకి అడుగుపెట్టింది.
అప్పుడు చూసింది... పిట్టగోడవేపు ఏదో ఒక ఆకారం ఫస్ట్ ఫ్లోర్ పిట్టగోడను దూకడానికి ప్రయత్నిస్తోంది.
మరేమాత్రం ఆలస్యం చేయలేదు.
"ఎవరు... హు ఆర్ యూ?" పిస్టల్ గురిపెడుతూ అరిచింది సుమబాల.
మరో ఘడియలో పిస్టల్లోంచి బుల్లెట్లు దూసుకొచ్చేవి. కానీ... వెనక నుంచొచ్చిన బలమయిన చేతులు సుమబాల మెడను చుట్టేశాయి. ఇంకొక వ్యక్తి ఆమెను కదలకుండా చేసి... ఆమె చేతిలోని పిస్టల్ ని లాక్కున్నాడు.
అప్పుడర్ధమైందామెకు వచ్చిందెవరో.
రౌడీ వెంకట్....
ఆమె వంటినిండా చెమటలు పట్టేశాయి.
ఆ ఇద్దరి వ్యక్తుల చేతుల్లో గింజుకుంటోంది సుమబాల.
ఆ ఇద్దరూ....
వేగంగా సుమబాలను కింద హాల్లోకి తీసుకొచ్చారు.
"హెల్ప్... హెల్ప్... హెల్ప్..." అతి ప్రయత్నం మీద నోటికి అడ్డంగా వున్న చేతుల్ని తప్పించుకుని అరుస్తోంది సుమబాల.
"చూడు పిల్లా! క్రితంసారి తప్పించుకున్నావు... ఈసారి తప్పించుకోలేవు... మర్యాదగా ఒప్పుకో... గుట్టుగా జరిగిపోతుంది. అరిచావో-గొడవ చేశావో నీ కూతుర్ని సఫా చేస్తా" ఆ గొంతు భయంకరంగా వుంది.
ఆ గొంతును గుర్తుపట్టింది సుమబాల... వెంకట్.
"ప్రెటీ" విహ్వలంగా అరుస్తూ తనని పట్టుకున్న వెంకట్ ని తనని ఆ చీకట్లోనే మేడమెట్లెక్కుతోంది సుమబాల.
"లైటు వేయండి... దాన్ని పట్టుకోండి ముందు... దాన్ని అరవనివ్వకుండా చేయండి. అరిస్తే వూరి జనం వస్తారు" పరుగు పరుగున ముందుకొస్తూ హెచ్చరించాడు వెంకట్.
"లైట్ స్విచ్ లు ఎక్కడున్నాయి?" ఒకడు చీకట్లో దేవులాడుతున్నాడు.
"ఎక్కడుంటాయిరా... గోడకుంటాయి వెతుకు" ఇంకొకడు మెట్లవేపు పరుగెత్తాడు.
గాలిలా, బాణంలా బెడ్ రూంలోకి దూసుకొచ్చి లోన గెడపెట్టేసి లైటు వేసింది సుమబాల.