Previous Page Next Page 
మనీ బాంబ్ పేజి 43

ఊగిసలాడుతున్న మనసుతో ఆలోచించింది వెనిలా. తర్వాత కృతజ్ఞతగా చూస్తూ, తల అడ్డంగా ఆడించింది.
"ఉహూ! వద్దు! ఇప్పటికే నీకు తోడుగా ఒక అమ్మాయి ఉంది. నేను కూడా వచ్చి నీకు భారం కాలేను."
"పిచ్చిదానిలా మాట్లాడకు ! రా !"
గట్టిగా తల విదిలించింది వెనిలా. "వెళ్ళు సందీప్ ! నా గురించి బాధపడుతూ నీ సమయం వృధా చేసుకోకు."
ఆమె మొహంలో స్థిరంగా కనబడుతున్న భావాన్ని గమనించి, ఇంక వాదించి లాభం లేదని గ్రహించాడు సందీప్. ఆ అమ్మాయి వైపు జాలిగా, అభిమానంగా చూస్తూ, "వెనిలా! నువ్వు రేపు ఆ లోయలోకి వచ్చేదాకా నీకోసం కనిపెట్టుకుని ఉంటాను" అన్నాడు.
నిస్పృహగా నవ్వింది వెనిలా.
బుట్టని దింపడానికి ఉపయోగించే తాడు కొసని గిలక వున్న దుంగకి కట్టాడు. తాడుని లాగి చూసి, దాన్ని పట్టుకుని బావిలోకి జారాడు.
అప్పుడు గమనించింది వెనిలా. పుచ్చిపోయి శిథిల మవుతున్న ఆ పాత దుంగ భారంగా కిర్రుమని శబ్దం చేసింది. మరుక్షణంలో కొద్దిగా చీలింది, సందీప్ బరువుకి.
ఆదుర్దాగా బావిలోకి తొంగి చూసింది వెనిలా. అప్పటికీ సగం వరకూ వెళ్ళిపోయాడు సందీప్.
మరి కొద్దిగా విరిగింది దుంగ. ఇంకొన్ని క్షణాలలో అది పూర్తిగా విరిగి పడిపోవడం ఖాయం!
వెంటనే తాడుని చేతులతో అందుకుంది వెనిలా. బావి గోడకి కాళ్ళు తన్నిపట్టి, శాయశక్తులూ కేంద్రీకరించి, బలంగా పట్టుకుంది తాడుని. మరి కొద్ది క్షణాలు వ్యవధి ఉంటే చాలు, ప్రమాదం గడిచి సందీప్ సురక్షితంగా లోయలోకి దిగుతాడు.
ఒక్కొక్క క్షణం ఒక్కొక్క యుగంలా గడుస్తోంది. చేతులు భుజాల దగ్గర ఊడి వచ్చేస్తాయేమో అన్నంత దుర్భరమైన బాధ కలుగుతోంది వెనిలాకి. నడుము జారిపోతున్నట్లు అనిపిస్తోంది. అరచేతులు ఒరుసుకుపోయి రక్తసిక్తమై పోయాయి.
పళ్ళు గిట్టకరిచి, కళ్ళు మూసుకుంది వెనిలా. 'మరికొద్ది... క్షణాలు! అంతే! దేవుడా! మరికొద్ది క్షణాలసేపు నాకు ఓర్చుకునే శక్తిని ప్రసాదించు!'
సందీప్ కాళ్ళకి భూమి ఇంకా పది గజాల అడుగున ఉంది.
హఠాత్తుగా ఎడమచేతి భుజం దగ్గర ఉన్న బంతిగిన్నె కీలు జారిపోయింది వెనిలాకు. భరించ శక్యం కాని బాధ. ఆ వెంటనే వెన్నుపూస మధ్యకు విరిగింది. తాడు ఒక్క ఉదుటున ఆమెని లోయలోకి లాగేసింది.
హృదయ విదారకంగా ఆర్తనాదం చేస్తూ, వంద గజాల లోతు ఉన్న బావిలోకి తలక్రిందులుగా పడిపోయింది వెనిలా. ఆమె తల భూమిని తాకగానే అసంఖ్యాకమైన ముక్కలుగా పగిలిపోయింది. ఆమె ప్రాణాలు గాలిలో కలిసిపోయింది.
మూడు గజాల ఎత్తు మీదనుంచీ కిందపడ్డాడు సందీప్. అతనికి అంతగా దెబ్బలు తగలలేదు. లేచి, విచారంగా వెనిలా శవంవైపు చూశాడు.
"సందీప్!" అని స్వప్న పెట్టిన కేక వినబడింది. "సందీప్ ! నా సందీప్ ! వచ్చావా?" అంటూ పరుగున వచ్చి, అతని కౌగిట్లో చేరబోయి, అంతలోనే ఏదో గుర్తొచ్చినట్లు హాఠాత్తుగా ఆగిపోయింది. పట్టరాని దుఃఖం కనబడుతోంది ఆమె మొహంలో.
"స్వప్నా!" అన్నాడు సందీప్ అభిమానంగా, ఆమె దగ్గరికి వస్తూ.
కలవరపడుతూ తల అడ్డంగా ఆడించింది స్వప్న. "వద్దు సందీప్! నన్ను తాకొద్దు!" అంటూ వెనక్కి తిరిగి పారిపోబోయింది.
పరుగెత్తి, ఆమె భుజం పట్టుకుని ఆపాడు సందీప్. బలంగా తనవైపు తిప్పుకున్నాడు.
వదిలించుకోవడానికి పెనుగులాడింది స్వప్న. "నన్ను తాకొద్దు సందీప్! నేను ఒక రోజంతా ఈ లోయలో ఉన్నాను. ఈ భయంకరమైన అంటువ్యాధి నాకూ సోకే వుంటుంది. నన్ను ముట్టుకోకు సందీప్! దూరంగా పారిపోయి నిన్ను నువ్వు రక్షించుకో!" అంది రోదిస్తూ.
ఆమె చుట్టూ చేతులేసి దగ్గరికి లాక్కున్నాడు సందీప్, "స్వప్నా! నువ్వు నా ప్రాణానివి!" అన్నాడు మనస్ఫూర్తిగా. పెదిమలతో ఆమె కన్నీళ్లు తుడిచాడు.

 Previous Page Next Page