అతను లేచి టాక్సీ తీసుకొచ్చాడు. జయ నర్సింగ్ హోమ్ లో జాయినయింది. విజయ ఆమెకు తోడుగా హాస్పటల్లోనే ఉండిపోయింది.
మధ్యాహ్నం వరకూ తనూ అక్కడే వుండి ఇంటికి చేరుకున్నాడు చంద్రకాంత్. తనకున్న మరికొన్ని అనుమానాలు తీర్చుకోటానికి అదే సరయిన అవకాశం అనిపించిందతనికి.
విజయ గదిలోకి నడిచి ఎదురుగ్గా బల్లమీదున్న పెద్ద సూట్ కేస్ తెరవడానికి ప్రయత్నించాడు. దానికి తాళం వేసి వుంది. దాని తాళంచెవి అల్మారాలో దేవుడి బొమ్మ దగ్గర వుంది. సూట్ కేస్ తెరిచి ఆమె బట్టలన్నీ తొలగించి చూశాడతను. అడుగున ఓ పెద్ద కవరు కనిపించిందతనికి. ఆ కవర్లో కాగితాల బొత్తి వుంది. వాటిని తీసి చూశాడు. అవన్నీ తను ఆమెకు రాసిన ఉత్తరాలు, అన్నిటినీ జాగ్రత్తగా అక్కడే వుంచి సూట్ కేస్ మూసివేశాడతను.
ఇప్పుడు తనకంతా అర్ధమవుతోంది.
సాయంత్రం వరకూ ఏవేవో ఆలోచనలతో సతమతమైపోసాగాడతను. కళ్ళు ఎర్రబడి పోయినాయి. విపరీతమైన తలనొప్పి.
హఠాత్తుగా అతనికి గుర్తుకొచ్చింది.
కిషోర్ తనకోసం ఎదురుచూస్తూంటాడు. ఆ హోటల్ దగ్గర.
మరుక్షణం ఆటోలో అక్కడకు చేరుకున్నాడతను. అప్పటికే హోటల్ బయట నిలబడి తనకోసం ఎదురుచూస్తున్నాడు కిషోర్.
ఇద్దరూ లోపలికెళ్ళి కూర్చున్నారు.
"జయ ఎలా వుంది" అడిగాడతను.
"నర్శింగ్ హోమ్ లో చేర్పించాను."
"ఐసీ."
"ఈ రాత్రిలోగా డెలివరీ అవ్వొచ్చునట"
"నాతో ఏ విషయం గురించి మాట్లాడాలనుకున్నారు?" అడిగాడు అతను డైరెక్టుగా సంభాషణ ప్రారంభిస్తూ.
"ఇప్పుడు జయను అంగీకరించడానికి సిద్ధంగా వున్నారా మీరు?" అడిగాడు చంద్రకాంత్.
అతను తడబడ్డాడు.
అతనికి భయం వేస్తోంది.
"మీరు తమాషాకి మాట్లాడుతున్నారా?"
"తమాషా కోసం ప్రేమించడం, తమాషా కోసం పెళ్ళి చేసుకోవడం నాకు చేతకాదు! నేనేం మాట్లాడినా ఖచ్చితంగా, సీరియస్ గా మాట్లాడతాను! ఆచరిస్తాను."
"కాని మరి...అదెలా సాధ్యం?"
"నేనడిగిన ప్రశ్నకు అది కాదు జవాబు!"
"ఓ అయామ్ సారీ! మీరు దానికి జవాబు కావాలంటే నిజంగా అనుకుంటే... ఆల్ రైట్! ఇప్పుడే కాదు! ఏ క్షణంలోనయినా సరే జయను ఆనందంగా ఆహ్వానిస్తాను నా జీవితంలోకి!"
"మీరు అన్నీ ఆలోచించే మాట్లాడుతున్నారనుకుంటాను"
"అవును"
"మరి జయ కూడా మీతో జీవితం గడపడానికి అంగీకరిస్తుందా?"
"ఆమెకు నామీద కోపం వుండే ఉండవచ్చు! అంతమాత్రాన మా యిద్దరి హృదయాల్లో ఒకరిమీద ఒకరికి ఏర్పడ్డ ప్రేమ చెదిరిపోతుందని నేననుకోను."
"అలాగయితే జయను ఎప్పుడు తీసుకెళతారు?"
"మీరు అలా మాట్లాడుతోంటే నాకు భయంగా ఉంది."
"జవాబు చెప్పండి"
"ఏ క్షణంలోనయినా సరే."
చంద్రకాంత్ ఆలోచించాడు.
"మరో పదిరోజుల్లో ఆమెను తీసుకెళ్ళేందుకు సిద్ధంగా వుండగలరా?"
"తప్పకుండా తీసుకెళతాను! నేనే మీఇంటికొచ్చి తీసుకెళతాను" దృఢ నిశ్చయంతో అన్నాడతను.
"ఇంక వెళదామా మరి?"
"పదండి" ఇద్దరూ బయటికొచ్చారు.
"అయితే వస్తానిక" బయల్దేరబోయాడు చంద్రకాంత్.
"ఒక్క మాట మీతో చెప్పనీండి"
"ఏమిటి?"
"మీరు దేవుడులాంటివారు"
చంద్రకాంత్ వడివడిగా అడుగులు వేసుకుంటూ వచ్చేశాడు.
ఆ రాత్రికే జయ ప్రసవించింది. మగపిల్లవాడు.
ఆమెతో మాట్లాడ్డానికి మనసొప్పటం లేదతనికి. ఆమెను చూడడం కూడా అయిష్టంగానే వుంది.
విజయతో ఒంటరిగా మాట్లాడే అవకాశం కోసం ఎదురుచూడసాగాడతను.
రెండ్రోజుల తర్వాత ఆ అవకాశం లభించిందతనికి.