Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యం - 2 పేజి 42

                                 


                                         ప్రపంచము

    "త్రావు నుమర్ ఖయా" మనుచు తప్పులు పట్టు మహాత్ము లీయహం
    భావులు పారసీక కవిభావ మెరుంగరు; ప్రేమమూర్తి యా
    దేవు దయారసం బను మదిన్ మదిరాక్షి! త్వదీక్షణద్యుతుల్
    ద్రావెద, త్రుప్తిదీర మధురమ్మగు నీ యధరామృతమ్ముతో.  

    ఎవ్వని కోటగోడల పయిన్ రవితేరు పచారు చేసెనో!
    ఎవ్వని పాదపీఠికి నరేంద్ర కిరీట చిరత్న రత్నముల్
    దివ్వియలై ఉషస్సులను దిద్దెనొ! ఆ బహరాము గోరిపై
    గువ్వలు గూండ్లు కత్తుకొనె! కూసెను జంబుకముల్ వృకంబులున్.

    దున్నలు రాసభంబులును త్రొక్కెడి అక్కడి ముళ్ళకంచె లే
    యన్నులమిన్న నెన్నుదుటనాడిన ముంగురులో యెరుంగ; మీ
    చిన్ని కొలంకులందు వికసించిన చెందొవ సోయగమ్ము లే
    కన్నెకుమారి చిక్కని నిగారపు చెక్కుల కావికాంతులో!

    ఏనుగు నెక్కి నిక్కు వసుధేశ్వరుడైన శ్మశానవాటిలో
    పీనుగు గాక తప్పదు విభీతమృగేక్షణ! యే క్షణాననో!!
    దా నవుగాము లారయక దానవుడై - శఠుడై-కృతఘ్నుడై-
    మానవు డుగ్రకృత్యముల మానడు జేనెడు పొట్టకోసమై.

    చిట్టి నిసుంగులన్, తళుకు చెక్కుల చక్కని ముద్దుగుమ్మలన్,
    పట్టపు రాణులన్, కవుల, పండితులన్, జగజెట్టులైన స
    మ్రాట్టుల, రాకుమారుల, సమాంతము పొట్టను బెట్టుకొంటివో
    కట్టిడి కాలమా! యమునిగాలమ! నీ కడుపెంత పెద్దదే!

    నెత్తురు మాంసఖండములు నిండిన పాపపుబండి లాగు ఈ
    గిత్త రవంతయేని పరికింపదు స్వీయభవిష్య మెట్టిదో;
    కత్తి కరాన దాల్చి బలికై కొనిపోవు కసాయి వెంట ప
    ర్వెత్తును మేక - కంఠమున వ్రేలెడు వేపచివుళ్ళు మేయుచున్.

    చక్కని పానపాత్రములు సల్పి కులాలుడు చేతిమీదుగా
    ముక్కలు సేయబోడు, నగు మోముల ముద్దులు మూటగట్టు లే
    జెక్కుల పైడిబొమ్మల సృజించి భయంకర మృత్యుదంష్ట్రలన్
    వ్రక్కలుగా నొనర్చు భగవంతుని దెంతటి రాతిగుండెయో!!

                  

    స్థిరములు "కావు కావు" చల జీవితముల్; సిరిసంపదల్ సుఖం
    కరములు "కావు కావు"; పలుగద్దెలు మిద్దెలు నాత్మశాంతి కా
    కరములు "కావు కావు"; నవకమ్ములు నిత్యము "కావు కా"; వటం
    చరచుచునుండె కాకి; కను మల్లదిగో బహరాము గోరిపై!

    "అవ్వల 'మాలి' వచ్చు సమయం బగుచున్నది; నిండుగుండెతో
    నవ్వుడు నవ్వు డిప్పుడె; క్షణంబు చనన్ కనువిందులైన మీ
    జవ్వనపుం బసందులు బజారుల పాలగు" నంచు తోటలో
    పువ్వుకు పువ్వుకుం దిరిగి "బుల్ బులు" నిచ్చలు హెచ్చరించెడున్.

    కాలము కాచియున్నది సృగాలము కైవడి; కాలుచేతి పెన్
    గాలము వేచియున్నది క్షణక్షణమున్ నిను మట్టుపెట్ట; ఏ
    కాలము స్వార్థలుబ్ధులయి కండలు పెంచెడివారి గాంచి కం
    కాలము నవ్వుచున్నది అగాధ సమాధి ప్రతిధ్వనింపగన్.

    అంబుధు లీదవచ్చు; ప్రళయాగ్నుల గుప్పిట బట్టవచ్చు; గ్రం
    థంబులు వ్రాయవచ్చు; గగనానికి నిచ్చెన వేయవచ్చు; వి
    శ్వంబు జయింపవచ్చు; హిమశైలము నెక్కగవచ్చు గాక; చో
    ద్యంబగు చావుపుట్టుకల దైవరహస్య మెరుంగవచ్చునే!

    శిష్టుల శీర్షమందు తమ చెప్పులపాదము లుంచి, భ్రష్టులౌ
    దుష్టుల నెత్తికెత్తుకొను ధూర్తజగమ్మిది; దీని పంచలో
    కష్టము తృప్తిగా బ్రతుకగల్గుట; కల్గినదాని తోడ సం
    తుష్టి వహింపుమా! పరుల దూషణభూషణముల్ సహింపుమా!

    తెగడగ రాలవర్షము; నదే పొగడంగ వరాలవర్షమున్
    జగ మిది నీ శిరమ్ము పయినన్ గురిపించును సుమ్ము; మిత్రులన్
    దెగడిన శత్రులౌదురు; స్తుతించిన శత్రులు మిత్రులౌదు; రీ
    ప్రగతి గ్రహింపరా! మధురభాషణమే మణిభూషణంబురా!

    నీవు భుజింపుమా కడుపు నిండ! క్షుథార్తుల కింత పెట్టుమా!
    నీవు సుఖింపుమా! పరుల నీవలెనే మననీయుమా! మరే
    త్రోవల కడ్డురాకు! పెడత్రోవల కాలిడబోకు! మిద్దియే
    జీవితమన్న! పంకిలము సేయకు స్వామివరప్రసాదమున్!

    అర్థ మనర్థహేతువు; మహా భవనంబులు వాహనంబులున్
    వ్యర్థములై నశించుట యథార్థము; మృత్యువు తప్ప దేరికిన్;
    సార్థకమౌను నీదు నరజన్మ; విపన్నుల నాదరింపుమా!
    స్వార్థము మానుమా! చెలి యొసంగెడి తీయని మద్య మానుమా!

    అందనిదాని కోసమయి అఱ్ఱులు చాచకు; లేనిదానికై
    కొందల మందబోకు; చెడుకోర్కుల చెంతకు చేరనీకు; నీ
    కందిన దాని తోడ ముదమందుచు-మోమున మందహాసముల్
    చిందుచు-సాగిపొమ్ము నవజీవన చైత్రవనాంతరమ్ములన్.

               

    ఉండగ చిన్నిపాకయు, పరుండగ చాపయు, రొట్టె లొక్కటో
    రెండొ భుజింప, డెంద మలరింపగ ప్రేయసి, చెంతనుండగా
    పండుగగాదె జీవితము! భ్రష్టనికృష్టుల కొల్వుసేయుటల్
    దండుగగాదె! ప్రాణికి స్వతంత్రత కంటెను స్వర్గ మున్నదే?

    ధన్యు డతండె; సత్యసముదంచిత నిత్యకళాప్రపూర్ణమూ
    ర్ధన్యుడతండె; వాస్తవ వదాన్యు డతండె; యెవం డనన్య సా
    మాన్య జనాభిమాన ధనమాన్యుడొ! యెవ్వడు వర్ధమాన సౌ
    జన్యుడొ! యెవ్వ డార్తజన సౌఖ్యవిధాన పథాగ్రగణ్యుడో!

    ఎచ్చట నుండి యెచ్చటికి నేగుచు నించుక విశ్రమార్థ మీ
    పచ్చని పాటిగడ్డపయి పాదము పెట్టితిమో! యికెన్ని నా
    ళ్ళిచ్చట సాగునో తెలియ దీ యనురాగము! లీ యసూయ! లీ
    ముచ్చట! లీ సుఖాలు! మొగమోటము! లీ ప్రణయానుబంధముల్!!

 Previous Page Next Page