Previous Page Next Page 
నయనతార పేజి 43


    ఏమైనా చిన్ననాటి సహవాసం గదా, అంత మరీ కఠినంగా మందలించకుండా, చనువుగా, అభిమానంగా చెప్పకూడదా అనిపించేది. ఇంతకీ తనిక్కడికి రాకపోయుంటే, కామేశం ఇంట్లో మకాం పెట్టకుండా వుంటే, సూర్యం అనుభవిస్తున్న పాట్లు చూడక్కరలేకపోయేదేమో! సూర్యం గురించిన బెంగ ఆయనలో రోజురోజుకీ యెక్కువ కాసాగింది!
    "నమస్కారం మేష్టారు!" బీచిలో వంటరిగా పరధ్యానంగా కూర్చున్న అవధానిగారు సూర్యం పలకరింపు విని సంతోషంతో పొంగిపోయారు.
    "రా, రా, సూర్యం! ఇలా వంటరిగా కలుసుకుని మాట్లాడాలని ఎన్నాళ్ళనించో అనుకుంటున్నాను! వీలే కుదరడం లేదు కూర్చో!" ఆప్యాయంగా చెయ్యి పట్టుకుని ప్రక్కన కూర్చోపెట్టుకున్నారు.
    "ఏమిటి సూర్యం! ఇలా అయిపోయావు? నువ్వెంతో పైకి వెళ్తావనుకునేవాడిని. ఇలా కామేశం క్రింద గుమస్తాగా చూస్తానని ఎన్నడూ అనుకోలేదు." బాధనంతటినీ వెళ్ళగ్రక్కారు అవధానిగారు.
    "ఏమిటి మేష్టారు, మనం అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగితే ఈ ప్రపంచం ఇలా ఎందుకుంటుంది? నోట్లో అక్షరం ముక్క లేని కామేశం కలక్టరవగాలేనిది, నేను గుమస్తానవడంలో ఆశ్చర్యమేముంది?" జీవంలేని నవ్వు నవ్వాడు సూర్యం.
    "అదే నన్ను బాధిస్తున్నది! ఇంతకీ నువ్వు చదువెందుకు మానావు?"
    "ఏం చెయ్యడం మాష్టారూ? మా ఇంటి సంగతి మీకు తెలుసుగదా! మా నాన్నగారి జీతంమీదనే ఆధారం. అలాగే పదిరోజులు నెట్టుకొచ్చేవాళ్ళం. నాన్నగారు ఎన్ని కష్టాలు పడయినా నన్ను పెద్ద చదువులు చదివించి, పెద్ద ఉద్యోగస్తుని చెయ్యాలని ఆరాటపడేవారు, బ్రతికి వుంటే సాధించేవారేమో! నా దురదృష్టం కొద్ది నేను ఇంటర్ రెండో సంవత్సరం చదువుతుండగానే గుండెపోటు వచ్చి, సంసార భారం నామీద మోపి వెళ్ళిపోయారు. ఇద్దరు చెల్లెళ్లు, తమ్ముడు, తల్లి, విధవక్కగారు ఇంతమందిని పోషించాలి. ఏం చెయ్యను? చదువుదామని అభిలాష వున్నా రోజులు గడిచేదెలాగా? ఇంటర్ పాస్ కాగానే అతి కష్టంమీద, అతి ప్రయాసతో ఈ ఉద్యోగం సంపాదించుకున్నాను. ఇంట్లో ఒక భాగం అద్దెకిచ్చి ఆ డబ్బుతో, నా జీతంతో, మా అక్కయ్య చుట్టుప్రక్కల చిన్నపిల్లలకి ట్యూషన్ చెప్పి సంపాదించే ఆ కొద్దిపాటి డబ్బుతో ఎలాగో రోజులు వెళ్ళదీస్తున్నాను. ఇప్పుడు చదువుకుంటున్న తమ్ముడు, పెళ్ళి కావల్సిన చెల్లెలేగాక, నా భార్య, ఒక అబ్బాయి, రేపో మాపో ఇంకో పసికందు... ఇదీ నా సంసార పరిస్థితి మేష్టారూ! ఏం చెయ్యమంటారు? ఒక్క తెలివితేటలుంటే సరా, అదృష్టముండాలి, అదృష్టం దేనికయినా. స్కూలు ఫైనలు ఒక్కసారి ఫేలయి ఇంటర్, బి.ఏ. పార్టుల వారీగా ప్యాస్ అయిన కామేశాన్ని అదృష్టం వరించింది. గాబట్టి అతను అలా పైకెళ్ళాడు!"
    "అంతే, అదృష్టం బాగుండబట్టి ఐ.ఏ.యస్.కి కట్టి సెలక్టయి నాలుగేళ్ళలో కలక్టరయి కూర్చున్నాడు"
    "అయితే సూర్యం నేనొకటి అడుగుతాను ఏమనుకోకుండా చెప్పు. నిన్నెందుకు కామేశం అస్తమానం అలా కేకలు వేస్తాడు! నీకు నిజంగా ఈ పని చేతగాదనా! చెయ్యలేకపోతున్నావా!"
    నినాదంగా నవ్వాడు సూర్యం. "ఏం చెప్పమంటారు మేష్టారూ? క్రితంవరకు చేసేది గుమాస్తా పని అయినా సుఖంగా వుండేవాడిని. కనీసం ఆఫీసు గొడవలు నన్ను బాధించేవిగావు. ఈ కామేశం వచ్చిన దగ్గరనించి నా బ్రతుకు దుర్భరమైపోయింది. వచ్చిన వెంటనే చిన్ననాటి సహసారి గదా ఏదైనా సహాయం పొందవచ్చని ఆశించి ఆనందంగా, అభిమానంగా చూడడానికి వెళ్లాను. నన్ను చూసి మొహం చిట్లించి ముభావంగా మాట్లాడాడు. ఇహ ఆ తర్వాత నన్ను ఎలాగో అలాగ ప్రతిదానికీనూ తప్పుపట్టి, ఏదోవంక ఎంచి అందర్లోనూ చిన్నపుచ్చాలని చూస్తాడు. ఏ ఆఫీసరూ, ఏ గుమస్తానీ కనీసం బంట్రోతునైనా ఈ విధంగా కించపరచరేమో! అతనైనా ఒక్క నాతో తప్ప మిగతా అందరితోనూ మామూలుగానే వుంటాడు. నన్ను మాత్రం ప్రత్యేకించి ఎన్ని విధాల బాధలు పెట్టాలో అన్ని విధాల పెడ్తున్నాడు. ఒక పూట శలవు కోసం నానా అగచాట్లు పడాలి. ఒకసారి మా అబ్బాయికి ప్రాణంమీదకి వస్తే డాక్టర్ దగ్గరకి తీసుకెళ్ళడానికి ఒకరోజు శలవు తీసుకుంటే ముందు పర్మిషన్ లేకుండా శలవు తీసుకున్నానని నానా కంగారు చేసి ఆరోజు జీతం కోసేశాడు. క్రితం ఏడు నా భార్య ప్రసవించేరోజు ఆస్పత్రికి తీసుకెళ్ళడానికి శలవు కావాలంటే వీల్లేదన్నాడు. నాకు శలవు వుంది గాబట్టి తప్పనిసరిగా కాగితం మీద శలవు కోరి ఇచ్చి వెళ్ళిపోయాను. అనుమతి లేకుండా, వద్దన్నా శలవు వేసుకున్నందుకు వార్నింగ్ ఇస్తూ నా పర్శనల్ ఫైల్లో కెక్కించాడు. ఇలా ఎన్నని చెప్పడం! ఇతర సెక్షన్స్ పనులు కూడా నాకు చెప్పి చేయలేదనే తిడ్తాడు. కామేశం చేత చివాట్లు తినడం ఇష్టంలేక అక్కడికి అందరికంటే ఎక్కువగా శ్రమిస్తాను, అయినా తిట్లు తప్పవు. ఈ బాధలన్నీ భరించలేక, వున్న స్వంత ఊరు, స్వంత ఇల్లు కూడా వదులుకోడానికి ఇష్టపడి బదిలీ కోసం దరఖాస్తు పెడితే రెండుసార్లు బుట్ట దాఖలు చేశాడు. ఇంక ఈ ఉద్యోగం మానడం ఒక్కటే గతి! ఇది కాస్త వదులుకుని ఈ సంసారం ఈదడం ఎలా? అందుకే అన్నీ భరిస్తూ, పౌరుషం చంపుకుని బ్రతుకెలాగో ఈడుస్తున్నాను. కామేశం తిట్లు మొదట్లా బాధపెట్టడం లేదు. నాలో చీము, నెత్తురు ఏనాడో హరించిపోయాయి. అందుకే కామేశం నీడన ఇంకా ఇలాగ బ్రతకగలుగుతున్నాను."
    విషాదంగా, దైన్యంగా, నీరింకినట్టున్న కళ్ళతో సూర్యం చెప్పిన మాటలకి అవధానిగారి హృదయం కుమిలిపోయింది.

 Previous Page Next Page