"ఎందుకంత కక్ష కామేశానికి? ఏం చేశావని నువ్వు?"
"ఎప్పుడో చిన్నప్పుడు పెంచుకున్న పగ, కక్ష ఇలా తీర్చుకుంటున్నాడేమో! అంతకన్న కారణమేం కనపడదు నాకు, మీరు వచ్చిందగ్గర నుంచి, ఈ రెండు నెలల నుంచి నాపట్ల మరీ క్రూరంగా ప్రవర్తిస్తున్నాడు, మేష్టారు!"
"నిజంగానా!" జాలిగా, ఆశ్చర్యంగా అడిగారు అవధానిగారు.
"అవును మేష్టారూ. ఇదివరకటి కంటే ఇప్పుడు మరీ తిట్లెక్కువయ్యాయి. పోనీండి, రోజూ వుండే గొడవే ఇదంతా. బాధపడి ప్రయోజనం లేదుగాని పదండి. ఒక్కసారి మా ఇంటికి రండి. ఇక్కడే దగ్గరే మహారాణి పేటలో"
"పద, ఎన్నాళ్ళనించో వద్దామనుకుంటున్నాను, వీలు పడింది కాదు. ఎప్పుడూ ఏదో సాకుతో కామేశం పంపకుండా వున్నాడు" అవధానిగారు లేచి నిలబడ్డారు.
"అయితే మేష్టారు, మీరేమిటి కామేశం దగ్గర ఇన్నాళ్లుండిపోయారు? కామేశానికి మీమీద ఇంత గౌరవాభిమానాలు యెలా వచ్చాయి? మిమ్మల్ని గౌరవంగా చూస్తున్నాడా?" త్రోవలో అడిగాడు సూర్యం.
"అదేనోయి సూర్యం, ఈ కామేశం సంగతి నాకేం అర్థం కాకుండా వుంది. నన్ను చూసింది మొదలు యెంతో అభిమానం కురిపించి వదలకుండా ఇంటికి తీసుకువచ్చాడు. యెంత చెప్పినా వినకుండా నన్ను వుండమని పదే పదే ప్రాధేయపడుతూ వుంచుకున్నాడు. భార్యాభర్తలిద్దరూ యెంతో గౌరవాభిమానాలు చూపుతున్నార్. స్వంత కొడుకు కంటే యెక్కువ అభిమానిస్తున్నాడు. చిన్నప్పుడు యెన్నడూ గురువుగా నన్ను గౌరవించనివాడు, ఈనాడు నన్నిలా అందలం యెక్కించి ఇంత ఆప్యాయత ఎందుకు కనబరుస్తున్నాడో అర్థంకాకుండా వుంది. మళ్లా నానుంచి ఏ ప్రయోజనమూ ఆశించినట్టు కనబడదు. నావల్ల తనకే ఉపకారం లేదు. ఆఖరికి ఇంట్లో వుంటున్నానని పిల్లలకి చదువైనా చెప్పబోతే "మీకెందుకు శ్రమ మేష్టారూ, వాళ్ళకి వేరే ట్యూటర్ వున్నాడని" అదికూడా వద్దన్నాడు. నేనెంత పట్టుదలగా వెళ్ళబోతానన్నా వదలడం లేదు. ఈ నడిమంత్రపుసిరి మరి నాకెన్నాళ్ళుంటుందో!"
"పోనీండి మేష్టారు, మీకీ వృద్ధాప్యంలో ఆసరా కల్పించడానికే దేవుడు కామేశానికి ఈ బుద్ధి పుట్టించాడేమో!... రండి, మేష్టారూ ఇదే మా ఇల్లు." అంటూ దారితీశాడు సూర్యం.
చిన్న డాబా ఇంట్లో, ఒకప్రక్క సందులోంచి వెనక భాగంలోకి నడిచారిద్దరూ. ఇంట్లో అడుగుపెట్టిన మేష్టారికి సూర్యం ఇంటి పరిస్థితి ఎంత హీనంగా వుందో ఎవరూ చెప్పనక్కరలేకుండానే బోధపడింది. ఇంట్లో అందరినీ పిలిచి పరిచయం చేశాడు సూర్యం.
"రాక రాక వచ్చారు మేష్టారు! ఇవాళ మా ఆతిథ్యం స్వీకరించి వెళ్ళండి. కామేశంలాగ పంచభక్ష్య పరమాన్నాలు పెట్టలేను గాని, యేదో మాకు కలిగినదానితో మేం తినేదే ఇంత అభిమానం కలిపిపెట్టడమే నేను చేయగలిగింది!" శుష్కహాసం చేసి సూర్యం అన్నమాటలకి అవధానిగారు నొచ్చుకున్నారు.
"అదేమిటి, సూర్యం! నేనేమైనా మొదటినించి రాజభోగాలకి అలవాటుపడ్డవాడినా. నువ్విలా మాట్లాడితే నాకు చాలా కష్టంగా ఉంటుంది!"
ఆ రాత్రికి సూర్యం ఇంట్లో భోంచేసి, అతనితో తనివితీరా కబుర్లు చెప్పి ఆలస్యంగా ఇల్లు చేరారు అవధానిగారు.
"ఏం మేష్టారూ, ఇవాళ యెక్కడికి వెళ్ళారు? ఇంత ఆలస్యమైంది" గుమ్మంలోనే పలకరించాడు కామేశం.
"ఏంలేదు, త్రోవలో సూర్యం కనిపించి ఇంటికి తీసుకెళ్ళి, వదలకుండా భోజనం తినిపించాడు. అంచేత ఈ ఆలస్యం అయింది."
కామేశం మొహంలో రంగులు మారాయి. "సూర్యమా, మొత్తానికి ముద్దుల శిష్యుడింటికి వెళ్ళారన్నమాట, విందు చేశాడా? ఏమంటాడు! కన్నీటిగాధ యే'కరువు పెట్టాడా?"
"విందులు చేయడానికి అతనేమన్నా నీలా భాగ్యవంతుడా, పాపం చాలా ధీనంగా వుంది అతని పరిస్థితి. వినలేకపోయాను"
"ఏమంటాడు? నా గురించేమన్నా దుమ్మెత్తి పోశాడా?"
"చూడు నాయనా, పేదవాడి కోపం పెదవికి చేటన్నారు! ఆ సంగతి అతనికి బాగా తెలుసు. ఏమనగలడు? అందులోనూ నీమీద! నేనే భరించలేకపోతున్నాను, అతని స్థితి చూసి! అతను నా ప్రియ శిష్యుడని నువ్వే అంటున్నావు? అందరికీ తెలుసు ఆ సంగతి. అందుకే, ఈ రాత్రి బండికి నేను వెళ్ళిపోదామనుకుంటున్నాను"
కామేశం మొహం వివర్ణమయింది. కొద్దిక్షణాలు వుండి అదోలాగ నవ్వాడు.
"అయితే సూర్యం కోసం, మీరు బాధపడ్డానికే నిశ్చయించుకున్నారన్నమాట!"
"చూడు కామేశం! నువ్వు పెద్ద అధికారివి. అందరూ నిన్ను ఆకాశానికి ఎత్తుతారు. కాని, నీ సంబంధం వేరు. ఆ చనువు పురస్కరించుకుని రెండు మాటలు చెప్పి వెళ్ళిపోతాను. అధికారం, ధనం ఇవాళ వుండి రేపు పోవచ్చు. కాని మమత, అభిమానం అలా క్షణికాలు కావు. అందుకే సూర్యం కష్టాల్ని నేను చూడలేకపోతున్నాను. అందులోనూ, వాటికి నేను కారణం గావడం అసలు సహించలేను! అన్నిటా అదృష్ట దేవత నిన్ను వరించింది. ఏదీ దక్కని నిర్భాగ్యుడు సూర్యం! అతన్ని చూసి జాలి పడడం మినహా ఏం చేయలేని అసమర్థుడిని! ఏ కారణంతో చేసినా ఈ రెండు నెలలు నన్ను ఆదరించావు. అందుకు నీ ఋణం ఎలా తీర్చుకోవాలో తెలియదు. గురువుగా నన్ను గౌరవించగలిగితే ఒక్క చిన్నమాట. సూర్యాన్ని తోటి మనిషిగా గౌరవించు, సానుభూతి చూపు... వస్తా. నీకు, నీ పిల్లలకి నా ఆశీస్సులు!" అంటూనే సంచి చేతపట్టుకుని బయటికి నడిచారు అవధానిగారు, ఎర్రబడిన మొహంతో చూస్తున్న కామేశాన్ని వదిలి.
* * *


