"లీలా, మేష్టారిని మనదగ్గరే వుంచేసుకుందాం. పాపం, ఆయన యీ వృద్ధాప్యంలో చెయ్యి కాల్చుకుని వంటరిగా నానా అవస్థలు పడుతున్నారు. ఇక్కడే మనతోపాటు ఉండిపోతే ఆయనకి ఈ వయస్సులో కాస్త సుఖంగా వుంటుంది. ఆరోజు మధ్యాహ్నం బోజనాల దగ్గర అన్నాడు కామేశం.
"అలాగే, దానికేముంది! ఆయనకి వేరే చేసేదేముంది? ఆయన మనకేం బరువు? తప్పకుండా వుండిపోండి మేష్టారు!" లీల మనస్ఫూర్తిగా అంది.
ఆ ప్రసంగం అర్థమేకానట్టు అయోమయంగా ఇద్దరివంకా చూసి ఖంగారుగా "అదేమిటోయ్! అదేమిటి నేనెలా వుండిపోతాను కామేశం! ఏదో నాలుగురోజులుంటే బాగుంటుంది కాని, ఎప్పుడూ యిక్కడే వుండమంటారేమిటి? నన్ను అనవసరంగా మొహమాటంలో పెట్టకు. నేను రేపొద్దున వెళ్ళిపోవడానికి నిశ్చయించాను. నాకింక అడ్డుచెప్పకు" అన్నారు అవధానిగారు.
"మేష్టారు, నామాట వినండి, మిమ్మల్ని యింట్లో వుంచుకొనే యోగ్యత నాకు లేదా! మీరుండడం వల్ల మాకెంతమాత్రం కష్టంలేదు. బరువు కాదు. ఇంతలో మా సిరిసంపదలు ఏమీ తరిగిపోవు... మీరేం సంకోచించవద్దు..."
"అదికాదు కామేశం! నువ్వు నాలాంటివాళ్ళని పదిమందిని పోషించగలవాడివి గావచ్చు. అయితే మాత్రం నేనెలా వుండిపోతాను శాశ్వతంగా ఇక్కడ! నువ్వు ఏదో అభిమానంకొద్దీ వుండమంటే మాత్రం వుండడం నాకేమన్నా బాగుంటుందా?"
"ఏం, ఎందుకు బాగుండదు? మీ కొడుకు ఇంట్లో వుండరా? అలాగే నన్ను మీ రామం అనుకోండి."
మేష్టారి కళ్ళు చెమర్చాయి. "అంతమాటన్నావు, చాలు నాయనా! కాని మరి బలవంతం పెట్టకు. ఏదీ దేముడి కృపవల్ల ఇంకా కాళ్ళూ చేయి ఆడుతూంది. ఇంకొకరిమీద ఆధారపడడం నాకిష్టంలేదు. ఏదో యీ చివరిరోజులు స్వంత ఇంట్లోనే వెళ్ళదీస్తాను."
"మీరు మామీద ఆధారపడ్డానికి ఏముంది? మేము మీకు ప్రత్యేకంగా చేసేదేముంది, అన్నింటికి నౌకర్లు వున్నారు. మీరు వెళ్ళిపోతానంటే నాకు చాలా కష్టం కలుగుతుంది. ఆమాత్రం నాలాంటి వాడు మీకు చెయ్యగూడదా?"
"ఉండిపొండి మేష్టారు! పిల్లలు కూడా తాతగారు, తాతగారు అంటూ మీచేత కథలు అవి చెప్పించుకుంటున్నారు. మాకు మాత్రం పెద్దదిక్కు ఎవరున్నారు, మాకిబ్బంది అని ఎంతమాత్రం సందేహించకండి" లీల కూడా బలవంతం పెట్టింది.
"ఏమిటి కామేశం, ఏదో ఒకరోజు వుండిపోదామని వచ్చినవాణ్ణి ఇలా బలవంతం పెట్టడం ఏమన్నా బాగుందా?"
"తప్పేముంది మేష్టారు! ఈ వృద్ధాప్యంలో చీకు, చింతా లేకుండా రోజులు గడపండి, ఇంక మీరు నామాట కాదనడానికి వీలులేదు."
ఏదో యింకా అనబోతున్న మేష్టారికి మాట్లాడ్డానికి అవకాశమివ్వకుండా వెళ్ళిపోయాడు కామేశం.
* * *
ఉదయమే లేచి కాలకృత్యాలు పూర్తిచేసుకుని, జపం ముగించి, కాఫీ ఫలహారాలు చేస్తారు అవధానిగారు. కాసేపు కామేశం పిల్లలతో ఆడుకుని, తోటలో తిరిగి తోటమాలికి సలహాలిస్తూ, చదువుకుంటూ, పన్నెండు గంటల వరకు కాలక్షేపం చేసి, భోజనం చేసి, విశ్రాంతి తీసుకుని లేచి, కాఫీ త్రాగి, సాయంకాలం పిల్లలు స్కూలునుంచి తిరిగిరాగానే వాళ్ళ కబుర్లు వింటూ, వాళ్ళకి కథలు చెప్తూ కాసేపు గడిపి, ఓ అరగంట అలా షికారు వెళ్ళి, ఆఫీసునించి యింటికి వచ్చిన కామేశంతో కాసేపు మాట్లాడి, భోంచేసి, ఏదో పుస్తకం చదువుతూ నిద్రపోవడం ___ అవధానిగారి దినచర్య.
ఆయనకీ ఆ వయసులో వేళపట్టున శుభ్రమైన తిండి తినడం, మనుమలు లేని కొరత, ఆ ముద్దు ముచ్చట్లు కామేశం పిల్లలద్వారా తీరడం, రామం లేనిలోటు కామేశం తీర్చడం అంతా బాగానే వుంది. చీకు చింతా లేకుండా వెళ్ళిపోసాగాయి రోజులు. లీల, కామేశం కురిపిస్తున్న ఆదరాభిమానాలతో దేనికి లోటు లేకుండా సుఖంగా వున్నా మేష్టారి మనసు అప్పుడప్పుడు ఎంతో బాధపడేది. దానికి కారణం సూర్యం!
సూర్యాన్ని చూసినప్పుడల్లా అవధానిగారి హృదయం ఆవేదనతో కుమిలిపోయేది. దైన్యంగా, నీరసంగా, అలసటతో కూడిన ఆ మొహం చూసినప్పుడల్లా ఆయన హృదయం ద్రవించేది. ఎలాంటివాడు యెలా అయిపోయాడు? సూర్యంతో మాట్లాడడానికే అవకాశం చిక్కలేదు మేష్టారికి. వచ్చిన నెలరోజులలోనూ ఎంతలేదన్నా అయిదారుసార్లు సూర్యం యింటికి వచ్చాడు. కామేశం ఇంకా లోపల ఉండగా అతన్ని చూసి అవధానిగారు గబగబ గదిలోంచి వచ్చి, ఆరాటంగా ఏవో ప్రశ్నలు వేసేలోపలే, కామేశం వచ్చేసేవాడు. చెప్పినపని చేయలేదనో, తప్పులు చేశాడనో, దేనికోదానికి తల వాచేట్లు చివాట్లు పెట్టి పంపేవాడు. ఖన్నుడై తలవంచుకువెళ్లే సూర్యాన్ని చూసి అవధానిగారి మనసు క్షోభించేది.
నిజంగా సూర్యం పనిచెయ్యడా, చేతగాదా లేక కామేశం ఊరకినే కేకలు వేస్తున్నాడా? ఏది తెలిసేది కాదు. ఏమయినా అంత కఠినంగా, నిర్దయగా, అతనూ మనిషే. అవమానిస్తే బాధపడే హృదయం అతనికి వుంటుందన్నమాట మరచి, తన క్రింద గుమాస్తా అయినంతమాత్రాన అంత అధికారం చెలాయించడం, అంత కఠినంగా మందలించడం అనవసరమేమో అనిపించి కామేశంమీద ఏహ్యం కలిగేది ఆ క్షణంలో.
కాని, ఆయనమీద, తోటివాళ్ళమీద, ఆఖరకి నౌకర్లమీద, కనపర్చే మంచి, మర్యాద చూసే, సూర్యం మీద ఆ దూకుడంతటికీ కారణం సూర్యంలో లోపమేనేమో, ఆఫీసరుగా తన బాధ్యత అతను నెరవేరుస్తున్నాడేమో, కామేశాన్ని అనుమానించడం సరిగాదేమో అనిపించేది మరుక్షణం.