"ఇవాళ భోంచెయ్యడం కాదు ఆదయ్యా! కొన్నాళ్ళు నేనిక్కడుంటాను. నాకో గది చూసి పెడతావా? అలాగే భోజనానికి ఏర్పాట్లు."
ఒక్క క్షణం ఆలోచించాక చెప్పాడు ఆదయ్య తాత.
"లైబ్రరీ పక్కన ఓ గది ఖాళీగా వుంది బాబూ! పేరుకే లైబ్రరీ. పుస్తకాలూ లేవు... లైబ్రెరీయన్ రాడు. పద... తీసుకెళ్తాను" లేచి నిలబడ్డాడు ఆదయ్య తాత.
మొత్తం వూరు మూడు వరసల్లో వుంది. మూడో వరస మధ్యలో వుంది లైబ్రరీ. రెండు గదుల యిల్లు-దాదాపు కూలిపోయే దశలో వుంది.
"ఇదా లైబ్రెరీ?" నవ్వుతూ అడిగాడు ఆదిత్య.
"ఊరికి తగినట్లుగా ప్రజలు... ప్రజలకు తగినట్లుగా లైబ్రరీ."
లోనికి నడిచారిద్దరూ.
ఒక గది ఖాళీగా వుంది. రెండో గదిలో రెండు అల్మారాలు... ఒక రీడింగ్ టేబుల్... నాలుగు కుర్చీలున్నాయి.
"అవును ఆదయ్య తాతా... మీ వూళ్ళో రేడియో, టి.వి. న్యూస్ పేపర్ ఇలాంటివేవీ వుండవా?"
"అవ్వన్నీ వున్నవాళ్ళు ఒకప్పుడు వుండేవాళ్ళు బాబూ... వాళ్ళు ఇక్కడ బతకలేక పట్నాలు వెళ్ళిపోయారు. ప్రస్తుతం ధరణిబాబు ఇంట్లోనే రేడియో వుంది. న్యూస్ పేపరంటావా... ఎవరైనా పట్నం వెళ్తే తేవడమే తప్ప యిక్కడికి రాదు"
ఫర్వాలేదు! తననెవరూ గుర్తుపట్టడానికి అవకాశాలు లేవు. నిర్భయంగా మనసులోనే అనుకున్నాడు ఆదిత్య.
"రంగితో చెప్తాను... నీకు వంటా వార్పూ చేయమని" అన్నాడు ఆదయ్య తాత.
"సరుకులవీ ఏమీలేవు. అన్నిటికీ వెంకటాపురమేనా వెళ్ళాల్సింది?"
"నువ్వొచ్చింది పల్లెటూరు... పల్లెటూరు మనుషుల్లో ఇంకా ఆత్మీయతలు పోలేదు బాబూ. ఆ మాత్రం నీకు మా వూరు తిండి పెట్టలేదనుకున్నావా?" ఆదయ్యతాత ఆత్మీయంగా అన్నాడు. తమ వూరు పిల్లని నీళ్ళ నుంచి రక్షించిన కృతజ్ఞత అతని మాటల్లో ధ్వనించింది.
"నువ్వుండు బాబూ... నీక్కావల్సినవన్నీ పంపుతాను" అని ద్వారబంధం వరకూ వెళ్ళి తల తిప్పి-
"అవును బాబూ... నువ్వీ వూరు ఏ పనిమీదొచ్చావు?" అమాయకంగా అడిగాడు ఆదయ్య తాత.
ఆ ప్రశ్నకు ఆదిత్య దగ్గర జవాబులేదు.
ఆదిత్యకు వెంటనే స్ఫురించిందో జవాబు.
"పట్నంలో బతుక్కి విసిగిపోయాను ఆదయ్యా... కొన్నాళ్ళు ఏ కల్మషమూ లేని పల్లెటూర్లో... హాయిగా బతుకుదామని."
"నీకెవరూ లేరా?"
"ఎందుకు లేరు? అందరూ వున్నారు. నువ్వూ... యీ వూరి జనం అందరూ నా వాళ్ళేగా!"
"నాలాంటి వాడివేనన్న మాట నువ్వూనూ."
"ఏం? నీకెవరూ లేరా?"
"ఉన్నాడు... చెట్టంత ఎదిగిన కొడుకున్నాడు. ఉన్న అరెకరం దున్నుకొని... హాయిగా పెళ్ళి చేసుకుని బతకరా అంటే ఆడు వినడు. పట్నం మోజుతో చిల్లర దొంగగా తయారయ్యాడు. వారం రోజులు ఊళ్లో వుంటే... మూడు వారాలు జైల్లో వుంటాడు. మొదట్లో వాడ్ని యిడిపించడానికి నానా బాధలు పడేవాడ్ని... రాన్రానూ వెంకటాపురం పోలీసులకి, ఆడికి లింకు కుదిరింది. అవసరమైనప్పుడు వాళ్ళే పట్టుకుంటారు... లేనప్పుడు వదిలేస్తారు..." చెప్పుకుంటూ ముందుకెళ్ళిపోయాడు ఆదయ్య తాత.
మరో గంట తర్వాత...
ఏదో పాత్రలు, సామాన్లు పట్టుకొని వచ్చింది రంగి.
"ఏం రంగి... నా వెనక రాలేదేం?" అడిగాడు ఆదిత్య.
"సుమమ్మలో అంత కోపాన్ని నేనెప్పుడూ చూడలేదు బాబూ- నువ్వెళ్ళి పోయాక ఆయమ్మ నా మీద అంతెత్తున లేచింది. నువ్వెవరు... ఎందుకొచ్చావ్? నేను నిన్ను ఆళ్లింటికి తీసుకెళ్ళినందుకు నన్ను తిట్టింది. ఎవరో, ఏమిటో తెలుసుకోకుండా ఆళ్ళింటికి పంపినందుకు ఆదయ్య తాతనూ తిట్టింది. ఆదయ్య తాతతో ఏదో మాట్లాడాలట... తరువాత వస్తానంది. నువ్వు వూరొదిలి వెళ్ళిపోయాక తనతో చెప్పమంది సుమమ్మ" గబగబా ఏకరువు పెట్టింది రంగి.
వంట పని చేస్తూ ఊరి కబుర్లన్నీ చెప్తూనే వుంది రంగి.
"మొదట్లో ఊరిలోని పిల్లలందరికి రాత్రిపూట చదువు చెప్పేది సుమమ్మ. ఆ ముదనష్టపోడు వూళ్ళోకి తగలడడంతో మానేసింది" చెప్పింది రంగి.
"ఎవరా ముదనష్టపోడు?" అడిగాడు ఆదిత్య.
"ఇంకెవడు... ఆదయ్య తాత కొడుకు వెంకట్ గాడు... ఆదయ్య ఎంత మంచోడో... ఆడి కొడుకు అంత చెడ్డవాడు. ఆడపిల్లని చూస్తే వదిలిపెట్టడు... వరసకి నేను చెల్లెలవుతానని నా జోలికి రాడు. పాపం! ఆడి పాలిబడి సుందరి... సుబ్బమ్మ ప్రాణాలు తీసుకున్నారు."
"ఊళ్ళోవాళ్ళు వాడికి బుద్ధి చెప్పలేదా?"
"ఏం చెప్తారు బాబూ... ఆడు, రౌడీ గేంగూ రెండు, మూడుసార్లు సుమమ్మ జోలికెళ్ళారు. సుమమ్మ తుపాకీతో బెదిరించేసరికి పారిపోయాడు. నెల రోజుల్నించి వూరు చల్లగుంది... ఎప్పుడో వూడిపడతాడు పిడుగులాగ. ఈసారి నువ్వున్నావు గదా... ఈ వూరి ఆడపిల్లలకు ధైర్యం."
నవ్వుకున్నాడు ఆదిత్య.
"నువ్వెవరో, ఏంటో తెలీకపోయినా... నన్ను నువ్వు నీళ్ళల్లోంచి రక్షించేవు కదా... ఊరోళ్ళందరూ నిన్ను ఎంతగా మెచ్చుకుంటున్నారో తెలుసా?" కృతజ్ఞతగా అంది రంగి.
భోజనం చేస్తున్నప్పుడు అడిగింది-
"వంటిమీద బట్టలు తప్ప మరేం లేవు. ఎలాగ... ఇంటిలోంచి పారిపోయొచ్చినవాడిలా వున్నావు."
"బాగా కనిపెట్టావు. పారిపోయే వచ్చాను... ఇంటి నుంచి కాదులే."
"మా బావ బట్టలున్నాయి... రేపు తేనా? రెండు జతలు వదిలి వెళ్ళిపోయాడు ఆడు" ఇంటికెళ్ళేముందు అడిగింది రంగి.
"నీ యిష్టం" ఆ అభిమానానికి విస్మయపడుతూ అన్నాడు ఆదిత్య.
"ఉదయాన్నే వస్తాను" మెట్లు దిగి వెళ్ళిపోయింది రంగి.
వెళ్ళిపోయిన రంగి వైపే చూస్తూ చాలాసేపు కూర్చున్నాడు ఆదిత్య.
ఊరంతా ఎనిమిది గంటలకే నిద్రపోయింది.
చాలాసేపు నిద్రపట్టలేదు ఆదిత్యకు.
తనని సుమబాల నమ్మాలంటే ధరణికుమార్ మరణ వార్త చెప్పక తప్పదు. ఆమె తనని నమ్మగలిగితేనే తనేమైనా ఆమెకి సహాయం చేయగలిగేది. కారణాలు తనకు తెలీకపోయినా గుర్రం పెద్దబ్బాయి మనుషులు సుమబాలకోసం రాక మానరు. ఒంటరి సుమబాలను వాళ్ళేమైనా చేస్తే? జాలిగొలిపే ధరణి మొహం గుర్తుకొచ్చింది ఆదిత్యకు. చాలా సేపటికి ఒక స్థిరమైన నిర్ణయానికి వచ్చాడు ఆదిత్య.
* * * * *