వెక్కివెక్కి ఏడవడం మొదలెట్టింది వెనిలా. "రేపటి నుంచీ నేనూ ఆ లోయలోనే చస్తూ బతకాలి" అంది.
"ఎందుకు ?"
"రేపటితో నాకు పాతికేళ్ళు నిండుతాయి." 'రేపటితో నాకు నూరేళ్ళూ నిండుతాయి' అన్నంత దిగులుగా చెప్పింది.
"నిండితే ?"
"ఓహ్ ! నీకు తెలియదు కదూ ? చెబుతాను." అంది వెనిలా, తనమీద వాలబోతున్న ఒక అడల్డ్ మేఫ్లైని అదిలిస్తూ.
"ఈ రాజ్యంలోని మనుషులకి ఈ కీటకమే ఆదర్శం! దీని బతుకు ఒకే ఒక్కరోజు. ఆ ఒక్కరోజూ శృంగారంతోనే గడిచిపోతుంది దీనికి. అలాగే ఈ నెఫ్రెతీతీ రాజ్యంలో పదమూడేళ్ళ నుంచీ పాతికేళ్ళ మధ్య వయసులో ఉన్న యవ్వనవతులే నివాసానికి అర్హులు. పాతికేళ్ళు నిండిన వాళ్ళని ఈ కుష్టు వాళ్ళ లోయలోకి తోసేసి బరువు తగ్గించుకుంటారు."
"ఏమిటీ ? కుష్టు....." అన్నాడు సందీప్, నిర్ఘాంతపోతూ.
"అవును ! ఈ అడవుల్లో కుష్టువ్యాధి విపరీతంగా ఉంది. ఆ రోగం సోకిన వాళ్ళందరినీ ఆ లోయలోకి తరిమేస్తారు. రోజూ కాస్త అన్నం, రొట్టే మాత్రం పడేస్తారు దయాధర్మంగా."
"వివరంగా చెప్పు! నాకేం అర్థం కావడం లేదు."
"నెఫ్రెతీతీ రాజ్యంలో కొన్ని కఠినమైన నియమాలు ఉన్నాయి. ఇది శృంగార సామ్రాజ్యం. సౌందర్యాధి దేవతలాంటి నెఫెర్ దీనికి యువరాణీ, విన్నావా? రాణీ కాదు, యువరాణి రాణీ, రాజూ ఎవరూ లేరు ఇక్కడ. పుట్టిన పిల్లలందరినీ ఒక ఆశ్రమంలో పెంచుతారు. ఆడపిల్లలకు యుక్తవయసు రాగానే ఇక్కడికి తీసుకొస్తారు. పాతికేళ్ళు దాటగానే లోయలో వదిలేస్తారు. ఇక్కడి జీవితం క్షణికం. గాలి బుడగ లాంటిది."
"మరి మొగపిల్లలు ఎక్కడ ఉంటారు."
"మొగపిల్లలను ఆంబోతుల్లాగ మేపుతారు. వాళ్ళకి వయసు వచ్చాక అప్పుడప్పుడు ద్వంద్వ యుద్ధాలు పెడతారు. గెలిచిన వాళ్ళకు సుఖాలు, చచ్చిన వాళ్ళకు విముక్తి."
కోపంతో సందీప్ మొహంలో కండరాలు బిగుసుకున్నాయి. "ఇంత దారుణం జరుగుతుంటే ఎలా సహిస్తున్నారు, మీరందరు?"
కళ్ళు పెద్దవి చేసి చూసింది వెనిలా. "సహించక ? ఆచారాలకు ఎదురు తిరుగుతామా ?"
"సక్రమమైన ఆచారాలని పాటించడానికి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఆచారాలు అనాచారాలుగా మారినప్పుడు వెల్! తిరగబడక తప్పదు"
"అమ్మో !"
"వెనిలా ! మనిషి సగటున జీవించే వయసులో మూడోవంతు కూడా లేదు నీకు! అప్పుడే జీవచ్చవంలాగా అయిపోయి, భయంకరమైన వ్యాధితో తీసుకుని చనిపోవాలని వుందా ?"
ప్రతి వాక్యం రెండేసి సార్లు చెప్పి మధ్యలో అభినయం జత చేస్తేగానీ ఒకళ్ళు చెప్పేది ఒకళ్ళకి అర్థం కావడం లేదు.
"చెప్పు వెనిలా ! చస్తూ బతకాలని ఉందా? నీకు ఈ దారుణం మీద తిరగబడాలని లేదా?"
నీళ్ళు నిండిన కళ్ళతో అతన్ని చూసింది వెనిలా. "ఎలా ?"
"నీ సహకారం ఉంటే, నీతోబాటు, ఆ మిగతా దురదృష్ట వంతులందరినీ కూడా రక్షించగలను నేను?"
ఆశగా చూసింది వెనిలా. "చెప్పు! ఏం చెయ్యను?"
"మొదట, స్వప్న ఎక్కడుందో చెప్పు ?"
"నీతో వచ్చిన ఆ అమ్మాయా ?" అని విషాదంగా చూసింది వెనిలా. "అదిగో! ఆ లోయలోనే ఉంది. ఆమెని కాళ్ళూ చేతులూ కట్టేసి, బుట్టలో కూర్చోబెట్టి లోయలో దింపిన వాళ్ళలో నేనూ ఉన్నాను. పాపాత్మురాలిని."
"న్నో!" అన్నాడు సందీప్ విహ్వలంగా. "నా స్వప్న, ఆ లోయలోనా? న్నో! న్నో!"
దోషిలా నిలబడింది వెనిలా.
"ఆల్ రైట్ ! నేను ఈ లోయలోకి వెళుతున్నాను. కమాన్ వెనిలా! నాతో వచ్చెయ్! ఈ చావుకంటే భయంకరమైన భవిష్యత్తు నుంచీ నీకు విముక్తి కలిగిస్తాను."