రాముడు అది విన్నాడు. గుహుని స్నేహం చూచాడు. అతని కళ్లు చెమ్మగిల్లాయి. "మిత్రమా! నీవు కాలినడకన వచ్చావు. గొప్పస్నేహం కనబరచావు. అంతేచాలు. నీవు తెప్పించిన సామాగ్రిని చూచాను. కాని నేను వాటిని స్వీకరించలేను. వనవాసం చేస్తున్నాను. కందమూలాలే తింటాను. ఈ గుర్రాలు మా తండ్రి అయిన దశరథుడివి. వాటికి కావలసినది స్వీకరిస్తాను" అన్నాడు.
రాముని ఆజ్ఞ మేరకు గుహుడు గుర్రాలకు మేత వేయించాడు. అంతలో సాయంకాలం అయింది. రాముడు సంధ్య ముగించుకున్నాడు. లక్ష్మణుడు గంగాజలం తెచ్చాడు. అవి మాత్రం పుచ్చుకున్నాడు. ఆ రాత్రికి రామునికి అదే ఆహారం.
రాముడు, సీత నేలమీద పడుకున్నారు.
లక్ష్మణుడు గుహుని దగ్గర కూర్చున్నాడు. రాముని గుణగణాలను వివరించాడు. అయోధ్యలోని దుఃఖాన్ని వర్ణించాడు. గుహుడు దుఃఖంతో కన్నీరు కార్చాడు. ముచ్చట్లోనే తెల్లవారింది.
గుహుడు గంగ దాటడానికి ఏర్పాట్లు చేశాడు. గట్టి పడవను ఏర్పాటుచేశాడు. తెడ్లు వేసేవాళ్లను బలమైన వాళ్ళను నియమించాడు.
రాముడు గంగదాటడానికి సిధ్ధపడుతున్నాడు. సూతుడు వచ్చాడు. చేతులు జోడించాడు. "నీవు లేని అయోధ్యలో ఉండలేను. నీతోపాటు అడవులకు వస్తాను. కాదంటే అగ్నిలో దూకుతాను" అన్నాడు.
రాముడు సుమంత్రుని వారించాడు. "నీ భక్తి నీకు తెలియనిదికాదు. అయినా నీవు అయోధ్యకు వెళ్లాలి. మేము అడవులకు వెళ్లిన విషయం తెలియకుంటే కైకకు మనశ్శాంతి ఉండదు. నాతండ్రి సత్యవాదిత్వం నిరూపించబడదు. మా తండ్రికి, తల్లులు కౌసల్యకు, సుమిత్రకు మేం అడవులకు వెళ్లినందుకు దుఃఖించవద్దని చెప్పు. మేం క్షేమంగా అయోధ్యకు తిరిగి వస్తామని చెప్పు. భరతుని తీసుకొనివచ్చి పట్టంకట్టు. నీవు రాజు విషయంలో ఎలా ప్రవర్తిస్తావో తల్లుల విషయంలో కూడా అలాగే ప్రవర్తించవలసిందని నా మాటగా భరతునికి చెప్పు"
వెంట్రుకలు జడలుకట్టించుకోవడానికి రాముడు మర్రిపాలు తెమ్మన్నాడు. గుహుడు తెచ్చాడు. రామలక్ష్మణులు ఆ పాలతో వెంట్రుకలు జడలు కట్టించుకున్నారు. జటావల్కలధారులైన రామలక్ష్మణులు ఋషుల్లా కనిపించారు.
లక్ష్మణుడు సీతను జాగ్రత్తగా పడవ ఎక్కించాడు. లక్ష్మణుడు ఎక్కాడు. తరువాత రాముడు ఎక్కాడు. రాముడు మాత్రం జపించాడు. ఆశమనం చేశాడు. గంగకు నమస్కరించాడు. సీత, లక్ష్మణులు కూడా గంగకు దండం పెట్టారు.
వారు సుమంత్రునివద్ద, గుహునివద్ద శెలవు తీసుకున్నారు. నావ కదిలింది. నడిమధ్యకు చేరింది. సీత గంగకు నమస్కరించింది. "దేవీ! మేము మళ్లీ అయోధ్యకు తిరిగి వచ్చిం తరువాత నీకు వేయిబానల కల్లు, మాంసంతో కూడిన అన్నం సమర్పిస్తామని మొక్కింది.
సీత గంగకు మొక్కింది. నారాయణునికి మొక్కలేదు. శివునికి మొక్కలేదు. అది దైవాన్ని గురించిన ఒకరూపం ఏర్పడనికాలం, దైవాన్ని గురించిన రూపాలు కూడా మానవుని నాగరికత పరిణామాల మీద ఆధారపడి ఉంటాయి.
ఆదిమానవునికి అగ్గి కనిపించింది. అది కాలాన్ని దహించివేస్తున్నది. దాన్ని ఒక శక్తిగా భావించాడతను అగ్నికి కోపం రాకుండా ఉండాలనుకున్నాడు. అగ్నికి ప్రార్థించాడు. అలాగే వర్షం అవసరం అని తెలిసికున్నాడు. వర్షాన్ని ప్రార్థించాడు. సూర్యచంద్రాదుల మనిషి మనుగడకు అవసరం అనుకున్నాడు. వారిని పూజించారు. మనిషి వాటికి ఆకారాలు కల్పించలేదు.
తల్లిని మించిన ధైవం లేదనుకున్న మనిషి, తల్లిని దైవం చేశాడు. ఆమెను ఆదిశక్తిగా చేశాడు.
ఆ తరువాత తండ్రిని దేవుడిలా భావించాడు. ఆనాటి మనిషి నాగరికతనుబట్టి శివుణ్ణి సృష్టించాడు. శివుడు గుట్టలు మీద ఉంటాడు. తోలు కట్టుకుంటాడు. పాములు మెడలో వేసుకుంటాడు. మూడో కంటితో ప్రపంచాన్ని నాశనం చేయగలడు.
అది మనిషి భయానికి లొంగిన కాలం. భయపడి పనులు చేసినకాలం. కాబట్టి శివుణ్ణి భయంకరంగా తయారుచేశారు. ఆది శక్తిచే శివునికీ సమన్వయం కుదర్చడానికి ఆదిశక్తిని శివుని భార్యగా చేశారు.
మనిషి నాగరికత వృద్ధిచెందింది. అప్పుడు నారాయణుడు వచ్చాడు. అంతలో నాగరకుడు పట్టుబట్ట కడ్తాడు. పాముపై పండుతాడు. పాలసంద్రంలో ఉంటాడు. లక్ష్మిని భార్యగా చేసుకుంటాడు. అతడు సంపన్నుడు. సంపన్నుడు ఉపాయంతో లొంగదీస్తాడు. ఎత్తులూ, యుక్తులూ చేయగలడు.
రామాయణ కాలాన్ని చూస్తే ఇంకా ప్రకృతి శక్తులనే ఆరాధిస్తున్నట్లు అనిపిస్తుంది. ఎక్కడా ఒక సాకారం అయిన దైవం కనిపించదు. ఉపవాసాలమీదా వ్రతాలమీదా, నమ్మకాలున్నట్లు కనిపిస్తుంది. రాముడు ఉపవాసం చేస్తాడు. కౌసల్య ఉపవాసాలూ, వ్రతాలూ చేస్తుంది.
సీత గంగకు మొక్కటం ఇందుకు బలమైన నిదర్సనం.
చిత్రకూటం:
సీతా, రామలక్ష్మణులు నావలో దక్షిణ దిశకు చేరారు. నావ దిగారు. నడక సాగించారు. ముందు లక్ష్మణుడు వెనుక సీత, ఆ వెనుక రాముడు నడక సాగించారు. అలా కొంత దూరం నడిచారు. సాయంకాలం అయింది. రామలక్ష్మణులు మనుబోతును, దుప్పిని, ఇర్రిని వేటాడి తెచ్చారు. దాని మాంసం సిద్ధం చేసుకున్నారు. ఆ రాత్రికి ఒక చెట్టు క్రింద పడుకున్నారు.
తెల్లవారింది. మళ్లీ నడక సాగించారు. సాయంకాలానికి గంగా యమునల సంగమం చేరుకున్నారు. అక్కడ భరద్వాజుని ఆశ్రమం ఉంది. వారు మహర్షిని దర్శించుకున్నారు. రాముడు, భరద్వాజునికి తన కథంతా చెప్పాడు. ఆ రాత్రికి కందమూలాలు తిన్నారు. ఆ రోజు అక్కడ గడిపారు.
తెల్లవారి భరద్వాజుడు రామునితో ఇది గంగా, యమునల సంగమ స్థలం. మీరు ఇక్కడే ఉండడం మంచిది అన్నాడు.
అందుకు రాముడు "ఇక్కడికి జానపదాలు దగ్గరలో ఉన్నాయి. జనం వచ్చి పోతుంటారు. ఇక్కడ ఉండడం నాకు ఇష్టంలేదు. ఏకాంత ప్రదేశంలో ఆశ్రమం నిర్మించుకొని ఉండాలని ఉంది" అన్నాడు. అయితే చిత్రకూటం అందుకు అనువైన ప్రదేశమని చెప్పాడు భరద్వాజుడు. అక్కడికి వెళ్లాల్సిన దోవకూడా చెప్పాడు.
సీతారామలక్ష్మణులు చిత్రకూటానికి బయలుదేరారు. కొంతదూరం నడిచారు. వారికి యమున అడ్డం వచ్చింది. ఒక తెప్ప కట్టుకున్నారు. నదిని దాటారు. అక్కడ వారికి ఒక పెద్ద మర్రిచెట్టు కనిపించింది. సీత మర్రిచెట్టుకు నమస్కరించింది. "మేము ముగ్గురం మళ్లీ కౌసల్యనూ, సుమిత్రనూ కలుసుకునేటట్లు అనుగ్రహించు" అని మొక్కింది. మళ్లీ నడక సాగించారు. కొంతదూరం వెళ్లారు. చీకటిపడింది. అక్కడ పడుకున్నారు.