Previous Page Next Page 
సీతాచరితం పేజి 44


    తెల్లవారి మళ్లీ నడక సాగించారు. అలా కొంతదూరం వెళ్లాక అందమైన అడవి కనిపించింది. అక్కడ నెమళ్లున్నాయి. పిట్టలున్నాయి. ఏనుగులున్నాయి. అందమైన అడవి చూస్తూ ముందుకు సాగారు. చిత్రకూటం ప్రవేశించారు.


    చిత్రకూటం రమణీయంగా వుంది. పచ్చనిచెట్లు, చక్కని నీడా చక్కగా వుంది. అక్కడే వాల్మీకి ఆశ్రమం వుంది. రామలక్ష్మణులు వాల్మీకి ఆశ్రమానికి వెళ్లారు. మహర్షికి నమస్కరించారు. మహర్షి వారిని అక్కడే వుండిపోవలసిందని కోరాడు. రాముడు అంగీకరించాడు. లక్ష్మణుడు దృఢమైన పర్ణశాల నిర్మించాడు. వాస్తుపూజ చేశాడు. నల్లిఇర్రిని తెచ్చి వండాడు.


    రాముడు మాల్యవతిలో స్నానం చేశాడు. బలులు నిర్వర్తించాడు. వారు అక్కడే వుండిపోయారు.


    చిత్రకూటం రమణీయంగా వుంది. మాల్యవతిలో చక్కని రేవుంది. దాన్ని చూసి రాముని మనసు ఆనందంతో నిండిపోయింది.


    రాముడు మాంసం తినడం విచిత్రమేం కాదు. ఆ కాలంలో బ్రాహ్మలూ, క్షత్రియులూ మాంసం తిన్నారు. బహుశా బౌద్ధమత ప్రభావం ప్రబలేవరకూ వారు మాంసాహారులే. ఆ తరువాత శాకాహారులయినట్లున్నారు. భాసుని నాటకంలో బ్రాహ్మలు తద్దినాల్లో గుమ్మడికాయ పెడ్తారు. ఉత్తరరామ చరితంలో బ్రాహ్మలకు లేతదూడ మాంసం వడ్డించినట్లుంది. అందాకా ఎందుకూ బెంగాలీ బ్రాహ్మలు ఇవాళ్టికి చేపలు తింటారు.


    "పంచ పంచ నఖా భక్ష్యా బ్రహ్మక్షత్రేణరాఘవ!
    శల్యకశ్శ్వా విధోగాధా శశః కూర్మశ్చ పంచమంII


    అంటాడు వాలి రామునితో. "అయిదుగోళ్ల జంతువుల్లో బ్రాహ్మలు క్షత్రియులు తినదగినవి, అయిదు. అవి ఏదుపంది, అడవి పంది, ఉడుము, కుందేలు, తాబేలు


    అలా ఆ రోజుల్లో బ్రాహ్మణ క్షత్రియులు మాంసం తినడం నిషేధం కాదు. కాగా మాంసం తినని వాళ్లంతా గొప్పవాళ్ళనీ, తినేవాళ్లంతా తక్కువవాళ్ళనీ అనుకోవడం అహంకారం మాత్రమే అవుతుంది.


    కాలం మారుతుంటే ఆహారపు అలవాట్లు కూడా మారుతుంటాయి. తెలుగు కావ్యాల్లో ఎక్కడా పూరీలు, బజ్జీలు, గులాబీజాంలు, జిలేబీలు లేవు. ఇవ్వాళ అవి సర్వసాధారణం అయినాయి. శ్రీనాథునికి జిలేబీలే తెలియవు అని వెక్కిరించడం మన మూర్ఖత్వాన్ని చాటుతుందేకాని శ్రీనాథునిలోని లోపాన్ని కాదు.


    వాల్మీకి ఆనాటి ఆచారాన్ని రాచాడు. గాని రానున్న కాలంలో బ్రాహ్మణ క్షత్రియులు మాంసం తినరు అని దివ్యదృష్టితో చూచి రాయలేదు. వాల్మీకిది కవి దృష్టి. దివ్యదృష్టి కాదు.


    రామలక్ష్మణులు మనుబోతును, దుప్పిని, ఇర్రిని వేటాడి తెచ్చారు. నాకు తెలిసినంతవరకు ఈ మూడూ భారీజంతువులే. ఈ మూడిటిని ముగ్గురూ తినేశారు!!! మొత్తం తినలేదు. కొంత వదిలేశారనుకున్నా వారు ఎంత తినగలరో అర్థం అవుతుంది. అంత తిన్న మనుషులు ఎంత ఎత్తుగా ఉండేవారో! ఎంత బలాఢ్యులుగా వుండేవారో!!


    మనిషి శరీరం కూడా సమయాన్ని బట్టి మారుతుందేమో? మది అడవి జంతువుల్తో పోరాడే దేహదారుఢ్యం వుండొద్దూ ఆనాడు! ఇప్పుడు మనకు దేహబలంతోనేం పని? అన్నీ మరలేగా! అందుకే ఇలా వున్నామేమో!! కావచ్చు. కాకపోవచ్చు.


     చిత్రకూటంలో వాల్మీకి ఆశ్రమం ఉందనడం పుక్కటి పురాణం.


    బాలకాండలో వాల్మీకి ఆశ్రమం తమసానది ఒడ్డున వుందన్నారు. తమసానది అయోధ్యకు కొద్దిదూరంలో వుంది. చిత్రకూటం మాల్యవతి నదీ తీరాన ఉంది.  వాల్మీకి ఇక్కడికి ఎలా వచ్చాడు? వచ్చాడు మరి రామునికి ఏం సహాయం చేశాడు? వాల్మీకికి రాముడంటే ఎనలేని అభిమానం. అలాంటివాడు రామునితో పంచవటికి ఎందుకు పోలేదు? భారతంలోని వ్యాసునిలా, రామాయణంలో వాల్మీకిని ఇరికించాలని చేసిన విఫలయత్నం ఇది. ఇలాంటివి రామాయణంలో అనేకం కనిపిస్తాయి.


    మనస్తాపం:


    సుమంత్రుడు గుహునివద్ద శెలవు తీసుకున్నాడు. అయోద్యకు బయల్దేరాడు. మూడు రోజులకు అయోద్యకు చేరాడు. అతని రతం నగర ద్వారం ప్రవేశించింది. జనం గుంపులు గుంపులుగా చేరి రాముని గురించి అడిగారు. "రాముడు అడవులకు వెళ్లాడు." అని చెప్పుచు, ఏడు ప్రాకారాలు దాటాడు. రాజ ప్రాసాదంలో ప్రవేశించాడు. అక్కడ రాణులు, స్త్రీలు దుఃఖిస్తున్నారు. అతడు అంతఃపురం ప్రవేశించాడు.


    అంతఃపురంలో దశరథుని చూశాడు. అతడు కృశించి వున్నాడు. దీనుడై వున్నాడు. సుమంత్రుడు, రాముడు విన్నవించమన్నదంతా, దశరథునికి విన్నవించాడు. దశరథుడు మాట్లాడలేదు. మౌనంగా విన్నాడు. మనస్తాపం భరించలేకపోయాడు. మూర్ఛిల్లాడు. సుమంత్రుని సాయంతో కౌసల్య దశరథుని లేపి కూర్చోబెట్టింది. "చూడు సుమంత్రుడు వచ్చాడు. రాముని దగ్గరనుంచి వచ్చాడు. ఎందుకలా భయపడ్తావు? కైక లేదిక్కడ. మనసిప్పి మాట్లాడు. సుమంత్రుడు వచ్చాడు" అన్నది. కైకమీద కోపంతో అన్నదే కాని ఆమెకు దుఃఖం ముంచుకొని వచ్చింది. విరుచుకొని పడిపోయింది. అది చూశారు. అంతఃపుర స్త్రీలంతా పెద్దగా ఏడ్చారు.


    కొంతసేపటికి దశరథుడు తేరుకున్నాడు. ఎదురుగా నుంచున్న సుమంత్రుని చూచాడు. రాముడు చెప్పింది చెప్పమన్నాడు. మళ్లీ మళ్లీ చెప్పించుకున్నాడు. విన్నాడు. అతడు దుఃఖముతో కుమిలిపోసాగాడు. ఇలా అన్నాడు :-


    "నేనెంత మూర్ఖుణ్మి! కైక మాటలే విన్నాను. కాని మంత్రులను, మిత్రులనూ సంప్రదించలేదు. ఏల సంప్రదిస్తాను? ఎందుకు సంప్రదిస్తాను? నా వంశం నశించే కాలం వచ్చింది. అలాంటప్పుడు నాకు మంచి ఆలోచన ఎలా వస్తుంది?


    "సుమంత్రా! రాముడు నాకు ప్రాణం. అతడు వెళ్లిపోయాడు. నేనెలా జీవిస్తాను. నా ఆజ్ఞకు ఇంకా చెల్లుబడి వుందా? వుంటే నన్ను అడవులకు తీసికెళ్లు. రాముడు లేక నేను బ్రతకడం వట్టిది.


    "కౌసల్య! నేను బుద్ధిహీనుణ్ణి, మూర్ఖుణ్ని. రాముణ్ని అడవులకు పంపాను. శోకసాగరంలోపడి కొట్టుకుంటున్నాను. ఈ సాగరానికి రాముని గురించిన దుఃఖం వైశాల్యం. సీతావిరహం  దానిలోతు. నిట్టూర్పులు కెరటాలు. కన్నీరు నురగ, ఏడుపు ఘోష, విరబోసిన వెంట్రుకలు నాచు, కైక బడబాగ్ని, మంధర మొసలి. కైక వరం చెలియలి కట్ట"


    అలా ఏడ్చీ, ఏడ్చీ దశరథుడు మూర్ఛిల్లాడు.


    కౌసల్య దశరథుని మాటలు విన్నది. అతడు మూర్ఛపోవడం చూచింది. "సుమంత్రా! నన్ను రాముని దగ్గరకు తీసికెళ్లు" అని పెద్దగా ఏడ్చింది. సుమంత్రుడు ఆమెను ఓదార్చాడు. రాముడు అడవుల్లో ఆనందంగా ఉన్నాడన్నాడు.


    సీత దుఃఖించడం లేదన్నాడు. రామునితోటి అడవే సీతకు అయోధ్యగా వుందన్నాడు.


    సుమంత్రుని మాటలు కౌసల్యకు ఓదార్చలేకపోయాయి. ఆమె ఆవేశంలో దశరథుని తిట్టింది.

 Previous Page Next Page