వశిష్టుడు సీత సింహాసనం ఎక్కి రాజ్యమేలుతుంది అంటాడు-అంటే రాజ్యం ఏలడంలో ఆడా మగా తేడా లేదని అర్ధమవుతుంది.
స్త్రీల లక్షణాలు గురించి చెబుతూ కౌసల్య భర్త కష్టంలో వుంటే భార్య వదిలేస్తుంది అన్నట్లు మాట్లాడుతుంది. ఒకచోట రాముడు సీతకు కూడ భరతుని కిచ్చేస్తానంటాడు. కైకతల్లి తండ్రిని ఒదిలేసింది. వీటన్నింటిని బట్టి, ఆనాడు వదిలేయడం అతిసులభమైనదిగా కన్పిస్తోంది. ఇవ్వాల్టికి మహమ్మదీయుల్లో విడాకులు అతి తేలికైన విషయం.
ఈ విడాకులవల్ల వచ్చిన అనర్ధాలను దూరంచేసి, భార్యా, భర్తల మధ్య ఒక పటిష్టమైన బంధాన్ని ఏర్పాటుచేయడానికే వాల్మీకి రామాయణాన్ని రచించినట్లు కన్పిస్తుంది. వీణకు, తీగకు; చక్రాలకు, రథానికి; వున్నలాంటి బంధం, భార్యాభర్తలకు కల్పించడం అతని ఉద్దేశ్యంలా వుంది. వీణలేక తీగ మ్రోగదు. చక్రాలు లేక రథం కదలదు. అలాగే భార్యా భర్తలు పరస్పరం అర్ధం చేసుకొని ప్రవర్తించకుంటే సమాజ రథం నడవదు.
ఈ సత్యాన్ని బోధించడం రామాయణంలో అంతర్వాహినిగా వున్న సందేశం.
ప్రజల మనస్తత్వం విచిత్రమైంది. వారు గెలుపును వరిస్తారు. గెలిచినవాడిని భజిస్తారు. న్యాయాన్ని గురించి వారంతగా పట్టించుకోరు. అన్యాయాన్ని తిడ్తారు. కాని సాధారణంగా ఎదిరించరు. సాధారణ జన జీవితానికి ఆటంకం కల్గేవరకు వారు తిరుగుబాటు సేయరు.
రాముని రథం బయలుదేరింది. అయోధ్య సాంతం కదిలింది. కొంత దూరం వెళ్లింది. దశరథుడు వెనక్కు మళ్లాడు. రాణులు వెనక్కి మళ్లారు. కొందరు జనం వెనక్కి మళ్లారు. తర్వాత కొంత దూరం కొంత జనం రథం పట్టుకొని ముందుకు వెళ్లారు. వారు ఆగిపొయ్యారు. వృద్ధులు, బ్రాహ్మలు మాత్రమే మిగిలారు. వారు తమసా నది దాక వచ్చారు.
ఇది ప్రజల ఉద్రేకానికి నిదర్శనం.
గుహుని ఆతిథ్యం:
తమసానది దగ్గర నుంచి రథం బయలుదేరింది. వేదశృతి, గోమతి, స్యందిక అనే నదులను దాటింది. కోసలదేశం దాటింది. అప్పుడు రాముడు అయోధ్యవైపు తిరిగాడు. "ఓ అయోధ్యా నగరమా! నిన్ను వీడిపోతున్నాను. నీవద్ద, నిన్ను పాలించే దేవతల వద్ద శెలవు తీసుకొని వెళ్తున్నాను" అని అయోధ్యకు నమస్కరించాడు.
అలా కోసల దాటారు. కొంతదూరం పయినించారు. అప్పుడు వారికి గంగానది కనిపించింది.
గంగకు రెండుపక్కలా మునుల ఆశ్రమాలు ఉన్నాయి. అక్కడ ఎన్నో సరస్సులున్నాయి. దేవ, దానవ, గంధర్వ, కిన్నెర, కింపుఋషులు తమ స్త్రీలతో వచ్చి జలక్రీడలాడుతుంటారు.
ఆ నది ఒకచోట పల్లానికి పడుతుంది. అక్కడ పెద్ద జలపాత ధ్వని వినిపిస్తుంది. ఒకచోట నురుగలు కక్కుతూ ప్రవహిస్తుంది. ఒకచోట జడలు అల్లుకున్నట్లు పారుతుంది. ఒకదగ్గర సుళ్లు తిరుగుతుంది. ఒక ప్రదేశంలో మెల్లగా, గంభీరంగా ప్రవహిస్తుంది. ఒకచోట చిలక పలుకులు పలుకుతుంది. ఒకచోట సింహంలా గర్జిస్తుంది. మరోచోట భైరవ ధ్వనులు చేస్తుంది.
అచ్చటచ్చట ఇసుకతిన్నెలు ఉన్నాయి. అవి తెల్లగా ఉన్నాయి. స్పటికంలా మెరుస్తున్నాయి. ఆ నది పొడుగునా అనేక రకాల పక్షులు విహరిస్తున్నాయి. వాటిలో హంసలు, చక్రవాకాలు, సారస పక్షులు, ఉన్నాయి. అవి కమ్మగా పాడుతుంటాయి. ఒడ్డున చెట్ల వరసలున్నాయి. ఆ చెట్లు ఎంతో పెరిగి ఉన్నాయి. అవి ఆ నదికి అందాన్ని కూరుస్తున్నాయి.
గంగలో కొంతమేర తామరులున్నాయి. కొంతమేర నల్లకలువలున్నాయి. మరికొంతమేర కలువలున్నాయి. కొన్నిచోట్ల అన్నీ కలిసి ఉన్నాయి. కొంతమేర నీరుపుప్పొడి కలిసి చిక్కగా ఉంది. కొంతదూరం నీరు నిర్మలంగా ఉంది. అధ్దంలా ఉంది.
గంగకు రెండు గట్లమీద దట్టమైన అడవి వుంది. ఆ అడవుల నుంచి ఏనుగులు వస్తున్నాయి. నదిలో స్వేచ్ఛగా విహరిస్తున్నాయి. నదిలో మొసళ్లు, పాములు, శింశుమారాలు మొదలైన జంతువులున్నాయి.
ఇక్కడ గంగానదిని మనోహరంగా వర్ణించాడు వాల్మీకి. ఇంత వరకు జరిగిన అయోధ్యకాండలో కల్లోలం, కార్పణ్యం, కాలుష్యం దవానంలా కనిపిస్తుంది. అదంతా ముగిసింది. ఆ తరువాత చల్లని గంగానదిని వర్ణిస్తున్నాడు. ఇప్పటిదాక కలత చెందిన మనసుకు చల్లని పిల్లగాలి సృష్టించాడు. మానవ మనస్తత్వాన్ని బాగా అర్థం చేసుకున్నవాడు వాల్మీకి. మనిషి ఎంతోకాలం అంత కల్లోలం భరించలేడని తెలుసు అక్కడ జగడాలు, కుట్రలు, ఏడ్పులు, మొత్తుకోళ్లతో అలసిపోయిన పాఠకులకు మనోహరం అయిన గంగానదిని చూపించాడు. మనసుకు చల్లదనాన్ని కల్పించాడు.
అసలు గంగానదికీ జీవితానికీ దగ్గరి పోలికలున్నట్లు కనిపిస్తున్నది. గంగ బిందుసరస్సులో పుట్టింది. అది ప్రవహించేప్పుడు కొండవాగులను చేర్చుకుంటుంది. పరిపూర్ణమై మైదానంలో ప్రవహిస్తుంది. మన శ్రేయస్సుకోసం ఉపకరిస్తుంది. సముద్రంలో కలుస్తుంది.
మనిషి జ్ఞానహీనం అయిన శిశువులా పుడ్తాడు. లోకంలోని అనుభవాలన్నింటిని తనలో ఇముడ్చుకుంటాడు. జ్ఞానం సంపాదించుకుంటాడు. పరిపూర్ణుడు అవుతాడు. ఏదోరకంగా మానవాళి శ్రేయస్సు కోసం ఉపకరిస్తుంది. అనంతాకాశంలో కలిసిపోతాడు.
నది ఒకచోట మైదానం మీద సాఫీగా పారుతుంది. ఒడుదుడుకులూ, కష్టాలూ ఉంటూనే ఉంటాయి. అయితే నది ఎక్కువ దూరం మైదానంలో మెల్లగా ప్రవహించినట్టు సాధారణ మానవుని జీవితం కూడ ఒడుదుడుకులు లేకుండానే గడుస్తుంది.
రామాయణం కూడా జీవన స్రవంతిలాంటిదే. అది బాలకాండలో మెల్లగా ప్రవహించి, అయోధ్యలో కొంతదూరం సుళ్ళు సృష్టించి, చిత్రకూటం దగ్గర మెల్లగా పారి, అరణ్యంలో అల్లరి లేపి కిష్కింధలో కొంత కల్లోలితం అయి, సుందరంలో దవాలనం సృష్టించి, యుద్ధంలో గర్జించి సాగిపోతుంది.
ఆ కాలంలో నదులమీద వంతెనలున్నట్లు కనిపించదు. వేదశృతి, గోమతి నదులను రథం మీదనే దాటారు. అది వసంతకాలం కాబట్టి నదులు ఎండిపోయి ఉండాలి. వర్షాకాలంలో ప్రయాణాలు జరిగినట్లు కనిపించవు.
సముద్రం మీద రాముడు నిర్మించిందే తొలి వారధి అయ్యుండాలి.
రాముడు శృంగిబేరం దగ్గర గంగానదిని చూచాడు. గంగానదిని అందాన్ని అతడు వీడలేకపోయాడు. ఆరాత్రికి అక్కడే ఉండటానికి నిర్ణయించుకున్నాడు. వారు రథం దిగారు. గంగానదిని చూస్తూ ఉండిపోయారు. అది సుళ్ళు తిరుగుతూంది, కెరటాలు లేస్తూంది. విచిత్రంగా ఉంది. మనోహరంగా ఉంది.
ఆ ప్రాంతాన్ని గుహుడు పాలించాడు. అతడు బోయలరాజు. అతనికి రాముడు వచ్చాడనే వార్త తెలిసింది. పరివారంతో రాముని సేవించడానికి వచ్చాడు. దూరంనుండే రామలక్ష్మణులు గుహుని చూచారు. చేతులు చాచుకొని ఎదురేగారు. గుహుని కౌగిలించుకున్నారు.
"రామా! నీకు అయోధ్య ఎంతో శృంగిబేరం అంతే. నీకేం కావాలో చెప్పు. ఏం చేయమంటావో ఆజ్ఞాపించు. నీలాంటి అతిథి ఎవరికి లభిస్తాడు?" అని అనేక విధములైన అన్నపానీయాలు తెప్పించాడు.