మొదట్లో నేను భయపడ్డాను. ఆ తరువాత బాగా ఆలోచించాను. నీతి నాకు కూడు పెట్టలేదు. అవినీతి అన్నం పెడతా రా రమ్మంటున్నది. నీతి, అవినీతి సంఘర్షణలో చివరికి అవినీతే గెలిచింది. చివరికి నేను వాడితో చేతులు కలిపాను.
నేను వాడితో కలపడంవల్ల నాకేమీ ప్రమాదం కనిపించలేదు. హత్యలు, దొంగతనాలు లాంటివి చెయ్యలేదు. వాడు ఒక చోట రహస్యంగా మారువేషంలో వుండి నాకు ఒక వస్తువు ఇచ్చేవాడు.
ఆ వస్తువు అనేది చిన్నది కావచ్చు. పెట్టెంత సైజులో వుండవచ్చు. దానిలో ఏమున్నాయి అన్నది కూడా నాకు అనవసరం. ఫలానాచోట ఆ వస్తువుని పెట్టిరమ్మనేవాడు అలాగే అక్కడ పెట్టివచ్చేవాడిని ఒకసారి ఒకరియింటి ఆవరణలో వున్న పూల కుండీలలో అటునుంచీ ఇటునుంచీ ఆ కుండీలని లెక్కపెట్టి ఎర్రపూవు పూసిన గులాబీ చెట్టు వున్న కుండీలో ప్యాక్ చేసిన చిన్న అట్టపెట్టెని దాచి రమ్మన్నాడు.
ఇలాంటి చిన్న చిన్న పనులు మాత్రమే నేను చేశాను. చేసింది చిన్నపనులు అయినా వాడు పెద్దమొత్తాలలో గిఫ్ట్ చెక్కులు పంపించేవాడు. ఈ రాత్రి కూడా అలాంటి ఒక పని చెయ్యటానికే నేను బయలుదేరాను.
వాడొక గదిలో ఒకచోట అద్దెకి వుంటున్నాడు. అక్కడికి నేను వేల్లెస్సరికి వాడు లేడు. ఓ కుర్రవాడు నాకు ఓ చీటీ అందించాడు. మీరు వెంటనే తిరిగి వెళ్ళిపొమ్మని ఆయన చెప్పాడు. నేను మీకు ఈలెటర్ అందించటానికి వందరూపాయలు కూడా ఇచ్చారు. గది ఖాళీ చేసి హడావుడిగా వెళ్ళిపోయారు అని చెప్పారు.
నేను ఇవతలకి వచ్చి చీటీ చదివాను.
"ఇప్పుడు కొత్తగా వచ్చిన ఇన్ స్పెక్టర్ వాళ్ళ ముఠా మొత్తాన్ని పట్టేశాడు. పోలీసుల మధ్య మా మధ్య కాల్పులు జరిగాయి. ఆ కాల్పుల్లో మా ముఠా నాయకుడు ముఖ్యమయిన అనుచరులూ నశించిపోయారు. కొద్దిగా మిగిలిన వాళ్ళం మాత్రం దూరతీరాలకు పారిపోతున్నాం.
నేనంటే ఇటువంటి వాటిల్లో ఆరితేరాను. నీలాంటి మంచివాళ్ళకి ఇలాంటి పనులు తగవు. అనవసరంగా ఈ రొంపిలోకి నిన్ను ఈడ్చానని నేనీమధ్య చాలా బాధపడేవాడిని. నేను దూరంగా వెళ్లిపోతున్నాను. నీగురించీ, నీ డబ్బు గురించీ ఎవరికీ తెలియదు. ఈ డబ్బుతో ఏదన్నా బిజినెస్ చేసుకో! నన్ను మర్చిపో!"
అని రాసింది చదివి, వాడు ఎక్కడెక్కడో నాకు తెలుసు కాబట్టి, ఒక్కసారి వాడిని చూసి మాట్లాడదామని, రైల్వేస్టేషన్ కి బయలు దేరామని, రైల్వేస్టేషన్ దగ్గర ఒక గుడిసెలో కూడా వాడు వుంటాడు.
నేను అక్కడికి వెళ్ళేలోపలే, రోడ్డు మీద వాడి దర్శనమిచ్చింది లారీ వాడిమీంచి వెళ్ళిపోయింది. అది యాక్సిడెంటల్ గా జరిగిందో, కావాలని ఎవరయినా చంపాలో తెలియదు. వాడు మరణిస్తూ కూడా నన్ను రక్షించాడు.
వాడు నిజంగానే నాకు శాశ్వతంగా దూరం అయిపోయాడు. వాడు నా స్నేహితుడు అని చెప్పలేను. నిజం చెప్పీ ప్రయోజనం లేదు. అశ్రుతర్పణం విడిచి నేను తిరిగి వచ్చాను.
ఇప్పుడు చెప్పు కామూ! నేను చాలా దుర్మార్గుడిని కదూ! నేను చేసింది చాలా పెద్ద తప్పు కదూ!" అని చెప్పి పాండురంగం మరలా కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు.
కొద్దిసేపు వాళ్లిద్దరి మధ్యా మాటలు జరిగాయి.
"తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. మీరు సంపాయించిన ఈ డబ్బు, అన్యాయం మార్గంలో సంపాదించింది. మీరు ఎవరికీ అపకారం చెయ్యకపోవచ్చు. కానీ, తప్పుడు మార్గాన డబ్బు సంపాదించారు. ఆ డబ్బుని మనం ముట్టుకోడానికి అర్హులం కాముకానీ...."
"చెప్పు ! కామూ! నువ్వేం చేయమంటే అది చేస్తాను" ఆత్రుతగా అన్నాడు పాండురంగం.
"నేను బ్యాంక్ పుస్తకం చూశాను. దాదాపు ముప్పైవేలు ఇప్పుడు మీ పేర బ్యాంకులో వున్నాయి. మీరు దానిలోంచి పదివేలు మాత్రమే బయటికి తియ్యండి. ఆ పదివేలతో ఏదయినా చిన్న వ్యాపారం ప్రారంభించండి.
మనకి కలిసివస్తే, ఆ పదివేలని తిరిగి బ్యాంకులో వేద్దాం. ఆ తరువాత అన్యాయపు డబ్బుని ఏ అనాధ శరణాలయంకో అజ్ఞాత దాతగా అందచేద్దాం. మనం తాత్కాలికంగా ఆ డబ్బుని ఉపయోగిద్దాం కానీ, పూర్తిగా వినియోగించుకోవద్దు. ఇది నా సలహా!" అంది కామాక్షి.
పాండురంగం చాలా సంతోషించాడు.
"నువ్వు చెప్పింది నాకు చాలా నచ్చింది కామూ! నువ్వు చెప్పినట్లే చెప్తాను" అంటూ కామాక్షి చేతిలో చెయ్యి వేశాడు.
32
రాత్రి ఒంటిగంటా పది నిమిషాలు.
ఎవరో తట్టి లేపినట్లు చటుక్కున మెలకువ వచ్చింది మనోజ్ కి.
"వులికిపాటుగా తనకెందుకు మెలుకువ వచ్చింది? మెలకువ వచ్చినా వెంటనే నిద్రపట్టకపోవటంతో పక్క మీద అటూ యిటూ పొర్లుతూ మనోజు ఆలోచనలో పడ్డాడు.
క్రిమినల్ బ్రెయిన్ ఈ ప్రపంచంలో చాలామందికి వుంటుంది. ఈ బ్రెయిన్ వున్న వాళ్ళు దొంగలూ, హంతకులూ, మోసగాళ్ళూ అయితే, మరికొందరు న్యాయాధికారులు! పోలీసులూ, లాయర్లూ అవుతారు.
అటుదొంగ, ఇటు పోలీసు వాళ్ళ వృత్తులో ఉత్తర, దక్షిణ ధృవాలు. కానీ, వారి ఆలోచనలు ఒకే పంధాలో సాగుతూంటాయి. పోలీసువాడు ఎలా వలపన్ని తనని పట్టుకుంటాడో దొంగకి తెలుసు. అలాగే దొంగవాడు ఏ మార్గాన తప్పించుకోటానికి ప్రయత్నిస్తాడో పోలీసు వాడికి తెలుసు. ఇరువురిది క్రిమినల్ బ్రెయిన్ లే మార్గాలు వేరు వేరు.
ఇన్ స్పెక్టర్ మానోజ్ క్రిమినల్ బ్రెయిన్ తో ఆలోచిస్తున్నాడు.
రాత్రి మొత్తంమీద నిద్రలో ఎంతోకొంత ప్రతివారికి మెలుకువ వస్తుంది. అటునుంచి ఇటువేపుకి పొర్లిపడుకుండి పోతారు. మెలుకువ వచ్చి నిద్ర పట్టకపోతే ఆలోచిస్తూ వుండిపోతారు.
నిద్ర మధ్యలో మెలకువ వచ్చిన మనోజ్ కూడ అందరి లాగానే ఆలోచిస్తున్నాడు.
"ఏదయినా చప్పుడయి మెలుకువ వచ్చిందా?"
"ఏ దొంగైయినా ఇంట్లో దూరాడా?"
"పోలీసు వాడింట్లో దొంగ!" మనోజ్ కి నవ్వు వచ్చింది. "మామయ్య మధ్యలో లేచి బాత్ రూంకి వెళ్ళాడేమో!"