అలా చూసుకున్నా బాత్ రూం తలుపులు చప్పుడు కావే?"
ఛటర్జీ గుర్తుకురాంగానే క్షణకాలం ఆలోచించిన మనోజ్ నెమ్మదిగా బెడ్ మీద నుంచి లేచాడు. బెడ్ కిందనే వున్న మెత్తని స్లిప్పర్స్ లో కాళ్ళు దూర్చి నైట్ గౌన్ తాడు నడుంకి ముడేస్తూ ఛటర్జీ బెడ్ రూమ్ వైపు నెమ్మదిగా సాగాడు.
నిద్రపోతున్న మామయ్యని చూసి వెనుతిరిగి వద్దామనుకున్న మనోజ్ బెడ్ రూం దగ్గరకు వెళ్ళి కర్ టెన్ తొలిగించి చూశాడు.
బెడ్ మీద ఛటర్జీ లేడు.
అంతేకాదు. బెడ్ రూమ్ లో కూడా లేడు ఛటర్జీ.
"ఈ సమయంలో మామయ్య ఎక్కడికి వెళ్ళి వుంటాడు అనుకుంటూ బెడ్ వైపు చూచిన మనోజ్ కి బెడ్ కింద స్లిప్పర్స్ కనిపించాయి. "స్లిప్పర్స్ ఇక్కడే వున్నాయి. కాబట్టి మామయ్య బాత్ రూంకి కూడా వెళ్ళలేదన్నమాట! మరి మామయ్య ఎక్కడికి వెళ్ళినట్లు? ఏమైనట్లు? మామయ్య మాయం అయ్యాడా?"
తన ఆలోచనలకి నవ్వురాగా మనోజ్ అక్కడనుంచి కదిలి బాత్ రూమ్ దగ్గరకు వెళ్ళి అనుమాన నివృత్తికి బాత్ రూమ్ లో చూసి లోపల ఛటర్జీ లేకపోవటంతో ఆపై పక్కగది కిచెన్ వగైరా ఇల్లంతా గాలించి పెరటివైపు వెళ్ళాడు.
పెరట్లో కూడా ఛటర్జీ లేడు.
అన్నిచోట్లా వెతికాను. మామయ్య నల్లపూసకాదు. కిందపడి ఏ మూలకో దొర్లిపోవటానికి, ఇంట్లో లేక పెరట్లో లేక ఎక్కడికెళ్ళినట్లు?" వీధిలోకి వెళ్ళాలి. ఈ అర్దరాత్రి వీధిలోకెళ్ళే పనేముంది? అయినా తను ముందుగా వీధి తలుపు వేసుందో తీసుందో చూడాల్సింది....
మనోజ్ అక్కడనుంచి కదిలి వీధి తలుపు దగ్గరకు వచ్చాడు.
వీధి తలుపు లోపల గడియవేసివుంది.
ఆశ్చర్యం అయోమయం రకరకాల భావాలు మనోజ్ ముఖంమీద ఒక్క క్షణం నడమాడాయి.
మనోజ్ గిరుక్కున వెనుతిరిగి మళ్ళీ ఛటర్జీ బెడ్ రూమ్ దగ్గరకు వచ్చి లోపలకి తొంగిచూశాడు.
ఛటర్జీ బెడ్ మీద పడుకుని వున్నాడు. రెండు చేతులు గుండెమీద చేర్చుకుని నిద్రపోతున్నాడు.
ఇన్ స్పెక్టర్ మనోజ్ గా ఆ క్షణంలో మారిపోయాడు. క్రిమినల్ బ్రెయిన్ తో ఆలోచించాడు. మరో క్షణం కూడా వృధా చేయకుండా హాలులోకి నడిచాడు.
బయటకి వెళ్లేటప్పుడు ఛటర్జీ వాడే చెప్పులు స్టాండ్ మీద వుంటాయి. మనోజ్ చెప్పులు స్టాండ్ దగ్గరికి వెళ్ళి ఛటర్జీ బయటకు వెళ్లేటప్పుడు వాడే చెప్పుల్ని చేతుల్లోకి తీసుకుని చూశాడు.
చెప్పులు క్రింద తడి తడిగా మట్టి అతుక్కుని కనిపించింది. ఎర్రని బురదమట్టి
హాల్లోలైటు వీధి వాకిట్లో లైటు వేసి, వీధి తలుపులు తీసి ఆ వెలుతురులో లోపలా, బయటా నేలని పరికించి చూశాడు మనోజ్.
నేలమీద తడి అడుగులు తాలూకా ముద్రలు సరీగా అవే చెప్పుల తాలూకా అడుగులు బయట నుండి లోపలికి వచ్చినట్లుగా పడి వున్నాయి.
మనోజ్ ఒకసారి తల పంకించి "మావయ్య బయటకివెళ్ళి వచ్చాడు. అర్ధరాత్రి పూట మావయ్యకి బయటకి వెళ్ళి వచ్చే పనేమిటి? ఈ విషయం మామయ్యనే అడిగితే సరిపోలా!" అనుకున్న మనోజ్ లైట్లు ఆర్పివేసి వీధి తలుపు వేసి ఛటర్జీ గదివేపు సాగాడు.
బెడ్ మీద ఛటర్జీ గాఢనిద్రపోతూ కనిపించాడు. అయినా మనోజ్ వూరుకోలేదు. ఛటర్జీ ప్రక్కనే బెడ్ మీద కూర్చుని నెమ్మదిగా తడుతూ లేపాడు "మావయ్యా ! మావయ్యా!" అంటూ.
చిన్న వులికిపాటుతో ఛటర్జీ లేచి కూర్చున్నాడు.
నిద్ర నుంచి లేవటం వలన మనోజ్ ముఖంలోకి అయోమయంగా చూసి, అంతలోనే తెప్పరిల్లి "ఏమిటి? లేపావు?" అని అడిగాడు.
"నిద్రపోతున్నావా? మావయ్యా" మనోజ్ నెమ్మదిగా అడిగాడు.
ఆ ప్రశ్న వింటూనే ఛటర్జీకి నవ్వు ఆగలేదు.
పైకే గట్టిగా నవ్వి, "నాకన్నా మతిపోయి వుండాలి లేదా! నీకన్నా మతిపోయి వుండాలి. అర్దరాత్రి మద్దెల దరువు అన్నట్లు నిద్రపోతున్న వాడిని నిద్రలేపి, నిద్రపోతున్నావా అని అడగటంలో నీవుద్దేశ్యం ఏమిట్రా అబ్బాయ్!" ఎంతయినా పోలీసు బుర్ర కదా!" అన్నాడు ఛటర్జీ.
పోలీసు బుర్ర అన్నమాటకి మనోజ్ లో చిన్న వులికిపాటు ఏర్పడింది. దాన్ని కప్పిపుచ్చుకుంటూ "అదికాదు మావయ్యా! నాకేమో ఎందుకో నిద్ర మెలకువ వచ్చింది. ఎవరో నడిచిన శబ్దం వెంటనే అయింది. నీకేమన్నా లేచావేమో అని నేను లేచి యిలా వచ్చాను, సారీ! మావయ్యా! నీవు నిద్రపోతున్నావు అనుకోలేదు. వూరికినే కళ్ళు మూసుకుని పడుకున్నావేమో అని అనుకొని లేపాను." నొచ్చుకుంటున్నట్లు అన్నాడు మనోజు.
"నేను నడిస్తే అడుగుల చప్పుడు కావు కదా! చాలా నెమ్మదిగా ఏ చప్పుడూ కాకుండా నడుస్తానని నీవే అనేవాడివి కదా మనోజ్!"
మనోజు చేత్తో నెమ్మదిగా తలమీద కొట్టుకున్నాడు.
"మాంచి నిద్రలో వుండి లేచానేమో బుర్ర పని చేయలేదు. అనవసరంగా నిన్ను నిద్ర లేపాను. వెరీ వెరీ సారీ మావయ్యా!" అన్నాడు.
మనోజు భుజంమీద మృదువుగా తట్టి "ఎన్నిసార్లు చెబుతావు సారీ! ఇక వెళ్ళి పడుకో, గుడ్ నైట్" ఛటర్జీ చిరునవ్వుతో అన్నాడు.
"గుడ్ నైట్!" తాను చెప్పి అక్కడనుంచి కదిలి తన బెడ్ రూమ్ లోకి వచ్చి పడుకున్నాడు మనోజు.
బెడ్ మీద అటూ ఇటూ దొర్లటం తప్పించి నిద్రపట్టలేదు మనోజ్ కి.
"మామయ్య ఈ అర్దరాత్రి బైటికి వెళ్ళిరాలేదా?"
"వెళ్ళివచ్చాడు. బురద అంటిన చెప్పులే దానికి సాక్ష్యం.
"తను ముందు చూసినప్పుడు మామయ్య బెడ్ మీద లేడు. వీధి వాకిలి తప్పించి ఇల్లంతా వెతికాడు.
లోపలలేని మామయ్య ప్రత్యక్షమయినట్లే బెడ్ మీద దర్శనం ఇచ్చాడు."
మరి?
మామయ్య అబద్ధం ఆడుతున్నాడా?
నెవర్
కానీ సాక్ష్యాధారాలు కనబడుతుంటే కాదని ఎలా?
మామయ్య అబద్ధం ఆడాడనే అనుకోవాలి. అ....ను....కో....వా....లి.
తన మామయ్య అబద్దాలకోరని మోసగాడని ఎప్పటికి అనుకోలేడు మనోజ్. కారణం ఛటర్జీ ఉత్తముల్లో ఉత్తముడు. చీమకి కూడా అపకారం తలపెట్టని మహామంచి మనిషి. ఇతరులని హేళన చేయని వ్యక్తిత్వం. శత్రువునయినా తులనాడని మనిషి. వేలెత్తి చూపుతూ వాడలాంటి వాడు ఇలాంటివాడు అనని మనిషి....


