Previous Page Next Page 
గిఫ్ట్ పేజి 42

    దాచినంతవరకూ రహస్యం. భయపడినంత కాలం భయం. రహస్యం బయటపడ్డా భయం పోయినా, లెక్కలేని తని, మొండితనం వస్తాయి.

    పాండురంగం విషయంలో సరిగ్గా అదే జరిగింది.

    "మీరు నిజం చెప్పే వరకూ మీరెవరో, నేనెవరో, నా వంటిమీద చెయ్యి వెయ్యవద్దు, భర్తగా నాపై అధికారం చెలాయిస్తానంటే మీ యిష్టం. ఈ దేశంలో మగవాళ్ళకి చేతనయిన విద్యల్లో మొదటి విద్యే ఇది, భార్య మీద అధికారం చెలాయించటమే ఆ విద్య" అని ఆ రోజు చెప్పేసింది కామాక్షి.

    ఆ రోజు నుంచీ,

    పాండురంగం భార్యవంటి మీద చెయ్యి వెయ్యలేదు కానీ, తన నడవడిక మాత్రం ఏ మాత్రం మార్చుకోలేదు. ఇప్పుడు భార్యకి నిద్రమాత్రలు చాటుగా కలిపి యిచ్చి అతను బయటకి వెళ్ళేంత అవసరం ఏమీ కనిపించలేదు.

    రహస్యం బయటపడ్డది. ఇంక భయమెందుకు? కివారాని ఒకసారో రెండు సార్లో రాత్రి పన్నెండు గంటలకు నిక్షేపంగా, దర్జాగా బయటకు వెడుతున్నాడు.

    'ఇదంతా ఏమిటండీ? మీరు చేసేది మంచో, చెడో పోనీ నాతో చెప్పండి! కనీసం నా మనస్సుకన్నా ప్రశాంతత ఉంటుందని మిమ్మల్ని అర్ధం చేసుకోటానికయినా ప్రయత్నిస్తాను' అని ఎన్నోసార్లు భర్తమీద జాలితో అనుకునేది.

    మళ్ళీ అంతలోనే మనసు మార్చుకుని, "తనేం తప్పు చేశానని వెళ్ళి లాలించి అడగాలి! ఆయన ఏదో చెయ్యరానిదే చేస్తున్నారు! నా దగ్గర ఎప్పుడూ రహస్యాలు దాచని మనిషి ఇప్పుడు రహస్యాలు దాచటమేమిటి? వివేకం నశించిన వారికి చెప్పి లాభంలేదు" అనుకునేది.

    ఇలాంటి ఆలోచనలతో నలిగిపోతుండేది కామాక్షి.

    బ్యాంక్ లో బాలెన్స్ పెరుగుతోంది పాండురంగం. ఆనందం పొందుతున్నాడు కానీ, మరింత కుంగిపోతోంది కామాక్షి మనస్సులో.

    రాత్రి బయటికి వెళ్ళినవాడు ఎన్నింటికి తిరిగి వస్తాడా అని, భర్త మీద పరిశోధన చెయ్యటం మానివేసింది కామాక్షి.

    ఈరోజు కూడా భర్త బయటకి వెళ్ళడం చూసింది. ఓ నిట్టూర్పు విడిచి, కొద్దిసేపు బాధపడుతూ ఆలోచించి ఆ తరువాత నిద్రపోయింది.

    ఉన్నట్టుండి, కామాక్షికి మెలుకువ వచ్చింది.

    విషయమేమిటో అర్ధం కావటానికి ఎక్కువసేపు పట్టలేదు.

    ఉలిక్కిపడి లేచి కూర్చుంది.

    పాండురంగమూ, కామాక్షి వాదులాడుకున్న తరువాత వారి పడకలు పూర్తిగా వేరయ్యాయి. పాండురంగం మంచం మీద పడుతుంటే. కామాక్షా చాపా దిండూ వేసుకుని కిందపడుకుంటోంది.

    కామాక్షి పైకిలేచి చూసేసరికి, పాండురంగం మోకాళ్ళలో తలదూర్చి దుఃఖం ఆపుకోలేక పైకే వెక్కిళ్ళు పెడుతున్నాడు, ఆ దృశ్యం ఆమె కంటపడింది.

    కామాక్షి పరిస్థితి క్షణకాలం అయోమయం అయింది. తమ ఇద్దరికీ పడక గదిలో అంత సఖ్యతలేదన్న విషయం ఆ క్షణంలో పూర్తిగా మరిచిపోయింది. అతను పరుషుడు - తను స్త్రీ.

    అతను భర్తా తను భార్య.

    మంచికైనా, చెడుకైనా తామిద్దరం ఒకటి,

    కామాక్షి గతాన్ని పూర్తిగా విస్మరించింది. పాండురంగం పక్కనే కూర్చుని భుజం మీద చెయ్యి వేసింది.

    పాండురంగం తలెత్తి చూశాడు అంతే ఒక్కసారిగా కామాక్షిని పసిపిల్లవాడిలాగా చుట్టేసి వళ్ళో ముఖం దాచుకుని ఏడవటం మొదలుపెట్టాడు.

    ప్రపంచంలో ఆడవాళ్ళే ఏడుస్తారు, మొగవాళ్ళు ఏడ్వరు అని ఎక్కడా రాసిలేదు. కాకపోతే వాళ్ళు ఒకపట్టాన ఏడ్వరు.

    గతంలో పాండురంగానికి ఉద్యోగం పోయింది. అపనిందల పాలయ్యాడు. డబ్బులు కట్టాల్సి వచ్చింది. జైలులో వుండవలసినవాడు, కాస్తలో అది తప్పిందనుకున్నాడు. ఇన్ని జరిగినా కూడా పాండురంగం ఏడవలేదు.

    విపరీతంగా చలించిపోయాడు. అంతకన్నా విపరీతంగా బాధపడ్డాడు. నా యోగం సరీగా లేదు ఆ మాట అనేవాడు అంతవరకే. ఇలా ఏడ్వడం మాత్రం ఎప్పుడూ జరగలేదు.

    తన భర్త ఉత్త కళ్ళనీళ్ళు పెట్టుకోడమే కాదు. పైకే ఏడ్వడం అనేది ఇదే మొదటిసారి చూడడం కామాక్షి.

    కామాక్షి ఏమీ మాట్లాడలేదు. భర్త క్రాఫ్ లోకి వేళ్ళు దూర్చి తల నిమురుతూ పసిపిల్లవాడిని దగ్గరకు తీసుకున్నట్లు దగ్గరకి తీసుకుంది.

    ఎంతైనా వాళ్ళిద్దరూ భార్యాభర్తలు.

    ఏడుపు ఆగిన తరువాత "నేను తప్పు చేశాను కామూ!" అన్నాడు పాండురంగం.

    "నాకు తెలుసు!" కామాక్షి అంది,

    "నీకు తెలుసా?" ఆశ్చర్యంగా అడిగాడు పాండురంగం.

    "తెలుసా అంటే ఏమి చెబుతాను? మీరేదో తప్పుపని చేస్తున్నారు అని మాత్రం తెలుసుకోగలిగాను. మీరు చేసే తప్పు ఏమిటో అది చిన్నదో పెద్దదో కూడా తెలియదు.

    బ్యాంక్ పుస్తకం చూసిననాడే, మీరు ఏదో కానిపని చేస్తున్నారని గ్రహించాను. మీ మార్గానికి అడ్డు తగిలాను. నిజం చెప్పమని నిలదీశాను. కానీ, మీరు నా మాట వినిపించుకోలేదు. చూస్తూంటే మీరేదో చిక్కుల్లో ఇరుక్కున్నట్లున్నారు. ఇప్పటికైనా సమయం మించిపోలేదు. నిజమేదో నాతో చెప్పండి. మీ మంచి చెడ్డల్లో నేను కూడా పాలు పంచుకుంటాను" కామాక్షి లాలనగా అడిగింది.

    పాండురంగం చెప్పసాగాడు.

    "నేను న్యాయంగా పోయినందుకు ఫలితం, నా ఉద్యోగం పోయింది. అనవసరంగా పెద్ద మొత్తం డబ్బు కట్టవలసి వచ్చింది. జైలుపాలు కావలసిన వాడిని కాస్తలో తప్పించుకున్నాను. మీ యింట్లో అందరూ మంచివాళ్ళు మీ మంచితనానికి కూడా నాకు బాధ వేసింది.

    ఒకరోజు సాయంత్రం పార్కులో కూర్చుని వుండగా, నా చిన్నప్పటి స్నేహితుడు నన్ను కలిశాడు. మేమిద్దరం ఒకరిని ఒకరు చూసుకుని కొన్నేళ్ళు అయింది. అయినా ఒకరినొకరం గుర్తుపట్టాం. ఒకరి కష్టసుఖాలు మరొకరికి చెప్పుకున్నాం.

    న్యాయానికి పోతే మంచి రోజులు కావురా! నేను కూడా జీవితంలో ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నాను. న్యాయంకన్నా అన్యాయమే నన్ను రక్షిస్తున్నది. నేను ఇప్పుడు కాని పనులే చేసి డబ్బు సంపాదిస్తున్నాను, ఇప్పుడు నన్ను పట్టుకునే నాధుడే లేడు అంటూ విషయం చెప్పుకొచ్చాడు.

    ఈ ఊళ్ళోనే ఒక స్మగ్లింగ్ ముఠా ఉంది. వాళ్ళక్రింద వీడు పనిచేస్తున్నాడు వెనుక వున్నది పెద్ద పెద్ద వాళ్ళు. వెళ్ళేవారన్నది కూడా వీడికి తెలియదు. వాళ్ళు చెప్పిన పని వీడు చెయ్యటం డబ్బు సంపాదించటం అంతవరకే. వాడి చేతిక్రింద అసిస్టెంటుగా ఒక మనిషి కావలసివచ్చాడు.

    వాడు గతంలో దొంగయి వుండకూడదు. నమ్మకస్తుడై వుండాలి. ఈ విషయం నాతో చెప్పి నా సహాయం కోరాడు. నీ పేరు బయటికి రాదు అన్నీ నేను చూసుకుంటాను. నేను చెప్పిన పని నీవు చెయ్యటమే. పని పూర్తికాగానే నీకు డబ్బు ఇస్తుంటాను. బ్యాంక్ లో ఒక వందరూపాయలు వేసి, అకౌంట్ ఓపెన్ చెయ్యి. నీ బ్యాంక్ అకౌంటు పేర చెక్కులు వస్తాయి. ఆటోమాటిక్ గా ఆ డబ్బు జమ అవుతూ వుంటుంది. ఎవరూ నిన్ను పట్టుకోడం అంటూ జరగదు అంటూ చెప్పాడు.

 Previous Page Next Page