చంద్ర ఆలోచించాడు. అవంతి నిజమే చెప్పి వుంటుంది. తలుపులు తాళంవేసి వున్న ఇంట్లో అవంతి ఎలా రాగలుగుతుంది? పైగా ఇందర్ నాటకాలలో వేషాలువేసే సంగతి కూడా చెప్పింది కదా? పైగా తను వచ్చే ముందు కాఫీ కలుపుకు వస్తూ ఇందర్ అనుకుని సర్దాగా మాట్లాడింది కనుక....
చంద్ర ముఖంలో కదలాడే భావాలను బట్టి అవంతి చంద్ర ఏమి వూహిస్తున్నాడో గ్రహించుకుంది.
"ఎంతసేపని నా చేయి యిలా గట్టిగా పట్టుకుంటావ్! నన్ను నమ్మావో లేదో చెప్పు. నమ్మకపోతే పోలీసుస్టేషన్ కి తీసుకువెళ్ళు. నమ్మితే నా చేయి వదులు. అలా కూర్చుని మాట్లాడుకుందాము."
అవంతి అలా అనంగానే చంద్ర చటుక్కున చేయి వదిలేశాడు.
"ఇద్దరం కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుందాము" అవంతి అంది.
సరేనన్నాడు చంద్ర.
అవంతి కిందపడ్డ కాఫీని తుడిచి రెండు కప్పులకాఫీ తయారుచేసి తీసుకువచ్చింది.
"ఊ.... ఇంకా ప్రశ్నల వర్షం కురిపించి మీ అనుమానాలు తీర్చండి" కాఫీ తాగటం పూర్తి అయింతరువాత అవంతి అంది.
"ఏమి అడగను?" చంద్ర అడిగాడు.
"ఏదైనా సరే. నేను ఈ ఇంట్లో దాక్కోలేదు. కావాలంటే ఈ ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ వుందో చెప్పగలను. ఇందర్ కి ఎన్ని డ్రస్ లున్నాయో చెప్పగలను...."
"అవేమీవద్దు నిన్ను నమ్మానులే...."
"మళ్ళీ లే అంటున్నారు. అదేదో అనుమానంగా....!"
"అదేం లేదులే."
"ఓహ్. లే అన్నది మీ ఊత పదమన్న మాట."
"ఇందర్ ఏడి?"
"డ్యూటీమీద వెళ్ళారు. రాత్రికి వస్తారు. ఇంట్లో నేను వున్నా కదా అని పుస్తకంలో రాసి వెళ్ళలేదు."
"అయితే ఈ పుస్తకంలో రాసి వెళ్ళలేదు."
"ఒక్క పుస్తకం విషయం ఏమిటి? చాలా చెప్పారు" అంటూ అవంతి ఏవేవో చెప్పింది. చంద్ర అనుమానం పూర్తిగా తీరిపోయింది.
చంద్ర ఏదో ఆలోచించడం చూసి "ఏ చిన్న అనుమానం వున్నా అడిగి తీర్చుకోడం మంచిది. ఏదైనా అడగాలంటే అడగండి" అవంతి అంది.
"ఎబ్బే.... అనుమానం కాదు. వివరంగా తెలుసుకోవాలని వుంది...." చంద్ర నాన్చుతూ! అన్నాడు.
"వివరంగా తెలుసుకోడంలో ఎంతమాత్రం తప్పులేదు. ఏఏ వివరాలు కావాలి?" అవంతి అడిగింది.
ఇందర్ దగ్గర అయితే చాలా జాగ్రత్తగా చూసి చూసి మాట వదలాలి. చంద్రవద్ద అలా అక్కరలేదు. చంద్ర విషయమే వేరు. ఇందర్ దగ్గర ఎంతో తూచితూచి మాట్లాడినా ఏ చిన్న పొరపాటు జరిగినా పట్టేస్తాడు. చంద్ర విషయం వేరు. నేను మేకలాగా సాధు జంతువుని నానోట్లో తలపెట్టి చూడు అంటే ఇది పులినోరా మేకనోరా అని తలపెట్టి చూసే రకం.
అవంతి అలా అనగానే "అయితే అడుగుతాను" అన్నాడు చంద్ర.
"ఓ.కె."
"బలవంతంగా పెళ్లిని ఎలా తప్పించడం. ఇందర్ వాళ్ళతో ఎలా ఎదుర్కొంది వివరంగా చెపితే వినాలనివుంది."
"ఓస్. ఇదా?" అని నాలుక చప్పరించి ఓ తెలుసు సినిమాలోని బలవంతం పెళ్ళిసీను పెళ్ళికూతురిని హీరో రక్షించడం గుర్తుకు తెచ్చుకుని కాస్త అటూ యిటుగా మార్చి చెప్పింది అవంతి.
"చాలా విచిత్రంగా ఉంది. రెండు మూడు తెలుగు సినిమాలలో పెళ్ళి సమయానికి హీరో వచ్చి హీరోయిన్ ళా ఇలాగే రక్షిస్తాడు" చంద్ర ఆశ్చర్యపోతూ అన్నాడు.
"భలే అన్నారు. ఆ వెధవలు కూడా ఇలాంటి సినిమాలు చూసి సినిమా ట్రిక్ గా ప్లాను వేశారు. కాపోతే వాళ్ళ పథకం సక్సెస్ కాలేదు."
"మీరు మాట్లాడుతుంటే అదేదో సినిమాలో లేడీ సి.డి. మాట్లాడినట్లుంది."
"ఇంకా నయం. అత్యంత గొప్ప గూఢచారిణి అనలేదు. నా ముఖానికి అదొక్కటే తక్కువ."
"మీకేం తెలియదు. గూఢచారిణి గానీండి. సి.ఐ.డి. కానీండి ఎక్కడినుంచో దిగిరారు...."
"పోనిద్దురూ తలకాయ నొప్పి."
"అలా అంటే ఎలా అన్నీ తెలుసుకొని ఉండటం మంచిది. సి.ఐ.డి.గాని గూఢచారిణిగాని అతి మామూలుగా మనలో మనిషిలాగ వుంటారు...."
"వాళ్ళ విషయాలేవి నాకిష్టం ఉండదు."
"అదేమి?"
"నాకు భయం. పోలీసులన్నా భయమే రౌడీలన్నా భయమే."
"అసలు నన్నడిగితే!"
"ప్లీజ్"
"ఓ.కె. ఓ.కె.... ఇంకా ఆ మాట ఎత్తను, పోనీ ఇందర్ ఇన్ స్పెక్టర్ వేషం చెప్పనా!"