"ఇందర్ .... ఇన్ స్పెక్టర్!" అవంతికి అర్ధం కాలేదు. అయోమయంగా అడిగింది.
"అవును. ఆ రోజు అసలేం జరిగిందంటే" అంటూ ఇందర్ ఇన్ స్పెక్టర్ వేషంలో వచ్చి తన్ని రక్షించడం వివరంగా చెప్పాడు.
అవంతి సాంతం విని "ఓ అదా! అఫార్స్ మొత్తం ఇందర్ చెప్పాడు. ఇందర్ ఇన్ స్పెక్టర్ వేషంతో స్టేజిమీద ఉన్నప్పుడు ఏ తమాషా అయినా చేశాడేమోనని అనుకున్నాను" తాపీగా అంది.
"ఇడియట్. ఇదీ చెప్పాడన్న మాట."
"ఆ...."
"అయితే ఇహ నేను చెప్పవలసినవి ఏమీ లేవు."
"అవును."
"అయితే ఇంక ఆ విషయం వదిలేద్దాము. మీ కథ చెప్పండి."
"నా కథా!" అయోమయంగా అంది అవంతి.
"అవును. మీకు అసలు ఎవరూ లేరంటే నాకు ఎందుకో నమ్మశక్యం కావడంలేదు."
ఈ చిన్న గురుడికి వాస్తవం కన్నా కల్పనే ఇష్టం అనుకున్న అవంతి "నాకెవరూ లేరని ఎక్కడ చెప్పాను!" దబాయింపుగా అంది.
"ఏకాకినని....చెప్పినట్లు.... గుర్తు...."
"ఏకాకిలేదు పదికాకులు లేదు. అప్పుడు పార్కులో ఆ తొందరలో నా నోటికొచ్చింది చెప్పాను. నాకు కన్నతల్లి వుంది...."
"తల్లి....!"
"అవును. నాకు జన్మనిచ్చిన తల్లి. తొంభై అయిదేళ్ళ వయోవృద్ధురాలు. ఆమె పంచప్రాణాలు నా మీద పెట్టుకొని జీవిస్తున్నది. గతంలో మా అమ్మ నాటకాల్లో వేషం వేసిన మాట నిజమే. సురభివారి నాటకాల్లో హరిశ్చంద్రుడి నాటకంలో బిషణి అన్న విషాద పాత్రకి మా అమ్మ తప్ప ఎవరినీ పెట్టుకునేవారు కాదుట. సత్యభామ వేషం అయితే ఇహ తిరుగే లేదుట. కాలం మారింది. దిక్కుమాలిన సినిమాలు వచ్చి, నాటక కళ నోట్లో దుమ్ముకొట్టాయి."
అమ్మకి ఇప్పుడు వయసు వుడిగిపోయినా ఆమెమీద గౌరవంతో నాకు నాటకసమాజం వారు వారి నాటకాల్లో వేషాలిచ్చారు. నాకు అమ్మగాక ఒక చెల్లెలు. తమ్ముడు ఉన్నారు. కాసుకూరు అనే పల్లెటూరిలో మా మామయ్య ఉన్నాడు. ఎప్పుడైతే నాటకాలలో వాళ్ళు నా పెళ్ళికి బలవంతం చేస్తున్నారో అప్పుడే నేను జాగ్రత్తపడ్డాను. అమ్మని, చెల్లెల్ని, తమ్ముడిని మా మామయ్య దగ్గరకు పంపించాను. నేను వెళ్ళిపోదామనుకుంటు ఉండగా వాళ్ళు నన్ను బంధించారు. ఎలాగో ఆ బంధాలు సడలించుకుని పారిపోతుండగా ఆ రౌడీ వెధవలు నా వెంటబడడం నేను పార్క్ లో దూరడం జరిగింది.
పార్క్ లో మీరు నాకు సహకరించి దొడ్డ బుద్దితో నాకు సహాయం చేశారు. అయినా నేను మగాళ్ళంటే నాకున్న భయంతో మీకు థాంక్స్ అయినా చెప్పకుండా వెళ్ళిపోయాను. మావూరు వెళదామని ఆరోజు రైలుస్టేషన్ కి వచ్చాను. మీరు నన్ను పట్టుకున్నారు. అవతల నేను ఎక్కవలసిన రైలు వస్తున్నది. ఆ పరిస్థితులలో నేను ఏం చెప్పినా మీరు నమ్మేట్లులేరు. పైగా సమయం కూడా లేదు. మిమ్మల్ని జనానికి అప్పగించి నాదోవ నేను చూసుకున్నాను.
నాకోసం అక్కడక్కడ మాటువేస్తున్న మనుషులు రౌడీలుగాక వెధవలు ఉన్నట్లు నాకు తెలియదు. స్టేషన్ లో కూడా ఆ రౌడీలు తారసపడ్డారు. సమయానికి బైలుదేరిన ఏదో రైలు కనపడింది. గబుక్కున దారిలో ఎక్కాను. అది గ్రహించి ఆరౌడీలు ఎక్కారు. ఏం లాభం వాళ్ళకి చిక్కనే చిక్కాను. ఎప్పుడని అడగండి. అలా అలా ప్రయాణం చేస్తూ రెండువారాల క్రితం అన్నమాట.
ఓసారి మీరు రక్షించారు. మరోసార్ ఇందర్ రక్షించారు. చివరికి అటుతిరిగి ఇటుతిరిగి మీగూటికే వచ్చాను. ఇప్పుడు నాప్రాణం హాయిగా వుంది. మా అమ్మని చూడాలని, చెల్లెని, తమ్ముణ్ణి చూడాలని మనసు ఊరికే ఆరాటపడుతున్నది. నాతల్లి వయోవృద్దురాలు.
నాకోసం కలవరిస్తూ వుంటుంది. నేను అర్జంట్ గా వెళ్ళాలి. ఇందర్ నన్ను క్షేమంగా తీసుకువెళ్ళి మా అమ్మకి అప్పగిస్తానన్నారు. మీరు ఇక్కడే ఉన్నారని తెలిసి, మీతో ఈ విషయాలన్నీ చెప్పి జరిగిందానికి క్షమాపణ కోరి ఆ తర్వాత వెళదామని అనుకున్నాను. నా నిర్ణయం ఇందర్ తో చెపితే సరేనన్నాడు. ఇదీ విషయం. ఇప్పుడు నామనసు తేలిక అయి నా నెత్తిమీద భారం దిగింది" అంటూ అవంతి క్లుప్తంగా కథ చెప్పింది.
"నేనే పొరపడ్డాను. సారి" అన్నాడు చంద్ర.
"ఛ....ఛ....ఆ సారీ ఏదో నేను చెప్పాలి. ఆపదలో ఉన్న అబలని ఆదుకున్న వీరులు మీరు...."
అవంతి అంటుంటే చంద్ర గర్వంగా ఫీలయ్యాడు.
"సాహసం చంద్రశేఖర ఆజాద్ అన్న మీ పేరులోనే కాదు. మీ నరనరానవుందని నా గాడాభిప్రాయం"
చంద్ర ఛాతీ అంగుళం ఉబ్బింది.
"శౌర్యధైర్యాలు ఓపక్క కవిహృదయం" అంటే సున్నిత హృదయం మరోపక్క. పరస్పర విరుద్ద తత్వాలను మీలోనే చూశాను.
ఈ తఫా చంద్ర ఛాతీ రెండంగుళాలు ఉబ్బింది.
"మగవాళ్ళల్లో అతి మంచివాళ్ళు ఉంటారని....ముఖ్యంగా అది మీరు....ఇందర్ అని అప్పుడిప్పుడే ఇంత జరిగింతర్వాత తెలుసుకున్నాను."
అవంతి వదలాల్సిన బాణాలన్నీ వదిలింది.
"ఏదో....మీ యిది....ఇహిహి....అంతే....నాదేముంది ....ఇహిహి.....అంతాపై వాడి దయ...." చంద్ర మురిసిపోతూ అన్నాడు.