Previous Page Next Page 
అడుగడుగునా... పేజి 41


    బైట తాళం తీస్తున్న చప్పుడు. తర్వాత అతను ఇంట్లోకి వస్తున్న అలికిడి. ఓహ్, ఇందర్ వచ్చాడు చేసేదేముంది. చాతగాని నవ్వొకటి నవ్వాలి అంతే.

    "కాఫీ టైముకి వచ్చావు మహాశయా! ఈ శుభోదయాన స్వాగతం సుస్వాగతం" అంటూ కాఫీ కప్పుతో అవంతి యివతల గదిలోకి వచ్చింది. అతన్ని చూస్తూనే చేతిలో కప్పు జారి కిందపడింది.

    కెవ్వున అరవబోయిన అవంతి గొంతు బిగుసుకుపోయింది.

    అతను అవంతి మీదకు పులిలాగా దూకాడు.

    అవంతి రెండు చేతులు గట్టిగా పట్టేసుకుని "దొంగ దొంగ" అని అరవబోయి అంతలోనే తమాయించుకుని "ఇప్పుడు ఎలా తప్పించుకు పోతావో చూస్తాను మాయలాడి" అన్నాడు. పళ్ళు పటపట కొరుకుతూ.

    అవంతి బుర్ర వేగంగా పనిచేసింది.

    "భాయీసాహెబ్! వచ్చింది నువ్వేనా! ఎవరో అని హడలిచచ్చాను. బాగున్నావా!" నవ్వుతూ పలకరించింది అవంతి.

    "నవ్వటానికి సిగ్గులేదూ!" చంద్ర అరిచాడు.

    "నవ్వటానికి ఎవరైనా సిగ్గుపడతారా!"

    "ఇదిగో పిచ్చి కబుర్లు చెప్పకు. నాది భల్లూకం పట్టు. ఇంక నిన్ను వదిలేది లేదు. మాయమాటలు చెప్పి వెళ్ళిపోదామనుకుంటున్నావేమో! ముడిదూదో, ఇంక నువ్వు ఏం చెప్పినా నవ్వనుగాక నవ్వను. నమ్మను. ఈ పట్టిన పట్టుకూడా వదలను. సరాసరి పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్ళి ఆడదానివని కూడా కనికరించక పోలీసులకి అప్పగించి వస్తాను."

    "రక్షించావ్, ఇంకేం చేస్తావో అని హడలి చచ్చాను. నేను చెప్పేది సాంతం వినకుండా మాత్రం ఏదీ చెయ్యకు."

    "ఇదో నాటకమా! నేను నమ్మనని చెప్పాను. నువ్వు ఏడ్చావనుకో, నీ ఏడ్పుకి కరిగిపోను. అసలు నీ మాటే వినను. పద పోలీసుస్టేషన్ కి. మొదటిసారి నీ మాట నమ్మి మోసపోయాను. రెండోసారి నీ మాటలు నమ్మి అన్యాయంగా దెబ్బలు తిన్నాను. పోలీస్ స్టేషన్ కి పద" అవంతి చేతుల్ని గట్టిగా పుచ్చుకుని చంద్ర కోపంగా గుంజాడు.

    "పద పోలీసులంటే నాకేం భయమా! తర్వాత ఇందర్ వచ్చి నీ పని పట్టకపోడు" అవంతి ధైర్యంగా అంది.
   
    "ఇందర్!" చంద్ర తెల్లబోయాడు.

    "అవును. ఇందర్, నీ మొగుడు సరేనా!"

    "అయితే ఇందర్ పేరు కూడా తెలుసుకున్నావన్న మాట!"

    "తెలుసుకోటం ఏమిటి! నా బొంద నే చెప్పేది పూర్తిగా వినవద్దులే. అటు చూడు. పెరటివేపు తాళం వేసివుందా లేదా! దీనికి జవాబు చెప్పు చాలు" అవంతి దబాయింపుగా అంది.

    "తాళం వేసి వుంది" చంద్ర వప్పుకున్నాడు.

    "పెరటివైపు తాళం వేసివుంది. వీధివైపు తాళం నీవు తీసి లోపలికి వచ్చావు అవునా!"

    "అవును!" అయోమయంగా తలవూపుతూ అన్నాడు చంద్ర.

    "మరి నేను లోపల ఎలా వున్నాను?"

    "మోసం మోసం నువ్వసలే మోసగత్తెవు. ఇది మరో నాట...."

    "ఛత్ ఒకటికి రెండుసార్లు  ఏదో జరిగిందని  ఇంక నేను మోసగత్తెనా! ఇప్పుడు మాత్రం నేను అరిస్తే పదిమంది పోగుకారా! మూసివున్న  తలుపులు లోపల అందమైన ఆడపిల్ల వంటరి మగవాడు. లోకానికి ఇంకేం సాక్ష్యం కావాలి?"

    "నేను చెప్పేది విను. దాంట్లో  మోసం వుందేమో  ఆలోచించు. ఆపై నాపై నీ ఇష్టం వచ్చిన చర్య తీసుకో. నామీద నమ్మకం లేకపోతే నేను పారిపోతాననుకుంటే ఆ కిటికీకి నన్ను కట్టివెయ్యి. లేకపోతే నీవలా కూర్చో నేనిలా కూర్చుంటాను. ముందు నాలుగు ముక్కలు విని నిర్ణయం తీసుకో. నీ ఇష్టానుసారం చేస్తాను."

    చంద్ర వెర్రిముఖం వేసుకుని అవంతివేపు చూశాడు. ఆమె చెయ్యి మాత్రం వదలలేదు.

    "నీవు వచ్చేసరికి నేను ఏం చేస్తున్నాను. వంటగదిలో కాఫీ పెట్టుకుంటున్నాను, వచ్చింది ఇందర్ అనుకున్నా. కప్పులో కాఫీ పోసుకుని ఆ గదిలోంచి వస్తూ "కాఫీ టైముకి వచ్చావు మహాశయా! స్వాగతం సుస్వాగతం అన్నానా లేదా!"

    "అన్నావు ఆ మాట విని నేను తెల్లబోయాను. ఈ ఆడగొంతు ఎవరిదా అనుకుంటుండగా నీవు వచ్చావు. అంతే నీ మీదకు దూకి గట్టిగా పట్టేశాను" చంద్ర అన్నాడు.

    "గుడ్ ఇప్పుడు దీనిని బట్టి నీకేం అర్ధమైంది."

    చంద్ర అయోమయంగా చూశాడు.

    "ఇందర్ నన్ను ఇక్కడికి తీసుకువచ్చాడు. నీవు ఊరికివెళ్ళిన మర్నాడు ఇందర్ ఊరినుండి వచ్చాడు. గతంలో నేను నీకు చెప్పిన కథ కథకాదు వాస్తవం. ఆరోజు రౌడీలు మళ్ళీ వచ్చారు. నేను తప్పించుకోటానికి వీలులేక నీమీదకి జనాన్ని రెచ్చగొట్టాను. రైల్వే స్టేషన్ నుంచి పారిపోగలిగాను కానీ నీవు నా చెయ్యి పట్టుకున్న కాస్త ఆలశ్యానికి ఆ తర్వాత వాళ్ళకి చిక్కాను. కొన్నాళ్ళు నన్ను పెళ్ళికి వప్పించటానికి నయాన భయాన చూశారు. నేను లొంగలేదు. చివరికి నన్ను బలవంతాన పెళ్ళికూతురుని చేసి పెళ్ళి చేయబోతుంటే సమయానికి హీరోలా ఇందర్ వచ్చి వాళ్ళందరి బుర్రలు రామకీర్తన పాడించి నన్ను ఇక్కడికి తీసుకువచ్చి రహస్యంగా దాచాడు. నామాట అబద్ధం అయితే ఇందర్ ణి అడగండి. ఇందర్ కూడా నాటకాల్లో వెయ్యబట్టి మా నాటక సమాజంతో పనివుండి రాబట్టి నన్ను వాళ్ళ బారినుంచి రక్షించగలిగాడు. నే చెప్పేది అసలు నమ్ముతున్నారా? లేదా? ఇదైనా చెపితే మిగతా కథ చెపుతాను" అవంతి తూచి తూచి బాణాలు వదులుతూ అంది.

 Previous Page Next Page