తనకు తెలీకుండానే లేచి ఆ గదివైపు నడిచాడు.
విజయ అటువైపు తిరిగి అల్మరాలోని దేవుడి పటం ముందు నిలబడి రెండు చేతులు జోడించి ప్రార్థిస్తోంది.
హారతి వెలుగులో ఆమె రూపం వింత కాంతితో కనబడుతోంది. అసలు రహస్యం తెలుసుకోడానికి ఇదే తగిన సమయం! ఇంక తను ఈ సస్పెన్స్ భరించలేడు. తనకి నిజం కావాలి! వెంటనే తనకు అన్ని విషయాలూ తెలియాలి. లేకపోతే పిచ్చెక్కిపోతుంది. లేదా గుండెలు పగిలిపోతాయ్!
ఆ నిజం విజయ నోటి వెంబడే వస్తుంది. అదీ ఈ దేవుడి ఎదురుగానే! ఇక్కడయితేనే ఆమె అబద్ధాలు చెప్పేందుకు భయపడుతుంది.
ఆమెకు సమీపంగా నడిచాడతను.
హఠాత్తుగా అతని దృష్టి అల్మారాలో ఉన్న మరో ఫోటో మీద పడింది.
ఉలిక్కిపడ్డాడు తను.
మరింత పరీక్షగా ఆ ఫోటోవైపు చూశాడు.
అవును! ఆ ఫోటో మరెవరిదో కాదు.
తనదే!
ఆనాడు విజయ తన ఫోటో పంపమని కోరితే అప్పటికప్పుడు స్టూడియో కెళ్ళి ఆమెకోసమే ప్రత్యేకంగా తీయించుకున్న ఫోటో అది.
మరి అది ఈమె దగ్గర ఎందుకుంది?
తల తిరుగుతున్నట్లనిపించిందతనికి.
అంతా మిస్టరీ!
విజయ పూజ ముగించి వెనుకకు తిరిగి గడప దగ్గర నిలబడ్డ చంద్రకాంత్ ని చూసి నిశ్చేష్టురాలయింది.
"మీరా" అంది అల్మారా తలుపు మూసివేస్తూ.
"మీరు పూజ చేస్తుంటే చూస్తున్నాను."
ఆమె బలవంతంగా చిరునవ్వు పెదాలమీదకు తెచ్చుకుంది.
"మీ దగ్గర చదువుకోవడానికేమయినా నవలలున్నాయా?" అడిగాడతను.
"ఓ! చాలా ఉన్నాయ్! లోపలకు రండి!"
ఆమెతోపాటు గదిలోకి నడిచాడతను.
టేబుల్ మీదున్న బుక్ షెల్ఫ్ లో వరసగా పేర్చి ఉన్నాయి కొన్ని నవలలు. అన్నీ ఒకటొకటిగా తీసి చూడసాగాడు.
వాటిల్లో చాలా వాటి గురించి విజయ చక్కని విమర్శలతో తనకు రాస్తూండేది. మరిప్పుడు వీటన్నిటిని బట్టి ఆలోచిస్తే అసలు విజయ ఈమే అని అనుకోవాలి! తన భార్య జయ! అంతే! అనుమానం లేదు. వివాహమయ్యాక జయతో చాలాసార్లు సాహిత్యం గురించి మాట్లాడాడు తను. కానీ ఆమె తెలివిగా ఎప్పటికప్పుడు ఏదొక సాకు చెప్పి తప్పించుకునేది.
"ఓ పుస్తకం తీసుకుని తన గదిలోకి వచ్చేశాడు చంద్రకాంత్.
చాలాసేపు ఆలోచిస్తూనే గడిపాడు.
ఆలోచిస్తున్న కొద్దీ అస్పష్టమయిన రూపం తయారవసాగింది. అయితే పూర్తి ఆధారాలు లభించటం లేదు.
తన ఆలోచనలన్నీ నిజమైనవే అని నిర్దారించుకోవాలంటే మరికొన్ని ఋజువులు కావాలి.
అవన్నీ లభించిన మరుక్షణమే తను ఇద్దరినీ కూర్చోబెట్టి వాళ్ళ రహస్యం వాళ్ళకే చెప్తాడు. ఆ తరువాత తను చేయదల్చుకున్న పని వివరిస్తాడు.
అంతవరకూ తనకి మనశ్శాంతి లభించదు.
అంత రాత్రిలోనే లేచి ఆటోలో కిషోర్ ఇల్లు చేరుకున్నాడతను. కిషోర్ అతనిని చూసి మళ్ళీ భయపడ్డాడు. "ఏమిటిలా వచ్చారు?"
"మీతో మాట్లాడాలి!"
"ఇప్పుడా?"
"మీకెప్పుడు వీలయితే అప్పుడే!"
"రేపు సాయంత్రం అయిదింటికి హోటల్ సిరి దగ్గర కల్సుకుందాం!"
"సరే" తిరిగి వచ్చేశాడతను.
తెల్లారుజామున ఎవరో తట్టి లేపుతూంటే మెలకువ వచ్చింది చంద్రకాంత్ కి.
విజయ ఆత్రుతగా లేపుతోందతనిని.
"త్వరగా లేవండి! జయకు నొప్పులు వస్తున్నాయి.
అతను లేచి కూర్చున్నాడు.
ఎదురుగ్గా భయంగా, ఆందోళనతో నిండిన విజయను చూస్తూంటే నవ్వు వచ్చిందతనికి.
"ఇప్పుడు నేనేం చేయను?"
"హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి."