ఎటూ తేల్చుకోలేని స్థితిలో అలాగే వుండిపోయాను. అంతలో చివుక్కున తలెత్తింది జానకి. నన్ను చూసింది. ఒక క్షణం బిత్తరపోయింది. మొహం నల్లబడింది? బహుశ తన పెళ్ళికి నేను వస్తానని అనుకుని వుండదు .... ఏదో తప్పు చేసిన దానిలా తలవంచుకుని నిలబడింది. ఇంక వెనక్కి వెళ్ళే ఉపాయం లేక ముందుకే అడుగేశాను.... అలా ఇద్దరం ఒకరి కెదురుగా మరొకరం నిలబడ్డాం కొన్ని నిమిషాలు! ఆ సన్నివేశం ఇద్దరికీ ఇబ్బందిగానే వుంది. ఆఖరికి జానకే తలెత్తి చిరునవ్వు నవ్వింది. "ఎప్పుడొచ్చావు బావా!" అంది అతి మామూలుగా, ఆ ప్రశ్నకి జవాబు అనవసరం.
'జానకీ!' అన్నాను. నా గొంతులో భావం కనిపెట్టి జానకి కలవరపడ్తూ చూసింది. అటుప్రక్కకి. ఆమె చూపుల ననుసరించి నేనూ చూశాను. ఆ గదిలో వున్నది మేమిద్దరమే గాదు! ఎవరో ఆమె అటు తిరిగి కూర్చుని వళ్ళో చంటి బిడ్డకి పాలిస్తూంది. నయమే అనుకున్నాను. గొంతులో ప్రశ్నని మళ్ళీ లోపలికి పంపేశాను.
'కూర్చోబావా' అంది జానకి. పట్టి పట్టి చూస్తున్న నా చూపులని తప్పించుకుంటూ ఎటో చూస్తూంది జానకి. బరువుగా గడుస్తున్నాయి నిమిషాలు.
"ఉద్యోగం బాగుందా! హైదరాబాదు మారుస్తారని విన్నానే...." జానకే నయం, ఏదో ఒకటి మాట్లాడుతుంది. జానకి ప్రశ్నలకి జవాబీయాల్సింది లేనట్లు ఆ గదిలోంచి ఆమె వెళ్ళడం కోసం ఆత్రుతగా చూస్తున్నాను.
"ఏం బావా మాట్లాడవు? అమ్మ నాన్న నీవు రావడం చూశారా? అత్తయ్య వచ్చింది చూశావా?" తలూపాను.
అమ్మయ్య! ఆమె పిల్లాడిని పడుకోబెట్టి గదిలోంచి వెళ్ళిపోయింది. భారం దిగినట్టు నిట్టూర్చాను. ముందుకి వంగాను.
"జానకి !"
జానకీ అడగబోయేదానికి సిద్ధపడ్డట్టు సర్దుకు కూర్చుని ధైర్యంగా మొహంలోకి చూసింది.
"జానకీ, ఏమిటిది?...."
"ఏమిటి బావా!" నవ్వింది.
"అదే దీనర్థం, ఏమిటి? ఎందుకిలా చేశావని అడుగుతున్నాను...." నా కళ్ళు నాకు తెలియకుండానే ఎర్రబడి వుంటాయి. మాటల్లో కఠినత్వం వచ్చింది.
"ఏం చేశాను బావా?" అమాయకంగా మొహం పెట్టింది. ఆమె కళ్ళల్లో ఇందాకటి కంగారు, బెదురు లేదు. కొంటెగా మెరుస్తున్నాయి.... ఆమె పెదవుల్లో చిన్న నవ్వు తొంగిచూస్తుంది. ఆ నవ్వులో ఏదో సాధించానన్న గర్వం తొంగిచూస్తున్న భావం కనిపిస్తూంది.... నా వళ్ళు మండింది ఆ మొహం చూస్తూంటే.
"జానకీ, నటన చాలు.... జవాబు చెప్పు!"
అదే చూపుతో, అదే నవ్వుతో తల ఎగరేసింది జానకి. "ఏం అడుగుతున్నావో తెలియకుండా జవాబేం చెప్పను బావా!" అంది.
నన్ను రెచ్చగొడ్తూంది. ఏం తెలీనట్టు నటిస్తూంది. స్పష్టంగా నా నోట "నన్నెందుకు పెళ్ళాడడంలేదు" అని అడిగించాలని చూస్తూంది. అంత తేలిగ్గా బైట పడతాననుకుంటూంది గాబోలు....ఘాటుగా దులిపేద్దామని నోరు తెరిచాను.
"అమ్మా, తల్లీ, పెళ్ళికూతురా, ఇక్కడా వున్నావు.... వెతికి వెతికి చస్తున్నాం...." అంటూ ఓ అరడజనుమంది అమ్మాయిలు, స్నేహ బృందం గాబోలు బిలబిలలాడుతూ లోపలికి వచ్చారు.
ఆ క్షణంలో నాకెంతో కోపం వచ్చింది. దాంతోపాటు ఏదో నీరసం, నిస్పృహ వచ్చాయి. బయటకు వెడుతూ ఒక్కసారి జానకి మొహంలోకి చూశాను. వాళ్ళతో మాట్లాడుతూనే జానకి నావంక చూస్తూంది.... యిప్పుడు ఆ చూపులో ఇందాకటి కొంటెతనం, గర్వం లేదు. ఆ స్థానే ఏదో బాధో__తొందరపడ్డానేమోనన్న పశ్చాత్తాపమో, తప్పుచేస్తున్నానన్న భావంతోనో మలినపడినట్లనిపించింది.... కేవలం నా ఊహేమో! తల త్రిప్పుకుని గబగబ వెళ్ళిపోయాను.
ఆ పగలంతా ఎన్నివిధాల ఎన్నిసార్లు ప్రయత్నించినా జానకిని వంటరిగా పట్టుకోలేకపోయాను. సంగతి తెల్సుకోవాలన్న నా ఆఖరి కోరికకి స్వస్తి చెప్పక తప్పలేదు.
రాత్రి జానకి శాశ్వతంగా పరాయిదయిపోయింది. జానకి మెడలో అతను మూడు ముళ్ళు కడుతూంటే ఏదో పోగొట్టుకున్నానన్న భావం నన్ను కృంగదీసింది. అందరితోపాటు ఇన్ని అక్షింతలు ఇచ్చారు ఎవరో. నా మనసులో కోరికలు, ఆశలు లాగే నాచేతిలోంచి అవి నాకు తెలియకుండానే జారిపోయాయి.
ఆ రాత్రే ప్రయాణం అయ్యాను, ఎవరు చెప్పినా వినకుండా! అవును, ఇంకేముంది అక్కడ నాకు!
* * * *
చాలా రోజుల తర్వాత.... జానకి పెళ్ళయి రెండేళ్ళపైన అయింది. ఏడాది కూతురు తనకి, అమ్మ వాళ్ళ ద్వారా అప్పుడప్పుడు సంగతులు వినడంతప్ప నేను తర్వాత జానకిని చూడలేదు...
జానక్కి పెళ్ళయ్యాక "రాజా" లాంటి నాకు చాలా సంబంధాలే వచ్చాయి! ఏం ఎందుకు రావు? అంతో ఇంత చదువు, మంచి ఉద్యోగం వున్న మొగాడికి సంబంధాలకేం కొదవ! కానీ....ఏమిటో.... యింకా ఈ రాజాగారి జీవితంలోకి ఇంకా ఏ రాణిగారూ ప్రవేశించలేదు.
మొదట్లో జరిగిన పరాభవాన్ని దిగమింగడంతో గడిపాను.
మరి కొన్నాళ్ళు ఏదో నిర్లిప్తత ఆవహించి వెనక్కి పెట్టాను పెళ్ళి. ఇంట్లోవాళ్ళ బలవంతం వల్ల చూసినవి కొన్ని నాకు నచ్చక, కొన్ని వాళ్ళకే నచ్చక... అలా అయి ప్రస్తుతం ఇంకా వంటరిగానే మిగిలాను.
ఆ రోజు....శలవురోజు! ఏం తోచలేదు ... బయటికి వెడదామంటే వర్షం! క్రొత్త పుస్తకాలు కనబడలేదు.... పేపరన్నా రాలేదు ఆరోజు టైము ఎలా గడపాలో తెలియక పుస్తకాల అలమారా వెతికాను... ఏదన్నా చదవనిది కనపడదాని!.... చూస్తూంటే 'తెగిన తీగలు' అన్న పుస్తకం కనపడింది. అది నాది కాదు! ఎలా వచ్చిందో అంతకంటే గుర్తులేదు.... అసలు నాకు తెలుగు పుస్తకాలు చదివే అలవాటు లేదు. బహుశా శారద దయి వుంటుంది. ఆర్నెల్ల క్రితం పురిటికి ఇంటికి వెడుతూ మధ్యలో నాదగ్గిర ఓరోజు ఆగి వెళ్ళింది. మర్చిపోయి వుంటుంది బహుశా, అలమారాలోకి ఎలా వెళ్ళిందో!
సరే, కాలక్షేపానికి ఎలా వుంటుందో చదివి చూద్దామనిపించింది. పేజీలు జరుగుతూంటే పరవాలేదనిపించింది....హీరో, హీరోయిన్ ల చిన్నతనం రోజులు చదువుతూంటే జానకి హఠాత్తుగా గుర్తు వచ్చింది... జానకి నేను....ఎంత వద్దనుకున్నా ఆ రోజులు కళ్ళముందు మెదిలాయి. నిట్టూర్చాను.