"స్నానం చేస్తానమ్మా చిరాగ్గా వుంది ...."
"పద !" అమ్మ నావెంట గదిలోకి వచ్చింది. పెట్టెలు, బెడ్డింగులు ప్రక్క చుట్టలతో గదంతా నిండి వుంది. పెట్టె తీసి బట్టలు సబ్బు వగైరాలు తీశాను. ఆ గదిలో ఎవరూ లేరు అమ్మనడగడానికి ఇదే మంచి సమయం.... కానీ....
"జానకేదమ్మా కనపడదు!" ఒకటి అడగాలని మరోటి అడిగాను.
"పెళ్ళి కూతురు గాదూ, స్నాతకం చూడకూడదు.... ఆ గదిలో ఎక్కడో కూర్చునంటుంది" అమ్మ అటు ఇటు చూసింది నాదగ్గిరకి జరిగింది. "చూశావురా, ఏం చేశారో వీళ్ళు" రహస్యం చెప్పినట్టు అంది.
"ఏం చేశారు?" ఏం తెలియనట్టు అమాయకంగా అడిగాను.
"ఏం చేయడ మేమిటి!? చిన్నప్పటినించి జానకిని నీకిద్దామనుకున్నది వాళ్ళూ మేము అనుకున్న మాట గదా! అసలు రెండు మూడేళ్ళ నించి నీ వుద్యోగంలో చేరిందగ్గిర నించి ఎప్పుడు చేసుకుంటావు అంటూ పోరుతూనే వున్నాడు గదా! అలాంటిది ఉన్నట్టుండి ఇంకో సంబంధం చూసుకున్నారు. కుదుర్చుకున్నాక ఓ కార్డు ముక్క రాసి పడేశాడు మామయ్య. పోనీ ముందన్నా మీ అభిప్రాయం ఏమిటనయినా అడగలేదు సంబంధం చూసేముందు!.... పోనీ ఆడపిల్ల వాళ్ళకే అంత టెక్కయితే మనకేం? యీ మాత్రం సంబంధం మనకు దొరకదనా మనం బెంగెట్టుకోవాలి.... నా వళ్ళు మండిపోయింది సుమా! మీ నాన్నయితే అసలు నన్ను వెళ్ళొద్దు అన్నారు పెళ్ళికి. ఎవరూ రాకపోతే మనమేదో ఏడుస్తున్నాం అనుకుంటారని వచ్చాను. అత్తయ్య మాటలు విన్నావా? పోట్లాటకి వచ్చావుట! పోట్లాటకి రావల్సిన అవసరం నీకేమిటి, యీ జానకిలాంటి వాళ్ళు లక్ష మంది దొరుకుతారు...."
అమ్మ చెప్పిన అన్ని మాటల్లోనూ నా సందేహం తీర్చేది ఒక్కటీ లేదు. నా పజిల్ సాల్వ్ కాలేదు .... నిజమే, జానకి నాభార్య అని పుట్టినప్పటినించి మొన్నటివరకు అందరూ అనుకున్నమాటే! అదీనాడు హఠాత్తుగా ఎందుకిలా తారుమారయింది .... అవాల్సిన అవసరం ఏం వచ్చింది? .... పోనీ ఈ వరుడు నాకన్న పెద్ద ఉద్యోగస్థుడా, ఆస్థి పరుడా, అందగాడా! అంటే అదీ లేదు .... మరి ?
"అది సరేనమ్మా, అసలు వీళ్ళిలా ఎందుకు చేసినట్లు?...."
"అదేరా సరిగా తెలియడం లేదు.... నేనడిగితే మనమేదో జానకి కోసం కొట్టుకు పోతున్నాం అని అనుకుంటారని అడగలేదు. వాళ్ళంత లెక్కలేనట్టుంటే మనమూ అలాగే వుండాలి! మీ అత్త, మామయ్య మాటలనిబట్టి "ఎన్నాళ్ళుంచుతాం పిల్లని" అంటూ ఏదో మాట్లాడారు, ... ఆ మాట అర్థం ఏమిటో నాకు బోధపడలేదు ...."
"జానకే మనలేదా, వప్పుకుందా!" ఆత్రుతగా- అడిగాను.
"అసలు జానకి పట్టుదలవల్లే ఈ పెళ్ళి జరుగుతూందట .... సూరమ్మ దొడ్డమ్మ అంది. "బావతప్ప ఇంకే"మగాడు లేడా నన్ను పెళ్ళాడడానికి" అందిట జానకి వాళ్ళమ్మతో."
"నిజంగా .... జానకందా అలా!" తెల్లపోయాను.
"ఊ .... అందుకే మామయ్య వెంటనే పై సంబంధం చూశాడట,"
"ఏమే సుబ్బులూ మురళి వచ్చాడుట ఏడి?...." మా దూరపు వరస బంధు వొకావిడ గదిలోకి రావడంతో సంభాషణ ఆగిపోయింది. ఆవిడ నన్ను నఖశిఖ పర్యంతం పర్యవేక్షించింది. జీతం వగైరాలు ఆరా తీసింది. విసుగ్గా వున్నా బాగుండదని ఓపిగ్గా చెప్పాను జవాబులు.
"అదేమి" సుబ్బులూ నిక్షేపంలాంటి మేనరికం వదిలి పై సంబంధం చూశాడు రాముడు .... రాజాలాంటి మేనల్లుడు ...."
మెల్లిగా జారుకుని బాత్ రూమ్ లోకి జొరపడ్డాను. స్నానం చేస్తున్నంతసేపూ నా మనసు మనసులో లేదు .... అమ్మ చెప్పిన మాటలు విన్నాక నా సందేహం తీరకపోగా మరిన్ని ప్రశ్నలు పుట్టాయి. జానకి వేరే సంబంధం చూడమందిట! బావతప్ప మరో మగాడు లేడా అందిట! జానకి.... జానకలా ఎందుకు అంది? హఠాత్తుగా జానకిలా ఎందుకు మారింది! చిన్నప్పటినించి అందరూ మొగుడు మొగుడు అనడం అది సిగ్గు పడడం నాకు తెల్సు! అలాంటిది హఠాత్తుగా జానకి నన్ను మొగుడిగా అంగీకరించక పోవడానికి కారణం ఏమిటో? అకస్మాత్తుగా నా మీద అయిష్టత ఎందుకొచ్చింది! అందరికి రాజాలా కనిపిస్తున్న నాలో ఏం లోపం కనిపించి ఇంకొకరిని వెతుక్కుంది! జానక్కి నేనంటే ఇష్టం లేదన్నట్లు యిప్పటి వరకు ఏ సందర్భంలోనూ నాకు తెలియదు. పైగా నేనంటే ప్రేమాభిమానాలు, గౌరవం ఉన్నట్లే అనేక సందర్భాలలో వ్యక్తపరచినట్లు గుర్తు. .... మరి హఠాత్తుగా ఎందుకిలా నిర్ణయం చేసుకుంది? .... పోనీ ఏ ప్రేమ వ్యవహారమో అనుకోడానికీ లేదు .... మామయ్య కుదిర్చిన సంబంధమే ఇది! ...."
వళ్ళు రుద్దుకోకుండా నీళ్ళన్నీ పోసేసు కుంటున్నానన్న సంగతన్నా గుర్తు రాలేదు బాల్చీలో నీళ్ళన్నీ ఆఖరయ్యే వరకు ....
ఇదేమిటో జానకినే అడగాలి ! నన్నింత అవమాన పర్చడానికి కారణం ఏమిటో జానకినే అడగాలి! అవమానం కాదూ! చిన్నప్పటినించి అనుకున్నది. ఉద్యోగంలో ప్రవేశించిం దగ్గిర నించి రోజుకో ఉత్తరం రాసి ప్రాణం తీసేవాడు మామయ్య. ఇంచుమించు జానకి నా భార్య అయిపోయిందన్న దృష్టిలో ఉన్న నన్ను ... యిలా యీనాడు .... నేనేదో చచ్చుదద్దమ్మని, చాతకాని వాడిని అన్నట్టు నన్ను కాదని యింకొకరిని చేసుకుంటుందా? మగాడన్న వాడికి ఇంతకంటే అవమానం యింకేం కావాలి! నేను చేసిన నేరం ఏమిటి!....
మొహం మీదే అడిగి తేల్చుకుంటాను.
ఆవేశంగా గబగబ వళ్ళు తుడుచుకుని బట్టలు కట్టుకుని పైకి వచ్చాను__ గదిలోకి వెళ్ళి తల దువ్వుకున్నాను.... గదుల్లో ఎవరూ లేరు. అంతా వీధి పందిట్లో చేరారు ఇదే సమయం!
నెమ్మదిగా గదులన్నీ వెతుక్కుంటూ మామయ్య కచేరిగదిలోకి వచ్చాను. జానకుంది అక్కడ. చుట్టూ పెట్టెలు, ప్రక్క చుట్టల మధ్య పెట్టి మీద కూర్చుని ఏదో వార పత్రిక చదువుతూంది. ప్రొద్దుటే పెళ్ళి కూతుర్ని చేసినట్టున్నారు తలంటుకుని వదులుగా వేసికున్న జడ, తలనిండా పూలు, కళ్యాణం బొట్టు, కాళ్ళకి పారాణి, కళ్ళకి కాటుక మొహంలో ఏదో కాంతి "పెళ్ళికళ" అంటే ఇదే గాబోలు! ఎంత అందంగా వుంది! యీ అందం .... యీ ఆనందం .... అంతా నాకు సంబంధించినది కాదు గదా! జానకి ప్రక్కన పెళ్ళికొడుకుగా కూర్చోవలసిన నేను .... పరాయి వాడిలా ఎదుట నిలబడ్డాను. నాకేమిటో దిగులు అనిపించింది. నేనెవర్ని యిక్కడ? ఎందుకొచ్చాను యిక్కడికి? సిగ్గులేకుండా .... పౌరుషం, అభిమానం లేకుండా యీ పెళ్ళికి ఎందుకు వచ్చినట్లు? వెంటనే జానక్కి కనపడకుండా వెనక్కి తిరిగి పారిపోవాలనిపించింది .... కాని మనసులో ఏమూలో అసలు సంగతి తెల్సుకోవాలన్న కుతూహలం నన్ను కదలనీయలేదు .... మరో అడుగు ముందుకు వేశాను .... నా పిచ్చిగానీ యిప్పుడు అసలు సంగతి తెల్సుకుని మాత్రం ఏం చెయ్యాలని నా ఉద్దేశ్యం! ఇంకో కొన్ని గంటల్లో శాశ్వతంగా పరాయిదయి పోతుంది జానకి, ఇంక యిప్పుడు కారణం తెల్సుకుని.... ఏం చెయ్యగలను! ఇదేం సినిమానా పీటలమీద పెళ్ళికొడుకుని లేవదీసి నేను కూర్చోడానికి!