పుస్తకం సగం చదివేసరికి... హఠాత్తుగా యిన్నాళ్ళ నించి నన్ను వేధిస్తున్న సమస్యకి మెరుపులా జవాబు తట్టింది. ఆ క్షణాన ఆ కథలో నాయిక స్థానంలో జానకి నిల్చుంది... సందేహం నివృత్తి అయింది.
జానకి నన్ను కాదనడానికి ఇదేనా కారణం! ఇంతే అయివుంటుంది బహుశా! ఎంత పొరపాటుగా అర్ధం చేసుకుంది నన్ను జానకి! ఎంత తొందరపడింది.
జానకి నన్ను అపార్థం చేసుకుంది. జానకి అలా ఆలోచిస్తుందని నేనూహించలేక పోవడం నా తప్పేనేమో! పొరపాటుపడ్డానేమో! తెగే వరకు లాగాను తాడు.
....నిజమే!
జానకి నిశ్చయంగా నాదే అన్న నమ్మకంతో, జానకిగాని, మామయ్యగాని నన్ను కాదనరన్న నిబ్బరంతో జానకి మనసుతో, అభిమానిని అయిన జానకితో చెలగాటం ఆడాను! .... చెలగాటం అని ఇప్పుడనుకుంటున్నాను. కాని అప్పుడది వినోదం!
పదిసార్లు అడిగించుకుంటూ, అడిగిన దానికి తిన్నగా సమాధానం ఇవ్వకుండా వాళ్ళని సందిగ్ధావస్థలో పెట్టి, ఇరకాటంలో పెట్టి వాళ్ళ మొహాలు చూసి మనసులో ఆనందించే వాడిని.
పాపం మామయ్య నేను ఉద్యోగంలో ప్రవేశించిందగ్గిరనించి వారానికో ఉత్తరం రాసేవాడు. శలవలకి వెళ్ళినప్పుడల్లా ముహూర్తం ఎప్పుడు పెట్టించమంటావు!' అంటూ వేధించేవాడు. రెండేళ్ళు ఏది తిన్నగా చెప్పకుండా, డొంకతిరుగుడు సమాధానాలు చెప్పి తప్పించుకునే వాడిని. ఓ రెండేళ్ళు మూడేళ్ళు కాలయాపన చేయాలన్నది నా ధ్యేయం.... దానికి కారణాలు వాళ్ళకి చెప్పకుండా ఏవేవో చెప్పి వాళ్ళని ఏడిపించేవాడిని.
ఓసారి మామయ్య గట్టిగానే నిలేశాడు .... 'ఏరా, ఎన్నాళ్ళు యిలా అడిగించుకుంటావు....ఏదో ఒకటి చెప్పు... నీవు చేసుకుంటావా దానికి వేరే సంబంధం చూసుకోమంటావా!' అప్పటికి ఓ పదిసార్లయినా యీ విషయం ఎత్తిన మామయ్య ఆ రోజు కాస్త గట్టిగానే అడిగాడు.
'ఓ . చూసుకో.... చూసుకో.... నేను కాక మరింకెవరు నీ కూతుర్ని పెళ్ళాడుతారో నేనూ చూస్తాను.... పోనీ ఏదో మామయ్యవు.... బ్రతిమిలాడుతున్నావు గదా అని ఆలోచిస్తున్నాను....' పోజుపెట్టి అన్నాను. జానకి తలెత్తి తీక్షణంగా చూసింది. ఉడుక్కుంటూందని నవ్వుకున్నాను మనసులో.
'పోనీలేరా, దానికి తగ్గవాడు దానికి వస్తాడులే...' నవ్వుతూ అన్నా మామయ్య మాటల్లో నిష్ఠూరం వినిపించింది.
'ఆ చూడు, తగ్గవాడిని! నన్నెందుకు యిలా బాధపెడతావు.... వచ్చినప్పుడల్లా పెళ్ళి, పెళ్ళి అన్నమాట తప్ప ఇంకోటి మాట్లాడరు.... అలా అయితే రానే రాను.... చూడు బాబూ సంబంధం చూడు.... అలా అయినా కొన్నాళ్ళు నా జోలికి రావు.... అప్పటికయినా నీ కూతురికి నేను తప్ప మరోడు దొరకడని తెలుసుకుంటావు....' పెళ్ళికొడుకు దర్పంతో టెక్కుగా అన్నాను.
'ఒరేయ్... నిజంగానే అంటున్నావా?....' మామయ్య గాభరా....
'వూరుకోండి, అతనేదో తమాషాగా అంటూంటే....' అత్తయ్య నమ్మకం.
జానకి చివుక్కున లేచి లోపలికి వెళ్ళిపోయింది. జానకి మొహం చూస్తూ బాగా ఏడిపించానని సంతోషించాను.
'కట్నం కావాలేమో అల్లుడికి....' అత్తయ్య ఎలాగైనా నా మనసులో ఉద్దేశం లాగాలని ప్రయత్నిస్తుంది.
'ఏం వద్దేమిటి? మేనల్లుడు గనక ఎగవేద్దా మనుకుంటున్నారులా వుంది. కుదరదు. పదివేలు కూడపెట్టాల్సిందే...' అలా ఏ సంగతి తేల్చి చెప్పకుండా మాట తేల్చేసి నవ్వులాటలోకి దింపేవాడిని. మామయ్య ఇంకేమనాలో తెలీక విసుక్కుంటూ లేచి వెళ్ళిపోయాడు.
మర్నాడు ఉదయం నా గదిలోకి వచ్చింది జానకి. మామయ్య ఆఫీసుకి, అత్తయ్య వంటింట్లోనూ, పిల్లలు స్కూలుకి వెళ్ళారు. వస్తూనే తిన్నగా నా ఎదుట నిల్చుంది. రోజులా బాతాఖానీకి రాలేదని తెలుస్తూంది ఆ మొఖం చూస్తూంటే.
'బావా!' అంది అదోలా సీరియస్ గా, "ఓయ్!" అన్నాను రోజులాంటి హాస్యధోరణిలో.
"నిన్ను ఓ సంగతి అడగాలని వచ్చాను" "ఓ అడుగు, ఒకటేం ఖర్మ ఓ వందో లక్షో అడుగు!" నవ్వుతూ పుస్తకం ప్రక్కన పెట్టి తలగడామీద చెయ్యి ఆన్చి శేషశాయిలా విలాసంగా పడుకున్నాను.
"హాస్యం కాదు.... సరి అయిన జవాబు చెప్పాలి"
"బాగుంది అడగకుండానే ఏం జవాబు చెప్పమంటావు? ఇంతకీ దేవిగారివాళ ఈ అపరకాళికా అవతారం ఎందుకు ఎత్తినట్లు... తమరు ముందుగా కుర్చీలో ఆసీనులయి చెప్పరాదా....అలా నిలబడితే నాకాళ్ళు నొప్పెడుతున్నాయి...."
జానకి కళ్ళు నవ్వబోయి మానేశాయి.... "బావా!" అంది మాటలకి తడుముకుంటూ.
"బావ" సహస్ర నామార్చన పూజచేస్తున్నావేమిటి!" హాస్యం ఆడాను, "అదికాదు....నీకు....నేనంటే...."
జానకి ఏం అడగడానికి వచ్చిందో అర్ధం అయింది నాకు. అలా జానకిని చూస్తుంటే ....చిన్నప్పటిలా.... పలకపుల్లలుదాచి, పుస్తకాలు చింపేసి, చేసిన లెక్కలనిండా ఇంకు పులిమి మేష్టరు చేత చివార్లు తినిపించి .... ఆటల్లో చేరుకోకుండా ఏడిపించి .... జడపట్టుకుగుంజి.... రకరకాల ఏడిపించడాలు చేసి జానకి మొహం చూస్తూ ఘనకార్యం చేసినట్టు ఫీలయ్యే ఆ చిన్ననాటి ప్రవృత్తి నాలో తొంగిచూసింది ఆక్షణాన....
'నీకంటే....' రెట్టించాను.
'ఇష్టముందా లేదా.... ఒక్క మాటలో చెప్పాలి జవాబు!' సూటిగా చూస్తూ అడిగింది.
"బాగుంది.... ఇష్టమంటే ఇష్టంలో ఎన్నిరకాలు!....నీకు చేగోడీలు ఇష్టమా కాదా అన్నంత సుళువుగా...."
నా జవాబు పూర్తి అయ్యే లోపలే అత్తయ్య క్రిందినించి కొంప మునిగినట్టు కేకలు పెట్టసాగింది. పాపం అత్తయ్యకి జానకి, నేను వంటరిగా రెండు నిమిషాలుంటే అనుమానం! నా జవాబుకి ఆరాటంగా కొన్ని క్షణాలు ఎదురుచూస్తూ నిల్చిన జానకి అంతకంతకి అత్తయ్య పిలుపులు ఎక్కువవడంతో వెళ్ళిపోక తప్పలేదు. తరువాత మళ్ళీ మధ్యాహ్నం నాచేత జవాబు చెప్పించడానికి ప్రయత్నించింది. నేనెక్కడ అంత సుళువుగా దొరుకుతాను! అంత సులభంగా బైట పడతానా!
ఆ శలవల తర్వాత.... నెలా పదిహేను రోజులకే పెళ్ళి శుభలేఖ....హు....జానకెంత తొందరపడింది! నా జాప్యాన్ని మరోలా అర్ధం చేసుకుంది!
ఉద్యోగంలో ప్రవేశించి కాస్త కాలు చెయ్యి కూడదీసుకోకుండానే పెళ్ళేంటి! జానకి ఎక్కడికి పారిపోతుంది! కాస్త ఇంటికి కావల్సినవి, నా హోదాకి సరిపడినట్టు నాలుగు అమర్చుకోకుండా పెళ్ళాడేస్తే.... తర్వాత ఇంక నాలుగు అమరడం ఉత్తమాట! క్రొత్తపెళ్ళాంతో షికార్లు తిరగడానికి కారు లేకపోయినా కనీసం స్కూటరయినా వద్దా! ఇవన్ని అమరడానికి కనీసం రెండేళ్లు కావాలి! మామయ్య మేనల్లుడేగదా అని ఇంటర్ చదువుతో చాలించి కూతుర్ని అంటగట్టేద్దామన్న ఎత్తులో ఉన్నాడు! నా పెళ్లానికి డిగ్రీ వుండకపోతే ఎలా? అందుకే బి.ఏ.లో చేర్పించమన్నాను... రెండేళ్లు మూడేళ్ళు ఆగితే నా కోరికలన్నీ తీరుతాయి.... అంతేకాక నాకొచ్చే ఆరువందలఏభై బొంబాయిలాంటి మహాపట్నంలో ఏమూల? మాకంపెనీ బ్రాంచి హైదరాబాదులో పెడ్తారని, ఏరియా మేనేజరుగా నన్ను వేస్తారని వార్తలు.... నేననుకున్నవి అన్నీ జరగాలంటే పెళ్ళి తప్పకుండా రెండు మూడేళ్ళు వాయిదా వెయ్యాలి!....
అప్పట్లో నా ఊహలని ఉన్నదున్నట్టు చెప్పకుండా పెళ్ళికొడుకు ఠీవి చూపిస్తూ వాళ్ళందరిని సందిగ్ధంలో పడేసి వినోదించడం.... కాలయాపనకి మాత్రమే! నా ఆలోచనలని ఎవరికీ చెప్పక పోవటం నాతప్పేనేమో!.
ఇప్పుడింక ఎవరికి చెప్పాలి! సంజాయిషీ ఎవరడిగారు?
ఆ పెళ్ళినాటి జానకి కళ్ళల్లో గర్వానికి అర్థం ఈనాడు బోధపడింది దెబ్బ తీశానని, బదులు చెప్పానని.... ఆ చూపులకి అర్ధం!
ప్చ్! జానకి ఎంత పొరపడింది! ఎంత తొందరపడింది! లేదు.... లేదు.... నేను తొందరపడలేదు.... అదే అనర్థం అయింది.
ఇప్పుడింక ఏం లాభం?....
"టూలేట్" నిట్టూర్చాను.
(ఆంధ్ర సచిత్ర వారపత్రిక'70)
* సమాప్తం *