Previous Page Next Page 
నయనతార పేజి 41


    సూర్యం మొదటినుంచీ అతి వినయ విధేయతలుగల, అతి చురుకైన విద్యార్థిగా మంచిపేరు తెచ్చుకున్నాడు. తెలివితేటలకి తోడు. కష్టపడి చదువుతాడు. అందుకే అన్ని క్లాసుల్లోను అన్ని సబ్జెక్ట్సుల్లోనూ అతనే ఫస్టు. సూర్యం అంటే అవధానిగారికి ప్రత్యేకాభిమానం. ఆయన పాతికేళ్ళ సర్వీసులోనూ అంతటి ఉత్తమ విద్యార్థిని ఎన్నడూ చూడలేదని అంటుండేవారు. అతను చాలా పైకి వెళ్ళి తనకి మంచిపేరు తెస్తాడని, అతనికేం చెప్పినా వృధా బోదని ఇంటికి పీల్చుకుని శ్రద్ధగా పాఠాలు వేరే ప్రతుఎకంగా చెప్పేవారు. సూర్యం స్కూలు ఫైనల్ రాష్ట్రం మొత్తంమీద మొదటివాడిగా పాసయినపుడు ఆయన ఆనందం వర్ణనాతీతం. అతను కాలేజీ చదువుకి వెళ్తుంటే తనకి దూరమైపోతున్నాడని అలాంటి విద్యార్థి తనకింక దొరకడని ఏదో తెలియని ఆవేదన పడ్డారు. సూర్యం ఇంటర్ చదవడానికి వెళ్ళిన మరుసటి ఏడే మాష్టారు రిటైరై స్వంత వూరు విజయనగరం చేరుకున్నారు.
    తర్వాత మళ్ళా ఇన్నాళ్ళకి ఇద్దర్నీ ఇలా తన అంచనాలు తారుమారు అవగా చూసిన మేష్టారు ఆ రాత్రి సరిగా నిద్రపోలేకపోయాడు. సూర్యం యెందుకిలా అయ్యాడు? ఆయన కొడుకు, ఒక్కగానొక్క కొడుకు ఆయన్ని దగాచేసి వెళ్ళిపోయినప్పటిలాగ ఆయన మనసు ఆందోళన చెందింది.
    మూడురోజులు కామేశం దంపతుల బలవంతంమీద వుండిపోక తప్పలేదు మాష్టారికి. ఆయన అంత చిన్నచూపు చూసి, నిర్లక్ష్యం చేసిన కామేశం, ఆయనని ఎంతమాత్రం లెక్కచెయ్యకుండా అమర్యాద చేసిన కామేశం ఈరోజు ఇంతలా మారిపోయి, గతం మరచి ఆయనని మర్యాదలతో ముంచెత్తుతూంటే అవధానిగారికి బిడియంగా వుంది.
    వచ్చిన రెండురోజులకి, కామేశానికి ఆ ప్రసక్తి ఇష్టముండదని తెలిసీ "కామేశం-సూర్యం ఇల్లెక్కడో ఎవర్నైనా చూపించమందూ! ఎలాగో ఇక్కడికి వచ్చాను, వున్నాడని తెలిసీ చూడకుండా వెళ్ళలేను. అతని ఇల్లు తెలిసిన బంట్రోతుని ఎవరినైనా పంపిస్తే వెళ్ళొస్తాను" అన్నారు మేష్టారు. సూర్యాన్ని చూడాలన్న కాంక్ష ఆయనలో మరీ ప్రబలింది.
    "మీరు వెళ్ళేదేమిటి మాష్టారు. కబురు పెడ్తే వాడే వస్తాడు!" నిర్లక్ష్యంగా అన్నాడు కామేశం.
    కబురు వెళ్ళిన అరగంటకి రెక్కలు గట్టుకు నిలబడ్డ సూర్యాన్ని చూస్తూనే మాష్టారు ఆనందంతో ఎదురెళ్ళి "సూర్యం గుర్తున్నానా? ఎన్నాళ్ళకి చూశాను!!" అంటూ ఆప్యాయంగా కౌగలించుకున్నంత పని చేశారు.
    "మేష్టారు, మీరా! ఇక్కడికెలా వచ్చారు?" ఆశ్చర్యపోయాడు సూర్యం.
    "మన కామేశం రైల్లో కనిపించి బలవంతంపెట్టి తీసుకువచ్చాడు. ఏదో యీ విధంగా నిన్ను చూడ్డం జరిగింది. ఎంత మారిపోయావు? ఇదివరకటి పోలికలే లేవు! ఏమిటి ఈ ఉద్యోగంలో చేరావు? పైకి చదవలేదా?" ప్రశ్నలు కురిపిస్తూ ఆప్యాయంగా అతని చేయి వదలకుండా పట్టుకున్నారు.
    ఏదో చెప్పబోతున్న సూర్యం, కామేశం రాకతో బెదిరిపోతూ నిల్చున్నాడు.
    "చూశారా మాష్టారూ, మీ ముద్దుల శిష్యుణ్ణి !"
    "చూశాన్నాయనా నీ ధర్మమా అని! ఇన్నాళ్ళకి కల్సుకున్నాం. సూర్యం చాలా మారిపోయాడుగదోయ్! గుర్తుపట్టలేనంత మారిపోయాడు! ముఫ్పై ఏళ్ళనాడు ఏభయ్యేళ్ళవాడిలాగ కనబడుతున్నాడు గదూ!"
    కామేశం మొఖం చిట్లించి సూర్యాన్ని ఉద్దేశిస్తూ "ఆ... నిన్నటి డ్రాఫ్ట్ పూర్తయిందా? ఇవాళ తప్పకుండా వెళ్ళాలి."
    సూర్యం మొఖం పాలిపోయింది.
    "లేదుసార్, ఇంకా డేటా పూర్తిగా నాకందలేదు" నసుగుతూ భయం భయంగా అన్నాడు.
    "అందలేదు! ఎందుకందుతుంది! చేతులు కాళ్ళు ముడుచుకు కూర్చుంటే అన్నీ వాటంతట అవి మీ వళ్ళోకి వస్తాయా? నిన్ననగా చెప్పాను. నాయెదట తలాడించి అవతల నిద్రపోతే సరి! ఇదేం ఆఫీసు పనా మరోటీనా, మీ ఇష్టం వచ్చినట్టు ఆడుతూ పాడుతూ చేయడానికి!" కఠినంగా అన్నాడు కామేశం.
    "ఇంకో గంటలో పూర్తిచేస్తానండి! రాత్రి పదిగంటలదాకా అక్కడే వున్నాను, యీ ఉదయం ఎనిమిది గంటలకే అక్కడికి వెళ్ళి ఆరంభించాను... అయినా చాలా వుందండి. అవలేదు." వినయంగా సన్నగా చెప్పబోయాడు సూర్యం.
    "మీరెన్ని గంటలు పనిచేశారో, ఎప్పుడు పడుకున్నారో అదంతా నాకనవసరం, నాక్కావలసింది పని. ఇంకో గంటలో ఆ కాగితాలు నా టేబుల్ మీద వుండాలి" ఆజ్ఞాపించాడు కామేశం.
    అతనిమాటలింకా పూర్తికాకమునుపే కామేశానికి నమస్కారం పెట్టి మాష్టారి వైపు బింకంగా చూచి తలవంచుకు గబగబ వెళ్ళిపోయాడు సూర్యం.
    "స్నానం ఫలహారం అయిందా మేష్టారూ" మర్యాదగా నవ్వుతూ అడిగాడు కామేశం.
    కళ్లెదుట జరుగుతున్నదంతా ఏదో కలలోనన్నట్లు ఖిన్నుడై చూస్తున్న అవధానిగారు ఎలాగో తేరుకొని ముక్తసరిగా తల ఊపారు. మాష్టారి మొహం చూసి కామేశం కళ్ళలో ఒక చిన్న నవ్వు తొంగిచూసింది.
    "ఏమిటి మాష్టారు అలా చూస్తున్నారు. ఒకనాడంత తెలివైనవాడు, కష్టపడి చదివే సూర్యం యీ రోజలా పనిచెయ్యడంలేదని చివాట్లు తింటున్నాడని ఆశ్చర్యపోతున్నారా? వాడిప్పుడు ఉత్త పనిదొంగ. ఏదో చిన్నప్పుడు నూటికి నూరు మార్కులు కొట్టానన్న గొప్ప తప్పిస్తే, ఇప్పుడసలు కాగితం ముట్టడు. నాలుగు లైన్లు రాస్తే నూరు తప్పులు. ఏదన్నా అంటే తొంభై వంకలు చెప్తాడు!"
    విషణ్ణుడై చూశారు మాష్టారు.

                                        *    *    *

 Previous Page Next Page