"ఈ అడవిలో యీ బిల్డింగ్ ఎవరు కట్టారు?" అడిగాడు ఆదిత్య.
"నేను పుట్టేటప్పటికే యీ బిల్డింగ్ వుంది. చాలా కాలం యీ బిల్డింగ్ ఖాళీగా వుంది. రెండేళ్ళక్రితం ఓ రాత్రి ధరణిబాబు సుమమ్మతో వచ్చారు" చెప్పింది రంగి.
"ఈ బిల్డింగ్ ధరణిబాబుదా?"
"నాకు తెలీదు... ఊరి పెద్దకు తెల్సు."
తలుపు తెరచుకుని లోనికెళ్ళింది రంగి.
వరండాలో నిలబడి గోడమీద వున్న వడ్డాది పాపయ్య పెయింటింగ్స్ ని చూస్తున్నాడు ఆదిత్య.
అయిదు నిమిషాల తర్వాత లోపల్నుంచి వచ్చింది రంగి.
"రండి బాబూ! అమ్మగారు రమ్మంటున్నారు" అంది రంగి.
లోనికి నడిచాడు ఆదిత్య.
పెద్ద విశాలమైన హాలు... ఆ హాల్లో అతి ఖరీదయిన సోఫాలు... కార్పెట్సు...
ఎడంపక్క నుంచి మేడ మీదకు దారి.
సోఫాలో కూర్చుని అద్భుతంగా వున్న ఇంటిరియర్ డెకరేషన్ వేపు చూస్తున్నాడు ఆదిత్య.
మూడు నిమిషాలు గడిచాయి....
కార్పెట్ మీద మెత్తని అడుగుల చప్పుడు... చేతి గాజుల సవ్వడి.
కిచెన్ రూమ్ కు ఆనుకుని వున్న డైనింగ్. హాల్లోంచి వస్తున్న ఆకారం వేపు చూసి అప్రతిభుడయ్యాడు ఆదిత్య.
లేత గోధుమరంగు చీర, జాకెట్టులో సంపెంగ పువ్వులా వుంది సుమబాల.
ఆమెను చూడగానే గుర్తుపట్టాడు ఆదిత్య.
నిన్న తనతోపాటు పాసింజర్ రైలులో వెంకటాపురం వరకూ ప్రయాణం చేసిన యువతి.
మీరా... ఆశ్చర్యపోయినట్టుగా చూస్తోంది సుమబాల.
"నా పేరు ఆదిత్య కుమార్. మిమ్మల్ని కలవడానికే బయల్దేరాను. నిన్న మిమ్మల్ని రైల్లో చూసినా మీరని తెలీకపోవడం వల్ల..."
"నన్ను కలవడానికా? ఎక్కణ్ణుంచొస్తున్నారు?" నెమ్మదిగా అడిగింది సుమబాల. ఆమె మాట్లాడుతున్నప్పుడు సన్నటి ముత్యాల ముక్కు పుడక తళుక్కున మెరిసింది.
"హైద్రాబాద్ నుంచి...."
"ధరణిగారి కోసమా? ఆయన బిజినెస్ పనిమీద బొంబాయి వెళ్ళారు."
అంటే... బొంబాయి వెళ్తున్నానని చెప్పి ధరణికుమార్ ఇంట్లోంచి బయటికి వెళ్ళాడన్నమాట.
బుల్లెట్ల గాయాలతో... రక్తపు ముద్దలా... అనాధలా... కళ్ళలో ఇంకిపోయిన కన్నీళ్ళతో... తన చేతిలో చనిపోయిన ధరణి...
ఆ దృశ్యం జ్ఞాపకం వచ్చింది ఆదిత్యకి. అతని కళ్ళు చెమ్మగిల్లాయి. తనని తాను కంట్రోల్ చేసుకోడానికి ఒక్క నిమిషం పట్టింది.
"ధరణిగారి కోసం... అంటే... మిమ్మల్ని కలవడానికే వచ్చాను" లోగొంతు లోంచి నెమ్మదిగా వచ్చిందా మాట.
"అసలు నేనిక్కడున్నానని మీకెవరు చెప్పారు? ఏ పనిమీద వచ్చారు?"
ఆ రెండు ప్రశ్నలకూ ఆదిత్య దగ్గర జవాబు లేదు.
సుమబాల ఆదిత్యనే చూస్తోంది.
ఆదిత్య తలదించుకుని కూర్చున్నాడు.
సుమబాలను చూస్తుంటే ధరణికుమార్ మరణవార్త ఇంకా తెలిసినట్టుగా లేదు. ఒక రకంగా తెలిసే అవకాశం కూడా లేదు.
తన శతృవుల్నించి తప్పించుకోడానికే యీ మారుమూల రహస్య ప్రదేశాన్ని ధరణికుమార్ ఎంచుకున్నాడా?
ధరణికుమార్ చనిపోయాడని తను చెప్తే... యీ పరిస్థితుల్లో ఆ నిజాన్ని భరించే శక్తి వుందా సుమబాలకు?
"ధరణికుమార్ ఎప్పుడు రావచ్చు?"
"ప్రశ్నకు ప్రశ్న సమాధానం అవుతుందా?" సీరియస్ గా అంది సుమబాల.
"అంటే?" అయోమయంగా అడిగాడు ఆదిత్య.
"చూడండి... మీరెవరో నాకనవసరం. మా యిద్దరికోసం గుర్రం పెద్దబ్బాయి గారు... అంటే... ధరణికుమార్ తండ్రి, ఆయన మనుషులు వెతుకుతున్నారని మాకు తెలుసు. వాళ్ళందరకూ తెలియకుండా యిక్కడ గడుపుతున్నాం. మీరు గుర్రం పెద్దబ్బాయి మనిషి. అవునా?"
"కాదు" టక్కున చెప్పాడు ఆదిత్య.
"ధరణికుమార్ యిక్కడుండగా మీరొచ్చారనుకోండి... మీరు మళ్ళీ బయటకు వెళ్ళేవారు కాదు. ధరణికి అంత కోపం- ఆయన తండ్రన్నా, ఆయన మనుషులన్నా. దయచేసి వెళ్ళిపోండి. మేం ఎక్కడున్నామో కనుక్కోడానికి గుర్రం పెద్దబ్బాయి మీకు ఎంత డబ్బిచ్చారో చెప్పండి - దానికి రెట్టింపు నేనిస్తాను. ప్లీజ్ లీవజ్ ఎలోన్" గంభీరంగా చెప్పి, చటుక్కున సోఫాలోంచి లేచింది సుమబాల.
అదే సమయంలో....
వెనక నుంచి వచ్చింది నాలుగేళ్ళ ప్రెటీ.
ఆదిత్యను చూసిన ప్రెటీ టీపాయ్ దగ్గరే ఆగిపోయి, తదేకంగా ఆదిత్య వేపే చూస్తోంది.
ముందు అక్కడ కూర్చున్నది డాడీ అనుకుంది. డాడీ అని గొంతులోంచి వచ్చిన పదం గొంతులోనే ఆగిపోయింది.
తెల్లబోయి వెనకడుగు వేసింది ప్రెటీ, అపరిచిత వ్యక్తిని చూసి.
నిన్న రైల్లోని వ్యక్తి ఇంటికెందుకొచ్చాడా అన్నట్లు చూస్తోంది.
ఆ ముద్దు ముఖంలో ధరణి ముఖం కన్పిస్తోంది.
రెండు క్షణాల తర్వాత...
గబగబా మెట్లుదిగి, చేతిలోని నోట్లకట్టను టీపాయ్ మీద పెట్టి-
"ఇది తీసుకుని వెళ్ళిపోండి. దయచేసి మీరు చూసింది మరెక్కడా చెప్పకండి. మమ్మల్ని ప్రశాంతంగా బ్రతకనివ్వండి."
సుమబాల గొంతులో కాఠిన్యం - ఆ గొంతు వెనక భయం!
ఏమీ చెప్పలేని, చెప్పుకోలేని నిస్సహాయత ఆదిత్యలో.
"మీరంతా భయపడాల్సిన అవసరం లేదు. మీరు నమ్మినా నమ్మకపోయినా నేను మీ మిత్రుణ్ణి. అది మాత్రం మీరు గుర్తుంచుకుంటే చాలు."
లేచి బయటికొచ్చాడు ఆదిత్య. విసురుగా నడుచుకుంటూ గేటువరకూ వచ్చి చూశాడు. రంగికోసం నిరీక్షించాడు. రాలేదు. చుట్టూ వున్న పరిసరాల్ని ఒకసారి పరికించాడు. బంగ్లాకి రెండొందల అడుగుల దూరంలో చిన్న జలపాతం... అక్కడ నుంచి సన్నటి వాగు... కొండలమీంచి జాలువారే వర్షపు నీరు జలపాతంగా మారి- వాగులా ప్రవహిస్తోంది. ఆ అద్భుతమైన దృశ్యాన్ని ఒకింతసేపు అలా చూస్తుండిపోయాడు.
కొద్ది క్షణాలకు తేరుకొని వూళ్ళోకొచ్చాడు - టీ బడ్డీ వేపు నడిచాడు.
టీ బడ్డీలోనే గ్రామ పెద్ద టీ తాగుతూ, కబుర్లు చెప్తున్నాడు.
"మా ఇంట్లో భోంచేసి వెళ్ళు బాబూ" పలకరిస్తూ అన్నాడు గ్రామపెద్ద ఆదయ్య తాత.