వాళ్ళలో శృంగారం రహస్యమైన విషయం కాదని గ్రహించాడు సందీప్.
"వీళ్ళందరూ చూస్తుండగా నేను నీకు మంచి ప్రియుడిలా ప్రవర్తించలేను!" అన్నాడు ఇబ్బందిగా.
అర్థమయిందన్నట్లు తల ఊపి నవ్వింది నెఫెర్. అతని సిగ్గుకి ఆ మిగతా ఇద్దరు యువతులు కూడా నవ్వు మొహాలు పెట్టారు.
తను నిలబడి, "లే!" అని అతనికి చెయ్యి అందించింది నెఫెర్. చెయ్యి మృదువుగా కనబడుతున్నా, బలంగా ఉంది ఆమెపట్టు. ఆమె చెయ్యి ఆధారంగా చేసుకుని లేచి నిలబడ్డాడు సందీప్. సరిగ్గా అతనంత పొడుగు ఉంది తను.
"రా!" అని, అతని చెయ్యి పట్టుకుని దారి తీసింది నెఫెర్.
చాలాదూరం నడిచారు ఇద్దరూ. ప్రతి వందగజాలకూ ఆగి, "ఇక్కడ బాగుందా?" అన్నట్లు చూస్తోంది నెఫెర్. సందీప్ చుట్టూతా పరీక్షగా చూసి, 'అక్కడెవరో ఉన్నారు' అన్నట్లు సైగ చేస్తున్నాడు. నవ్వుతూ అతని భుజంమీద ఒక్క దెబ్బ వేసి, మరికొంచెం ముందుకి తీసుకెళుతోంది.
దాదాపు రెండు కిలోమీటర్లు నడిచారు. అక్కడ బొత్తిగా జనసంచారం లేదు. మోకాళ్ళ ఎత్తున గడ్డి పెరిగి వుంది.
"ఇక్కడ బాగుంది!" అంది నెఫెర్ ఆగి, అతన్ని హత్తుకుపోతూ.
ఇంక ఆలస్యం చెయ్యలేదు సందీప్. ఆమె చుట్టూ చేతులేసి దగ్గరగా లాక్కుని, ఆమె మెడదగ్గర ఉన్న ఒక నరాన్ని ఒడుపుగా వేళ్ళతో నొక్కాడు.
శాయశక్తులా పెనుగులాడుతూ వదిలించుకోవడానికి ప్రయత్నించింది నెఫ్రెతీతీ. కొద్ది క్షణాల తర్వాత ఆమె ప్రయత్నాలు బలహీనమైపోయాయి. చేతులు జార్చేసి, కుప్పలా అతని పాదాలదగ్గర కూలిపోయింది.
ఆమె అలా అచేతనంగా కనీసం రెండు గంటలసేపు ఉంటుందని తెలుసు సందీప్ కి. ఈ లోపలే స్వప్నా, భూతాలరాజూ - ఎక్కడున్నారో కనుక్కోవాలి తను.
ఎటు వెళ్ళాలి? ఎక్కడ వెదకాలి?
దూరంనుంచీ ఎవరో నూతిలోనుంచీ ఏదో తోడుతున్నట్లు గిలకశద్దం వినబడుతోంది. అటుగా నడిచాడు సందీప్.
అక్కడ, పచ్చదనం హఠాత్తుగా అంతమైపోయింది. దిగులుగా, బూడిదరంగులో ఉన్న రాతిభూమి మొదలయింది. అక్కడ ఉంది పాడుబడినట్లు కనబడుతున్న ఒక బావి.
ఆ బావిలోకి గిలకమీదనుంచీ పెద్ద బుట్టను దింపుతోంది ఒక యువతి మూర్తీభవించిన శోకదేవతలా ఉంది తను.
లెపర్స్ వాలీ
తన వెనకాతల ఎవరో నిలబడినట్లు గ్రహంచగానే గాభరాగా వెనుక్కి తిరిగింది ఆమె. తన మొహంలో భయాందోళనలు కనబడుతున్నాయి.
"ఎవరు నువ్వు? ఏం చేస్తున్నావిక్కడ ?" అన్నాడు సందీప్, సందేహంగా ఆ బావిలోకి తొంగిచూస్తూ. అది నిజానికి బావికాదు. ఒక లోయలోకి ప్రవేశద్వారం.
ఆ లోయలో కిందగా కొంతమంది మనుషులు కనబడుతున్నారు. కొంతమంది తమ మొహాలు కనబడకుండా ముసుగులు వేసుకుని ఉన్నారు.
ఆ యువతి దింపిన ఆహారపు బుట్టను అందుకున్న ఒక నడివయసు స్త్రీ తలెత్తి సందీప్ ని చూసి, కంగారుగా ముసుగు సరిచేసుకొని, పరుగులాంటి నడకతో వెళ్ళిపోయింది. ఆమె పడక సక్రమంగా లేదు. కాళ్ళు స్వాధీనంలో లేనట్లు ఎత్తెత్తి వేస్తోంది అడుగులు.
"ఏమిటిదంతా ?" అన్నాడు సందీప్.
మాట్లాడడానికి నోరుతెరిస్తే ఏడ్చేసేలా ఉంది ఆ అమ్మాయి. "నా పేరు వెనిలా" అంది, పూడుకుపోతున్న గొంతుతో.
వెనిలా అంటే వెన్నెలకు అపభ్రంశమై ఉండవచ్చుననిపించింది సందీప్ కి. అతనికి క్రమక్రమంగా ఆ భాషతో పరిచయం బాగా పెరిగిపోతోంది.