Previous Page Next Page 
సీతాచరితం పేజి 41


    సుమంత్రుడు గుర్రాలను తోలాడు.


    రథం కదిలింది. సాగింది.


    అది చూశారు జనం. అయోధ్యవాసులంతా మూర్ఛిల్లారు. ఏనుగులు ఘీంకరించాయి. వీధుల్లో పరుగెత్తాయి. గుర్రాలు సకిలించాయి. గంతులు వేశాయి. దప్పిగొన్నవారు నీటివెంట పరిగెత్తారు. అలాగే ఆబాలవృద్ధులు రామునివెంట పరిగెత్తారు. కొందరు రథపు వెనుకభాగం పట్టుకున్నారు. కొందరు పక్కలు పట్టుకున్నారు.


    "సుమంత్రా! పగ్గాలు బిగపట్టు గుర్రాలను మెల్లగా నడిపించు. రాముని ముఖం మళ్లీ మాకు కనిపించదు. ఇప్పుడే చూచుకుంటాం" అని కేకలు పెట్టారు.


    "రాముణ్ణి చూస్తా" అని దశరథుడు బయలుదేరాడు. రాజులంతా ఏడుస్తూ అతనివెంట పరిగెత్తారు. వారి రోదన ధ్వనులు వారికంటే ముందే పరిగెత్తాయి.


    ప్రజలు విడిచిన కన్నీటితో నగరంలో లేచిన ధూళి అణిగిపోయింది. నగరం సాంతం దుఃఖంలో నిండిఉంది. అది చూశాడు దశరథుడు మొదలు నరికిన చెట్టులా కూలిపోయాడు. రాజును చూచిన ప్రజలు హాహాకారాలు చేశారు.


    అంతఃపుర స్త్రీలు "రామా! రామా!" అని ఏడ్చారు. ఏడుపులు విన్నారు. రాముడు వెనుదిరిగి చూచాడు. ఏడుస్తూ వస్తున్న తల్లిదండ్రులు కనిపించారు. రాముడు భరించలేకపోయాడు. రథం త్వరగా పోనివ్వాల్సిందని సూతునికి ఆజ్ఞాపించాడు.


    రథం వడిగా సాగిపోయింది.


    తిరిగి రావాలని కోరుకునేవారిని దూరంగా సాగనంపరాదని మంత్రులు విన్నవించారు. దశరథుడు వెనక్కు మళ్లాడు. అతని శరీరం చెమటతో నిండిపోయింది. ముఖం వాడిపోయింది.


    దశరథుడు వెనక్కు మళ్లాడు. అంతేకాని రాముని చూస్తూ నిలిచిపోయాడు.


    రాముని వెంట వెళ్లేవారిలో పెద్దలు, బ్రాహ్మణులు ముందుకురికారు. రథాన్ని ఆపమని కేకలు వేశారు. ఆ ధ్వనులు ఆకాశాన్నంటాయి. రాముడు రథంలో వుండడానికిష్టపడలేదు. అతడు రథం దిగాడు. కాలినడకన బయలుదేరాడు. అలా వారు కొంతదూరం నడిచారు. అక్కడ తమసానది కనిపించింది. అది రాముని వారిస్తున్నట్లు ప్రవహిస్తున్నది.


    సూర్యుడు పడమటి గూటిలో చేరాడు. రాత్రి ప్రవేశించింది. చీకటిపడింది. అది రాముని వనవాసపు తొలిరేయి. రాముడు మంచినీళ్లు మాత్రం తాగాడు. చెట్లక్రింద ఆకులతో లక్ష్మణుడు మెత్తటి శయ్య తయారుచేశాడు. సీతారాములు శయనించారు. పురజనులు చెట్లక్రింద పడుకొని నిద్రపోయినారు. లక్ష్మణుడు, సుమంతుడు నిద్రపోలేదు. వారిద్దరు రాముని గుణగణాలను గురించి మాట్లాడుకున్నారు.


    తెల్లవారుజామయింది రాముడు లేచాడు. అతడు సుమంత్రునితో "ఈ జనులంతా ఇళ్లు, వాకిళ్లు వదిలిపెట్టి వచ్చేశారు. వీరి తీరు చూస్తుంటే నన్ను తిరిగి అయోధ్యకు రమ్మని బలవంతం చేసేట్టు కనిపిస్తూంది. కాబట్టి వాళ్లు మేల్కొనకముందే మనం వెళ్లిపోదాం. రథం సిద్ధంచెయ్యి అన్నాడు.


    సుమంద్రుడు సిద్ధం చేసాడు. సీతారామ - లక్ష్మణులు రథం ఎక్కారు. రథం సాగింది. రథాన్ని కొంత ఉత్తరంగా పోనిమ్మన్నాడు రాముడు. అలాచేస్తే తాము అయోద్యకు వెళ్లామనుకుంటారు ప్రజలు. తర్వాత తమదారిన పోదామన్నాడు. సుమంత్రుడు రధాన్ని కొంత ఉత్తరంగా పోనిచ్చి తర్వాత అడవులకు తోలాడు.


    తెల్లవారింది. పురజనులు లేచారు. రాముడు కనిపించలేదు. నలువైపుల పరుగెత్తి చూచారు. రాముని జాడలేదు. రధపు జాడలేదు. ఒళ్లుమరిచి నిద్రపోయినందుకు తమను తామే తిట్టుకున్నారు. వారు తిరిగి అయోధ్యలో ప్రవేశించారు.


    అయోధ్య నీరు ఇంకిపోయిన సముద్రంలావుంది. అయోధ్య ఏడుస్తున్నట్టుంది. అయోధ్యలో సాయంకాలం అయింది. సూర్యుడు కుంగాడు. అయోధ్య నిశ్శబ్దంగా వుంది. బోసిగా వుంది. అయోధ్య స్మశాన వాటికలా వుంది.


    ప్రతి పనికి క్రియా, ప్రతిక్రియా రెండు వుంటాయి. ఐతే ఈ రెండు సమానమైనప్పుడు రాణింపు. అక్కడే కథలు, గాధలు పుడ్తాయి. క్రియా, ప్రతిక్రియ ఈ రెంటిలో ఏది బలహీనమైనా కథలు పుట్టవు.అది సాధారణమే. చదరంగపు ఆటలో ఆడేవాళ్లు ఇద్దరు సమానమైనప్పుడు ఆట కీర్తి కడ్తుంది. ఆట సాగుతుంది. అలాకాక ఒకడు చాతకానివాడయితే ఆట రక్తి కట్టదు.


    జీవితం కూడా చదరంగం లాంటిదే. రెండు సమానమైన శక్తుల మధ్య పోరాటం కథలను, గాథలను సృష్టిస్తుంది. నిత్య జీవితంలో మనం అనేకసార్లు ఓడుతాం. అనేకమార్లు గెలుస్తాం. వాటికంత ప్రాధాన్యత లభించడం లేదు ఎంచేతంటే ఒకప్పుడు మనం ప్రతిఘటనకు లొంగుతున్నాం. మరొకసారి మన ప్రతిఘటనను మరొకరు లొంగుతున్నారు.


    సమాన శక్తుల జరిగిన పోరాటాలు చరిత్రలో నిలిచిపోతున్నాయి.


    ఇక్కడ రెండు సమానమైన శక్తులున్నాయి. ఒకటి కైక. రెండవ వాడు రాముడు. రాజ్యం సాధించాలనే పట్టుదల కైకలో ఉంది. ఆ పట్టుదల ముందు ఏది వచ్చిన లెక్క సేయదు. ఆమె ధ్యేయాన్ని చేరుకోవడానికి అక్కడ కూడిన అన్ని శక్తులతోనూ నిరంతరం పోరింది.


    అలాగే రాముడు, తండ్రిమాట చెల్లించాలనేది రాముని పట్టుదల. అతడు తన ధ్యేయం నుంచి రవ్వంత కదలలేదు. అతనికి అనేక ప్రవోభాలు కల్పించబడ్డాయి. దశరథుడు రాముణ్ని స్వయంగా తనమీద తిరగబడమన్నాడు. లక్ష్మణుడు రాజ్యం గెలిచిపెడ్తానన్నాడు. కౌసల్య మాతృభక్తిని బోధించింది. ఐనా అతడు వినలేదు. అడవులకు వెళ్లడానికే నిశ్చయించుకున్నాడు.


    ఇది రెండు విభిన్న మనస్తత్వాలతో జరిగిన పోరాటం. ఈ పోరాటానికి అనువుగా తన పాత్రలను నిర్దిష్టంగా మలిచాడు వాల్మీకి. రామునిలో ఎంత పట్టుదల వుందో కైకలోనూ అంత పట్టుదల కల్పించాడు.


    కైక ఆనాటికి అమలులో వున్న ధర్మాన్ని విడిచి పుచ్చింది. న్యాయం ఏదో అక్కడ గూడిన అంతమందికీ తెలుసు. అంతమంది న్యాయసూత్రాలు అనేకమార్లు వల్లించారు. కైకను తిట్టిబోశారు. ఐనా కైక తన పట్టుదల వదలలేదు. సత్యం అనే ఒకతాటితో అటు దశరథుణ్ణి, ఇటు రాముణ్ణి లొంగదీసింది. ఆమెకు అలాంటి పట్టుదల తన తల్లినుంచి సంక్రమించింది.


    రాముడుగాని, కైకగాని తమ పట్టుదలలను ఏమాత్రం సడలించినా రామాయణగాథ వుండేదికాదు.


    ఆనాటి సమాజంలో ఆదిమ సమాజపు లక్షణాలు రేఖామాత్రంగా కన్పిస్తాయి. రాముని వీడ్కోలు జరిపేప్పుడు జరిగిన పద్ధతి చూస్తే అది చెట్టుకింద పంచాయితీలా కన్పిస్తుంది. కాని రాజులకు వుండవల్సిన హుందాతనం కన్పించదు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా కొట్లాడటం, ఎత్తిపొడవడం, యివన్నీ తర్వాత కాలపు రాజభవనాల్లో కన్పించవు. నిగ్రహం మనుషుల్లో తక్కువగా కన్పిస్తుంది. మాటమాటకు ఏడ్వటం- యివన్నీ బాగా నాగరికమైన సమాజ లక్షణాలు కావు.


    జనం రథం వెంట పరుగెత్తారు. కేకలు పెడ్తారు. దశరథుడు వారివెంట పరుగెత్తుతాడు. అతనివెంట రాణులు కూడ వీధుల్లోపడి పరుగెత్తుతారు. రాముడు రథం దిగుతాడు. జనంతోపాటు నడుస్తాడు. వీటన్నిటినీ చూస్తే సాధారణ జనానికి, రాజులకు మధ్య పెద్దగా అంతరమున్నట్టు కన్పించదు.

 Previous Page Next Page