మరో గదిలోకి వెళ్ళారు లాలస, తిలక్.
లోపల చాలాభాగం రాళ్ళూ రప్పలతో నిండిపోయింది.
ఓ మూలగా దుప్పటితో కింద బాగా తుడిచింది లాలస. సంచిలోంచి ఓ పంచెను తీసి కింద పరిచింది. సంచిని తలగడలా పెట్టింది.
ఇద్దరూ పడుకున్నారు.
బాగా అలసిపోవడంవల్ల క్షణాల్లో నిద్రపోయారు.
ఉదయం ఐదుగంటల ప్రాంతాన మెలకువ వచ్చింది.
నలుగురూ పక్కనున్న ఏటికి వెళ్ళి స్నానాలు ముగించి, బట్టలు మార్చుకున్నారు.
"బాసూ! కడుపులో ఆకలి దంచేస్తోంది" అన్నాడు ఉత్తరుడు.
"ఆకలి కడుపులో కాక మెదడులో దంచేస్తుందా?" బుద్ధుడు బిగ్గరగా నవ్వుతూ అన్నాడు.
"ఆకలిలో ఏం మాట్లాడుతున్నానో కూడా తెలియడం లేదు" ఉత్తరుడు తనను తాను డిఫెండ్ చేసుకోవడానికి ప్రయత్నించాడు.
తిరిగి బంగళాకు వచ్చి సంచిని అక్కడపెట్టి వూర్లోకి బయల్దేరారు.
మొదట్లోనే ఓ హోటల్ కనిపించింది. హోటలంటే హోటలు కాదు. చిన్న మెస్ లాంటిది. పెద్ద అడ్డాపిల్లుమధ్య కుర్చీలూ, బల్లలూ వేసి వున్నాయి. క్యాష్ కౌంటర్ లో కూర్చున్న వ్యక్తి అప్పటికే విభూదిపట్టీలు పెట్టి శాపవశాత్తూ సాక్షాత్తూ ఆ ఈశ్వరుడే అలా అవతారం ఎత్తినట్టున్నాడు.
లోపల ఎవరూ కస్టమర్సు లేరు.
నలుగురూ వెళ్ళి కూర్చున్నారు.
గోడలమీద సినిమా నటీమణుల బొమ్మలు తప్ప ఏ దేవుడి బొమ్మ లేదు ఓ పక్కగా ముసలామె దోసెలు పోస్తోంది.
వాళ్ళు కూర్చోగానే కౌంటర్ లో కూర్చున్న వ్యక్తి దగ్గరకు వచ్చి "ఏం కావాలి బాబూ?" అని అడిగాడు.
"సర్వర్ ఎవరూ లేరా?" బుద్ధుడు అడిగాడు.
"అన్నీ నేనే బాబూ - ఈ హోటల్ కి ఓనరూ, క్లీనరూ, సర్వరూ నేనే. ఆల్ ఇన్ ఒన్ అన్నమాట -" అని ఆయన పళ్ళికిలించాడు.
"టిఫిన్ ఏం వుంది?"
"ఇడ్లి దోసె బాబూ"
"అయితే మొదట అందరికీ ఇడ్లీ" ఆర్డరిచ్చింది లాలస.
మరి కాసేపటికి అందరికీ ఇడ్లీలు తెచ్చిపెట్టాడు ఆయన.
చాలా ఆకలిమీద వుండడంతో ఆవురావురుమంటూ తింటున్నారు నలుగురూ.
వాళ్ళకు అడ్డు తగిలాడు ఆయన. "మీది ఏ వూరు బాబూ?"
"సొంతవూరు నెల్లూరు. రైల్వేలో పనిచేస్తుంటాం. అరకు నుంచి విశాఖ వరకు రైల్వేలైన్ చెక్ చేస్తుంటాం. మరో పదిహేను రోజులపాటు ఇక్కడే వుంటాం. మీ హోటల్ లోనే భోజనం. మీ హోటల్లో టిఫిన్ ఒక్కటేనా? భోజనం కూడా వుందా?" ఆయనకు డౌట్ రాకుండా చాలా జాగ్రత్తగా చెప్పాడు తిలక్.
"ముందు చెబితే భోజనం కూడా పెడతాం బాబూ. మధ్యాహ్నం వస్తారా?"
"మధ్యాహ్నం రాము. రాత్రికి వస్తాం. నాలుగు భోజనాలు సిద్ధం చేసి వుంచు"
"అలానే బాబూ"
"ఇంతకీ నీ పేరేమిటి ఆల్ ఇన్ ఒన్?" బుద్ధుడు అడిగాడు.
"అప్పలకొండ బాబూ"
"అలాగా"
ఆయన వారికి దోసెలు వడ్డించాక కౌంటర్ లోకి వెళ్ళి కూర్చున్నాడు.
బిల్లు ఎంతైందో లెక్క కడుతూ మధ్య మధ్యలో వాళ్ళను చూస్తున్న ఆయనకు అమ్మాయిని తప్ప మిగిలిన ముగ్గురినీ ఎక్కడో చూసినట్టు అన్పించింది.ఆలోచనలో పడ్డాడు.
నలుగురూ టిఫిన్ ముగించి, కౌంటర్ దగ్గరకు వచ్చారు.
లాలస బిల్లు చెల్లించింది.
రాత్రి భోజనానికి వస్తామని చెప్పి బయటపడ్డారు.
వాళ్ళను ఎక్కడ చూసిందీ లీలగా గుర్తుకొచ్చింది అప్పలకొండకు.
తన అనుమానం నిజమో కాదో తేల్చుకోవడానికి ఆయన పాత పేపర్ల కోసం లోపలికెళ్ళాడు.
* * * *
మసక వెన్నెల ప్రకృతికి సిల్వర్ పెయింట్ ను అద్దుతోంది. చుట్టూ వున్న కొండలు వెన్నెల్లో జలకాలాడుతున్న వింత జంతువుల్లా వున్నాయి. గాలి చెట్లను కదుపుతూ చిన్నపిల్లలా తప్పటడుగులు వేస్తున్నట్టు వుండుండీ వీస్తోంది.
లాలస, తిలక్ పిట్టగోడ దగ్గర నిలబడి లోయలోకి చూస్తున్నారు.
బుద్ధుడు, ఉత్తరుడు అప్పుడే పడుకుని నిద్రపోతున్నారు.
నలుగురూ ఎనిమిది గంటల ప్రాంతాన అప్పలకొండ హోటల్ కి వెళ్ళి భోజనం చేశారు. తిరిగి వచ్చేప్పుడు. ఎక్కడుంటున్నారు బాబూ? అని అడిగితే ఏదో లోకంలో వున్న ఉత్తరుడు జవాబు చెప్పాడు.
తమ ఫోటోలు వేసి, జైలునుంచి పారిపోయిన ఈ ముగ్గురినీ పట్టి ఇచ్చిన వారికి ఇరవై అయిదు వేల రూపాయలు బహుమానం ఇస్తామని పోలీసులు ఇచ్చిన ప్రకటన వున్న పేపర్ ఆయన దగ్గరున్నట్టు వాళ్ళు పసిగట్టలేకపోయారు. అదే వాళ్ళు చేసిన తప్పు.
తిరిగి పాడుబడ్డ భవనానికి వచ్చి పడకేశారు.
నిద్రరాకపోవడంతో లాలస, తిలక్ మాత్రం గదినుంచి బయటకు వచ్చి నిలబడ్డారు.
"ఎవరో పేరున్న చిత్రకారుడు వేసిన పెయింటింగ్ లా వుంది లోయ. ఇలాంటప్పుడు ప్రకృతి అందాలను అనుభవించాలనిపించదు. లీనమైపోవాలనిపిస్తుంది" పలవరిస్తున్నట్టు అంది ఆమె.
"ప్రకృతి విసిరిన మంత్రంలో చిక్కుకుపోవడమంటే ఇదే. జైలు జీవితం ఎంత భయంకరంగా వుంటుందో ఇలాంటప్పుడు మరీ బాగా తెలుస్తుంది. ఒకవేళ తిరిగి జైలుకి వెళ్ళాల్సి వస్తే అంతకన్నా విషాదం మరొకటి వుండదేమో"
అతని మాటలకు ఆమె కదిలిపోయింది.
"అలాంటి పరిస్థితి రాకూడదని ఆశిద్దాం. ఇన్నాళ్ళకు ఓ మంచి తోడు దొరికాడన్న ఆనందం బ్రద్ధలైపోవడాన్ని నేను భరించలేను. అందుకే ఎవరికీ కనపడకుండా నిన్ను నా గుండెల్లో దాచుకుంటాను" అని అతని పక్కకు జరిగింది.
"లాలసా! నేను జైలునుంచి తప్పించుకున్న ఖైదీని. నేను ఎప్పటికీ నీ తోడుగా వుండలేనేమో" అతని గొంతులో బాధ సుళ్ళు తిరుగుతోంది. ఆమెను వదిలిపెట్టడం తనకూ సాధ్యం కాదని అతనికీ తెలుస్తూనే వుంది.