"వాడు పారిపోయిన విధానం చూస్తుంటే ఎవరో బయటవాళ్ళు సహాయం చేశారనిపిస్తోంది. అందుకే ఇకనుంచీ వాడ్ని మరింత బాగా పరిశీలిస్తుండాలి ఒకవేళ వాడు తిరిగి పట్టుబడితే, వాడికోసం ఎవరైనా వచ్చినా వాళ్ళ వివరాలన్నీ తెలుసుకోమను."
అలాగే అన్నట్టు ఆమె తల వూపింది.
"మన వలలో పడ్డట్టే అనిపించి తప్పించుకున్నాడు!" రాయుడు అసహనంగా తలను రెండు చేతులతోనూ రాసుకుంటూ అన్నాడు.
"అవును. వాడిని కన్విక్ట్ ఆఫీసర్ గా నియమించేందుకు నా భర్త ఒప్పుకున్నాడు. రేపో మాపో వాడి నియామకం జరిగేది. మన ఉచ్చులో వాడు పడేవాడు. కానీ ఇంతలో ఈ ఘోరం జరిగిపోయింది" ఆమె నొచ్చుకుంటూ అంది.
"ఇంతకీ వాళ్ళను పట్టుకునేందుకు ఏమైనా గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయా?"
"ఆఁ! జైలు సిబ్బందంతా వేటకుక్కల్లా తిరుగుతున్నారు. మీరూ ఓసారి ఎస్.పి.కి ఫోన్ చేయండి."
"అలానే" అని తన ముందున్న ఫోన్ ని అందుకున్నాడాయన.
మరో నిముషానికి ఎస్.పి. లైన్లోకి వచ్చాడు.
"హలో... నేను రాయుడ్ని!"
"నమస్తే సార్. చెప్పండి!" అవతల నుంచి ఎస్.పి. చాలా వినయంగా అన్నాడు.
"జైలు నుంచి ఈరోజు ముగ్గురు ఖైదీలు తప్పించుకున్నారు- తెలుసా?"
"ఎస్ సార్. వాళ్ళను పట్టించుకునేందుకు ఎంతో శ్రమపడుతున్నాం సార్!"
"అబద్ధాలు చెప్పకు. మీ డిపార్ట్ మెంట్ గురించి మీకంటే నాలాంటి వాడికే యెక్కువ తెలుసు. బద్ధకాన్ని, సోమరితనాన్ని ఒడుల్చుకుని వాళ్ళని ఎలాగైనా పట్టుకునేట్టు కృషి చేయండి. ఇరవైనాలుగు గంటల్లో వాళ్ళు తిరిగి జైల్లో వుండాలి!" రాయుడు హెచ్చరించాడు.
"అలానే సార్!" ఎస్.పి. గొంతుతోనే సెల్యూట్ చేస్తూ అన్నాడు.
* * * *
"ఊరు మరీ దగ్గరైనట్టుంది. పెద్దదిగానే కనిపిస్తోంది వూరు" అన్నాడు ఉత్తరుడు నడక స్పీడు తగ్గిస్తూ.
"ప్రస్తుతానికి ఇదేనన్న మాట మనవూరు. ఇంకొన్ని రోజులపాటు ఈ వూరు మనలను కన్నతల్లిలా ఆదరిస్తుంది. ప్రేయసిలా ప్రేమగా చుట్టేసుకుంటుంది. నేస్తంలా దగ్గరకు తీసుకుంటుంది!" బుద్ధుడు ఆనందంతో తేలిపోతున్నాడు.
"ఏం బుద్ధా! మనసు ప్రేయసిమీదకు పోతోంది" అన్నాడు తిలక్ నవ్వుతూ.
"అవును బాసూ! మరీ ఇంత స్వేచ్ఛను భరించలేకపోతున్నాను. ఇందులో కొంతైనా పోగొట్టుకుంటే తప్ప లాభం లేదు. అందుకే ప్రేమా, పెళ్ళీ అని సంకెళ్ళు వేసుకుంటే మంచిదనుకుంటున్నాను."
లాలస చీకట్లో చూపులతోనే తిలక్ ని స్సృశిస్తూ "మరి మీ బాసు బంగారు సంకెళ్లు వేస్తానంటున్నా వూఁ అనడం లేదు" అంది.
బుద్ధుడు, ఉత్తరుడు తమ బాస్ వైపు చూసి ముసిముసిగా నవ్వారు.
ఊరు మరింత దగ్గర పడింది.
రోడ్డుకి పక్కగా వున్న పాడుబడ్డ భవంతి మసకచీకటిలో దెయ్యం తలలా వుంది.
తిలక్ ఆగాడు.
"ఇదేదో పాతభవనంలా వుంది. ఇక రాత్రి మనం వూళ్ళోకి వెళ్ళడంకన్నా ఇక్కడ తలదాచుకుంటే మంచిదేమో?" అన్నాడు మిత్రులవైపు తిరిగి.
"అది నిజమే. ఈ భవనంలో ఎవరూ కాపురమున్నట్టు లేదు" బుద్ధుడు అడుగు ముందుకేశాడు మరొక ఆలోచనకు తావివ్వకుండా.
నలుగురూ అక్కడికి చేరుకున్నారు.
ఎవరో వచ్చినట్టు అలికిడి కావడంతో వరండాలో పడుకున్న ఇద్దరు సన్యాసులు లేచారు.
"ఎవరు బాబూ?" ఓ సన్యాసి ప్రశ్నించాడు.
"మాది పరాయి వూరు. పనీపాటా వెదుక్కుంటూ ఇక్కడకు వచ్చాం. ఇక్కడ పడుకోవచ్చా? ఎవరూ కాపురమున్నట్టు లేదు" అని వాళ్ళ పక్కన కూర్చున్నాడు ఉత్తరుడు.
"నిరభ్యంతరంగా పడుకోవచ్చు బాబూ. ఇది ఎప్పుడో పూర్వం కట్టిన భవనం, ఇప్పుడూ ఎవరూ లేరు. ఈ భవనం జమిందారులంతా చాన్నాళ్ళక్రితం విశాఖపట్నం వెళ్ళిపోయారట. ఇదిగో ఇలా మనలాంటి వాళ్ళకు ఉపయోగపడుతోంది ఈ పాడుబడ్డ భవంతి."
"ఇక్కడే వుండిపోదాం" లాలస తన కాళ్ళను పట్టుకుంటూ అంది. బాగా నడవడం వల్ల ఆమెకు కాళ్ళు నొప్పెడుతున్నాయి.
అలాగే అన్నట్టు తల వూపి లోపలికి నడిచాడు తిలక్.
తలుపులు, కిటికీలు విరిగిపోయి చెదిరిపోయిన జీవితంలా వుంది లోపలంతా. గత జన్మపు స్మృతుల్లా సాలెగూళ్ళు మసక మసగ్గా కనిపిస్తున్నాయి. పైన చాలాభాగం రూఫ్ లేకపోవడంవల్ల లోపల ఏమేమి వున్నాయో బాగా కనిపిస్తోంది. గోడలు కూలి పోవడంవల్ల ఎక్కడా పడుకోవడానికి వీల్లేకుండా ఉంది.
హాలులోంచి పైకి వెళ్ళడానికి మెట్లున్నాయి. అయితే అవి అక్కడక్కడా విరిగిపోవడం వల్ల ఫ్రీగా ఎక్కేందుకు సాధ్యపడదనుకున్నాడు తిలక్.
"పైకి వెళ్ళాలంటే కొంచెం కష్టపడాలి. కింద పడుకోవడానికి కుదరదు, మరి ఏం చేద్దాం?" లాలసను అడిగాడు.
"కొంచెం కష్టమైనా పైకే వెళదాం"
"అయితే పదండి"
నలుగురూ చాలా అవస్థపడి పై అంతస్థుకు చేరుకున్నారు.
అక్కడ మూడే గదులున్నాయి. మిగిలిన భాగమంతా ఖాళీనే.
ఆ గదులు కూడా బాగా లేవు. ఒక దాన్లో బాగా గడ్డి పెరిగి వుంది. ఇక మిగిలిన రెండు ఫరవాలేదు.
"ఒక గదిలో నేనూ, ఉత్తరుడు పడుకుంటాం. రెండో గదిలో మీరిద్దరూ వుండండి. అందరం ఒకే గదిలో పడుకోవడం చాలా కష్టం" బుద్ధుడు ప్రపోజ్ చేశాడు.
"బ్రహ్మాండం బుద్ధా" లాలస వెంటనే అంది.
"ఓకే గుడ్ నైట్. రేపు ఉదయం పునర్ధర్శనం." బుద్ధుడు తమ గదిలోకి అడుగు పెట్టాడు.