"ఇక మనం శారీరకంగా విడిపోవచ్చేమోగానీ మానసికంగా కాదు. ఇప్పుడు మనిద్దరం వేరు వేరు కాదు ఒక్కటే. నువ్వు లేని జీవితం నాకు వ్యర్థంగా అనిపిస్తోంది. అందుకే నీకోసం, నీ ప్రేమకోసం ఎన్ని యుగాలయినా ఇలాగే నిరీక్షిస్తాను తిలక్" ఆమె మోహావేశంతో బరస్ట్ అయిపోయింది. ప్రతి మనిషికీ ఇలాంటి క్షణాలు తప్పవేమో.
అతని కళ్ళల్లోకి చూస్తూ మరింతగా ముందుకు కదిలింది.
తిలక్ పక్కకు చూశాడు. అవతల రూప్ కూలిపోయి వుంది. తను అటువైపు జరిగితే కింద పడిపోతాడు. అక్కడే వుంటే అంతకంటే అగాధమయిన ప్రేమలో పడిపోతాడు. అగాధమౌ జలనిధిలో ఆణిముత్యాలుంటాయని తెలుసు. అందుకే కదలకుండా అలాగే నిలబడిపోయాడు.
అతని మనసు వెన్నెల్లో తెలుస్తోంది ఆమెకు.
ఇక ఒక్కక్షణం ఆగలేకపోయింది. ముందుకు జరిగి ముఖాన్ని పైకెత్తి పెదవులతో అతని పెదవులను అద్దింది.
మనసు జివ్వున లాగింది అతనికి. ఈ జీవితానికి సరిపడా ప్రేమ ఆ ముద్దులో వున్నట్టు అనిపించింది.
తనకు ఇంతకాలం ఒంటికన్ను రాక్షసిలా భయపెట్టిన ఏకాంతం ఎక్కడికో దూరంగా పారిపోతున్న భావన ఆమెలో.
ఎక్కడో దూరంగా ఏదో చప్పుడవుతున్నట్టు అన్పిస్తే ఠక్కున కళ్ళు విప్పాడు తిలక్.
ఏదో అనుమానం కొండచిలువలా చుట్టుకొంటోంది.
"లాలసా! ఎవరో వస్తున్నట్టు అన్పిస్తోంది" అన్నాడు మెల్లగా.
"అవును, నాకూ అలానే అన్పిస్తోంది. మన భవనంవైపే వస్తున్నట్లున్నారు."
ఇద్దరూ ముందుకు వచ్చారు.
దూరంగా పోలీసులు రావడం కనిపించింది.
లాలస భయంతో వణికిపోయింది. ఆ అలజడికి తట్టుకోలేక అతడిని గట్టిగా కౌగిలించుకుంది.
"లాలసా! రిలాక్స్" ఆమెను సున్నితంగా విడిపించాడు.
తమ గురించి అప్పలకొండే సమాచారం అందించాడని అతనికి అర్థమైంది. తమవైపు అనుమానంగా చూడడం, ఎక్కడుంటున్నారని అడగడం గుర్తొచ్చింది.
"ఇప్పుడెలా?" వణుకుతున్న కంఠంతో అడిగింది లాలస.
"అదే ఆలోచిస్తున్నాను"
"బుద్ధుడు, ఉత్తరుడ్ని లేపుతాను" అని ఆమె గదిలోకి పరుగు తీసింది.
తిలక్ అలానే నిలబడిపోయాడు.
పోలీసులతోపాటు అప్పలకొండ రాకుండా వుంటే తప్పించుకోవడం పెద్ద కష్టం కాదనుకున్నాడు. పోలీసులు దగ్గరకు వచ్చేశారు కాబట్టి ఇక తాము కిందకు దిగి వాళ్ళకు కనపడకుండా తప్పించుకోవడం ఇంపాజిబుల్. ఏదో విధంగా పోలీసులకు తాము ఖైదీలు కామని నమ్మించాలి. తిరిగి ముందు భాగానికి వచ్చి చూశాడు.
పోలీసుల్లో అప్పలకొండ లేడు. 'థాంక్ గాడ్' అనుకున్నాడు మనసులో
అతని బుర్ర చురుగ్గా పనిచేస్తోంది.
అంతలో లాలస, బుద్ధుడు, ఉత్తరుడు వచ్చారు.
అప్పటికప్పుడు ఓ ఐడియా తట్టింది అతనికి. వెంటనే దానిని అమలు చేయాలనుకున్నాడు.
"బుద్ధా! ఉత్తరా! మీరు ఇద్దరు ఇక్కడే వుండండి. నేనూ, లాలస కిందకు వెళతాం" చెప్పాడు చిన్నగా.
"అదేమిటి బాసూ! మీరు కిందకు వెళ్ళడం, మేము ఇక్కడ వుండడం అందరం ఇక్కడే వుండిపోదాం" ఉత్తరుడు ఒప్పుకోలేదు. లాలస, తిలక్ లు కిందకు వెళ్ళి పోలీసుల కంటపడడం అతనికి ఇష్టంలేక పోతోంది.
"అది కాదు ఉత్తరా! మనం ఇక్కడ వున్నా పోలీసులు పైకి వస్తారు. అందరినీ పట్టుకుపోతారు. అయితే పోలీసుల్ని మస్కా కొట్టించగలిగితే మనం తప్పించుకోవచ్చు. అందుకే మేమిద్దరం కిందకు వెళుతున్నాం. నేనూ పోలీసులకు కనిపించను. లాలస ఒక్కతే వాళ్ళతో మాట్లాడుతుంది. నేనో చిన్న ప్లాన్ వేశాను. ఎప్పుడో నేర్చుకున్న మిమిక్రీని ప్రదర్శించడానికి కిందకు వెళుతున్నాను అంతే. లాలస ఫోటో పేపర్లో వేయలేదు గనుక ఆమె మన మనిషి అని పోలీసులు గుర్తించలేరు. పోలీసులతో అప్పలకొండ రాకపోవడం మన అదృష్టం" అని లాలసతో ఏం చేయాలో చెప్పాడు తిలక్.
వెంటనే ఆమె తన తలను బాగా చెరిపేసుకుంది. చీరను అక్కడక్కడా చించుకుంది. రెండు చేతులతోనూ గోడలకు రాసి మట్టిని ముఖానికి పౌడర్ లా పూసుకుంది.
తిలక్, లాలస కిందకు దిగారు.
మరో క్షణానికి పోలీసులు ఆ భవనానికి చేరుకున్నారు.
వెంటనే లాలస ఏడుపు అందుకుంది. ఏడుస్తూనే ఆమె రాగాలు తీస్తూ మాట్లాడుతోంది. "ఓరిదేవుడో! ఇప్పుడేం చేయాలిరా? సింహాచలం స్వామీ! నా పాములు నాకు దొరికితే నీ దగ్గరకు వస్తాను స్వామీ! అవి కనిపించకపోతే నా బతుకుపోతోంది దేవుడో."
ఒక్కసారిగా భావనంలోంచి ఆడపిల్ల ఏడుపు వినిపించడంతో పోలీసులు ఉలిక్కిపడ్డారు.
"ఎవరూ?" అంటూ టార్చ్ వేశాడు సింహాచలం.
లాలస ఓసారి ముఖం చిట్లించి! వెంటనే వాళ్ళ దగ్గరకు పరుగున వచ్చింది. "సమయానికి వచ్చారు పోలీసుబాబులూ. నేను పాములు ఆడించేదాన్ని. రాత్రి పడుకునేప్పుడు బుట్టను మూయడం మరచిపోయాను బుస విన్పిస్తే అనుమానంతో లేచి చూసాను బాబూ. పాములు తప్పించుకున్నాయి. అయితే అవి ఎక్కడికీ పోలేదు. ఇక్కడే వున్నాయి బాబూ. బుస విన్పిస్తూ వుందే తప్ప పాములు కన్పించడం లేదు. ఒకటిగాదు రెండుగాదు మొత్తం నాలుగు పాములు బాబూ అన్నీ తాచుపాములే. ఈ మధ్యే నేనూ, నా బావా ఎంతో కష్టపడి పట్టుకున్నాం బాబూ ఇంకా కోరలు కూడా పీకలేదు బాబూ. వాడు... నా బావ... సాయంకాలం అనగా వూర్లోకి వెళ్ళాడు ఇంతవరకూ రాలేదు. బాబ్బాబూ! మీరైనా లోపలికి వచ్చి సాయం చేయండి బాబూ..." ఆమె రాగాలు తీస్తూ చెప్పుకుపోతుంది ఆ రాగానికి వెనక శృతి చేస్తున్నట్టు ఏడుపు కూడా విన్పిస్తోంది.
పాములు తప్పించుకుని అక్కడే తిరుగుతున్నాయని తెలియడంతో ఎస్.ఐ.కు చెమటలు పోస్తున్నాయి. "ఛీ! నోర్ముయ్!" అని కసిరాడు.


