"ఐ. సీ ! చటర్జీగారు మీ మావయ్య అన్నమాట. మీరు మీ మావయ్య గారితో రాలేదు. మీ మావయ్య గారిని మీరు తీసుకురాలేదు. తన కేసు గురించీ ఎవ్వరికీ చెప్పవద్దని కూడా చటర్జీగారు కోరారు. అలాంటప్పుడు మీ ప్రశ్నలకి నేను ఎలా సమాధానాలు ఇవ్వమంటారు? అయినా మా నియమాలకి విరుద్దంగా మేము ఏమీ చెప్పం" పాండే చెప్పేశాడు.
ఆయన నోట్లోంచి విషయాలు రప్పించాలంటే అధికారం ఉపయోగించక తప్పదు అనుకున్న మనోజు.
"ఏయామ్ ఇన్ స్పెక్టర్ మనోజు! టూటౌన్ ఎస్.ఐ. ని. మా మావయ్యది ఒక విచిత్రమైన కేసు...." అంటూ మనోజు చటర్జీ గురించి ఒక పెద్ద కథ చెప్పాడు.
మనోజు చెప్పింది విని, పాండే ఏ కామెంటూ చెయ్యలేదు. దీర్ఘాలోచన చేస్తూ వుండిపోయాడు.
ఇన్ స్పెక్టర్ మనోజుకి అనుమానం వచ్చింది. పర్సులో నుంచీ తీసి తన ఐడెంటిటీ కార్డు చూపించాడు.
"నో....నో....నేను మిమ్మల్ని అనుమానించటం లేదు. మీరు చెప్పిన కథకీ, ఛటర్జీ గారు అడిగే ప్రశ్నలకీ, ఆ వ్యాధికీ దగ్గర సంబంధం వుందా అని ఆలోచిస్తున్నాను. అక్కడికీ చటర్జీ గారిని అడిగాను. తన వ్యాధి గురించీ సరైన వివరాలు ఇవ్వలేకపోతున్నారు.
మీ వాళ్ళని ఎవరినైనా తీసుకురండి అంటే నా కేసు విషయం మరొకరికి తెలియటం నాకు ఇష్టంలేదు, దయచేసి నన్ను అర్ధం చేసుకుని నాకు ట్రీట్ మెంట్ ఇవ్వండి! అన్నారు. ఈ విధమైన కేసు నూటికో కోటికో ఒకటి వుంటుంది.
కేసు గుర్తించి పూర్తి వివరాలు తెలియంది ట్రీట్ మెంట్ ఇవ్వటం కూడా కష్టం. ఛటర్జీగారి విషయంలో నేనింత వరకూ ఏ విధమైన ట్రీట్ మెంటూ మొదలుపెట్టలేదు...."
"మావయ్య ఇప్పటికి మీ దగ్గరకి నాలుగయిదుసార్లు వచ్చారనుకుంటాను మరి....?" మనోజు ఆర్దోక్తిగా ఆగిపోయాడు.
"మనస్సుని నిరంతరం టెన్షన్ కి గురిచేయటం ద్వారా, మానసికంగా ప్రశాంతతని కోల్పోతారు. ఏ మనిషి అయినా టెన్షన్ కి గురి అవుతారు ఎందుకూ? అంటే దానికి ఫలానాకారణం అని ముందుగా చెప్పలేం.
ఏదైనా జటిలమైన సమస్య వచ్చినపుడు, జీవితంలో తీరని లోటు ఏర్పడినపుడు. తీసివెయ్యలేని బాధ ఏర్పడినపుడూ, ఆప్తులకి దూరమైనా. వాళ్ళని కోల్పోయినా కొందరు వాటిని స్పోర్టివ్ గా తీసికొని ధైర్యంగా జీవితంలో ముందుకి సాగుతూ వుంటారు. సెన్సిటివ్ అయితే అదే పట్టుకుని బాధపడుతూ వుంటారు. మానసికంగా కృంగిపోతారు.
అప్పుడే మానసిక జబ్బులు ఏర్పడతాయి. అదే డీప్ సెన్సిటివ్ అయితే అతని ప్రవర్తన కూడా ఫలానా విధంగా వుంటుందని చెప్పలేం. వింత ధోరణులూ, విపరీతమైన పనులూ చేయడం కూడా వుంటుంది.
ఆంక్సైటి న్యూరోసిస్ అనే జబ్బు వచ్చినవారికి, అకారణంగా భయమూ, గుండె దడ వణుకూ వస్తాయి. ఆ రోగిని డాక్టర్ దగ్గరకి తీసుకువెడితే నాకు హార్టుఎటాక్ వచ్చింది అని చెబుతాడు. నీకు వచ్చింది హార్టుఎటాక్ కాదు అని డాక్టర్ ఎంత చెప్పినా వినిపించుకోడు. తనకి హార్టుఎటాక్ వచ్చిందనే అనుకుంటాడు.
కనుక ఈ మానసిక జబ్బులనేవి ఎందుకొస్తాయ్? ఎలా వస్తున్నాయ్? అనే దానికన్నా, వ్యాధి లక్షణం ముందు కనుక్కుంటే, ట్రీట్ మెంట్ ఇవ్వటం తేలిక. తన వ్యాధి ఏమిటో పేషెంట్ చక్కగా చెప్పేటట్లు వుండాలి.
లేకపోతే ఆ పేషెంటుని తీసుకు వచ్చినవాళ్ళు పేషెంట్ ప్రవర్తన వివరంగా చెప్పగలిగి అయినా వుండాలి. పూర్తి పిచ్చి వాళ్ళకి జబ్బు నయం చెయ్యడం తేలికేమోగానీ. ఇలాంటి మానసిక రోగుల్ని అంటే సగం పిచ్చివాళ్ళలాగానూ, సగం మామూలు మనిషిలాగానూ ప్రవర్తించే పేషెంట్లని, ట్రీట్ చెయ్యడం చాలా జాగ్రత్తగా చెయ్యాలి.
డాక్టర్ జకిల్ మిష్టర్ హైడ్ లాంటి మస్తత్వం కలిగిన వ్యక్తి వున్నాడనుకోండి! అతన్ని గురించి ఇతరులు చెప్పలేరు. అతనూ, తనని గూర్చి చెప్పలేడు. అలాంటి వాళ్ళకి ట్రీట్ మెంట్ ఇవ్వడం చాలా కష్టం. అయినా, దానికి కొన్ని మార్గాలు వున్నాయి."
"వన్ మినిట్...." అంటూ అడ్డు తగిలాడు పాండే మాటలకు మనోజ్. "ఏదీ మరొకసారి చెప్పండి మీరన్నది?" అన్నాడు.
పాండే అనే మాటలు తిరిగి మళ్ళీ చెప్పాడు.
ఇన్ స్పెక్టర్ మనోజ్ చాలాసేపు ఆలోచిస్తూ వుండిపోయాడు. అతని ఆలోచనలకి అంతరాయం కలుగజెయ్యకుండా, తనూ మౌనంగా వుండిపోయాడు డాక్టర్ పాండే.
"నేను ఒక కేసు విషయంలో పరిశోధిస్తూ ఇక్కడికి వచ్చాను. మీరు నాకు సహాయం చెయ్యాలి!" మనోజ్ అడిగాడు.
"విషయమేమిటో చెప్పండి!"
"ఇది మన మధ్యనే వుండాలి. చాలా సీక్రెట్. దయచేసి ఈ విషయం బయటకి రాకుండా వుంచగలిగితే ధన్యుడ్ని."
"తప్పకుండా మీకు సహకరిస్తాను. ఇద్దరి మధ్య వుండాల్సిన విషయాన్ని అనగా పేషెంట్. డాక్టర్ మధ్యా గుప్తంగా వుండవలసిన విషయాన్ని, మూడో వ్యక్తిముందు చర్చించకూడదు. కానీ మీరు ఛటర్జీ గారి గురించి చెప్పటం, ఛటర్జీ గారు మీ మామయ్య అని కాక, మీరు ఇన్ స్పెక్టర్ గా ప్రశ్నిస్తున్నారు కాబట్టి, మీకు నా చేయూత వుంటుంది.
మన మధ్య జరిగే సంభాషణ మన మధ్యే వుంటుంది చెప్పండి! ఛటర్జీ గారు తన గురించీ సరిగ్గా చెప్పలేకపోతున్నారు. వైద్యం చెయ్యమంటున్నారు. మీవల్ల ఇప్పుడు ఆయనకి వైద్యం చెయ్యటం కూడా నాకు తేలికవుతుంది" మనస్పూర్తిగా అన్నాడు డాక్టర్ సుఖదేవ్ పాండే.
మనోజుకి ఆయన మాటలు చాలా సంతోషాన్ని కలిగించాయి.
కొంతసేపు మనోజు ప్రశ్నలు అడుగుతూ వుంటే డాక్టర్ పాండే సమాధానాలు ఇచ్చాడు.
మరికొంతసేపు అనుమాన నివృత్తికోసం. డాక్టర్ పాండే కొన్ని ప్రశ్నలు అడుగుతూ వుంటే మనోజు వాటన్నింటికీ జవాబులు ఇచ్చాడు.
వారిరువురి మధ్యా కొద్దిసేపు ఈ విధంగా సంభాషణ జరిగింది.
"ఇప్పుడు కేసుకొక రూపం ఏర్పడింది!" డాక్టర్ పాండే అన్నాడు.
"కేసుకి రూపం ఏర్పడటం కాదు. కేసేమిటో పూర్తిగా తెలియాలి నాకు" మనోజు అన్నాడు.
"తెలుస్తుంది!"
"అదే నాకు కావలసింది. నన్ను మళ్ళీ ఎప్పుడు కలవమంటారు?" మనోజు అడిగాడు.
సుఖదేవ్ పాండే చెప్పాడు.
ఆ తరువాత పాండే దగ్గర శలవు తీసుకుని, మానసా నర్సింగ్ హోమ్ నుంచీ బయటకి వచ్చాడు మనోజు.
31
కామాక్షి మొగుడిని పట్టించుకోవడం మానేసింది.