Previous Page Next Page 
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 41


    "అవును. నిజమ్గాన్ నిజం!" చెప్పాడు లోకనాధం.

    రిషి వెంటనే తల కొద్దిగా వెనక్కి వంచి పెద్దగా నవ్వడం మొదలుపెట్టాడు.

    ఆశ్రిత కంగారుగా "రిషీ, ఏమైంది? ఏమిటా నవ్వు?" అంది.

    రిషి ఇంకా నవ్వుతూనే "ఎక్కడ కలిసారు మా నాన్నగార్ని? స్వర్గంలోనా?" అడిగాడు.

    "కాదు- మనోరమలో!" అన్నాడు లోకనాధం.

    "వా! ఆయన కాళ్ళు సరిగ్గా చూసారా? నేలకి ఆనున్నాయా?" ఇంకా నవ్వుతూనే అడిగాడు రిషి.

    "రిషీ!" కాస్త కోపంగా అరిచింది ఆశ్రిత.

    రిషి నవ్వు ఆపుకుని "ఐయామ్ సారీ ఆశ్రితా! మీ నాన్నగారు జోక్స్ బాగా వేస్తారు. నేను వెళ్ళొస్తాను" అన్నాడు.
    లోకనాధం అతనికి అడ్డుపడి "నా మాటలు మీరు నమ్మడం లేదా?" అన్నాడు.

    "లేదు!" తీవ్రంగా అన్నాడు రిషి.

    "ఎందుకు?" అంతకంటే తీవ్రంగా అడిగాడు లోకనాధం.

    "మా నాన్నగార్ని నేనే చూడలేదు. నాకు వూహ వచ్చేనాటికి పోయారు కాబట్టి!" చెప్పి రిషి కదలబోయాడు.

    లోకనాధం అతని భుజం మీద చెయ్యి వేసాడు.

    "మీరు ఇలా అంటారని కూడా ఆయన చెప్పారు. మీ వంశస్థుల పట్టుదల గురించి ఆయన చాలా చెప్పారు. మీరెన్ని చెప్పినా, మీరు కుందన్ షా కుమారుడేనని నా దగ్గర గట్టి సాక్ష్యాధారాలున్నాయి. నుదుటి మీద సుడీ, కుడి చెవి తమ్మి కాస్త ఒంగి వుండడం, గుండెల మీద కంది బద్ధంత పుట్టుమచ్చా! ఇవన్నీ మధ్యలో వచ్చేవి కాదు. ఒకే రూపున్నా, ఇలాంటి పోలికలు వుండటం అసాధ్యం. చిన్నతనం మానేసి, బుద్ధిగా నాన్నగారి మాట వినండి. ఏవంటారు?" అన్నాడు.

    రిషి కాస్త వాడిగా "అదే అంటాను. నాకు కుందన్ షా, కుబేర్ షా ఎవరూ తెలీదు. మా నాన్నగారి పేరు నరసింహం. ఆయన నా చిన్నతనంలోనే మరణించారు. మా అమ్మ నన్ను కష్టపడి పెంచింది. ఆవిడకి నేనే ఆధారం. మీ అమ్మాయి ఇంత గొప్పింటి పిల్ల అని ప్రేమించాకే నాకు తెలిసింది. గొప్ప మనసుతో మా ప్రేమని ఆదరిస్తే సంతోషిస్తాను. లేదా మా దారి మేం చూసుకుంటాం. నన్ను వెళ్ళనీయండి లోకనాధంగారూ!" అన్నాడు.

    "ఆగు!" లోకనాధం గద్దించాడు.

    రిషీ, ఆశ్రితా ఉలిక్కిపడి చూసారు.

    "మా అమ్మాయిని ప్రేమించానన్నావు కదా! మరి వెళ్ళిపోతావేం? పెళ్ళి చేసుకోవూ?" అడిగాడు లోకనాధం.

    "కానీ.... నేను మీరు అనుకున్నట్లు...." రిషి చెప్పబోయాడు.

    "అదంతా నీకు అనవసరం. నీకు ఆశ్రిత కావాలా? వద్దా?" లోకనాధం అడిగాడు.

    రిషి ఆలోచించకుండా "కావాలి!" అన్నాడు.

    "అయితే లోపలికి పద!" అన్నాడు అధికారికంగా లోకనాధం.

    "థాంక్యూ సర్!" రిషి ఆనందంగా ఆశ్రిత వైపు చూస్తూ అన్నాడు.

    కానీ, ఒక్కమాట గుర్తుంచుకో!" లోకనాధం గొంతు పెంచి అన్నాడు.

    "ఏవిటది?" రిషి తలతిప్పి లోకనాధాన్ని అడిగాడు.

    "నా అంగీకారం లేకుండా నువ్వు ఇల్లు కదలకూడదు!" లోకనాధం చెప్పాడు.

    "అదెలా కుదుర్తుంది? నేను మా అమ్మ దగ్గరకు రేపే వెళ్దాం అనుకుంటున్నాను. అసలే అనారోగ్యం మనిషి" అన్నాడు రిషి.

    "ఆ విషయం నేను చూసుకుంటాను. రేపే మీ అమ్మని ఇక్కడికి తెప్పించే ఏర్పాటు చేస్తాను. ఆవిడతో నాకు పనుంది!" చెప్పాడు లోకనాధం.

    ఆశ్రిత రిషి వైపు ఒప్పుకోమన్నట్లుగా చూసింది. దట్టంగా కమ్మిన మబ్బులు తేలిగ్గా తేలిపోయినట్లు నిట్టూర్చారు లింగం, ఆశ్రితలు.

    లోకనాధం ఆ గదిలోంచి వెళ్తూ "ఒరేయ్ లింగం! నువ్వు వెళ్ళి అల్లుడుగారి కోసం స్పెషల్ గా నీ పాక శాస్త్ర ప్రావీణ్యం చూపించు" అన్నాడు.

    లింగం ఆనందంగా "చిత్తం!" అని అతని వెనకాలే వెళ్ళాడు.

    ఆశ్రిత రిషి దగ్గరకొచ్చి అతని చెయ్యి పట్టుకుని "రిషీ! ఇదంతా ఏవిటీ? కలా? నిజమా?" అంది.

    "ఒకటి నిజం. ఒకటి అబద్ధం!" చెప్పాడు రిషి.

    ఆశ్రిత కనురెప్పలు అల్లార్చి చూసింది.

    రిషి నవ్వి "మీ నాన్నగారు మన ప్రేమని ఆమోదించడం నిజం. నేను కుందన్ షా గారి అబ్బాయిని అనడం అబద్ధం" అన్నాడు.

    ఆశ్రిత విస్మయంగా "అచ్చు గుద్దినట్లు నీ పోలికలతో వున్న ఫోటో నీది కాదంటావా? నువ్వు ఓసారి గుర్తు తెచ్చుకో" అంది.

    రిషి కనుబొమలు ముడివేసి "నిజాలు చెప్పేవాడికి జ్ఞాపకశక్తి అవసరంలేదు. అబద్ధాలు చెప్పేవాడికే అది ఎంతో అవసరం" అన్నాడు.

    ఆశ్రిత విచారంగా మారి "రెండోది నిజం కాకుండా మొదటిది నిజం అవుతుందా? మన ప్రేమ సుఖాంతం అవుతుందంటావా?" అంది.

    రిషి నవ్వి "నీకు ఆ అనుమానం రావడం సహజమే. దుఃఖాంతాలయ్యేవీ నిజమైన ప్రేమలనీ మనని నమ్మించడానికే దేవదాసు, అనార్కలీ లాంటి కథలని వుగ్గుపాలతో రంగరించి పోసారు మన పెద్దవాళ్ళు" అన్నాడు.

    ఆశ్రిత అతని చేతిని తన చెంపకి ఆనించుకుని "అంతా సవ్యంగా జరిగిపోతే బావుండ్ను కదూ" అంది.

    రిషి ఆమె బుగ్గ పట్టుకుని సాగదీస్తూ "చూసావా, దేవుడు మనకెంత అద్భుతమైన వరాన్నిచ్చాడో! ఇలా జరిగితే బావుండ్నూ, జరగకపోతే బావుండ్నూ అని ఆలోచించుకునే శక్తే మానవుడికి ఇవ్వకపోతే ఎంత థ్రిల్ మిస్సయ్యే వాళ్ళమో" అన్నాడు.
    ఆశ్రిత కలవరంగా చూస్తూ "మా నాన్నగారి సంగతి నీకు సరిగ్గా తెలీదు రిషీ! ఆయన ప్రాణానికీ డబ్బుకీ లంకె. డబ్బుకోసం ఏదైనా చేయగలరు" అంది

 Previous Page Next Page