రిషి తేలిగ్గా "ఆయనకున్న ఆ గుణమే ప్రస్తుతం మనకు వుపయోగపడ్తోంది, చూడు. అందుకే అంతా మన మంచికే అనుకోవాలి" అన్నాడు.
ఆశ్రిత ఇంకా అనుమానంగా "అయితే మీ నాన్నగారు కుందన్ షా కాదని నీకు ఖచ్చితంగా తెలుసా?" అంది.
"అబ్బా! ఈ కుందన్ షా ఎవడ్రా బాబూ! నన్ను వదిలిపెట్టేట్లు లేడు. నువ్వు కూడా చివరికి...." అన్నాడు విసుగ్గా.
ఆశ్రిత నవ్వి "సరే.... సరే ఇంకేమీ అడగనుకానీ లోపలికి పద ఆకలేస్తోంది" అంది.
* * *
లోకనాధం లింగంతో కుందన్ షా తనని కలవడం గురించీ, అతని ఐశ్వర్యం గురించీ వర్ణించి చెప్పాడు.
"అయిబాబోయ్. నవాబులన్నమాట! అంత గొప్ప మనిషికి ఎంత కష్టం వచ్చిందీ" నోరు తెరిచి ఆశ్చర్యంగా అన్నాడు లింగం.
లోకనాధం నవ్వి "ఇంకా ఆ నోరు అలా పెగలదీసుకోకు. నరాలు చిట్లిపోగలవు కానీ యిప్పుడు చెప్పు! మన అమ్మాయికి భారతదేశంలో వున్న అతి గొప్ప వాళ్ళల్లో ఒకడు భర్తగా దొరుకుతాడా లేడా?" అన్నాడు.
లింగం ఆనందంగా "అన్నింటికన్నా గొప్ప విషయం ఆ అబ్బాయ్ మన అమ్మాయిని ప్రేమించండి అండీ! కానీ చిన్న తిరకాసు.... ఎందుకో తనే ఆ కుందన్ షా కొడుకని ఒప్పుకోవడం లేదు" అన్నాడు.
లోకనాధం నవ్వేసి "అంటే మాత్రం నమ్ముతామా? ఇన్ని ఆధారాలుంచుకునీ, అదంతా మనకి పరీక్షలే! ఇప్పుడు మనం చేయాల్సిందల్లా అర్జెంటుగా ఆ కుందన్ షాకి ఫోన్ చెయ్యడం" అన్నాడు.
లింగం వెంటనే "మీకు చెప్పేటంతటి వాడ్ని కాదుగానీ ఒక్కమాట అబ్బాయి గురించిన మిగతా వివరాలు కూడా కనుక్కుని వాళ్ళ అమ్మతో మాట్లాడాక అంత పెద్ద మనిషికి తెలియబరచటం మంచిదేమో! ఆలోచించండి" అన్నాడు.
లోకనాధం ఆలోచనలో పడ్డాడు. లింగం చెప్పిందికూడా సబబుగానే అనిపించింది.
"సర్లే.... రేపే వాళ్ళ అమ్మని ఇక్కడికి రప్పిద్దాం. ఒక్కరాత్రిలో ఏం మునిగిపోద్దిగానీ" అన్నాడు.
లింగం నసుగుతూ "చిత్తం మరి ఆ జగపతిగారి అబ్బాయితో రేపు ఆదివారం తాంబూలాలు అవీ...." అన్నాడు.
లోకనాధం విసుగ్గా "ఆ జగపతిగాడికి మన కుందన్ షా గేటుదగ్గర నిలబడే అర్హతకూడా లేదురా. ఆ కొబ్బరితోటలు చూసుకుని నేనే పెద్ద కోటీశ్వరుడ్ని అని తెగ నీల్గాడా వెధవకి. వాడి కుంటి కొడుక్కి నా బంగారు బొమ్మలాంటి కూతుర్ని ఎందుకివ్వాలంటా?" అన్నాడు.
లింగం కోపంగా "కుంటి కొడుక్కా?" అన్నాడు.
లోకనాధం మామూలుగా "ఆ! ఓ కాలు లేదులే.... అయితేనేం? కార్లలోనే తిప్పుతాడు గదా సుఖపడుద్ది అనుకున్నాను" అన్నాడు.
"కార్లుంటే మాత్రం కాలులేనివాడితో ఏం సుఖపడ్తుందనుకున్నారండీ?" అరిచాడు లింగం.
లోకనాధం గొంతు తగ్గించి రహస్యంగా "ఓరి నీ జిమ్మడా, గొంతు తగ్గించరా అవతల అల్లుడుగారున్నారూ" అన్నాడు.
లింగం గొంతు తగ్గించి "ఇన్నాళ్ళూ మీరు ఉత్త పిసినిగొట్టు, కక్కుర్తిమేళం అనుకున్నానండీ.... కానీ కాదండీ" అన్నాడు.
లోకనాధం నవ్వేసి "పోనీ ఇప్పటికయినా సరిగ్గా తెలుసుకున్నావ్" అన్నాడు.
"అవునండీ! పిసినిగొట్టు, కక్కుర్తి, పరమనీచ, తుచ్చ, అప్రాచ్య ప్రాణులండీ" అనేసాడు లింగం.
"ఒరే.... ఒరే సెక్రెట్రీ!" అని అరిచాడు కోపంగా లోకనాధం.
"ఉష్ .... అరవకండి.... అల్లుడుగారు వింటారు" అన్నాడు నెమ్మదిగా లింగం.
లోకనాధం గొంతు తగ్గించి "నా మాటకేంకానీ.... ఏదో ఒకటిచేసి ఆ ఆదివారం తాంబూలాలు రద్దు చేయించు" అన్నాడు.
లింగం నవ్వి "ఆయ్! పెళ్ళిళ్ళు కుదర్చడం కష్టం కానీ పెటాకులు చెయ్యటం ఎంతసేపండీ! అమ్మాయిగారు మన రిషి బాబుగారితో రాసుకునీ పూసుకునీ పార్కులమ్మటా, చెరువులమ్మటా తిరుగుతున్నట్లు వాడికి ఆకాశరామన్న ఫోన్ కాల్స్ అందించామంటే చాలు. మన గడపలోకి కూడా రాడు. మనలాగా కాదు. పరువుకి ప్రాణం పెడ్తాడు" అన్నాడు.
లోకనాధం చిరాగ్గా "సర్లే.... ఏదో ఒకటి చెయ్యి. ముందు అర్జెంటుగా ఓ కొబ్బరికాయ తెప్పించు. రూపాయిబిళ్ళ పెట్టి ఆ వడ్డీకాసుల వాడికి ముడుపుకట్టాలి" అన్నాడు.
లింగం ఆశ్చర్యంగా "అబ్బో దైవభక్తి కూడానా? ఇదెప్పట్నించీ" అన్నాడు.
లోకనాధం భక్తిగా కళ్ళు మూసుకుని "ఆ ఏడుకొండల వాడు అంత పవర్ ఫుల్ గాడ్ కాబట్టేరా, అంత ఆదాయం. అలా నిన్నరాత్రి కోరుకున్నానో లేదో ఇలా ఈరోజు వరం యిచ్చేసాడు. ఇంత పెద్ద సిటీలో ఆ కుర్రాడు నా ఇంటికే రావడం, నాకళ్ళే పడడం ఇందంతా స్వామి లీల కాకపోతే ఇంకేమిటి? అమ్మాయికి అబ్బాయికీ పవిత్రంగా తిరపతి కొండమీద పెళ్ళి చేసి తల నీలాలు సమర్పించుకుంటాను" అన్నాడు.
"ఛ! కొత్తగా పెళ్ళయినవాళ్ళ తలనీలాలు సమర్పించడం ఏమిటి?" విసుక్కున్నాడు లింగం.
లోకనాధం నెత్తికొట్టుకుని "వాళ్ళ తలనీలాలు కాదురా నావీ" అన్నాడు.
లింగం ఆశ్చర్యంగా "ఏవీ? అవికూడా ధారాళంగా లేవు కదండీ పాపం! అయినా ఇంత ఐశ్వర్యం యిస్తున్న భగవంతుడికి మీరిచ్చేది చచ్చు బొచ్చా!" అన్నాడు.
లోకనాధం తన్మయత్వంగా "కాదురా నిలువు దోపిడీ కూడా ఇస్తాను" అన్నాడు.
లింగం లోకనాధాన్ని క్రిందనుంచి మీదివరకూ చూపులతో తడిమేసాడు.


