"ఇదంతా నా పూర్వజన్మ సుకృతం. లేకపోతే మీరు నా ఇంటికి రావడమేమిటీ?" అన్నాడు ఆనందంతో వుబ్బితబ్బిబ్బు అయిపోతూ లోకనాధం.
రిషి ఆశ్రితవేపు ఏమయింది అన్నట్లుగా చూసాడు. ఆశ్రిత కూడా తండ్రి వింత ప్రవర్తన ఆరగించుకోలేక ఆశ్చర్యంగా చూస్తూ వుండిపోయింది.
లోకనాధం లింగంవేపు తిరిగి "అలా దేభ్యం ముఖం వేసుకుని చూస్తూ నిలబడతావేం? అబ్బాయిగారికి కుర్చీ వెయ్యి" అని ఆశ్రితవేపు తిరిగి "నువ్వెళ్ళి స్ట్రాంగ్ కాఫీ తీసుకురా తల్లీ" అన్నాడు.
ఆశ్రిత ఇంకా తేరుకోకుండానే తలూపి లోపలికి వెళ్ళిపోయింది.
రిషి కూర్చున్నాకా లోకనాధం పరమ వినయంగా చేతులు కట్టుకుని "ఎప్పుడొచ్చారు మీరు ఈ ఊరు?" అనడిగాడు.
"ఒక వారం అయింది" చెప్పాడు రిషి.
లోకనాధం అబ్బురంగా అడిగాడు "తెలుగు ఇంత బాగా ఎలా మాట్లాడుతున్నారూ?"
"అలవాటు" క్లుప్తంగా చెప్పాడు రిషి.
లోకనాధం బాధగా మొహంపెట్టి "అవును పదేళ్ళనుంచీ అలవాటై వుంటుంది. ఏమయినా మీరు అలా చెయ్యకుండా వుండాల్సింది" అన్నాడు.
రిషి సంశయంగా "ఎలా?" అనడిగాడు.
'ఇల్లు వదిలి రాకుండా వుండాల్సింది" అన్నాడు లోకనాధం.
రిషి తలవంచుకుని "ఏం చేద్దాం? తప్పనిసరి అయింది" అన్నాడు.
లోకనాధం ఆనందంగా "దాన్నే విధి అంటారు బాబూ! లేకపోతే మనం కలిసేవాళ్ళమా?" అన్నాడు.
"అవును" రిషి ఒప్పుకున్నాడు.
ఇంతలో ఆశ్రిత కాఫీ తెచ్చి ఇచ్చింది.
"అబ్బాయి తెలుగు చక్కగా తప్పులు లేకుండా మాట్లాడుతున్నాడమ్మా!" లోకనాధం ఆనందంగా అన్నాడు.
రిషి కాఫీ సిప్ చేసి "మీరూ నేర్చుకోండి. కనీసం మాతృభాషయినా తప్పులు లేకుండా మాట్లాడగలగాలి" అన్నాడు.
లోకనాధం ఘళ్ళున నవ్వుతూ "భలే మాట్లాడతావోయ్" అన్నాడు. ఆ తర్వాత కాస్త నసుగుతూ "నాన్నగారు పాపం ఈ వయసులో ఒంటరితనంతో చాలా బాధపడుతున్నారు. ఆరోగ్యంకూడా అంతగా బావున్నట్లు లేదు" అన్నాడు.
రిషి వెంటనే "అలాగే! ఆయన్ని అలా బాధపెట్టకండి. వెంటనే మంచి డాక్టర్ కి చూపించండి" అన్నాడు.
లోకనాధం తెల్లబోయి చూసాడు.
రిషి లేస్తూ "ఇక నేను వెళ్ళొస్తాను" అన్నాడు.
"ఎక్కడికీ?" అరిచాడు లోకనాధం.
రిషి మామూలుగా "నా రూంకీ" అన్నాడు.
లోకనాధం నోరు కట్టుకుని "మీకేం ఖర్మబాబూ! లంకంత కొంప ఇక్కడ పడి ఏడుస్తుండగా అలా రూమ్ లోనూ, సత్రాల్లోనూ వుంటారా?" అన్నాడు.
రిషి అయోమయంగా "మీరు అలా ఎందుకు ప్రవర్తిస్తున్నారో నాకు అర్ధం కావడం లేదు" అన్నాడు.
లోకనాధం గుంభనంగా నవ్వి "మీ నాన్నగారూ నేనూ మంచి స్నేహితులం" అన్నాడు.
"ఆ!" రిషి ఆశ్చర్యంగా అన్నాడు.
ఆశ్రిత అర్ధమయినట్లు చూసింది.
లోకనాధం ఆశ్రిత తలమీద చెయ్యివేసి నిమిరి "సంబంధం కలుపుకుని మా స్నేహాన్ని వియ్యంగాకూడా మార్చుకోవాలని నిశ్చయించుకున్నాం. అదేనోయ్.... మా అమ్మాయిని నీకిచ్చి పెళ్ళిచేయాలని అనుకున్నాం! నీకు ఇష్టమేనా.... ఇష్టమే అని ఇందాకా నేను చూసినప్పటి మీ ఫోజే చెప్పిందనుకో" అన్నాడు.
రిషి, అశ్రితా సిగ్గుతో తల వంచుకున్నారు. రిషి నెమ్మదిగా.... "అసలు మా నాన్నగారు మీకెలా తెలుసూ?" అన్నాడు.
లోకనాధం నవ్వి "సస్పెన్స్. అది నువ్వడగకూడదూ నేను చెప్పకూడదూ" అన్నాడు.
రిషి కాస్త చిరాగ్గా "మీరు ఎక్కడో పొరపడుతున్నారు. నన్ను చూసి ఎవరో అనుకుంటున్నారు" అన్నాడు.
లోకనాధం తల అడ్డంగా వూపి జేబులోంచి ఓ ఫోటోతీసి లింగాని కందిస్తూ "ఇది ఎవరిదో సరిగా చూసి చెప్పరా" అన్నాడు.
లింగం ఆశ్చర్యంగా ఆ ఫోటోనీ, రిషినీ మార్చి మార్చి చూసి.... "అబ్బాయి గారిదేనండీ. కానీ కాస్త చిన్నప్పటిది" అన్నాడు.
"ఏదీ?" రిషి వెంటనే అందుకున్నాడు. ఆశ్రిత కూడా వచ్చి పట్టుకుని చూసింది.
"సందేహం ఏముంది? నీదే" అంది ఆశ్రిత.
రిషి ఆలోచనగా "అవును. కానీ సుమారు పదేళ్ళ క్రిందటిదానిలా వుంది. మీ దగ్గర ఎలా వుందే?" అన్నాడు.
"మీ నాన్నగారే ఇచ్చారు" తాపీగా చెప్పాడు లోకనాధం.
"ఎప్పుడు?" అడిగాడు రిషి.
"నిన్న రాత్రి విజయవాడలో మేం ఇద్దరం కలిసి రూంలో...." అని ఆగిపోయాడు.
"వాట్!" రిషి పరమ ఆశ్చర్యంగా మొహం పెట్టి "నిన్న రాత్రా? ఇంపాజిబుల్" అన్నాడు.
"అవును, నిన్న రాత్రే!" చెప్పాడు లోకనాధం.
"అయితే నిన్న రాత్రి మా నాన్నగార్ని మీరు కలిసానంటారు" అన్నాడు రిషి.