ఒకడు పాట మొదలు పెట్టాడు రెండో వాడు తలుపు మీద దరువు మొదలుపెట్టాడు.
అవంతి బైట జరిగేది చక్కగా వూహించింది. ఇద్దరు తాగుబోతులు పీకలదాకా తాగి వాకిలి ముందుకు వచ్చి తిష్ట వేశారు. వాళ్ళ వాలకం యిప్పుడప్పుడే కదిలేటట్లు లేదు.
అవంతి ఓ నిట్టూర్పు విడిచి తలుపు దగ్గర నుంచి యివతలికి వచ్చేసింది. సుత్తితో తాళం పగల కొడదామంటే పెట్టె తాళం వూడటం ఏమోగాని ఆ చప్పుడు బైటనున్న తాగుబోతులకి వినపడి వాడి పెళ్ళాం లోపల వుందేమో అనుకుని తలుపుల బాది బాది అరుస్తారు, దాంతో నలుగురు లేవటం ఖాయం. కనుక వాళ్ళు వెళ్ళింతరువాత సుత్తికి పని కల్పించడం మంచిది అనుకుంది.
అవంతి సుత్తి పని కాసేపు ఆపు చేసి అట్లకాడతో పిన్నీసుతో పెట్టె తాళం తీయటానికి ట్రై చేసింది. తాళంలో పిన్నీసు యిరుక్కుపోయింది!
కొద్దిగా వున్న తలనొప్పి అవంతికి ఎక్కువ అయింది.
కొద్దిసేపు రెస్టు తీసుకుని తర్వాత రంగంలోకి దిగాలి అనుకున్న అవంతి తలనొప్పి మాత్ర వేసుకుని మంచం మీద విశ్రాంతిగా పడుకుంది.
అవంతి విశ్రాంతి తీసుకోటం తప్ప నిద్ర పోదల్చుకోలేదు. దీర్ఘంగా ఆలోచిస్తూ ఊరికే కళ్ళు మూసుకుంది.
తలనొప్పికి తయారు చేసే మాత్రల్లో నిద్రపట్టే మందు కూడా కొద్దిగా వుంటుంది. అవంతి తలనొప్పి మాత్ర వేసుకుని పడుకోటంతో తనకి తెలియకుండానే అలానే నిద్రపోయింది.
అవంతి కోరుకున్న గోల్డెన్ ఛాన్స్ కి నిద్ర మొదటి అంతరాయం.
తానునిద్ర పోవటం వల్ల ఆ ఛాన్స్ పోవటం అటుంచి కొత్త ప్రమాదం వచ్చి పడనుందని అవంతి ఎరుగదు. అడుగడుగున ఎదురయ్యే ఆపదలు ప్రతిసారి తప్పించుకోటం సాధ్యమేనా, అవంతికి తెలియదు.
అవంతి గాఢనిద్రలో పడిపోయింది.
వాకిట్లో తాగుబోతులు రెండు కీర్తన్లు పాడేసి వాళ్ళూ నిద్రాదేవి వడిలో పడిపోయారు.
మళ్ళీ అంతటా నిశ్శబ్దం ఏర్పడింది.
ఈ ఉదయం ఎంతచెడ్డది, అనుకుంది అవంతి. పొరపాటు చేసింది తను. ఈ ఉద్యమ మంచిదికాదు. ఈ రోజు మంచిదికాదు. ఈ టైము మంచిదికాదు అనుకోటం సుద్ద తెలివితక్కువ.
ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని గట్టిగా నిర్ణయించుకుని ఫలానా టైముకి వెళ్ళాలని ముహూర్తం కూడా పెట్టుకుని చివరికి చేసింది ఏమిటి? మంచానికి కాళ్ళు నిగడదన్ని నిండా ముసుగు పెట్టుకుని తీయటి కలలు కంటూ రాత్రి అంతా రెస్ట్ తీసుకుని బారెడు పొద్దు ఎక్కిం తరువాత తీరుబడిగా లేచింది. అమ్మమ్మలు బామ్మలు అనుకున్నట్లు లేచినవేళ మంచిదికాదు, ఈ ఉదయం ఎంత చెడ్డది అనుకోడం తన తెలివి తక్కువ.
అవంతి లేస్తూనే చిరాకు పడింది. తన చిరాకు, కోపం ఎవరి మీద వెళ్ళగక్కాలో తెలియక తను లేచిన టైముని ఆ రోజుని తిట్టుకుంది. "డ్యూటీలో వుండగా ఇలాంటి పొరపాట్లు ఎప్పుడన్నా చేశావా' ఇడియట్, ఫూల్ అనుకుంటూ తనమీద తానే అక్షింతలు వేసుకుంది.
మంచంమీద నుంచి లేచి వెళుతుంటే పెట్టె తాళం తీయటానికి వుపయోగించిన సుత్తి కనపడింది. మరోసారి వళ్ళు మండింది. తన కోపమంతా సుత్తిమీద చూపిస్తూ బలంగా విసురుగా వక తన్ను తన్నింది. ఆ తన్నుకి వేళ్ళు నెప్పి చేశాయి. "అబ్బా" అనుకుంది బాధతో.
పగలు ఆ యింట్లోంచి వెళ్ళిపోదామంటే అవంతికి రెండు ఇబ్బందులు వున్నాయి. పెరటి తోవన వెళ్ళటం అన్నది ఎట్టి పరిస్థితులలో కూడా కుదరదు. రాజమార్గం వాకిలిగుండా వెళ్ళటం. కాని వాకిలి వేపు తాళంవేసి వుంది. పోనీ ఏదో విధంగా తలుపులు బద్దలుకొడదామన్నా ఇది రాత్రి కాదు. బైట తాళంవేసి వుండి లోపలనుంచి తలుపులు ఎవరో బద్దలు కొడుతుంటే అది ఎవరికంట అయినా పడితే ఇంతే సంగతులు.
ఇంటికన్నా గుడి పదిలం. గుడికన్నా జైలు పదిలం. ఈ ఇల్లు తనకి జైలు. ఈ జైలే తనకి పదిలం. ఈ రాత్రి పన్నెండింటికి వస్తే వస్తానన్నాడు ఇందర్. పన్నెండు లోపల రానని ఖచ్చితంగా చెప్పాడు కనుక....పెట్టె తాళం ఊడగొట్లే పని ఈ సాయంత్రం లోపల పూర్తి చేసి రాత్రి కాగానే రాత్రి పన్నెండు గంటల లోపున ఇక్కడనుంచి చెక్కేయాలి. అంతకు మించి మార్గం లేదు.
"అలా చేద్దాం. అంతకుమించిన మార్గం వేరేదారి లేవుకదా?" అనుకుని తృప్తి పడింది. ముఖం కడుక్కువచ్చి కాఫీ తయారుచేస్తూ కూర్చుంది. ఏదో శబ్దం....అవంతి వులిక్కిపడింది.