Previous Page Next Page 
జయ - విజయ పేజి 40


    "అవును! కానీ ఆ విషయం ఆలస్యంగా తెలుసుకున్నాను. అందువల్ల ఇద్దరి జీవితాలూ పాడయిపోయాయి."
    "ఇప్పుడు జయ మీ దగ్గరకొస్తే స్వీకరించగలరా?" అడిగాడు చంద్రకాంత్.
    కిషోర్ తెల్లబోయాడు.
    "మీరు పరిహాస మాడకూడదు ఈ విషయంలో!" అన్నాడు ఎర్రబడ్డ ముఖంతో.
    "ఇది పరిహాసం కాదు మిష్టర్ కిషోర్! నిజంగానే చెపుతున్నాను! జయ అంగీకరిస్తే మీరు ఆమెని స్వీకరించగలరా?"
    "ఆ విషయం మాట్లాడడం అనవసరమని నా అభిప్రాయం..." ఆ ప్రస్తావన నుంచి తప్పించుకోడానికి ప్రయత్నిస్తూ అన్నాడతను.
    "అవసరమని నా అభిప్రాయం!" తీవ్రంగా అన్నాడు చంద్రకాంత్.
    "దయ చేసి అలా మాట్లాడకండి!" దీనంగా అన్నాడు కిషోర్.
    కొద్దిక్షణాలు ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు.
    "నేనిక వెళ్తాను..." అన్నాడు కిషోర్ లేచి నిలబడుతూ.
    "సరే..." తనూ లేచి నిలబడుతూ అన్నాడు చంద్రకాంత్. కిషోర్ అక్కడినుంచి వడివడిగా వెళ్ళిపోయాడు.
    చాలాసేపటివరకూ ఏవేవో ఆలోచనలతో సతమతమయిపోతూ రోడ్ల వెంబడి పిచ్చాడిలా తిరిగాడు చంద్రకాంత్.
    ఇల్లు చేరుకునేసరికి అర్థరాత్రి అయిపోయింది.
    విజయ మెలకువగా కూర్చుని ఉంది. త్వరత్వరగా భోజనం వడ్డించింది. ఆమె తనకోసం పడుతున్న శ్రమ చూస్తూంటే ఆశ్చర్యంగా ఉంది. చెల్లెలి భర్తకోసం అంతగా పాటుపడాల్సిన అవసరం ఏముంది? మర్నాడు ఉదయం అతను నిద్రలేచేసరికి ఆలస్యమైపోయింది.
    జయ కాఫీ తెచ్చి అతనికందించింది.
    "నిన్న మీ ఫ్రెండ్ కిషోర్ కనిపించాడు." అన్నాడతను.
    ఆమె మొఖంలో కలవరం, భయం స్పష్టంగా కనిపించినాయతనికి.
    "ఎక్కడ?" అడిగింది హీన స్వరంతో.
    "వాళ్ళింటి దగ్గరే! ఇద్దరం చాలాసేపు కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాం."
    జయ గుండెలు వేగంగా కొట్టుకోసాగినయ్.
    "నువ్వూ, కిషోర్ ప్రేమించుకున్నారట గదా?" సూటిగా అడిగాడతను.
    జయ కంపించిపోయింది. ముఖంలో నెత్తురు లేదు. అబద్ధం ఆలోచించి చెప్పే అవకాశమే లేదు.
    "అ...అ...అవును."
    "మరి వివాహం ఎందుకు చేసుకోలేదు?"
    "అతను చెప్పలేదా?" ధైర్యం తెచ్చుకుంటూ అడిగిందామె.
    "చెప్పాడు! అతని తెలివితక్కువ తనం వల్లే వివాహం జరగలేదన్నాడు! నాకు అర్థంకాలేదా మాటలు!"
    జయ అవమానం భరించలేకపోతోంది. అతను తనను అవమానించాలనే అలా మాట్లాడుతున్నాడు.
    అతనికీ విషయాలన్నీ కిషోర్ ఎందుకు చెప్పివుంటాడో తనకు తెలుసు. అప్పుడు గాని చంద్రకాంత్ తనను వదిలేయడనీ, చంద్రకాంత్ వదిలేశాక అప్పుడు తను వివాహం చేసుకోవచ్చని కిషోర్ ఆశ.
    కిషోర్ మీద కోపం ముంచుకొచ్చిందామెకి.
    అతని మూర్ఖత్వం వల్ల తమ వివాహం జరగనందుకు తను బాధపడటం లేదు. కానీ అతను ఇప్పుడు మూర్ఖత్వంగా తనను పొందాలనుకోవడం బాధ కలిగిస్తోంది."
    "బావుంది! ప్రేమించడం అంతా కాఫీలకూ, సినిమాలకూ తిరగడమని అతని ఉద్దేశ్యమా? లేక అన్ని సుఖాలు అనుభవించాలని..."
    "ఆపండి!" గట్టిగా అరిచిందామె.
    "దయచేసి నన్నింకేమీ అడక్కండి." అక్కడ నుంచి లేచివెళ్ళిపోయిందామె.
    వాళ్ళిద్దరి మాటలూ లోపలినుంచి వింటున్న విజయ తల్లడిల్లిపోయింది. ఆమెకు అర్థమయిపోయింది.
    అతనికంతా తెలిసిపోయినట్లే! ఇక ఈ నాటకానికి తెరపడిపోతుంది. అయితే ఆ తరువాత ఏం జరుగుతుందో ఊహించలేకపోతుంది. చాలాసేపు చలనం లేకుండా అక్కడే కూర్చుండిపోయాడు చంద్రకాంత్. జయ ఆఫీస్ కెళ్ళలేదు. ముగ్గురూ ఒకరికొకరు ఎదుటపడకుండా చాలాసేపు గడిపారు.
    తరువాత తన గదిలోకెళ్ళి పెద్ద చెక్క పెట్టి తెరచి అందులో అడుగున పడివున్న ఉత్తరాల కట్ట బయటకు తీశాడు. అవన్నీ విజయ రాసిన ఉత్తరాలే!
    ఒక్కొక్క ఉత్తరం చదువుతోంటే అతని హృదయం బరువెక్కిపోసాగింది. ఆ ఉత్తరాలు రాసింది జయ కాదని ఇట్టే తెలిసిపోతోంది. ఆ ఉత్తరాల్లో ప్రతి అక్షరం విజయ వ్యక్తిత్వాన్ని తెలుపుతోంది.
    అలా ఉత్తరాల ముందు ఎంతసేపు కూర్చుండిపోయాడో తనకే తెలీదు. స్పృహలో కొచ్చేసరికి బాగా పొద్దుగూకి పోయింది. అవతలి గదిలో నుంచి విజయ దేముడి గదిలో జరుపుతున్న ప్రార్థనా గీతం వినిపించింది. నెమ్మదిగా ధీనంగా, ప్రశాంతంగా పాడుతుందామె.
    అంతకుముందు చాలాసార్లు ఆ ప్రార్థన విన్నాడతను. కానీ ఏనాడూ ఆ ప్రార్థనలో ఇంత దీనత్వం, ఇంత పరవశత్వం కనిపించలేదు.

 Previous Page Next Page