టూ లేట్
పది రోజుల కంపెనీ పనిమీద కలకత్తా వెళ్ళి వచ్చేసరికి .... జానకి పెళ్ళి శుభలేఖ వచ్చి వుంది! ఆశ్చర్యపోయాను! తెల్లబోయి చూశాను.
జానక్కి పెళ్ళా? తనకి తెలియకుండా, తనని అడగకుండానే! తనకి చెప్పకుండానే .... ఏమిటిది! ఎందుకిలా జరుగుతూంది! ఇంత తొందరగా జానక్కి సంబంధం ఎందుకు కుదుర్చుకున్నారు? కనీసం అమ్మ వాళ్ళయినా రాయలేదేమిటి?
ఆత్రుతగా వరుడి పేరు చూశాను. ఎవడో బి. సూర్యనారాయణ, ఎవడయితే నాకెందుకు!
అసలిలా ఎందుకు జరిగిందన్నది నా బాధ! ఆలోచించి అలోచించి తల బ్రద్దలయింది. ప్రయాణం చికాకుకి తోడు అదో చికాకు! సంగతేమిటో తెలియని బాధ భరించరాని దయింది.
ఎల్లుండి రాత్రి పెళ్ళి! పెళ్ళికి వెళ్లాలా? ఎందుకు వెళ్లడం? నాకేం అవసరం! మాట మాత్రం అయినా చెప్పకుండా పెళ్ళి చేసుకుంటున్న వాళ్లింటికి నేనెందుకు వెళ్లాలి. పెళ్లికి వప్పుకునే ముందు.... కనీసం జానకయినా ఓ ఉత్తరం ముక్క రాసి నీ అభిప్రాయం ఏమిటని అడిగితే ఎంత బాగుండేది! ఆ తర్వాత చేసుకోవచ్చుగా ఆ పెళ్ళి! కనీసం అమ్మయిన నాన్నయిన రాయొచ్చుగా, వాళ్ళకి తెలియదేమో!
తలచుకున్నకొద్ది వళ్ళు మండుతుంది. అందరిమీద కోపం వస్తూంది. ఏదో కసి, ఉడుకుమోత్తనం వస్తున్నాయి. మనసంత అవ్యక్తమైన బాధ నిండింది. ఎవరిని ఏమనాలో, ఎవరిది తప్పో, ఎందుకిలా జరిగిందో, అన్న ప్రశ్నలు సందేహాలు, మనసుని పిండేస్తున్నాయి.
స్నానం అన్నా చేయకుండా అలా ప్రక్కమీద వ్రాలిపోయాను. పెళ్ళికి వెళ్ళకుండా, అసలు సంగతి తెలియకుండా బాధపడుతూ కూర్చోడం కంటే వెళ్ళి సంగతి ఏమిటో తేల్చుకోడం మంచిదేమో! కష్టమైనా సంగతి తెలిస్తే భరించగలననిపించింది.
ఎల్లుండి రాత్రి పెళ్ళి, రాత్రి ట్రైయిన్ ఎక్కితే ఎల్లుండి ప్రొద్దుటికి చేరగలను.! ఆ ఆలోచన వచ్చాక ఇంకా ఆలస్యం చేయలేదు.
రాత్రి ట్రైయిన్ ఎక్కేక మనసు కాస్త స్థిమితపడింది. ఆరాటం, ఆందోళన కాస్త తగ్గినట్లనిపించింది.
* * * *
రిక్షా సందు మలుపు తిరగకుండానే బాజాలు గట్టిగా వినిపిస్తున్నాయి. రిక్షా దిగాను. పందిళ్ళు, రాటలు, రంగవాటికలు. చాందినీలు, కుర్చీలు అంతా అట్టహాసంగానే వుంది వీధి పందిరి.
పందిట్లో స్నాతకం అవుతూంది నేను లోపలికి వెళ్ళేసరికి. హడావిడిగా తిరుగుతున్న మామయ్య నన్ను చూశారు. ఒక్క క్షణం మామయ్య మొఖం అదోలా అయింది. పై నున్న జరీకండువాతో మొహం తుడుచుకుంటున్నట్టు తన మొహం చాటు చేసుకున్నారు. నేను ముందుకు వెళ్ళడం చూసి, అప్పుడే, నన్ను చూసినట్టు ఆశ్చర్యంగా మొఖం పెట్టాడు. నవ్వాడు "ఏరోయ్ ఇదేనా రావడం! .... నిన్న సాయంత్రానికి కూడా రాకపోతే యింక రావనుకున్నాం" అన్నాడు.
"రావనుకున్నాం" అన్న మాటలో ఎలా వచ్చావు అన్న అర్థం వినిపించింది నాకు.
"పద, పద లోపలికి వెళ్లి కాఫీ గట్రా తాగి స్నానం చెయ్యి" అంటూ ఇంకో ప్రక్కకి వెళ్ళిపోయారు. నాలుగడుగులు వేశాను లోపలికి.
పందిట్లోంచి అమ్మ నన్ను చూసింది గాబోలు లేచి వచ్చింది.
"మురళీ వచ్చావా!" అంది .... తర్వాత నెమ్మదిగా "రావనుకున్నాను" అంది.
"నాన్నగారేరమ్మా!"
"రాలేదు, నేను ఒక్కర్తినే వచ్చాను...." అంటూ నా మొహంలోకి అదోలా చూసింది.
ఇంతలో ఏదో పట్టుకుని అటు వెడుతున్న అత్తయ్య నన్ను చూసి గతుక్కుమంది! అందో లేక నా కలా అనిపించిందో! ఏమయ్యా వచ్చావూ!" అంటూ దీర్ఘం తీసింది.
నాకు వళ్ళు మండింది. అందరూ ఒకటే మాట! "వచ్చావూ" అంటూ, రాననుకున్నారా, ఎందుకు రాకూడదూ! .... లేక ఏ మొహం పెట్టుకుని వచ్చావు అని అడగడమా ఇది! జానక్కి పెళ్ళవుతూంటే ఓర్వలేననుకున్నారా? చూసి ఏడ్చుకుంటాననుకున్నారా?
వళ్ళు మండుతున్నా నవ్వుతూనే అన్నాను. "ఏం రావద్దనుకున్నారా? రాకూడదనుకున్నారా? రాలేననుకున్నారా" నవ్వుతూ అన్నా ఆ మాటల్లో వున్న కఠినత నాకే వినపడింది. అత్తయ్య మొఖం అదోలా పెట్టింది. "అయ్యో, రావద్దనుకుంటే శుభలేఖ ఎందుకు వేస్తాం! నీలాంటి పెద్ద ఆఫీసరు రాతగడానికి సరిపోరని నీవనుకోవాలిగాని మేము ఎలా అనుకుంటామయ్యా."
"ఓహో, నా ఆఫీసరుతనం ఇవాళ క్రొత్తగా తెల్సినట్టుంది!" కయ్యానికి కాలు దువ్వాను.
పనుంది గాబోలు అత్తయ్య నవ్వేసింది. "పోట్లాటకి వచ్చినట్టున్నాడు వదినా మీ అబ్బాయి ...." ఆడపడుచుకి ఫిర్యాదు చేసింది.
"పోట్లాటకి రావాల్సిన అవసరం వాడికేమిటి వదినా!" అమ్మ అర్ధవంతంగా నా వైపు చూస్తూ అంది.
"సరే గానీ పదవోయి, కాఫీ అది త్రాగి స్నానం చేయి .... మీ అబ్బాయి సంగతి చూడవమ్మా వదినా, అంతా అయ్యాక ఇప్పుడు మన వాదన ఎందుకు?" గుంభనంగా అంది వెడుతూ అత్తయ్య.
అమ్మ నావైపు అత్తయ్యవైపు చూసింది "చూశావా ఆ మాటలు" అన్నట్టు. నాకంతా అయోమయంగా వుంది. ఇద్దరూ ఒకరినిమించి ఒకరు నిగూఢంగా మాట్లాడిన ఆ మాటల్లో నాక్కావలిసిన జవాబు ఏదీ దొరకలేదు.
"పదరా!" అంది అమ్మ లోపలికి దారితీస్తూ. నా పెట్టె, బెడ్డింగు చుట్టాలకి ఇచ్చిన గదిలో పెట్టించింది. ఇద్దరం వంట పందిట్లోకి వెళ్ళాం.
"పంతులు గారూ, కాస్త కలిపి ఇద్దురూ, మావాడొచ్చాడు యిప్పుడే!" వంటాయనతో అంది అమ్మ.
"తమరి అబ్బాయి గారా, ఏం చేస్తున్నారు? ...." వంటాయన ప్రశ్నలు అమ్మ జవాబులు, ఏవీ నా తల కెక్కడం లేదు. నా కళ్ళు ఆరాటంగా చుట్టూ చూస్తున్నాయి. కావల్సిన మనిషి కనపడక నిరుత్సాహం వేసింది. "ఉప్మా వుంది, తింటావా? చల్లారిపోయినట్టుంది...." అమ్మ అడిగింది. వద్దన్నాను, అమ్మని అడగాలి! ....ఇలా ఎందుకు జరిగిందో... చుట్టూ మనుష్యులు.... ఎలా అడగడం?.
"నిక్షేపంలాంటి మేనరికం వుండగా పై సంబంధం చేస్తున్నారేం...." వంట హెడ్డు గాబోలు సావకాశంగా కత్తిపీట ముందు కూర్చుని కూరలు తరిగి పోస్తున్నాడు.
"వుంటే మాత్రం అన్నీ జరుగుతాయా? ఎవరికెవరు రాసిపెట్టారో!" అమ్మ నావైపు చూస్తూ అంది. నేను చూపులు తప్పించాను.