Previous Page Next Page 
నయనతార పేజి 40


    "లీలా! ఈయన అవధానిగారని నా చిన్ననాటి గురువుగారు. రైల్లో కనిపిస్తే మనింటికి ఆహ్వానించాను" అంటూ భార్యని పరిచయం చేశాడు కామేశం.
    లీల వినయంగా నమస్కరించింది.
    "లీలా, ముందు కాఫీ పంపించు. ఆ చేత్తో ఏదయినా ఫలహారం కూడా చేయించు. ఉదయం అనగా ఎప్పుడో భోంచేశారు మేష్టారు. మాష్టారు గారికి గెస్టురూము సర్దించు"... కామేశం భార్యకి పురమాయించాడు.
    అవధానిగారి కోసం ఓ గది కేటాయించారు. ఆయన సదుపాయాలు భార్యాభర్తలిద్దరూ స్వయంగా చూశారు. ఆయనకేలోటు రాకుండా చూడాల్సిన బాధ్యత భార్యకే అప్పగించాడు కామేశం.
    రాత్రి భోజనాల దగ్గిర కామేశం దంపతులు బలవంతం చేసి అవధానిగారి మొహమాటాన్ని వెనక్కి నెట్టించారు. ఆ ఇంటిని, ఆ ఇంటి పొందికని, ఆ దంపతులని, వాళ్ల పిల్లల్ని, వాళ్ళ భోగభాగ్యాల్ని వారు తనపట్ల చూపుతున్న ఆదరాభిమానాలని చూసి అవధానిగారు తబ్బిబ్బు అయిపోయారు.
    భోజనం చేస్తూ, మాటల సందర్భంలో కామేశం అన్నాడు___
    "మాష్టారూ, మీ సూర్యం ఇక్కడే వున్నాడు తెలుసా?"
    "సూర్యం!... సూర్యం అంటే నీ క్లాస్ మేట్ అతనే కదూ!"
    "ఆ...ఆ...అతనే. మీ అనుంగు శిష్యుడే!" అదోలా నవ్వాడు.
    "ఇక్కడే వున్నాడా? ఏం చేస్తున్నాడు?"
    "నా ఆఫీసులోనే గుమస్తా"
    "గుమస్తానా?!... అంత బ్రిలియంట్ స్టూడెంట్!" అప్రయత్నంగా మాష్టారి నోటివెంట అపనమ్మకం, నిరాశ లాంటి అనుభూతులు మిళితమయి వినిపించాయి.
    కామేశం నుదురు చిట్లించాడు.
    "అదేమిటోయి కామేశం, సూర్యం ఎందుకలా అయ్యాడు? పైకి చదవలేదా? ఎంతవరకు చదివాడు?" ఆత్రుతగా ప్రశ్నించారు.
    "ఏమో...అవన్నీ నాకు తెలియవండి, ఇంటర్ లోనే చదువు మానేసినట్టున్నాడు..." ముభావంగా అన్నాడు కామేశం.
    "అయ్యో పాపం! ఎంతో తెలివైనవాడు పైకి వస్తాడనుకునేవాడిని, ఇలా అయ్యాడా చివరికి!" మేష్టారు ఆవేదనగా నిస్పృహగా అన్నారు. "అయితే, ఎప్పుడైనా ఇక్కడికి వస్తుంటాడా? అతని ఇల్లెక్కడో నీకు తెలుసా?" కుతూహలంగా ప్రశ్నించారు.
    "అతని ఇల్లు నాకెందుకు తెలుస్తుంది చెప్పండి! ఎప్పుడయినా, ఆఫీసు పనిమీద అతనే ఇక్కడికి వస్తుంటాడు" ముభావంగా అన్నాడు కామేశం.
    కామేశం ముభావత చూశాక చటుక్కున గుర్తువచ్చింది మాష్టారికి. కామేశం ఉన్నతోద్యోగి అని, సూర్యం అతనికి చాలా క్రింద గుమాస్తా అని! ఇంక ఆ విషయమేం అడక్కుండా మాట మార్చేశారు.
    ఆ రాత్రి మెత్తని పరుపు మీద చల్లని గాలి వీచే ఫ్యాను క్రింద పడుకుని ఏనాడూ అంతటి అదృష్టానికి నోచుకోని మాష్టారు ఆదమర్చి నిద్రపోవలసిందిపోయి కంటికి కునుకు రాక, మెదడంతా ఆలోచనలతో గజిబిజి అయి మదనపడ్డాడు.
    కామేశం పెద్ద ఉన్నతోద్యోగి! సూర్యం అతనిక్రింద గుమస్తా! ఆయన అంచనాలు ఎంత ఘోరంగా తారుమారయ్యాయి? కామేశం ఎంత అల్లరి చిల్లరగా తిరిగేవాడు! ఎప్పుడూ చదువులో అందరికంటే వెనకే! అల్లరిలో మొట్టమొదట! తనచేత ఛీవాట్లు తినని రోజు వుందా? ఏ పేపర్లోనూ పది మార్కులు రాకపోయినా ఏదో పేరుమోసిన జడ్జిగారబ్బాయని చూసి చూడనట్టు పైకి నెట్టేవాడు. కాని స్వతహాగా ఏ పరీక్షా ప్యాస్ గాలేదు. ఆడపిల్లలను ఏడిపించడం, పేర్లు పెట్టడం, గోడల మీద రాయడం, మేష్టర్లని ఎగతాళి చెయ్యడం, ఎవరన్నా ఏమయినా అంటే రౌడీ మూకని వెనకేసుకుని అల్లరి_ ఇదే ధ్యాస తప్పించి చదువులేదు. మిగతా మేష్టర్లంతా విసుగుపుట్టి అతని కర్మానికి అతన్ని వదిలి ఊరుకున్నారు. ఆయనమాత్రం ఒక విద్యార్థి అలా పాడవడం చూస్తూ ఊరుకోలేక కామేశాన్ని సంస్కరించ పూనుకున్నారు కొన్నాళ్ళు. "చూడు కామేశం, సూర్యాన్ని చూసి నేర్చుకో, బాగుపడే లక్షణాలు అవి, మీ నాన్నగారి పేరుప్రతిష్ఠలు చూడు, ఆయన పేరు చెడకుండా వుండాలనైనా కొంచెం చదువు. రోజుకో డ్రస్, నిగనిగలాడే బూట్లు కట్టుకుని స్టైలుగా తయారవడమేగాని, పొట్ట చించినా అక్షరం ముక్కలేదు. నీలాంటివాడు నా క్లాసులో వుండడం నాకే సిగ్గుచేటు, అవమానం!" ఇలా అనేకవిధాల అతన్ని మంచిగా ఒకప్పుడు రెచ్చగొట్టి పౌరుషం తెప్పించి మరొకప్పుడు, ప్రయత్నించారాయన. కాని, ఫలితం శూన్యం. "ఆ సూర్యంగాడికి నాకూ పోలికా! వాడొక పుస్తకాల పురుగు. నాకలా ఇరవై నాలుగు గంటలూ బుర్ర పుస్తకాల్లో దూర్చి కూర్చోడం చేతకాదు. వాడికంటే గతిలేదు కాబట్టి చచ్చినట్లు రుబ్బుతాడు. నాకా అవసరం లేదు. వాడిలా చదివితే వాడికంటే బాగానే వస్తాయి మార్కులు!" "స్కూలుకి కుళ్ళు బట్టలు, కంపు బట్టలు వేసుకు రావాలి గాబోలు. ఆ సూర్యం గాడిలాగ! కుళ్ళు బట్టలు కట్టుకుంటే చదువొచ్చినట్టే గాబోలు! కాస్త బాగుంటే చూడలేక ఏడుస్తారు కుళ్ళు వెధవలు" అలా నోటికొచ్చినట్లు మేష్టారికి వినిపించేటట్లు పరుష వాక్యాలు మాట్లాడేవాడు కామేశం. ఇక ఆ తర్వాత మాష్టారు కూడా ఆశ వదులుకుని అతని గురించి పట్టించుకోడం మానేశారు. ఒక విధమైన ఏహ్యం ఇద్దర్లోనూ ఒకరియెడ ఒకరికి పెరిగి గోడలా నిల్చింది. కామేశాన్ని బాగుపరచదల్చుకున్న అవధానిగారికి కలిగిన నిరాశ అప్పట్లో అతన్ని ద్వేషించేటట్టు చేసింది. తండ్రి ఆర్జించాడు గాబట్టి ఎలాగో పొట్టపోసుకుంటాడని అతని జోలికి పోవటం మానేసి, అతని ఉనికే పట్టనట్టూరుకొనేవారు.

 Previous Page Next Page