అందరూ ఆదిత్య వేపే వింతగా చూస్తున్నారు. అందులో ఆరాధన, భక్తి రెండూ వున్నాయి.
"ఇక ఏం ఫరవాలేదు" లక్ష్మమ్మ వేపు చూస్తూ అన్నాడు ఆదిత్య.
"చల్లగా... నూరేళ్ళూ హాయిగా బ్రతుకు బాబూ! ఎక్కణ్ణుంచి వచ్చావో... దేవుడిలా వచ్చావ్. నువ్వే సమయానికి రాకపోతే నా కూతురు నిలువునా నీళ్ళపాలయ్యేది..." దుఃఖం, సంతోషం కలగలిసిన చూపులతో అంది లక్ష్మమ్మ.
"ఏవ్ లక్ష్మమ్మా!రంగమ్మ ఎందుకే నీళ్ళలో పడింది?" ఎవరో లక్ష్మమ్మను అడిగారు.
"ఏం చెప్పన్రా గోవిందూ? వెంకటాపురంలో వున్న యాదగిరిగాడు దాని బావ! ఈళ్ళిద్దరికీ మనువు కుదిర్చాంగదా? పెళ్ళికి ఏర్పాట్లు చేస్తున్నాం గదా? పెళ్ళయ్యాక వెంకటాపురంలో కాదు, ఇక్కడే వుందాం అన్నాట్ట! ఇది యిక్కడ నేను చచ్చినా వుండనని అందట... ఇద్దరూ జగడాలాడుకుంటున్నారు. ఆడు కోపంతో వెంకటాపురం వెళ్ళిపోయాడు పొద్దున్నే. తన మాట ఆడు వినడం లేదని..." చెప్పింది లక్ష్మమ్మ.
"ఏవే రంగమ్మా! ఆ మాత్రం దానికి బావిలో దూకెయ్యాలిటే...? ఇంకా పెళ్ళి కాలేదు. మూడు రాత్రులూ కాలేదు. మొగుణ్ని నీ కొంగున కట్టేసుకోవాలంటే ఇలాగే? భలేదానివే... పెళ్ళయ్యాక అలాగే వెంకటాపురంలోనే కాపురం పెడుదూగానిలే! నేనున్నానా ఊరి పెద్దను?" అరవై ఏళ్ళ వ్యక్తి చెబుతున్నాడు.
మెలుకువ వచ్చిన రంగమ్మ చుట్టూ మూగిన జనాన్ని, తన పక్కనే కూర్చున్న ఆదిత్యనూ చూసి ముందు భయపడి, తర్వాత సిగ్గుపడి. గబుక్కున లేచి ఎదురుగా వున్న గుడిసెలోకి పారిపోయింది.
తలోమాటతో అందరూ నవ్వుకున్నాక, అందరి దృష్టీ ఆదిత్య మీద పడింది.
"ఎవరు బాబూ నువ్వు?" రంగమ్మకు ధైర్యం చెప్పి ముసలాయన అడిగాడు ఆదిత్యను.
ఆదిత్య చుట్టూ గ్రామాన్ని చూస్తున్నాడు.
చిన్న గ్రామం...
ఇక్కడ ధరణి భార్య, పిల్ల వుంటున్నారంటే నమ్మశక్యంగాలేదు ఆదిత్యకు.
రెండువేపులా ఇళ్ళు, సగంవరకూ వెళ్ళిన దారి ఒక మలుపు తిరిగింది. ఆ మలుపులో ఒక శివాలయం. చుట్టూ సగం పడిపోయిన గోడలు!
"ఇదేనా శివదేవునిపల్లి?" అడిగాడు ఆదిత్య.
ఔనన్నట్టుగా తలూపారు జనం.
"ఊరంతా ఇదేనా?"
"ఆ ముందుకెళితే బడి వుంది. పంతులుగారు లేరు. పంతులుగారు ఎప్పుడో తోచినప్పుడు వెంకటాపురం నుంచి వస్తారు."
"పోస్టాఫీసూ, పోలీస్ స్టేషనూ, కిరాణాషాపులూ ఏవీ లేవా?" అడిగాడు ఆశ్చర్యంగా.
"అవన్నీ వెంకటాపురంలో వున్నాయి" అమాయకంగా చెప్పాడు ఓ యువకుడు.
"నువ్వు గవర్నమెంటోడివా అన్నీ అడుగుతున్నావ్?" వూరి పెద్ద మళ్ళీ అడిగాడు.
ఏం చెప్పాలో తోచక ఔనన్నట్లుగా తలూపాడు ఆదిత్య.
"మీరు తప్ప ఇక్కడ ఇంకెవరూ లేరా?" అడిగాడు ఆదిత్య.
"ఎందుకు లేరు? మా సుమమ్మ వుందిగా! ఆయమ్మే మాకన్నీ నేర్పుతుంది."
సుమమ్మ...
"అంటే... సుమబాల..." ఆదిత్య ఆశ్చర్యంగా అన్నాడు.
"నీకెరికా?"
"తెలుసు..."
"అలా చెప్పు ధరణిబాబు ఫ్రెండువా నువ్వు?"
తలూపాడు ఆదిత్య.
"సుమబాల ఉండేది ఇక్కడేనా?" మరింత ఆశ్చర్యంగా అడిగాడు ఆదిత్య.
"ఇక్కడంటే ఇక్కడ కాదు... కొంచెం దూరంలో."
దిగ్గున లేచి నిలబడ్డాడు ఆదిత్య.
"అక్కడేదైనా ఇల్లుందా?"
"ఇల్లా? పెద్ద బిల్డింగు వుంది."
"పెద్ద బిల్డింగా?"
"ఔ..."
"ఈ అడవి ప్రాంతంలో సుమబాల ఒంటరిగా వుంటోందా?" తనను తానే ప్రశ్న వేసుకున్నాడు ఆదిత్య.
అదే అడిగాడు.
"మేం లేవూ? ధరణిబాబు వచ్చేంతవరకూ ఆయమ్మకు ఏ హానీ జరక్కుండా చూసుకునే పూచీ మాది..." అన్నాడు వూరి పెద్ద.
"ధరణిబాబు ఎక్కడికి వెళ్ళాడు?"
"సుమమ్మ మాకెప్పుడూ చెప్పలేదు. మేం అడగలేదు. వచ్చేస్తాడు. అమెరికాలో వుండాల్సినవాడు అడవిలో వున్నాడు."
"సుమమ్మ ఉండే భవనం నాకు చూపిస్తారా?" అడిగాడు ఆదిత్య.
"సుమమ్మకు ఏం కావాల్సివచ్చినా మా రంగే చేస్తుంది బాబూ...! ఆయమ్మతో మా రంగికి స్నేహం ఎక్కువ" అని చెప్పిన లక్ష్మమ్మ-
"రంగీ! రంగమ్మా..." అని పిల్చింది.
రంగమ్మ గుడిసెలోంచి బయటికొచ్చింది.
"ఈ బాబుకి ధరణిబాబు ఇల్లు చూపించు" చెప్పింది లక్ష్మమ్మ.
రంగమ్మ అప్పటికే పువ్వులా తయారైంది.
"రండి బాబూ!" ముందుకడుగేసింది రంగి.
ఆమె వెనకే నడిచాడు ఆదిత్య.
ముందుకెళుతున్న అతని వేపే వింతగా చూస్తున్నారు జనం.
* * * * *
ఒక పక్కపచ్చటి పొలాలు... ఇంకోపక్క కళ్ళాలు... స్వచ్చమైన నీటితో నీటిలో తామరలతో అందంగా కన్పిస్తున్న చెరువు... చెరువుకి ఆనుకుని మట్టిదారి...
రెండు కిలోమీటర్లు నడిచాక దృశ్యం మారిపోయింది.
"అదే ధరణిబాబు, సుమమ్మల బిల్డింగు"దూరంగా చెట్ల చాటునుంచి కన్పిస్తున్న పెద్ద రాతి భవనాన్ని చూపిస్తూ అంది రంగి.
అది దాదాపు చిన్నసైజు కోటలా వుంది.
వెస్ట్రన్ స్టయిల్లో కట్టిన రాతిభవనం సువిశాలమైన తోట మధ్యన వుంది. పెద్ద ఐరన్ గేటు... గేటు తర్వాత రకరకాల చెట్లు- ఒక పక్క అందమైన పాలరాతి శిల్పం ముసుగు సవరించుకుంటున్న అమ్మాయి. మెయిన్ గేటు నుంచి బంగ్లావరకు వెళ్ళటానికే పావుగంట పడుతుంది. సుమారు ఆ ఇంటి ఆవరణ వైశాల్యం నూటయాభై ఎకరాలు వుంటుంది.
చిన్నసైజు ఎస్టేటులా వున్న ఆ బంగ్లాని చూసి ఆశ్చర్యపోయాడు ఆదిత్య.
అడవిలాంటి ప్రదేశంలో ఆ బిల్డింగ్... చాలా ఆశ్చర్యంగా వుంది అతనికి.