ఓడిపోయిన ముగ్గురు మగాళ్ళు దగ్గరికి వచ్చింది నెఫెర్. వాళ్ళు భయభ్రాంతులై నిలబడి ఉన్నారు.
"దున్నల్లా ఉండికూడా ఓడిపోయారు! సిగ్గు లేదూ?" అంటూ ఆడపిల్లలు వేళాకోళంగా గిల్లినట్లు గిల్లింది వాళ్ళని.
ఆమె పొడుగాటి గోళ్ళకి ఎంత తీవ్రమైన విషం పూసుకుని ఉందోగానీ, ఆ ముగ్గురూ నురుగులు కక్కుతూ క్రిందపడి పోయారు.
"ఆగు!" అంటూ ఒంగి, వాళ్ళని లేవదీయబోయాడు సందీప్.
తన తలలోని ఒక పువ్వుని తీసి, అరచేతితో నులిమి, అతని ముక్కు దగ్గర ఉంచింది నెఫెర్.
జరుగుతున్నదేమిటో గ్రహించే లోపలే స్పృహ తప్పింది సందీప్ కి.
అతను మళ్ళీ కళ్ళు తెరిచేసరికి ఆ పూలపొదలోనే పడుకుని ఉన్నాడు. ఆకుల మధ్యనుంచీ సూర్యకిరణాలు ముళ్ళలా అతని కళ్ళలో గుచ్చుకుంటున్నాయి.
మెలకువ రాగానే అతనికి వచ్చిన మొదటి ఆలోచన స్వప్న ఎలా వుంది? ఎక్కడ ఉంచారు ఆమెని? భూతాలరాజు ఎక్కడ ఉన్నాడు? వాళ్ళిద్దరూ క్షేమంగానే ఉన్నారా?
ఉదయం విరిసిన పూలతో ముస్తాబు చేసుకున్న నెఫెర్ ఆ పొదలోకి వచ్చింది. అతని పక్కనే కూర్చుని మొహంలోకి చూసింది.
ఆడపిల్లలన్న సంకోచం లేకపోతే, బలం ఉపయోగించి వీళ్ళమీద తిరగబడగలడు తను. అందుకని, బలాన్ని మించిన సాధనం లౌక్యం, డిప్లొమసీ ఉపయోగించదలుచుకున్నాడు సందీప్. నవ్వుతూ నెఫెర్ వైపు చూశాడు.
నెఫెర్ కూడా బదులుగా చిరునవ్వు నవ్వింది. "నిన్న నీపట్ల దురుసుగా ప్రవర్తించవలసి వచ్చింది. ఏమీ అనుకోకు!" అంది రాజీగా.
"దురుసుగా ప్రవర్తించే ఆడపిల్లలంటేనే నాకు మోజు!" అన్నాడు సందీప్ ఆమెచుట్టూ చేతులు వేస్తూ. "వీళ్ళేరీ?" అన్నాడు యధాలాపంగా. భూతాలరాజు అనువాదం లేకుండానే అతను ప్రయత్నపూర్వకంగా వాళ్ళ భాషని మాట్లాడగలుగుతున్నాడు, అభినయం జోడిస్తూ.
కానీ అతని ప్రయత్నం అంతగా ఫలించినట్లు కనబడలేదు. అర్థంకానట్లు చూసింది నెఫెర్.
"ఒక మొగ, ఒక ఆడ నాతో వచ్చిన మనుషులు" అని సైగలు చేస్తూ అడిగాడు సందీప్.
సోగకళ్ళతో అతన్ని పరిశీలనగా చూసింది నెఫెర్. "నేను చెప్పను" అంది తల అడ్డంగా ఆడిస్తూ.
"చెప్పకపోయినా ముంచుకుపోయిందేమీలేదు." అని బద్దకంగా ఆవలించాడు సందీప్.
"ఆ అమ్మాయి అంటే నీకు చాలా ఇష్టమా" అంది నెఫెర్, జాగ్రత్తగా.
సమాధానంగా, ఒక కొమ్మమీద పాకుతున్న గొంగళిపురుగును చూపించి, మొహం అసహ్యంగా పెట్టాడు.
సంతోషంగా నవ్వింది నెఫెర్. అతని మీదకు ఒరిగిపోయి, పెనవేసుకుపోతూ, "నాకు నువ్వు కావాలి! ఇప్పుడే!" అంది నిస్సంకోచంగా.
ఆ గొంగళిపురుగు తనమీదే పడ్డట్లు ఫీలయ్యాడు సందీప్. అయినా పళ్ళ బిగువున సహించి, మృదువుగా ఆమె వెన్ను రాస్తూ, "ఇప్పుడా ? తెల్లారిపోయాక ?" అన్నాడు సూర్యుడిని చూపిస్తూ.
"ఏం తప్పేముంది? ఇదేమన్నా అసహజమైన పనా? అసహ్యమైన పనా?"
ఒకమ్మాయి తటపటాయించకుండా లోపలికి వచ్చి, తాజా పూలతో శయ్యను అమరుస్తోంది.
ఆ అమ్మాయి ఉనికిని పట్టించుకోకుండా అతని పెదిమలని తన పెదిమలతో రాసింది నెఫెర్. ఆమె ఊపిరి బరువుగా వస్తోంది. కళ్ళు కోరికతో ఎర్రబడుతున్నాయి. వళ్ళు వెచ్చగా అవుతున్నది.
"నేను పెరిగిన వాతావరణంలో ఎన్నో కట్టుబాట్లు ఉన్నాయి. అక్కడ అతిగోప్యంగా ఉంచుతాం ఈ విషయాన్ని. సభ్యత ఉన్న వాళ్ళెవరూ అసలు దీని ప్రస్తావనే ఎత్తరు. సిగ్గు పడతారు."
అర్థంకానట్లు ప్రశ్నార్థకంగా చూసింది నెఫెర్.
మరొక యువతి లోపలికి వచ్చి, తేనెలో ముంచిన రొట్టెలూ, మద్యం అక్కడ వుంచి కుతూహలంగా చూస్తూ అక్కడే నిలబడింది.