Previous Page Next Page 
హైజాక్ పేజి 41

ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర, రెండు చేతులూ పైకి ఎత్తి నిలబడి వున్నాడు రెడ్డి. ఆశ్చర్యంగా, అపనమ్మకంగా శతృఘ్నని చూస్తున్నాడు అతను. "శతృఘ్న!"
నిర్ఘాంతపోయాడు శతృఘ్న.
ఇక్బాల్, విక్టర్ కూడా రెడ్డిని చూశారు.
"అరె! ఎవరెడీ! నువ్వా?" అన్నాడు విక్టర్ ఎగ్జయిటెడ్ గా.
శతృఘ్న పెదిమలు మెల్లిగా కదిలాయి. "రెడ్డీ!" అన్నాడు అస్పష్టంగా.
"అవును! నేను రెడ్డినే?" అన్నాడు రెడ్డి శతృఘ్న కళ్ళలోకి సూటిగా చూస్తూ. "కానీ శతృఘ్నా! నువ్వు నిజంగా మా శతృఘ్నవేనా? నువ్వేనా ఈ ప్లేన్ ని..." హైజాక్ చేస్తున్నది అన్న మాటలు ఉచ్చరించడం ఇష్టంలేక సగంలో ఆపేసాడు రెడ్డి.
సంతోషం లేని నవ్వు నవ్వాడు శతృఘ్న.
తన కళ్ళతో చూస్తున్నదానిని తనే నమ్మలేనట్లు తల అడ్డంగా వూపుతూ అన్నాడు రెడ్డి.
"వెల్! అయితే నువ్వూ అందరిలాంటి వాడివేనన్నమాట! నీ ఆదర్శాలు అదృశ్యమయిపోయి ఆశయం అతిశయంగా మారిందన్నమాట! నీవాడిన మాటల వేడి కాలేజీ రోజులలోనే చల్లబడిపోయిందన్న మాట! చివరికి నవ్వుకూడా డబ్బుకి దాసోహం అనే స్థితికి దిగజారిపోయి, ఆ డబ్బు సంపాదించడానికి ఇంత ఎత్తు వేశావన్నమాట!
శతృఘ్నా! నిజంగా నువ్వు నువ్వేనా! ఆడపిల్లల పురువుని నిలపడానికి ధైర్యంగా గోడ ఎక్కి బ్రాసరీల తోరణాన్ని తెంపిపారేసి, ఆ రూడీమూకలతో రణం సాగించింది నువ్వేనా? అలాంటి నువ్వే ఇవాళ చీప్ క్రూక్ లాగా..."
సమాధానం చెప్పకుండా నిలబడి ఉన్నాడు శతృఘ్న.
"శతృఘ్నా! మన కాలేజీ డేస్ లో జరిగిన మరో ఇన్సిడెంట్ గుర్తుందా? 'పరులసొమ్ము పాముతో సమానం' అని చెబుతుండేవాడివి నువ్వు. నిన్ను టెస్ట్ చెయ్యడానికి నిశ్చయించుకున్నారు కొంతమంది క్లాస్ మేట్స్. ఒక వందరూపాయలనోటు నెంబరుని రహస్యంగా నోట్ చేసుకుని 'ఇది మా దగ్గరయితే ఖర్చయిపోతుందిరా! నీ దగ్గర దాచు! అవసరం వచ్చినపుడు తీసుకుంటాం! అని ఇచ్చారు నీకు. ఆరు నెలల తర్వాత వాళ్ళు అడిగితే, అచ్చం అదే నోటుని భద్రంగా తీసి ఇచ్చావు నువ్వు. ఆ ఆరునెలల్లో నువ్వు మెస్సు ఛార్జీలు కట్టక పస్తులున్న రోజులున్నాయి. కానీ శతృఘ్నా! అంతటి అవసరాల్లోనూ కూడా ఆ వందనోటుని కదపలేదు నువ్వు. నీ అవసరాల గురించీ, ఇబ్బందుల గురించీ, మా ఎవ్వరిదగ్గరా పెదవి మెదపలేదు. నువ్వు నిప్పులాంటి మనిషివని కథలు కథలుగా చెప్పుకునేవాళ్ళం మేము! అలాంటి...నువ్వు" అతని గొంతు వణికింది. "అలాంటి నువ్వు, డబ్బు కోసం ప్లేన్ ని హైజాక్ చేసి, రాన్ సమ్ గా డిమాండ్ చేసిన పదికోట్ల రూపాయలూ కొత్తనోట్లు ఇస్తే నెంబర్ల సాయంతో దొరికిపోతానని భయపడి, పాతనోట్లు, చిన్ననోట్లు కావాలని అడుగుతున్నావా శతౄ! దిసీజ్ ఇన్ క్రెడిబుల్!"
విరక్తిగా నవ్వాడు శతృఘ్న. "నువ్వొక నవల కొని నాతో కూడా చదివించావ్ గుర్తుందా? 'డాక్టర్ జెకిల్ అండ్ మిస్టర్ హైడ్!' 'మనిషిలో మనిషి' అని తెలుగు అనువాదం కూడా ఉంది దానికి. చాలా మంచి మనిషి అయిన ఒక డాక్టరు ఒక మందు తాగినప్పుడల్లా దుర్మార్గుడిగా ఐపోతుంటాడు. అలాగే మంచి సర్జను కావలసిన ఈ శతృఘ్న కూడా, ఈ సొసైటీ వీలయినంతగా తాగించిన కాలకూట విషంతో కుమిలిపోయి, కుమిలిపోయి దుర్జనుడిగా మారాడురా!" అన్నాడు.
మిత్రులిద్దరూ చాలాసేపటిదాకా ఒకరినొకరు తేరిపార చూసుకుంటూ ఉండిపోయారు.
తనని తాను అతికష్టంమీద తమాయించుకుని అన్నాడు శతృఘ్న.
"రెడ్డీ! బాగా చిక్కిపోయావురా నువ్వు! నల్లబడిపోయావ్ కూడా!"
"నువ్వు మహా బలిసినట్లు! చెంపలు చూడు ఎలా పీక్కుపోయాయో!" అన్నాడు రెడ్డి.
ఇద్దరూ మళ్ళీ ఒకళ్ళని ఒకళ్ళు అభిమానంగా చూసుకున్నారు.
"మెడమీద ఆ మచ్చలేమిటిరా? ఇదివరకు లేదనుకుంటానే!"
మెడ తడుముకుని చిన్నగా నవ్వాడు రెడ్డి. "ఎవరో ఒక గూండా వెధవ, పట్టపగలే హత్యచేసి పరారీ అయిపోయాడు. వాడికోసం రాష్ట్రమంతా గాలించాను నేను. చివరికి వాడు విశాఖపట్టణంలో ఒక ఇంట్లో దాక్కుని ఉన్నట్లు తెలిసింది. నేను పోలీసుననీ, అరెస్టు చెయ్యడానికి వస్తున్నాననీ తెలిస్తే ఆ సమాచారం వాడికి ముందుగానే ఎవరన్నా చేరవేయవచ్చు, వాడు ఏ దొంగదారిలోనే పారిపోవచ్చు. అందుకని పోస్ట్ మెన్ లా మేకప్ వేసుకుని వెళ్ళి తలుపు కొట్టాను. వాడు తలుపు తెరిచాడు. అయితే గడుసు పిండం అవడం వల్ల వెంటనే నేనెవరో గుర్తుపట్టేసి రివాల్వర్ తో కాల్చాడు నన్ను. మెడకి రాచుకుంటూ పోయింది గుండు. మొత్తానికి వాణ్ణి పట్టుకున్నాననుకో! ఆ తర్వాత రెండు నెలలు హాస్పిటల్లో ఉండి చచ్చి బతికాను."
"అప్పుడేమయింది? మెచ్చుకొని మేకతోలు కప్పారా నీకు? వెంటనే ప్రమోషన్ ఇచ్చారా?" అన్నాడు శతృఘ్న హేళనగా.
తల వంచుకున్నాడు రెడ్డి. "ప్రమోట్ చెయ్యలేదు తక్షణం డిమోట్ చేసి ఒక రిమోట్ ఏరియాకు ట్రాన్స్ ఫర్ చేసేశారు నన్ను. ఆ హత్య వెనక వెంకట్రావు అనే రాజకీయ నాయకుడి హస్తం ఉందని తర్వాత తెలిసింది నాకు."
వింటున్న వెంకట్రావు ఒక్కసారి ఉలిక్కిపడి, ఆ తర్వాత సర్డుకుని, తేలుకుట్టిన దొంగలా కిక్కురు మనకుండా కూర్చున్నాడు.
అప్పుడతన్ని మొదటిసారిగా గమనించాడు రెడ్డి, "గుడ్ మార్నింగ్ రావుసాబ్!" అన్నాడు చాలా మామూలుగా.
పొడుగాటి నమస్కారం పెట్టాడు వెంకట్రావు. భయంగా, తను పూనుకుని ఆఘమేఘాలమీద రెండోసారి ట్రాన్స్ ఫర్ చేయించిన ఈ రెడ్డి, మళ్ళీ ఇక్కడ ప్రత్యక్షమవడం విచిత్రంగా కనబడింది అతనికి.
"బ్లడీ షిట్!" అన్నాడు శతృఘ్న ఆగ్రహంతో వణికిపోతూ, "అర్థమయిందా ఈ దేశమెంత దౌర్భాగ్యమయిన దేశమో! మనుషులు మనుషుల్లా బతకలేరురా ఈ దేశంలో! బలం గలవాడు రాక్షసుడిలా బతకగలడు ఇక్కడ! బలం లేనివాడు కుక్కలా బతకాలి ఇక్కడ! అంతేగానీ మనిషి మనిషిలా బతకలేడురా! అందుకేరా నేను ఇలా మారింది."

 Previous Page Next Page