Previous Page Next Page 
హైజాక్ పేజి 42

"కానీ నేను మారలేదే!" అన్నాడు రెడ్డి. "మొండిగా నిలబడి, అన్యాయాలకి అడ్డం పడుతూ, చేతనయినంతగా మంచిని పెంచుకుందామని చూస్తున్నాను. సాధ్యమయినంతగా మనుషుల్ని మార్చాలని ప్రయత్నిస్తున్నాను. కానీ శతృఘ్నా! నువ్వు వెళ్తున్నదారి....."
"ఈ పాత చింతకాయ పచ్చడి నీతిబోధలు చేసి నన్ను మరిపించడానికి చూడకు! నీ తాత తరం కాదురా! ఈ కుళ్ళిపోయిన కుష్టురోగపు సొసైటీని మార్చడం! రెడ్డి! కుక్కలు సాటి కుక్కలను తినవురా! కానీ మనుషులు సాటి మనుషులని పీక్కుతినే దేశం ఇది! ఈ దేశంలో నువ్వు బతకాలంటే, పక్కవాణ్ణి చంపాలి! నువ్వు డబ్బు సంపాదించాలంటే, ఎదుటివాడ్ని నిలువు దోపిడీ చెయ్యాలి! నువ్వు సుఖపడాలంటే, మిగతా వాళ్ళని నరకయాతన పెట్టాలి!
అందుకే, అందుకేరా ఈ దేశం ముక్కుపిండి ఒక పదికోట్లు రాబట్టుకుని, వెళ్ళిపోదలుచుకున్నాను యాఁ! ఈ దేశం నాకు పదికోట్లు బాకీ! నా జీవితం పాడుచేసినందుకు నష్టపరిహారంగా!" ఆగ్రహంతో ఊగిపోతున్నాడు అతను.
కాసేపు తదేకంగా శతృఘ్నవైపు చూసి, తల పంకించాడు రెడ్డి "నువ్వు చాలా ఆవేశంలో ఉన్నావు శతృఘ్నా! ఇప్పుడు నేనేం చెప్పినా నీకు తలకెక్కదు!"
పిడికిళ్ళు గట్టిగా బిగించి, తనని తాను అదుపులోకి తెచ్చుకున్నాడు శతృఘ్న, ప్రయత్నపూర్వకంగా చిరునవ్వు నవ్వి, "ఆ విషయం ఇంక వదిలెయ్ బ్రదర్! పెళ్ళి చేసుకున్నావుట్రా?" అన్నాడు.
అవునన్నట్లు నవ్వుతూ తల ఊపాడు రెడ్డి.
"ఎంత మంది జూనియర్స్?"
"ఇంకా లేరు."
చిన్నగా విజిలేసి, గొంతు తగ్గించాడు శతృఘ్న.
"ఏరా! ఈ ఖాకీ బట్టలు అసలు ఇప్పడం లేదా ఏమిటి? ఇరవై నాలుగ్గంటలూ డ్యూటీ అని ఊళ్ళెంబడి తిరుగుతున్నావా? ఇంట్లో డ్యూటీ చెయ్యడం లేదా?"
నవ్వాడు రెడ్డి, "నువ్వు పెళ్ళి చేసుకున్నావా శతృఘ్నా?"
"పెళ్ళా!" అన్నాడు శతృఘ్న తమాషాగా. "ఈ రాక్షసుడు పెళ్ళి చేసుకుంటే ఇంకో రాక్షసినే చేసుకోవాలి. అలాంటి దెవరూ తగల లేదు, ఇంతవరకూ!"
నెమ్మదిగా తల ఎత్తి శతృఘ్న వైపు చూసింది సుజాత.
తర్వాత అక్కడ నిలబడే ఇక్బాల్ నీ, విక్టర్ నీ కుశల ప్రశ్నలు వేశాడు రెడ్డి. అతని మనసులో ఒకే భావం మెదులుతోంది. తాము నలుగురూ కాలేజీలో క్లాస్ మేట్సు, హాస్టల్లో రూంమేట్సు. ఇక్బాల్ ఇంటరుతో చదువుకి సలాం పెట్టెయ్యగా, తానూ, విక్టర్ మాత్రం గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.
తమలో ప్రొఫెషనల్ కోర్సుకి వెళ్ళింది శతృఘ్న ఒక్కడే. తమ అందరికంటే అతను చాలా గొప్పవాడవుతాడని ఊహించారు అప్పట్లో సహజంగానే.
ఇప్పుడు, అందరిలోకి అతని జీవితమే భ్రష్టమైపోయినట్లయింది. ఈవిల్ జీనియస్ లా తయారయ్యాడన్నమాట శతృఘ్న!
"నీ జీవితం గతుకుల దారిలో పడిపోయింది శతృఘ్నా! దాన్ని సరిచేసుకోవడానికి ఎందుకు ప్రయత్నించవు?" అన్నాడు విచారంగా.
తీవ్రంగా చూశాడు శతృఘ్న.
"ఇనఫ్ ఈజ్ ఇనఫ్! ఇంక మెలోడ్రామా చాలు! రెడ్డి! నీకు రెండే ఆప్షన్స్! ఒకటి! నాతో చేరిపోయి నేను సంపాదించబోయే డబ్బుని షేర్ చేసుకో! నా బెస్ట్ ఫ్రెండ్ గా నీకు అందులో వాటా ఉంటుంది! కిక్ దిస్ బ్లడీ కంట్రీ ఇన్ ద షిట్ అండ్ కమ్ అలాంగ్ విత్ మీ! లేదా. డ్యూటీనే పట్టుకు వేళ్ళాడే పోలీసుగానే ఉండదల్చుకున్నావా. నీ ఇష్టం! తేల్చుకో!"
"నా డ్యూటీ నాకు ప్రాణాలకంటే ఎక్కువ! సో! గుడ్ బై శత్రూ!" అంటూ కరస్పర్శకై చెయ్యి జాచాడు రెడ్డి.
అతని ఎత్తు ముందే ఊహించి రెడీగా ఉన్నట్లు వెనక్కి ఒరిగి, బాలన్స్ చేసుకున్నాడు శతృఘ్న. మెరుపులా ఒక కాలు ముందుకు జాపి, దానితో రెడ్డి కాలుకి బంధం వేసి లాగాడు.
వెనక్కి విరుచుకు పడిపోయాడు రెడ్డి.  
ఒంగి చెయ్యి అందించి రెడ్డిని లేవదీశాడు శతృఘ్న. అతని బట్టలకు అంటిన దుమ్ము దులిపాడు. అభిమానంగా రెడ్డి మొహంలోకి చూస్తూ, "దయచేసి ట్రిక్స్ ప్లే చెయ్యాలని చూడకురా నేస్తం! నేనిప్పుడు నిజంగా రాక్షసుణ్ణే! మనిషన్న వాడిని నమ్మను నేను! నన్ను నమ్ము!" అన్నాడు.
నెమ్మదిగా తల తడుముకున్నాడు రెడ్డి. తర్వాత నిదానంగా, స్పష్టంగా చెప్పాడు.
"శతృఘ్నా! నిన్ను నేను పట్టుకుని తీరతాను. ఈ రెడ్డి టేకప్ చేసిన కేసు ఏదీ ఇంతవరకూ ఫెయిలయిపోలేదు, గుర్తుంచుకో!"
అసహనంగా భుజాలు ఎగరేశాడు శతృఘ్న. "ఒకే ఆఫీసర్! నీ ప్రయత్నాల్లో నువ్వుండు? కానీ అవి నిష్పలమని ముందే చెబుతున్నాను. ఈలోగా, ఫస్ట్ థింగ్స్ ఫస్టు. ముందుగా, ఈ పేషెంట్లని నీ వానులో ఎక్కించి, దగ్గరలో వున్న హాస్పిటల్లో చేర్పించు. కేసాఫ్ ఫ్లయిట్ ఫుడ్ పాయిజనింగ్! అంతే! నెక్స్ ట్ - మీ కానిస్టేబుల్ని ఊళ్ళోకి తోలి, మా అందరికీ మంచి భోజనాలు ఏర్పాటు చెయ్. ఈ పాసెంజెర్లలో చచ్చేవాళ్ళు చావగా మిగిలినవాళ్ళు ఎన్ని పూటలు ఇక్కడ వుండవలసి వస్తుందో తెలియదు. వాళ్ళకి ఆహారం సరిగా అందే ఏర్పాట్లు చెయ్! ఓకే. ఒక్కసారి ఇలా నాతో రా! ఇటు" అని పైలట్స్ కేబిన్ లోకి తీసుకెళ్ళాడు రెడ్డిని.
పైలట్ సవ్యసాచి చిరాకును అణుచుకుంటూ చూశాడు శతృఘ్న వైపు.
"రేడియోలో మాట్లాడాలి." హెడ్ ఫోన్స్ అందించాడు సవ్యసాచి, అవి తగిలించుకున్నాడు శతృఘ్న. ఎయిరు పోర్టుతో కాంటాక్టు ఏర్పడింది.

 Previous Page Next Page