Previous Page Next Page 
హైజాక్ పేజి 40

విధి మనుషులని విచిత్రంగా ఆడించగలదు!
సుజాత శతృఘ్నని ఆపాదమస్తకం ఎగాదిగా చూస్తోంది. భరించలేనంత ఆశాభంగం, షాక్ ఆమె మొహంలో కనబడుతున్నాయి.
"మీరా! మీరేనా శతృఘ్న అంటే!" అంది విషాదంగా. "మా అక్కయ్య వైనవైనాలుగా వర్ణిస్తే విని, ఇన్నాళ్ళూ నేను ఊహించుకున్న మహా పురుషుడికీ, ఇప్పుడు నేను ప్రత్యక్షంగా చూస్తున్న మొండి మనిషికీ ఎంత తేడా! మనుషుల్లో దేముడిలాంటివారు మీరని చెప్పేది అక్క! అంత గొప్ప ప్రవర్తన మీదని చెప్పేది. నిజమేనని నమ్మాను నేను. అల్లూరి సీతారామరాజులా ఉంటారు మీరని ఊహించుకున్నాను. అభినవ రాబిన్ హుడ్ లా వుంటారనుకున్నాను. మీరెప్పుడన్నా అసలు నాకు కనబడటం అంటూ జరిగితే, నడిరోడ్డులో అయినాసరే వంగి మీ పాదాలు తాకి నమస్కరించదలుచుకున్నాను. మీతో మాట్లాడాలనీ, మీ మాటల ద్వారా స్ఫూర్తిని పొంది, ఆ ఉత్తేజంతో ఉత్తమ కార్యాలెన్నో చెయ్యడానికి పునాదులు వేసుకోవాలనుకున్నాను.
కానీ మిమ్మల్ని చూస్తుంటే ఇప్పుడు....భగవాన్!
తన ఆరాధ్య దైవాన్ని చూడాలని ఉర్రూతలూగుతున్న వ్యక్తికి ఒక ఆవారా మనిషి ప్రత్యక్షమైతే, ఎంత దుర్భరంగా వుంటుంది మిస్టర్ షాట్ గన్!"
తీక్షణంగా చూస్తూ వుండిపోయాడు శతృఘ్న. అంతేగానీ సమాధానం ఏమీ చెప్పలేదు.
తన ఊహలనీ, వాస్తవాలనీ సమన్వయం చేసుకోలేక సతమతమయిపోతోంది సుజాత. ఆ అయోమయంలోనే ఆమెకు తను చిన్నప్పుడు చదివిన కథ ఒకటి గుర్తొచ్చింది. ఒక ఆర్టిస్టు జీసస్ క్రైస్టు బాల్యాన్ని చిత్రీకరించదలుచుకుని, అలాంటి దేవతాంశలు ఉట్టిపడే పిల్లవాడికోసం ఎంతో వెదికాడు. చివరికి ఒక అబ్బాయి దొరికాడు అతనికి. అంత చిన్న వయసులోనే ఆ అందమైన మొహంలో ప్రశాంతత, కరుణ, సహనం గోచరిస్తున్నాయి.
ఆ పిల్లవాడిని మోడల్ గా పెట్టుకుని, జీసస్ క్రైస్టు బొమ్మని చిత్రీకరించాడు ఆర్టిస్టు. అత్యద్భుతంగా వచ్చింది అది.
చాలా సంవత్సరాలు గడిచాయి.
ఈసారి ఒక పరమ దౌర్భాగ్యుడయిన మనిషి చిత్రాన్ని వేయదలుచుకుని, దానికి మోడల్ కోసం వెదకడం మొదలెట్టాడు ఆ ఆర్టిస్టు. నెలల తరబడి గాలించాక ఒక పానశాల నుంచి బయటికి వస్తున్న మనిషి కనబడ్డాడు. శనిదేవతకు స్నేహితుడిలా ఉన్నాడతను. చాలా నీచుడయి ఉంటాడని మొహంలోకి చూసీ చూడగానే తెలిసిపోతోంది.
డబ్బు ఆశ చూపి, అతన్ని తనతో తీసుకువెళ్ళి, మోడల్ గా కూర్చోబెట్టుకుని చిత్రం పూర్తి చేశాడు ఆర్టిస్టు. పరమాద్భుతంగా వచ్చింది అది.
సంతోషంతో డబ్బు ఇవ్వబోయాడు ఆర్టిస్టు. అతను అది తీసుకోలేదు. వెక్కి వెక్కి ఏడుస్తూ ఉండిపోయాడు.
ఆశ్చర్యంతో కారణమేమిటని ప్రశ్నించాడు ఆర్టిస్టు.
"చాలా సంవత్సరాల క్రితం బేబీ జీసస్ చిత్రానికి మీకు మోడల్ గా ఉండిన వాడిని నేనే! ఇప్పుడు..." అని ఆపేశాడు, గొంతు పూడుకుపోతూ ఉండగా.
నిట్టూర్చింది సుజాత. చెప్పలేనంత వెలితిగా అనిపిస్తోంది ఆమెకు.
పాసెంజర్సు చాలామందికి జరుగుతున్నదేమిటో అంతుబట్టలేదు. నోళ్ళు తెరుచుకుని చూస్తున్నారు వాళ్ళు.
శతృఘ్న నిలబడ్డ చోటుకి వెనకగా, దగ్గరగా ఉన్న రెండు సీట్లలోని పక్కపక్కనే కూర్చుని ఉన్న ఇద్దరు మనుషులు భావగర్భితంగా మొహాలు చూసుకున్నారు. చక్కటి శరీర సౌష్టవంతో, ఉక్కు మనుషుల్లా వున్నారు వాళ్ళు. నిర్భయంగా, అలర్టుగా చూసే కళ్ళు, పొట్టిగా కత్తిరించిన క్రాఫులూ, నిటారుగా కూర్చున్న తీరూ, వాళ్ళు మిలటరీ వాళ్ళయి వుంటారని సూచిస్తున్నాయి.
ఆ అమ్మాయి ఎవరో ఆవేశంతో పెద్దపెద్ద మాటలు మాట్లాడేస్తూ వుంటే, అతను కొంచెం అప్ సెట్ అయిపోవడం గమనించారు వాళ్ళు. ఇందాక రాజేందర్ చేసిన విఫల ప్రయత్నాన్ని మరోసారి చేసి చూడదలుచుకున్నారు వాళ్ళు. రెండోసారి కూడా అలాంటి ప్రయత్నం భగ్నమయితే, హైజాకర్స్ అదుపు తప్పిపోయి తమని నిర్దాక్షిణ్యంగా హింసించవచ్చని బాగా తెలుసు వాళ్ళకి. తాము తలపెట్టిన పని అత్యంత ప్రమాద భరితమైనదని తెలుసు కానీ, ప్రమాదానికి భయపడి చేతులు ముడుచుకు కూర్చోవడం కాక, దాన్ని ధైర్యంగా ఎదుర్కొని కంట్రోలులోకి తెచ్చుకోవడమే వాళ్ళ వృత్తీ, ప్రవృత్తీ కూడా. దానికోసమే వాళ్ళు అనేక సంవత్సరాలు అతి కఠోరమైన శిక్షణ పొందారు.
'రెడీ' అన్నట్లు తన సహచరుడికేసి నెమ్మదిగా తల పంకించి, స్ప్రింగులా లేవబోయాడు ఒకతను.
తక్షణం అతని భుజాలమీద తేలిగ్గా, బలహీనంగా వున్న ఒక చెయ్యి పడింది.
ఉలిక్కిపడ్డాడు అతను.
"మీరు ఇంగ్లీషు సినిమాలు చూస్తారా?" అన్నాడు సుభాష్ చంద్రబోస్ చిరునవ్వుతో "ఇందాకటినుంచీ చెప్పాలనుకుంటున్నాను. మీరు అచ్చం యూల్ బ్రిన్నర్ లా ఉంటారు, గుండు చేయించుకొంటే! మీరెప్పుడన్నా గుండు చేయించుకుంటే, పోలికలు సరిచూసుకోండి!"
ఏడవలేక నవ్వాడు ఆ మిలటరీ ఆఫీసరు. 'ఈ ముసిలాడికి వయసుతోబాటు చాదస్తం కూడా పెరిగి వుంటుంది! ష్యూర్!' అని మనసులోనే తిట్టుకుంటూ కూర్చుండిపోయాడు.
కానీ ఈసారి శతృఘ్న తనని పట్టుకోవడానికి జరిగిన ప్రయత్నాన్ని గమనించలేదు. అతను తదేకంగా సుజాతనే చూస్తున్నాడు.
"శతృఘ్న!" అని పిలుపు వినబడింది, సంకోచంగా, సందేహంగా.
చివుక్కున వెనక్కి తిరిగాడు శతృఘ్న, రివాల్వర్ గురిపెడుతూ.

 Previous Page Next Page