రైలు ముందుకు పోతుంటే పాత జీవితం మరింతగా వెనక్కి వెళ్ళి పోతున్నట్టుంది తిలక్ కి. అలా బయటకు చూస్తూ కూర్చున్నాడు.
అతనికి ఎదురుగా కూర్చున్న లాలస అప్పుడప్పుడు ఏదో మాట్లాడుతోంది.
ఉత్తరుడు, బుద్ధుడు, పైన ఎదురెదురుగా బెర్త్ ల మీద పడుకున్నారు.
"తిలక్!" ఏదో లోకంలో వుండి పిలిచినట్టు మెల్లగా పిలిచింది లాలస.
"ఏదయినా మాట్లాడు" గారాబంగా అడిగింది ఆమే మళ్ళీ.
"ఏం మాట్లాడను?" అని చిరునవ్వు నవ్వాడు.
"జైలు నుంచి తప్పించుకుని అప్పుడే పదిగంటలు దాటుతోంది. ఇక మనం సేఫ్ అనుకుంటా."
"మనం సక్సెస్ అయినట్టే అనిపిస్తోంది నాకూ. నీవల్లే ఇంత త్వరలో జైలు నుంచి బయటపడే అవకాశం చిక్కింది. నీకెలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు" తిలక్ ఎంతగానో కదిలిపోతూ అన్నాడు.
"మనమధ్య అలాంటిది వుండకూడదని చెప్పానుగా. అందునా నేను చేసింది ఏముంది? ప్లాన్ అంతా నీదేగా"
"కానీ దానికి ఎంత కష్టపడ్డావ్. ఒకవేళ పట్టుబడి వుంటే నువ్వూ మాతోపాటు జైల్లో వుండేదానివిగా. ఇంత రిస్క్ తీసుకున్న నీకు నేను ఏమివ్వగలను?"
"ఏమైనా ఇవ్వచ్చు. ఉదాహరణకు నీ గుండెలో అంత చోటు"
అతను దానికి సమాధానం చెప్పలేదు. ఏవేవో భయాలు, అనుమానాలు అతడిని మాట్లాడనివ్వడం లేదు.
చిన్నగా నవ్వాడు.
ఆమె ఇక దానిని పొడిగించలేదు.
రైలు విశాఖపట్టణం నుంచి అరకులోయ వెళుతోంది.
చుట్టూ చీకటి అడవిలా వుంది. గాలి లేడిపిల్ల గెంతుతున్నట్టు వుండుండీ చల్లగా తగుల్తోంది.
అంతలో బుద్ధుడు బెర్త్ నుంచి కిందకు దిగి "కాఫీ తాగితే బావుండు" అని దిగి కంపార్టుమెంట్ లోపలికి నడుచుకుంటూ వెళ్ళాడు.
మరికాసేపటికి కాఫీ కుర్రాడితో వచ్చాడు.
నలుగురూ కాఫీ సిప్ చేస్తూ మాటల్లో పడ్డారు.
తాము జైలు నుంచి తప్పించుకుని వచ్చామన్న విషయాన్ని వాళ్ళు తాత్కాలికంగా మరిచిపోయారు. స్వేచ్ఛలోని మాధుర్యాన్ని తనివితీరా అనుభవిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ వేషం కూడా మారింది. అందరూ చీప్ వే గానీ కొత్త బట్టలు వేసుకున్నారు. లాలస కూడా విశాఖపట్టణంలో నూరు రూపాయలు పెట్టి ముతక చీరలు కొనుక్కుంది. మరీ అవసరమయిన వస్తువులు వుంచుకునేందుకు ఓ చేతి సంచీ కూడా తీసుకున్నారు. వాళ్ళను చూస్తే గ్రామం నుంచి సరుకుల కోసం టౌన్ కి వచ్చిన వాళ్ళలా వున్నారు.
రైలు కష్టపడి ఘాట్ ఎక్కుతోంది.
కొన్ని రోజుల వరకు అరకులోయ ప్రాంతంలో వుండి, ఆ తరువాత భవిష్యత్తు నిర్ణయించుకుందామనుకున్నారు.
విశాఖపట్నం నుంచి సాయంకాలం ఆరుగంటలకు బయల్దేరుతున్న ఈ రైలును ఎక్కారు.
"తరువాత ఏ స్టేషన్ లో రైలు ఆగితే అక్కడ దిగేద్దాం. అరకు లోయ వరకు వెళ్ళడం కూడా డేంజరే. అదీగాక అది టూరిస్ట్ స్పాట్ గనుక మనల్ని ఎవరైనా కనిపెట్టే ప్రమాదముంది. చిన్న పల్లెటూరు కాకుండా, అలా అని పెద్ద టౌనూ కాకుండా ఓ మోస్తరుగా వుండే టౌన్ అయితే మంచిది" తిలక్ చెప్పిందానికి అందరూ అవునన్నట్టు తలలూపారు.
"నువ్వు చెప్పింది నిజమే బాసూ. అరకులోయ వరకు వెళ్ళడం వేస్ట్. నెక్ట్స్ స్టేషన్ లో దిగేద్దాం. అక్కడే ఏదైనా పని చూసుకుని కొన్నిరోజులపాటు వుండిపోదాం. మన గురించి పోలీసులు మరిచిపోయాక తిరిగి మనం ఎక్కడ ఉండాలో ప్లాన్ చేసుకుందాం" అని దగ్గరలో ఏదైనా వూరు వస్తుందేమో చూడడానికి బుద్ధుడు డోర్ దగ్గరకు వెళ్ళాడు.
దూరంగా లైట్లు కనిపించాయి.
తిరిగి తిలక్ దగ్గరకు వచ్చి "మరో అయిదు నిముషాల్లో ఏదో వూరు వచ్చేటట్టుంది. మరి అక్కడ ట్రైన్ ఆగుతుందో లేదో?" నని అనుమానం వెలిబుచ్చాడు.
"ఇది ప్యాసెంజర్ ట్రైన్ గనుక స్టేషన్ వుంటే ఆగుతుంది."
మరో అయిదు నిముషాలకు ట్రైన్ స్లో అయింది.
"స్టేషన్ వచ్చేటట్టుంది లేవండి, ఇక్కడ దిగిపోదాం" తిలక్ చెప్పడంతో అందరూ లేచారు ఉన్న ఒకే సంచిని ఉత్తరుడు తీసుకున్నాడు.
స్టేషన్ చాలా చిన్నది. ఓ నిముషం కన్నా రైలు ఆగలేదు.
రైలుకు పచ్చజెండా చూపిన వ్యక్తి క్షణాల్లో మాయమయ్యాడు.
టికెట్లు కూడా ఎవరికివ్వాలో తెలియడంలేదు. ఎవరైనా వస్తారేమోనని కొంతసేపు చూశారు. ఎవరూ కనిపించలేదు.
నలుగురూ స్టేషన్ నుంచి బయటపడ్డారు.
చీకటి కొమ్మమీద వాలిన పావురాయిల్లా దూరంగా దీపాలు కనిపిస్తున్నాయి.
అటుకేసి నడక సాగించారు.
* * * *
సాయంకాలం ఏడుగంటలవుతోంది.
జీవకారుణ్య సదన్ లైట్లు వెలుగుల్లో బంగారు తామరలున్న వెండి సముద్రంలా మెరిసిపోతోంది.]
బయట లాన్ లో మసక చీకటిగా వున్నచోట రాయుడు, చిత్ర తెల్లటి ఫేము కుర్చీలో కూర్చుని మాట్లాడుకుంటున్నారు.
"ఇంత జరుగుతున్నా నువ్వు నియమించిన ఆ కైలాసం ఏం చేస్తున్నాడు? ముందు ఏదైనా సమాచారం తెలిసి వుంటే వాళ్ళు పారిపోకుండా ఎలాగైనా అడ్డుకునే వాళ్ళం. నీమీద ఎంతో నమ్మకంతో పని అప్పగిస్తే ఇలా చేశావేమిటి?" రాయుడు కఠినంగా అన్నాడు.
తిలక్ జైలునుంచి తప్పించుకున్నాడని తెలిసినప్పట్నుంచి ఆయన నిప్పులు తొక్కిన కోతిలా అయిపోయాడు. ఏదో తెలియని భయం ఆయన్ని ఒకచోట వుండనివ్వడంలేదు. అందుకే అనవసరంగా కుర్చీలోంచి లేచి అటూ ఇటూ పచార్లు ప్రారంభించాడు.
చిత్ర ఏం సమాధానం చెప్పకుండా, మౌనంగా తన చాతకాని తనాన్ని ఒప్పుకుంటున్నట్టు తల దించుకుంది.